
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు.
తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు.
కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ
ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు.
ఫోబియా
Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్‌షిప్‌లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు.
గైనోఫోబియా అంటే ఏమిటి?
స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్‌లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment