Rwanda
-
ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు. తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. ఫోబియా Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. గైనోఫోబియా అంటే ఏమిటి? స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్‌లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి. -
ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో
జాతి వివక్షత, కుల వివక్ష.. పేద, ధనిక వంటి కారణంగా చాలామంది నిరాదరణకు గురవ్వడం చూసి ఉంటాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై దూరంగా అడవిలో జీవించాల్సి రావడం అంటే అది అత్యంత అమానుషమే. రువాండాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రూపం కారణంగా నిరాదరణకు గురైనప్పటిక ఒక చానల్ సాయంతో మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అతనెవరో ఏంటో చూద్దాం రండి. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీని రియల్ లైఫ్‌లో మోగ్లీగా పిలిచేవారు. కారణం అతని రూపం. అయితే ఈ 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ మైక్రోసెఫాలీ అనే రుగ్మతతో బాధపడుతున్నాడు (శిశువు తల ఊహించిన దాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది). ఈ వ్యాధి అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. ఈ రూపం కారణంగా కర్కశత్వానికి, నిరాదరణకు గురయ్యాడు. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఎల్లీ తల్లికి అతను పుట్టక ముందే ఐదుగురు పిల్లలను కోల్పయింది. ఆమె దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేయగా ఎల్లీ పుట్టాడు. అంతేకాదు ఈ ఒంటరి తల్లి ఎల్లిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది. అయితే అఫ్రిమాక్స్ అనే ప్రాంతీయ టీవి చానల్ గో ఫండ్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు అతనికి మనమందరం సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడూ ఎల్లీ రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు. పైగా అతని స్కూల్ యూనిఫాం అయిన కస్టమ్ మేడ్ సూట్ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. ఈ మేరకు ఎల్లి తల్లి మాట్లాడుతూ..."ఒకప్పుడూ నా కొడుకుని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడూ మా జీవితాలు మారాయి. నా కొడుకు ఆనందంగా స్కూల్‌కి వెళ్తున్నాడు. మాకు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. నా బాధలన్నింటిన మీరు ఒక్క నిమిషంలో దూరం చేశారు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయిలే ఎల్లి సూట్ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మనం అందరూ కృషి చేస్తే ఇలాంటి వాళ్ల ఎందరికో సాయం చేయగలం అంటూ రకరకలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) The story of Zanziman Ellie Mowgli transformation is inspirational, Everyone this a happy life, We can all work to eliminate stigmatization in our respective societies. pic.twitter.com/bQhwIm02Tf — Sam Wamalwa🇰🇪 (@samsmoothke) October 28, 2021 -
రువాండాకు మోదీ బహుమతి
కిగాలి: రువాండా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం రువేరు అనే గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేదలకు 200 ఆవులను కానుకగా ఇచ్చారు. పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికొక ఆవును పంపిణీచేయడం 2006 నుంచి అక్కడ సంప్రదాయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘గిరింకా’ అని పిలుస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల రీత్యా రువాండాలోని మారుమూల గ్రామంలో ఆవులకు ఇస్తున్న ప్రాధాన్యం భారతీయులను సంతోషానికి గురిచేస్తుందని మోదీ అన్నారు. గిరింకా గ్రామాల్లో గొప్ప మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంపై కూడా దృష్టిపెట్టాలని రువాండా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆఫ్రికా తాళంచెవి రువాండా.. మోదీ రువాండాలో ప్రవాసులతో మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టి ఆఫ్రికాపై పడకముందే, భారతీయులు అక్కడికి వెళ్లడానికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా తమ ప్రత్యేకతను చాటుకుంటూ దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని కితాబిచ్చారు. అంతకుముందు, ఆ దేశాధ్యక్షుడు కగామేతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్యవేత్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఆఫ్రికాకు దారితీసే అన్ని ప్రవేశద్వారాల తాళంచెవి రువాండా వద్దే ఉందని అన్నారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ సహకారం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో అమలుచేస్తున్న ‘మేకిన్ ఇండియా’లో రువాండా కూడా భాగమైతే, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని అన్నారు. తర్వాత మోదీ రువాండా పర్యటనను ముగించుకొని ఉగాండా చేరుకున్నారు. ఉగాండాకు రూ.1377 కోట్ల రుణం... కంపాలా: ఉగాండాకు భారత్ రూ.1377 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ నిధులను ఇంధన మౌలిక వసతులు, వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధికి వెచ్చించనున్నారు. ఉగాండాలో ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు యువేరి ముసెవేనితో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ సహకారం, దౌత్యవేత్తలు, ఇతర అధికారులకు వీసా మినహాయింపు, సాంస్కృతిక మార్పిడి, మెటీరియల్ టెస్టింగ్ లేబొరేటరీలపై 4 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నేటి నుంచి బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలో మూడు రోజులపాటు.. జోహన్నెస్‌బర్గ్: అమెరికా వైఖరి కారణంగా ఏర్పడుతున్న అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ వాతావారణంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ పదవ సదస్సుకు ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసాతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా, చైనాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు సభ్యదేశాల ఉన్నత స్థాయి అధికార బృందాలు హాజరు కానున్నాయి. చైనా నుంచి వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచడం, చైనా కూడా అందుకు దీటుగా స్పందించడం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు, కెనడా, మెక్సికో నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కూడా ట్రంప్ సుంకాలను పెంచి అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ కొత్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత బ్రిక్స్ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న ఆయన మంగళవారం ప్రిటోరియాలో రమఫోసాను కలిసి పలు విషయాలను చర్చించారు. చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంపైనే ఈ సమావేశంలో ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని రష్యా ఆర్థిక మంత్రి తెలిపారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుండటాన్ని మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొన్ని ఆసక్తికర అంశాలు.. ♦ బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని 2001లో బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ తొలిసారి వాడారు. ♦ మొదటి బ్రిక్ సమావేశం రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో 2009లో జరిగింది. ♦ 2010లో ఈ కూటమిలో దక్షిణాఫ్రికా చేరడంతో దీని పేరు బ్రిక్స్‌గా మారింది. ♦ మన దేశంలో బ్రిక్స్ సదస్సులు 2012లో ఢిల్లీలో, 2016లో గోవాలో జరిగాయి. ♦ ప్రపంచంలోని మొత్తం జనాభాలో 40% మంది బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. -
గో రక్షకులూ.. వెంటనే రువాండా వెళ్లండి...!
దేశంలోని గో రక్షకులకు బహిరంగ విజ్ఞప్తి... మీరంతా దయచేసి వెంటనే రువాండా దేశానికి వెళ్లి ఈ ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి. ప్లీజ్... దక్షిణాష్రికా బ్రిక్స్ శిఖరాగ్ర భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో రువాండాలో ఆగి 200 ఆవులను కానుకగా ఇచ్చారు. దీనిపై ట్విటర్ వేదికగా సాగిన హాస్యపూర్వకచర్చలో భాగంగానే ఈ విజ్ఞప్తి సోషల్ మీడియా తెరపైకి వచ్చింది. రువాండాలో కొన్ని శతాబ్దాలుగా ‘గిరింకా పథకం’లో భాగంగా గోవులను కానుకగా ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరచడంలో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆవులు అందజేస్తారు. అయితే రువాండాలో బీఫ్‌ను ఆహారంలో భాగంగా పరిపాటి కావడంతో ఈ అంశం ట్విటర్లో చర్చకు కేంద్రమైంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్‌ను నిషేధించడంతో పాటు ఇటీవల గోవుల పరిరక్షణపేరిట మూక దాడుల సంబంధిత వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్విటర్లో సరదా కామెంట్లు... రువాండాలోని బుగెసెరలో అతి పెద్ద బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతోంది. ఆ దేశానికే ప్రధాని మోదీ ప్రేమతో 200 ఆవులు కానుకగా ఇచ్చారంటూ ఓ వ్యక్తి స్పందించాడు=మోదీ మాస్టర్ స్ట్రోక్...200 ఆవులు కానుకగా ఇచ్చేశారు అని ఆప్కా దేవేందర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు రువాండాలో మాంసం కొరత ఏర్పడింది అనే శీర్షికతో... రెండుదేశాల్లోనూ ఆవులను పూజిస్తారు. అయితే ఈ ఫోటోను చూడాలంటే భయమేస్తోంది అంటూ రువాండాలో బీఫ్ అమ్మే ఫోటోను రోహిత్ కన్నన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు ఆ దేశంలో గోవులను ఇష్టపడతారు. అయితే డైనింగ్ టేబుళ్ల మీద...అక్కడ గోరక్షకుల దళాన్ని వెంటనే ఏర్పాటుచేయాలి. దళ సభ్యులంతా కూడా రాత్రికి రాత్రి ప్యారాఛూట్లలోఅవసరమైన చోట్ల దిగే ఏర్పాటు చేయాలి అంటూనైనా డీ షేత్ పేర్కొన్నారు రువాండాకు 200 ఆవులను ఎత్తుకెళుతున్న వారు కనిపించారని మై ఫెల్లో ఇండియన్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు ఓ వ్యక్తి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు గోవులను తీసుకెళుతుంటేనే దాడి జరిగింది. మరో వ్యక్తి భారత్ నుంచి 200 ఆవులను తీసుకుని రువాండాకు వెళ్లినట్టు ఇప్పుడే విన్నాను. అతడికి ఏమి కాకూడదని ప్రార్థిస్తున్నాను అని అతుల్ ఖత్రి వ్యాఖ్యానించాడు. -
రువాండాలో ప్రధాని మోదీ
కిగాలీ / న్యూఢిల్లీ: ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రువాండాకు చేరుకున్నారు. రాజధాని కిగాలీలోని ఎయిర్‌పోర్టులో మోదీకి రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనతో రువాండాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పర్యటనలో కగమేతో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. రువాం డాలో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ తోళ్ల అనుబంధ పరిశ్రమ, వ్యవసాయ పరిశోధనకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రువాండాలో పారిశ్రామిక పార్కులు, కిగాలీ సెజ్ అభివృద్ధికి రూ.1,379.10 కోట్ల రుణాన్ని, వ్యవసాయం, నీటివనరుల అభివృద్ధికి మరో రూ.689.55 కోట్ల సాయాన్ని భారత్ అందజేయనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. తర్వాత మంగళవారం ఉగాండాకు వెళ్లనున్న మోదీ.. ఆ దేశ ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 200 ఆవుల బహుమతి.. రువాండా పర్యటనలో మోదీ ఓ గ్రామానికి 200 ఆవుల్ని బహుమతిగా ఇవ్వనున్నారు. రువాండా ప్రారంభించిన ‘గిరికా’ కార్యక్రమం కింద ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ఆవు ఇవ్వనున్నారు. ఇందుకు స్థానిక ఆవుల్ని సేకరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం సమకూర్చడమే పథకం లక్ష్యం. -
ఎయిర్టెల్ చేతికి టిగో రువాండా
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టిగో రువాండాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. టిగో రువాండా లిమిటెడ్ పేరుతో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న మిల్లికామ్లో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశామని భారతీ ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులార్కు చెందిన టిగో రువాండాతో ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం ప్రకారం, టిగో 370 మిలియన్ వినియోగదారులు ఎయిర్టెల్ రువాండా నెట్ వర్క్‌లో చేరతారు. అలాగే 80 మిలియన్ డాలర్ల ఆదాయంతో 40 శాతం ఆదాయాన్ని ఆర్జించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ కొనుగోలు ద్వారా రువాండాలో రెండవ అతిపెద్ద సంస్థగా అవతరించనున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం రెగ్యులేటరీ, చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. టెలికాం మార్కెట్ బలహీనంగా ఉన్నదేశాల్లో నిర్మాణాన్ని ఏకీకృతం చేసేందుకు ఎయిర్‌లెట్ చురుకైన చర్యలు చేపట్టిందని ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఘనాలో బలమైన ఆచరణాత్మక సంస్థ ఉన్న తాము ఆఫ్రికాలో లాభదాయకమైన బలమైన పోటీదారుగా ఉండటానికి టిగో రువాండాను కొనుగోలు చేయడం ఒక కీలకమైన మందడుగు వేసినట్టు చెప్పారు. -
వైద్యంలోనూ డ్రోన్ల సాయం!
అమెరికా: రోడ్లు సరిగా లేని మారుమూల ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో చేరుకోవాలంటే చాలా కష్టం. ఆఫ్రికన్ దేశమైన రువాండాలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అసలే చాలా ఘోరంగా ఉంటుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు ఆహారపదార్థాలు, మందులు, రక్తం పంపిణీ చేయడం అక్కడి అధికారులకు తలనొప్పితో కూడుకున్న వ్యవహారం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డ్రోన్ల సాయం తీసుకునేందుకు వినియోగించేందుకు రంగం సిద్ధమైంది. వైద్య పరికరాలు, ఇతరత్రా అత్యవసర సామగ్రిని అవసరమైన ప్రదేశానికి పంపేందుకు డ్రోన్ సేవలను రువాండాతో పాటు అమెరికాకు చెందిన జిప్‌లైన్ అనే సంస్థ త్వరలో ప్రారంభించనుంది. వెయ్యి కొండల దేశమని పేరున్న రువాండాలో దాదాపు 1.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. జిప్‌లైన్ అభివృద్ధి చేసిన డ్రోన్లు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు మందులు, రక్తం, ఇతర సామగ్రి సరఫరా చేస్తాయి. రోజుకు ఎన్ని సార్లయినా ఎక్కడికైనా వెళ్లి రాగలిగే ఈ డ్రోన్ల సైన్యాన్నే సిద్ధం చేస్తున్నారు. గోడౌన్లలోని అధికారులకు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా డాక్టర్లు సమాచారం పంపడమే ఆలస్యం ఈ డ్రోన్లు తమ పని ప్రారంభిస్తాయి. దూరాన్ని బట్టి సాధ్యమైనంత త్వరలో నిర్దేశిత ప్రాంతంలో సామగ్రిని వదిలేస్తుంది. ప్యారాచూట్ సాయంతో సామగ్రి ఉన్న బ్యాగ్‌ను భద్రంగా కిందికి దించుతుంది. -
మంత్రి కూతురి కిడ్నాప్... డబ్బు డిమాండ్!
చెన్నై: తూర్పు ఆఫ్రికా దేశం రువాండాకు చెందిన మంత్రి కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ దేశ రాయబారి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకుని, ఆమెను కాపాడారు. వివరాలివీ.. మేరీగ్రేస్(18) రాశీపురంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ రెండో సంవత్సరం చదువుతుంది. రాశీపురం సమీపంలోని కోనేరిపట్టిలో నివసించే ప్రభుదాస్ అనే వ్యక్తి ఇంటిలో ఈమె ఉంటోంది. ఈ నెల 1వ తేదీ మూడో సెమిస్టర్ పరీక్ష ముగిసిన తరువాత 8వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. 5వ తేదీ వరకు రాశీపురంలోనే ఉండిన మేరీగ్రేస్ 6వ తేదీన కనిపించకుండా పోయింది. చెన్నైకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి ఉండొచ్చని భావించారు. అయితే కొందరు వ్యక్తులు రువాండా దేశంలోని యువతి తండ్రికి ఫోన్ చేసి డబ్బు కోసం బెదిరించడంతో కిడ్నాప్‌నకు గురైనట్లు నిర్ధారణైంది. దీంతో యువతి తల్లిదండ్రులు ఢిల్లీలోని రువాండా రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. రువాండా రాయబార కార్యాలయం అధికారి ఎమిలీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. పశ్చిమ మండల ఐజీ శంకర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించి, రక్షించారు. నిందితులను పట్టుకున్నారు. రువాండా దేశానికి చెందిన కొందరు యువకులు యువతితో నెట్చాటింగ్లో స్నేహం చేశారు. కోల్‌కతాలో ఉచితంగా విద్య అందిస్తున్నట్టు నమ్మించి, రప్పించుకున్నారు. నిందితుల అదుపులోకి యువతి చేరిన వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి 3 లక్షల డాలర్లు ఇస్తే వదిలిపెడతామని బేరం పెట్టారు. ఈలోగా పోలీసులకు పట్టుబడ్డారు. బాధిత యువతితోపాటూ కిడ్నాప్‌నకు పాల్పడిన బందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గురువారం రాశీపురం చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.