కిగాలీ / న్యూఢిల్లీ: ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రువాండాకు చేరుకున్నారు. రాజధాని కిగాలీలోని ఎయిర్‌పోర్టులో మోదీకి రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనతో రువాండాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పర్యటనలో కగమేతో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. రువాం డాలో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఇరు దేశాలూ తోళ్ల అనుబంధ పరిశ్రమ, వ్యవసాయ పరిశోధనకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రువాండాలో పారిశ్రామిక పార్కులు, కిగాలీ సెజ్ అభివృద్ధికి రూ.1,379.10 కోట్ల రుణాన్ని, వ్యవసాయం, నీటివనరుల అభివృద్ధికి మరో రూ.689.55 కోట్ల సాయాన్ని భారత్ అందజేయనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. తర్వాత మంగళవారం ఉగాండాకు వెళ్లనున్న మోదీ.. ఆ దేశ ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు.
200 ఆవుల బహుమతి..
రువాండా పర్యటనలో మోదీ ఓ గ్రామానికి 200 ఆవుల్ని బహుమతిగా ఇవ్వనున్నారు. రువాండా ప్రారంభించిన ‘గిరికా’ కార్యక్రమం కింద ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ఆవు ఇవ్వనున్నారు. ఇందుకు స్థానిక ఆవుల్ని సేకరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం సమకూర్చడమే పథకం లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment