bilateral talks
-
భారత్‌తో అమెరికా వాణిజ్యం బలోపేతం
వాషింగ్టన్: భారత్‌తో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రమాణంచేసిన కొద్దిసేపటికే ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. 53 ఏళ్ల రూబియో బాధ్యతలు చేపట్టగానే భారత్‌తో భేటీకి సిద్ధపడటం అమెరికా భారత్‌కు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను చాటిచెబుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికాకు వచ్చిన విషయం తెల్సిందే. క్వాడ్ భేటీ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో రూబియో, జైశంకర్ విస్తతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
PM Narendra Modi: ఏ కష్టమొచ్చినా మేమున్నాం
న్యూఢిల్లీ: చైనా పంచన చేరి భారత్‌పై ద్వేషం పెంచుకున్న మాల్దీవులు ఇప్పుడు మళ్లీ భారత్‌తో మైత్రిబంధం బలోపేతానికి ముందడుగు వేసింది. పెట్టుబడులు, పర్యాటకం ద్వారా తమ ఆర్థికాభివృద్ధికి తోడ్పాడాలని స్నేహహస్తం అందించింది. నాలుగు నెలల వ్యవధిలోనే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌లో రెండోసారి పర్యటించడం ఈ పెనుమార్పుకు అద్దం పడుతోంది. స్నేహహస్తం అందించిన ఏ దేశానికైనా సాదర స్వాగతం పలికే భారత్ మరోసారి తన స్నేహశీలతను చాటుకుంది. వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం అందిస్తూనే మాల్దీవుల్లో సోమవారం రూపే కార్డు సేవలను ప్రారంభించింది. మాల్దీవుల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్ట్, ఇరుదేశాల మధ్య మరింత అనుసంధానత, పర్యాటకం వృద్ధి కోసం భారత ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు సమాలోచనలు జరిపారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వీరి ద్వైపాక్షిక భేటీకి వేదికైంది. తొలుత రాష్ట్రపతి భవన్లో ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలికారు. తర్వాత మోదీ, ముయిజ్జు ద్వైపాక్షిక చర్చలు జరిపాక ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు. మాల్దీవులకు దాదాపు రూ.3,360 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. సాయం చేసేందుకు సదా సిద్ధం ‘‘ మాల్దీవులు మాకు అత్యంత సమీప పొరుగుదేశం. భారత పొరుగుదేశాల విధానం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్(సాగర్) దార్శనికతలో మాల్దీవులు మాకు అత్యంత ప్రధానం. మాల్దీవులపై భారత్ ఎల్లప్పుడూ స్నేహభావాన్నే వెదజల్లింది. గతంలో ఎప్పుడు కష్టమొచ్చినా మొట్టమొదట ఆదుకునేందుకు భారతే ముందు కొచ్చింది. కోవిడ్ సంక్షోభకాలంలోనూ ఆదుకున్నాం. పొరుగుదేశంగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చాం. ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల్లో రూపే కార్డ్ సర్వీసులను మోదీ, ముయిజ్జులు వర్చువల్‌గా ప్రారంభించారు. 700 ఇళ్ల అప్పగింత రూ.3,000 కోట్ల విలువైన దిగుమతులను స్థానిక కరెన్సీల్లో చెల్లించేలా ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. హనీమధో ఎయిర్‌పోర్ట్‌లో నూతన రన్‌వేనూ ప్రారంభించారు. హల్హమేలో నిర్మించిన 700 ఇళ్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవుల్లో పోర్టులు, రోడ్ల నెట్వర్క్, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల్లో సాయపడేందుకు భారత్ అంగీకారం తెలిపింది. థాంక్యూ మోదీజీ: ముయిజ్జు ఆర్థిక సాయం ప్రకటించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ కష్టకాలంలో కీలక భాగస్వామిగా భారత్ మమ్మల్ని ఆదుకుంటోంది. పర్యాటకం అభివృద్ధికి భారత్ సాయపడాలి. ఎందుకంటే మాల్దీవుల్లో పర్యాటకానికి భారతే ప్రధాన వనరు. పెద్ద ఎత్తున భారతీయులు మా దేశంలో పర్యటించాలి’’ అని ముయిజ్జు అన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ముయిజ్జు కోరారు. మంగళవారం ఆగ్రా, ముంబైలో, బుధవారం బెంగళూరులో ముయిజ్జు పర్యటిస్తారు. -
స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్
విలి్మంగ్టన్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: ‘క్వాడ్’ కూటమి ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ కోసమే అది కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. ప్రపంచదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను క్వాడ్ గౌరవిస్తోందని అన్నారు. సంఘర్షణలు, సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, సమగ్ర, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో డెలావెర్‌లోని విలి్మంగ్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగిన క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారం¿ోపన్యాసం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమిచి్చన ఈ సదస్సులో ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా కూడా పాల్గొన్నారు. భిన్న రంగాల్లో క్వాడ్ దేశాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణమార్పులు, మౌలిక సదుపాయా కల్పనతోపాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చ జరగబోతోందని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక బంధం బలోపేతం ప్రపంచమంతటా శాంతియుత పరిస్థితి నెలకొనాలన్నదే క్వాడ్ ఆకాంక్ష అని కూటమి నేతలు స్పష్టం చేశా రు. ఇండో–పసిఫిక్ దేశాల బాగు కోసమే కూటమి ఏర్పాటైందన్నారు. ‘ఇండో–పసిఫిక్ సంక్షేమానికి కృషి చేస్తున్న శక్తి క్వాడ్’ అని ఉద్ఘాటించారు. తమ కూటమి దేశాల మధ్య వ్వూహాత్మక బంధం గతంలో ఎన్నడూ లేనంతగా బలపడిందని వెల్లడించారు. సదస్సు అనంతరం నేతలంతా ఈ మేరకు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల జరిగిన మిస్సైల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చైనా తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండో–పసిఫిక్ విద్యార్థులకు 50 క్వాడ్ స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు భారత్ ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికింద మొత్తం 5 లక్షల డాలర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు క్వాడ్ సదస్సు సందర్భంగా ప్రధానులు అల్బనీస్, కిషిదాతో పాటు బైడెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రతపై భారత వైఖరిని వివరించారు. ఆయా దేశాలతో బంధాల బలోపేతంపై సంప్రదింపులు జరిపారు.ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ చొరవ ప్రశంసనీయం: బైడెన్ మోదీపై బైడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గత నెలలో ఉక్రెయిన్‌లో చరిత్రాత్మక పర్యటన చేపట్టడం, శాంతి సందేశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. మోదీకి బైడెన్ శనివారం విలి్మంగ్టన్లోని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ గళం బలంగా వినిపించేలా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు తాను మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కలి్పంచేందుకు తన మద్దతు ఉంటుందన్నారు. మోదీ–బైడన్ భేటీపై భారత్, అమెరికా ఒక ఫ్యాక్ట్ïÙట్ విడుదల చేశాయి. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ 31 లాంగ్–రేంజ్ ఎండ్యూరెన్స్ ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లు కొనుగోలు చేస్తుండడాన్ని బైడెన్ స్వాగతించారు. -
ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్‌లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు.అమెరికాతో బంధం బలోపేతం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్‌తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్‌లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు. -
భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
కలిసి పని చేస్తేనే కలిమి
బందర్‌సెరీ బెగవన్/సింగపూర్: అభివృద్ధి విధానానికి తాము మద్దతు ఇస్తామని, విస్తరణవాదాన్ని తిరస్కరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. చైనా పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆ దేశ వైఖరిని ఎండగట్టారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మోదీ బుధవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బొలి్కయాతో సమావేశమయ్యారు. భారత్–బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆహార భద్రత, విద్య, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలని, వివిధ నూతన రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తేనే ఇరు దేశాలకు మేలు జరుగుందని స్పష్టంచేశారు. సమావేశం అనంతరం మోదీ, సుల్తాన్ హసనల్ బొలి్కయా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, బ్రూనై మధ్య లోతైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండు దేశాల నడుమ దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు నిండుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించామన్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల కోసం ఒక ప్రవర్తనా నియామవళిని ఖరారు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని వివరించారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ–1982(అన్క్లాస్) తరహాలో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో నౌకలు, విమానాల స్వేచ్ఛా విహారానికి ఒక తీర్మానం ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బ్రూనై అత్యంత కీలక భాగస్వామి భారతదేశ ‘తూర్పు కార్యాచరణ’, ఇండో–పసిఫిక్ దార్శనికత విషయంలో బ్రూనై తమకు అత్యంత కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. బ్రూనై సుల్తాన్‌తో సమగ్ర చర్చలు జరిపామని, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని తీర్మానించామని చెప్పారు. ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. తనకు ఘనమైన ఆతిథ్యం ఇచి్చన బ్రూనై రాజ కుటుంబానికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లో పర్యటించాలని సుల్తాన్‌ను ఆహా్వనించారు. ఉపగ్రహాలు, ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం టెలిమెట్రీ, ట్రాకింగ్, టెలికమాండ్ స్టేషన్ నిర్వహణ విషయంలో సహకరించుకోవడానికి భారత్, బ్రూనై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. మోదీకి సింగపూర్ ప్రధాని విందు భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం సింగ్‌పూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఇరువురు నేతలు గురువారం చర్చలు జరుపనున్నారు. అంతకముందు బ్రూనై పర్యటన ముగించుకొని సింగపూర్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. సింగపూర్ హోం, న్యాయ శాఖ మంత్రి కె.షన్ముగంతోపాటు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మోదీ రెండు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. -
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్‌లర్ కార్ల్ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్‌ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్‌లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్‌కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్‌కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
పనికొచ్చే చర్చలేనా?!
ఎటుచూసినా ఘర్షణలు, బెదిరింపులే రివాజుగా మారిన ప్రపంచంలో... ఏడాదిగా మాటా మంతీ లేని రెండు పెద్ద దేశాలు ఒకచోట కూర్చుని చర్చించుకున్నాయంటే కాస్త వింతగానే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరగటం, అందులో పురోగతి సాధించామని ఇద్దరూ చెప్పటం ఉపశమనం కలిగించే పరిణామమే. ఉపశమనం మాట అటుంచి ఇద్దరూ కలవటమే ఇప్పుడు పెద్ద వార్త. అంతకు మించి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఇరు దేశాల విభేదాలతో పోలిస్తే సాధించింది అతి స్వల్పం. వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతోకొంత సాధించామని చెప్పుకోవటం బైడెన్, జిన్పింగ్లిద్దరికీ అవసరం. రష్యా–ఉక్రెయిన్ల మధ్య దాదాపు రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. కనుచూపు మేరలో అది చల్లారేలా లేదు. ఈలోగా గత నెలలో హమాస్ సాగించిన నరమేథంతో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికి దాదాపు 12,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏకపక్ష దాడులకు స్వస్తి చెప్పాలన్న వినతులను ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తోంది. పర్యవ సానంగా పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఈ రెండుచోట్లా కీలకపాత్ర పోషిస్తున్న రష్యా, ఇరాన్‌లను ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయంలో అమెరికా వుంది. జో బైడెన్‌కు వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలన్న ఆరాటంలో వున్నారు. అటు జిన్‌పింగ్‌కు సమస్యలు తక్కువేం లేవు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగాక విదేశీ పెట్టుబడులు తరిగిపోయాయి. దశాబ్దాలపాటు ఎడతెగకుండా సాగిన ఆర్థిక పురోగతి మందగించింది. మితిమీరిన రుణభారంతో, రియలెస్టేట్ కుప్పకూలడంతో, ఎగుమతులు దిగజారటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు మరింత పెరగకుండా చూడటం, సాంకేతికత విక్రయంపై ఆ దేశం మరిన్ని ఆంక్షలు పెట్టకుండా చూసు కోవటం చైనాకు తక్షణావసరం. వివాదాలకు ఎక్కడో ఒకచోట ముగింపు లేకపోతే చైనా మరింత గడ్డుస్థితిలో పడుతుంది. నిజానికి దాన్ని దృష్టిలో వుంచుకునే ‘దుందుడుకు దౌత్యం’లో సిద్ధహస్తులైన చైనా విదేశాంగమంత్రి కిన్ గాంగ్, రక్షణమంత్రి జనరల్ లీ షాంగ్ఫూలను హఠాత్తుగా తప్పించింది. వారిద్దరి ఆచూకీ ఇప్పటికైతే తెలియదు. ఆ దేశాల అంతర్గత సమస్యలు, ఆ రెండింటిమధ్యా వున్న వివాదాల మాటెలావున్నా ఇప్పుడున్న అనిశ్చితిలో అమెరికా, చైనా రెండూ ముఖాముఖి చర్చించుకోవటం ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ రెండింటి మధ్యా తలెత్తే యుద్ధం అన్ని దేశాలకూ పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. నాలుగు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం బైడెన్, జిన్‌పింగ్‌లిద్దరూ సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన పక్షంలో నేరుగా సంభాషించుకునే సదుపాయాన్ని పునరుద్ధరించుకోవటానికి అంగీకరించినట్టు ప్రకటించారు. అప్పటి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నిరుడు తైవాన్ పర్యటించటాన్ని ఖండిస్తూ చైనా దీనికి స్వస్తిపలికింది. ఇది చెప్పుకోదగ్గ పురోగతే. అలాగే పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయాలనుకోవటం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సమష్టిగా కృషి చేయాలనుకోవటం కూడా మంచిదే. అమెరికా, చైనా రెండూ ప్రపంచాన్ని కాలుష్యం బారిన పడేస్తున్న దేశాల జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో వున్నాయి. కాలుష్యంలో ఇద్దరి వాటా 38 శాతంగా వుంది. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలన్నది పారిస్ ఒప్పందం సారాంశం. మప్పు ముంచు కొస్తున్నా రెండు దేశాలూ అవతలి పక్షం అమలు చేశాకే ముందుకు కదులుతామని మొండికేయటంతో ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. భూగోళం నలుమూలలా కార్చిచ్చులు, కరువులు, వరదలు వంటి వైపరీత్యాలు తలెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తామనటం మంచిదే. అయితే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపించి మరో 366 గిగావాట్ల విద్యుదుత్పాదన కు చైనా వేసుకున్న ప్రణాళికల మాటేమిటి? దాన్ని రద్దు చేయటానికి ఆ దేశం అంగీకరించిందా? ఆ ఊసే లేనప్పుడు ఇలాంటి కంటితుడుపు ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతికతల విషయంలో పారదర్శకంగా వుండాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల అధినేతలూ నిర్ణయించారు. కృత్రిమ మేధను సైనిక ప్రయోజనాల కోసం వినియోగించటం మొదలు పెడితే దాని పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం వుంటుంది. అయితే ఈ అంశాలన్నిటిపైనా ఒప్పందాలేమీ లేవు. కేవలం నోటి మాటలే. వాటికి మున్ముందు రెండు దేశాలూ ఏపాటి విలువిస్తాయో తెలియదు. సమావేశానంతరం విడివిడి ప్రకటనలతో సరి పెట్టుకోవటం, కొన్ని గంటలు గడిచాక జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ‘ఆయనొక నియంత’ అంటూ బైడెన్ వ్యాఖ్యానించటం, దానికి చైనా విదేశాంగ ప్రతినిధి అభ్యంతరం తెలపటం వాస్తవస్థితికి అద్దం పడు తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌లతో చైనా లడాయి సరేసరి. తైవాన్‌కు 10,600 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించటానికి సంబంధించిన తీర్మానం అమెరికన్ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో వుంది. అది సాకారమైతే చైనాతో సంబంధాలు మొదటికొస్తాయి. ఇన్ని అవాంతరాలున్నా అధినేతలిద్దరూ ముఖా ముఖీ మాట్లాడుకోవటం మంచిదే. ఇది ఉద్రిక్తతల ఉపశమనానికి తోడ్పడాలని ఆశించాలి. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్‌లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్‌కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్‌లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్‌కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ♦ మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ♦ జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ♦ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ♦ వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ♦ జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ♦ వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ♦ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ♦ వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచ్చిన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్‌తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్‌కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్‌కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్‌లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్‌కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
G20 summit: నేడే మోదీ– బైడెన్ చర్చలు
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది. స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. -
బంధాన్ని భంగపరిస్తే సహించం
సిడ్నీ: ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్‌కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు. టీ20 వేగంతో బంధం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్‌కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్‌లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్‌లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్‌ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం. ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్‌తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్‌లోని డిజిటల్ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్ ఆకాంక్షించారు. -
Bilateral Talks: జపాన్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాలు సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చిన విషయం తెల్సిందే. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. ‘ జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే. ఇండో–పసిఫిక్ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని తర్వాత పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ భారత్‌తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ వృద్ధికేకాదు జపాన్ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో –పసిఫిక్ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా చెప్పారు. పలు ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాలపై ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్‌వేర్‌ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్ యెన్ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. -
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Xi meets Putin: ఇక మరింత సహకారం
కీవ్: రష్యా, చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు పుతిన్, షీ జిన్‌పింగ్ నిర్ణయానికొచ్చారు. వారు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మినహా పలు అంశాలపై చర్చించుకున్నారు. భేటీని టీవీల్లో ప్రసారం చేశారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా రష్యా, చైనా బంధం బలోపేతం అవుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు! రెండు దేశాల సంబంధాల్లో సైనిక సహకారానికి ‘ప్రత్యేక ప్రాధాన్యం’ ఉందని ఉద్ఘాటించారు. రష్యా, చైనా సైనిక దళాల నడుమ సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రష్యాలో పర్యటించాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
జీ20 సదస్సుకు మోదీ
న్యూఢిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేసియాలోని బాలీకి వెళ్లనున్నారు. నవంబర్ 14–16 తేదీల్లో సదస్సుకు హాజరవుతారు. అదే తేదీల్లో సదస్సుకు విచ్చేస్తున్న పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బగ్చీ గురువారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ సమిష్టిగా కోలుకుందాం. మరింతగా బలీయమవుదాం.. అనే ఇతివృత్తంతో కొనసాగే ఈసారి జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ సహా భాగస్వామ్యదేశాల అగ్రనేతలు పాల్గొంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యంæ అంశాలపైనా చర్చిస్తారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు నాయకత్వం వహిస్తున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో సదస్సు చివరి రోజున తదుపరి నాయకత్వ పగ్గాలను మోదీకి లాంఛనంగా ఇవ్వనున్నారు’ అని బగ్చీ చెప్పారు. -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్‌నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు. రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్‌పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, భారత్‌లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదిరిన ఎంవోయూలు.. బంగ్లాదేశ్ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్ భారత్ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్ డబ్లింగ్ పనుల్లోనూ, పర్బతీపూర్– కౌనియా రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చేందుకు భారత్ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్ వద్ద 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత ప్లాంట్ మైత్రి యూనిట్–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు. షేక్ హసీనాకు ఘన స్వాగతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. -
హైదరాబాద్ హౌస్‌లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు
న్యూఢిల్లీ: భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా.. శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన జపాన్ ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. జపాన్ అధికారుల ప్రధాని మోదీతో ఆయన భేటీ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విట్టర్లో.. ఇరు ప్రధానులు న్యూఢిల్లీలో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. అని పేర్కొంది. భారత్ పర్యటనకు రాకముందు జపాన్ ప్రధాని కిషిడా ఇలా అన్నారు... "నేను భారత్ పర్యటన తరువాత కంబోడియా పర్యటనకు వెళ్తున్నాను. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ఈ పర్యటనల ద్వారా నేను అంతర్జాతీయ ఐక్యత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. జపాన్ భారత్ వివిధ సమస్యలపై కలిసి పనిచేస్తాయని విశ్వసించండి. టోక్యోలో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నాయకుల మధ్య జరిగే క్వాడ్ సమ్మిట్ విజయవంతానికి కృషి చేయాలనే మా ఉద్దేశ్యాన్ని భారత ప్రధాని మోదీతో కలిసి ధృవీకరించాలనుకుంటున్నాను. అని చెప్పారు. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా పై జపాన్ ఆంక్షలు విధించడమే కాక ఉక్రెనియన్ శరణార్థులను స్వీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా 2018 అక్టోబర్‌లో మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగింది. కానీ ఆ తర్వాత ఏడాది 2019లో గౌహతిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల కారణంగా సమ్మిట్ నిర్వహించలేకపోయింది. గత రెండేళ్లు కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి 2021 వరకు శిఖరాగ్రసమావేశన్ని నిర్వహించలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ఏడాది నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం భారత్, జపాన్ల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. భారత్ జపాన్ రెండూ తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ జపాన్‌లు తమ 'ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కాక విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి బలోపేతం చేయడానికి పరస్పర సహకరంతో ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. (చదవండి: వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు) -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్‌లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్‌లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్‌లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్‌లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
అల అగ్రరాజ్యంలో...
-
అమెరికాతో రక్షణ సహకారం బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సమావేశమయ్యారు. పలు రంగాల్లో రక్షణ సహకారం మరింత పెరిగేలా తమ చర్చలు ఫలవంతంగా సాగాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమయ్యాలా సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్లు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ఇరువురూ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ సమావేశమవుతారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికా మంత్రుల భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : చైనా సరిహద్దులో ఆయుధ పూజ -
ఇమ్రాన్..జాగ్రత్తగా మాట్లాడండి!
వాషింగ్టన్: భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి జఠిలంగానే ఉందని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు కలిసి పనిచేయాలని భారత్, పాక్‌లను ఆయన కోరారు. కశ్మీర్ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని, సంయమనంతో వ్యవహరించాలని, అదే సమయంలో భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో నిగ్రహంతో వ్యవహరించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇమ్రాన్‌ను కోరారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర అభ్యంతరం తెలపడం, రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో సోమవారం ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ‘వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుతో రెండు దేశాల ప్రధానులతో చర్చించా. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లకు సూచించా. అక్కడ పరిస్థితి జఠిలంగానే ఉన్నప్పటికీ, మా మధ్య సంభాషణలు ఫలప్రదంగా సాగాయి’అని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ వారికి వివరించారు. ప్రాంతీయ పరిణామాలతోపాటు అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా భారత ప్రధాని మోదీతో చర్చించారని, త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఆకాంక్షించారని తెలిపింది. ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడం పాక్ ఆపాలని ట్రంప్‌ను మోదీ కోరారని వెల్లడించింది. భారత ప్రభుత్వం జాత్యహంకార, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తోందని, దీని కారణంగా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని మైనారిటీల సంక్షేమం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. సోమవారం ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు జరిగిన ఫోన్ సంభాషణల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్ పాక్ ప్రధానితో మాట్లాడారు. అయితే, కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని ఇమ్రాన్ కోరారని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి పేర్కొన్నారు. కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేయాలని, మానవహక్కుల సంఘాలను కశ్మీర్లో పరిస్థితులపై అంచనా వేసేందుకు పంపించాలని కూడా ఇమ్రాన్ కోరారన్నారు. ఇలా ఉండగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పెర్‌తో ఫోన్లో సంభాషించారు. భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, సంబంధిత అంశాలు తమ అంతర్గత విషయమని కూడా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు భారత్ అంతరంగిక వ్యవహారమని, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎస్పెర్ ప్రశంసించారని అధికారులు తెలిపారు. భారత్, పాక్‌కు ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా సూచించారన్నారు. -
పాక్ పరువుపోయింది
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరోసారి భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా ఒత్తిడిని యూఎన్ బేఖాతర్ చేసింది. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ రంగు అద్దడానికి చైనాతో కలిసి పాక్ చేసిన కుయుక్తులు బెడిసికొట్టాయి. ఈ సమావేశం జరగడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జన్, పాక్ రాయబారి మలీహా లోథిలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్ అంశంపై ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు మాసానికి భద్రతా మండలి అధినేతగా పోలండ్ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. అందుకే కశ్మీర్ అంశంలో ఐరాస తరఫున ఏదైనా ప్రకటన జారీ చేయాలని పోలండ్ అధ్యక్షుడిపై చైనా ఒత్తిడి తీసుకువచ్చింది. యూకే దానికి వంతపాడింది. ద్వైపాక్షిక సమస్యన్న మెజార్టీ దేశాలు.. నాలుగ్గోడల మధ్య జరిగిన ఆ సమావేశం వివరాలు తెలిసిన కొన్ని వర్గాలు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించమని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. 370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనని కొట్టిపారేశాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈఎస్) ద్వారా మార్పులు వస్తున్నాయి కదాని దుయ్యబట్టాయి. చైనా తానేదైనా చేయదలచుకుంటే తమ దేశ అభిప్రాయంగా ప్రకటన అయినా ఇచ్చుకోవచ్చునని ఆ సమావేశంతో పాల్గొన్న ఇతర దేశాలు పేర్కొన్నాయి. కశ్మీర్ అంశంలో తలదూరిస్తే భారత్ వాదనలకు తమ దగ్గర సమాధానం లేదని యూఎన్ అభిప్రాయపడింది. Üమ్లా ఒప్పందానికి అనుగుణంగానే కశ్మీర్‌పై తాము నిర్ణయం తీసుకున్నామని భారత్ చెబుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన సభ్యదేశాలేవీ తమ వైఖరిని వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ రికార్డు చేయలేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా∙నిలిచాయి. ఫ్రాన్స్, రష్యాలు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచివి కావని ఇండోనేసియా సూచించింది. ఉగ్రవాదాన్ని నిరోధిస్తేనే చర్చలు చైనా ఒత్తిడి మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిశాక యూఎన్‌లో పాక్, చైనా రాయబారులు మీడియాను తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ యూఎన్‌లో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం పాకిస్తాన్ జర్నలిస్టుల దగ్గరకు స్వయంగా వచ్చి స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భయోత్పాతం సృష్టిస్తూ ఉంటే ఏ దేశం కూడా చర్చలకు ముందుకు రాదని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుంటేనే భారత్ చర్చలకు ముందుకు వస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భారత్ ఎప్పుడో ప్రకటించిందని, పాక్ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ చెప్పారు. -
కశ్మీర్‌పై ఐరాసలో రహస్య చర్చలు
ఐక్యరాజ్య సమితి: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత్ తొలగించిన అంశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి శుక్రవారం రహస్య చర్చలు జరిపింది. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. భారత్, పాక్‌లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా తమ అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేయగా, పాక్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి వివాదాస్పదం చేస్తోంది. శాంతంగా పరిష్కరించుకోవాలి: రష్యా, చైనా చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ రహస్య చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ మాట్లాడుతూ భారత్, పాక్‌లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పద్ధతిని మానుకోవాలని సూచించారు. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఆయన స్పందిస్తూ, భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయనీ, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు. ఉగ్రవాదం ఆపితేనే చర్చలు: భారత్ ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపిన తర్వాతే ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నారు. రహస్య చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ చెప్పినట్లుగానే కశ్మీర్లో 370వ అధికరణం రద్దు అంశం భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఇతర దేశాలకు దీనితో పనిలేదన్నారు. పాక్‌పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, కశ్మీర్లో ఏదో జరిగిపోతోందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందనీ, ఇది వాస్తవ దూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై రెండు దేశాలు (పాక్, చైనా) తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయనీ, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. -
భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు
బీజింగ్/ఇస్లామాబాద్: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న జై శంకర్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్ చైనాను సందర్శించడం గమనార్హం. వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్‌లో సోమవారం జరిగిన భారత్–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్ చెప్పారు. -
సమష్టిగా విపత్తు నిర్వహణ
ఒసాకా: విపత్తు నిర్వహణ విషయంలో జి20 బృందం ప్రపంచదేశాలతో కలిసి కూటమిగా ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు, పునరావాసం ఎంత త్వరగా చేపడితే నష్టం అంత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వైపరీత్యాల సమయంలో నిరుపేద ప్రజలే ఎక్కువగా నష్టపోతుంటారని వ్యాఖ్యానించారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో జరుగుతున్న జి20 సదస్సులో శనివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘విపత్తులను తట్టుకునే మౌలికవసతుల కల్పన కోసం అంతర్జాతీయ కూటమితో చేతులు కలపాలని జి20 దేశాలను నేను కోరుతున్నాను. ఈ రంగంలో తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. రండి.. సురక్షితమైన ప్రపంచం కోసం మనమందరం చేతులు కలుపుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు. విపత్తులను తట్టుకునే మౌలికవసతుల ఏర్పాటు అన్నది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఈ మౌలిక వసతులు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. బిజీబిజీగా మోదీ.. జి20 సదస్సు చివరి రోజైన శనివారం ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమైన మోదీ వాణిజ్యం ఉగ్రవాదంపై పోరు, తీరప్రాంత భద్రత, రక్షణ సహా పలు అంశాలపై చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడోతో మోదీ తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, తీర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సోనారోతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జీవ ఇంధనాలు, వాతావరణ మార్పు వంటి అంశాలపై మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలుసుకున్నారు. భారత్–టర్కీల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లీహసియన్ లూంగ్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాలతో ప్రధాని మోదీ సుహృద్భావ పూర్వకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయా దేశాధినేతలతో వీరు చర్చించారు. కితనా అచ్చేహై మోదీ! భారత ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన కితాబు ఇది. ఒసాకాలో జరిగిన జి–20 సదస్సుకు హాజరయిన మారిసన్,మోదీలు శనివారం సమావేశమయ్యారు. క్రీడలు, గనుల తవ్వకం, రక్షణ, తీర ప్రాంత భద్రత వంటి విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు అంగీకరించారు. ఆ సందర్భంగా మారిసన్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు. దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ఫొటోకు ‘కితనా అచ్చే హై మోదీ’అని కాప్షన్ ఇచ్చారు. దాన్ని చూసి మోదీ మురిసిపోయారు. ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ మారిసన్ను ‘మేట్’అని సంబోధించారు. ఆస్ట్రేలియా భాషలో మేట్ అంటే స్నేహితుడని అర్థం. భారత్–ఆస్ట్రేలియా సంబంధాల పట్ట సంతోషంగా ఉన్నానని మోదీ ట్వీట్ చేశారు.‘కితనా అచ్చే హై మోదీ అంటూ హిందీలో నన్ను అభినందించడం ద్వారా ఈ ట్వీట్‌ను వైరల్ చేశారు.దానికి నేను కృతజ్ఞుడిని’అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆ దేశాలే బాధ్యులు
బిష్కెక్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు. ఎస్సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్ కీలకమని భారత ప్రధాని అన్నారు. ఆప్ఘన్ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ–ఇమ్రాన్ పలకరింపులు ఎస్సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది. దౌత్య మర్యాదకు ఇమ్రాన్ భంగం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్ అయింది.ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికార ట్విట్టర్లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్ ఖాన్ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ప్రేరేపిత ఉగ్రవాదంతో ముప్పు
మాలి: ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని భారత ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్నుద్దేశించి ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీకి చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సోలిహ్ సాదర స్వాగతం పలికారు. మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్‌తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను సోలిహ్‌కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు జరగాలి చరిత్రకు పూర్వం నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ..స్పీకర్‌గా ఎన్నికైన మొహమ్మద్ నషీద్ మజ్లిస్మొదటి సమావేశానికి తనను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రతి భారతీయుడిని కదిలించి, ఇక్కడి ప్రజల పట్ల గౌరవాన్ని పెంచిందన్నారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం బలపడేందుకు ప్రతి భారతీయుడూ వెన్నంటి ఉంటారని భరోసా ఇచ్చారు. ‘ఉగ్రవాదం ఏదో ఒక దేశానికే పరిమితమైంది కాదు, అది నాగరికతకే పెనుముప్పు. ప్రపంచ దేశాలన్నీ కలిసి వాతావరణ మార్పులపై సమావేశాలు, చర్చలు జరిపిన విధంగానే ఉగ్రవాదం అంశంపైనా అంతర్జాతీయ సదస్సు జరపాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డ వారు ఉన్నారంటూ కొందరు తేడా చూపుతూ పొరపాటు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ తరహా ఉగ్రవాదం తీవ్ర ప్రమాదకరంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ నేతలంతా ఏకం కావాలని ఆయన కోరారు. ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నిర్ణయించారు. ఈ మేరకు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘రెండు దేశాల ఉమ్మడి భద్రతా పరమైన అంశాల గుర్తించి, ఈ ప్రాంతంలో సుస్థిరత సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రెండు దేశాల్లోనూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరగనివ్వరాదు. హిందూమహా సముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు సహకారం బలోపేతం చేసుకోవాలి. సమన్వయంతో కూడిన గస్తీ, నిఘా, సమాచార మార్పి, బలగాల పెంపు తదితర అంశాల ద్వారా సముద్ర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవాలి. మెరుగవుతున్న సంబంధాలు గత ఏడాది నవంబర్‌లో సోలిహ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని మాల్దీవులు సందర్శించడం ఎనిమిదేళ్లలో అదే ప్రథమం. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ చైనా పరోక్ష జోక్యం ప్రభావం ఫలితంగా దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం వంటి పలు చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన విషయం తెలిసిందే. సోలిహ్ అధికారంలోకి వచ్చాక భారత్–మాల్దీవుల సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన సందర్భంగా బెంగళూరులో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ వీక్షించారు. అనంతరం ఆయన తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం కోరారు. కేరళ నాకెంతో ప్రియమైనది తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో గెలచాక మోదీ తొలిసారిగా కేరళలో పర్యటించారు. కేరళ బీజేపీ విభాగం ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ప్రధాని.. తన సొంత నియోజకవర్గం వారణాసి మాదిరిగానే కేరళ తనకెంతో ప్రియమైనదని చెప్పారు. బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఈ ఎన్నికలు వ్యతిరేక శక్తుల్ని తిరస్కరించాయి. చెడుపై మంచి విజయం సాధించింది. ఇదే స్ఫూర్తితో నవ భారత నిర్మాణానికి అందరం కలసికట్టుగా పనిచేయాలి‘‘ అని మోదీ పిలుపునిచ్చారు. కేరళలో మాకు ఒక్క సీటు రాకపోయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలపై ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో అద్భుతమైనవారు. వారితో బంధం మరింత దృఢపడాలని కోరుకుంటున్నాను‘‘ అని అన్నారు. గురువాయూర్‌లో మోదీ తులాభారం కేరళ పర్యటనలో భాగంగా మోదీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శిం చుకున్నారు. స్వామివారి సమక్షంలో తామరపూలతో తులాభారం నిర్వహించారు. తామరపూలతో మోదీ శ్రీకృష్ణుడికి మొక్కును చెల్లించుకున్నారు. గురువాయూర్ ఆలయం పరమపవిత్రమైనది. కృష్ణ భగవానుడికి అరటిపళ్లు, తామరపూలు, నెయ్యి సమర్పించారు. ప్రధాని మోదీ శ్రీకృష్ణ ఆలయంలో దాదాపుగా 20 నిముషాల సేపు గడిపారు. కేరళ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభాలతో శ్రీకృష్ణ ఆలయ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ వస్త్రధారణ అయిన తెలుపు రంగు ముండు(ధోతీ), కుర్తాతో పాటు శాలువాను మోదీ ధరించారు. గురువాయూర్‌లో పంచెకట్టులో ప్రధాని అభివాదం. తామరపుష్పాలతో తులాభారం దృశ్యం -
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వీరు చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పుతిన్.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత ఏడాది మేలో రష్యాలోని సోచిలో ఇద్దరు నేతల చర్చలు, పుతిన్ భారత్ పర్యటనల ద్వారా అత్యంత కీలకమైన ఉమ్మడి భాగస్వామ్యంలో అధిగమించిన మైలురాళ్లను, సాధించిన విజయాలపై ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ రంగం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మోదీ, పుతిన్ చర్చించారు. అంతర్జాతీయ అంశాలతోపాటు ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, తదితర ప్రపంచ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యాలోని వ్లాడివొస్టోక్లో సెప్టెంబర్‌లో జరగనున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మోదీని పుతిన్ ఆహ్వానించారు. -
ఉగ్రవాదమే పెద్ద సమస్య
బ్యూనోస్ ఎయిర్స్: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్ర«ధాని మోదీ శుక్రవారం అన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు కోసం మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తుండటం తెలిసిందే. అక్కడ బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన భేటీలో మోదీ ప్రసంగించారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని ఆయన సూచించారు. బ్రిక్స్ దేశాధినేతల భేటీలోనే కాకుండా ప్రత్యేకంగానూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వాతావరణ మార్పులపై ఈ నెల 3 నుంచి పోలండ్‌లో జరగనున్న కాప్24 సదస్సులో భారత్ కీలక, బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తుందని గ్యుటెరస్‌తో మోదీ చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని అన్నారు. ట్రంప్ చెడగొట్టారు: పుతిన్ జీ–20 దేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులపై గతంలో ఉన్న ఏకాభిప్రాయాన్ని ట్రంప్ చెడగొట్టారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారంలో రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తుండటాన్ని పుతిన్ తప్పుబట్టారు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో జీ–20 దేశాధినేతల తొలి సదస్సు సమయం నుంచి ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను ట్రంప్ పాడుచేశారని పుతిన్ దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పుతిన్‌తో గొంతు కలిపారు. ట్రంప్, మోదీ, అబే భేటీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ శుక్రవారం జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని మోదీ అన్నారు. ‘జై’ దేశాల తొలి త్రైపాక్షిక భేటీలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని అబే చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. -
అమెరికాకు భారత్, రష్యాలు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, రష్యాల మధ్య మరో కీలక ఒప్పందం ఖరారైంది. ఐదు బిలియన్ డాలర్ల (రూ. 40,000 కోట్లు) విలువైన ఎస్-400 ట్రయంఫ్ క్షిపుణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య 19వ ద్వైపాక్షిక సదస్సులో ఈ ఒప్పందం ఖరారైనట్లు ఇరు దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది అంశాలపై సంతకాలు చేశారు. కాగా రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేయకూడదన్న అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా భారత్ కొనుగోలుకే మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా తదుపరి ప్రకటన ఎలా ఉంటోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సదస్సులో భాగంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధిలో రష్యా సహాకారం ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌కు నమ్మకమైన మిత్రదేశం రష్యా అని, అంతరిక్షం, రక్షణ, వంటి అంశాల్లో రష్యా సహాకారం ఎంతో ఉందని మోదీ కోనియాడారు. మోదీకి ఆహ్వానం... రష్యాలోని వ్లాదివోస్లోక్ ఫోర్‌మ్‌కు ముఖ్య అతిధిగా నరేంద్ర మోదీని రావాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారు. ఉగ్రవాదం, రక్షణ సహాకారం వంటి పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు పుతిన్ తెలిపారు. ఇండియా ఇంధన అవసరాలను తీర్చేందుకు రష్యా ఎల్లపూడూ సిద్దంగా ఉంటుందని పుతిన్ వెల్లడించారు. భారత్‌ను రష్యాకు నమ్మమైన మిత్రదేశంగా పుతిన్ వర్ణించారు. -
భారత్, పాక్ మధ్య చర్చలే శరణ్యం
శ్రీనగర్ : కశ్మీర్లో శాంతిని నెలకొల్పాలంటే భారత్,పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలే శరణ్యమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశంలో బుధవారం ఈ మేరకు ఏకగ్రీవం తీర్మానం చేసింది. రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న వైరుద్యాలకు చర్చల ద్వారా చరమగీతం పాడాల్సిన అవసరముందని ఫరూక్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య చర్చలతో అటు సరిహద్దు సమస్యతో పాటు కశ్మీర్లో సాగుతున్న మారణకాండకూ ఓ పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ‘‘సమైక్యత, సమగ్రత, ప్రత్యేకతకు కశ్మీర్ కట్టుబడి ఉంది. పాక్,భారత్ విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలు విఫలం కావడంతో తాము ఎంతో నిరాశ చెందాము. పాక్‌తో చర్చలకు కశ్మీర్ ప్రజలకు ఎంతో కాలం నుంచి ఎదురుచుస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ మేరకు చొరవ తీసుకోవాలి’’ అని ఫరూక్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35A లపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తెలపాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఏ ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు నిరసనగా ఐరాస వేదికగా జరగాల్సిన భారత్,పాక్ విదేశాంగ మంత్రుల సమావేశంను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇంత అహంకారమా?: భారత్‌పై ఇమ్రాన్ ధ్వజం
కరాచీ : భారత్‌తో శాంతి చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను పునరుద్దరించాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘శాంతి కోసం చర్చలకు రావాలని నేను రాసిన లేఖకు భారత్ నుంచి అహంకారపూరిత ప్రతికూల స్పందన రావడం నిరాశ కలిగించింది. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు.’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However, all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture. — Imran Khan (@ImranKhanPTI) September 22, 2018 ఇక కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుందన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల భారత్‌కు రాసిన లేఖలో ప్రతిపాదించారు. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలెలా జరపుతామని భారత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌తో చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలకు భారత ప్రభుత్వం ససేమిరా అంటో్ంది. బుధవారం రామ్‌గడ్ సెక్టారులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తూటలు దింపు, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే గురువారం ముగ్గురు ఎస్వీవోలను పాకిస్తాన్ కిరాతకంగా హత్యచేసింది. ఈ నేపథ్యంలో పాక్‌తో్ శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని.. ప్రభుత్వం ప్రకటించింది. కాగా సరిహద్దులో పాక్ చర్యలకు తూటలతోనే సమాధానం చెప్తుతామని ఇటీవల భారత సైన్యం ప్రకటించిన విషయం విధితమే. పాకిస్తాన్ నూతన ఇటీవల ఎన్నికైక ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే లేఖ రాశారు. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. సరిహద్దులో పాక్ వైఖరిపై భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. కాగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అమెరికా ఆహ్వానం... పాక్, భారత్ విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమని గురువారం వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భవిషత్తులో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అకాక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ఓ ప్రకటలో తెలిపింది. -
చర్చలు మళ్లీ మొదలెడదాం..
ఇస్లామాబాద్: భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సంసిద్ధత తెలుపుతూ ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ద్వైపాక్షిక బంధాలకు సవాల్‌గా మారిన ఉగ్రవాదం, కశ్మీర్ సహా ఇతర కీలకమైన అంశాలపై చర్చకు సిద్ధమేనని గురువారం మోదీకి రాసిన లేఖలో ఇమ్రాన్∙పేర్కొన్నారు. సెప్టెంబర్ 14న ఇమ్రాన్ ఈ లేఖ రాసినట్లు ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ప్రతిపాదించారు. ‘భారత్–పాక్ మధ్య సంబంధాల్లో సవాళ్లున్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే ప్రక్రియకు ఐరాస సభలో సమావేశం ఉపయుక్తమవుతుందని భావిస్తున్నా’ అని ఇమ్రాన్ లేఖలో పేర్కొన్నారు. ‘పాక్ ప్రజలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ సహా అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. అభిప్రాయభేదాలను రూపుమాపి పరస్పర ప్రయోజనం కలిగేలా చర్చలు జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నిర్మాణాత్మక చర్యలకు సిద్ధమే.. ఆగస్టు 18న మోదీ ఇరుదేశాల సత్సంబంధాలను కాంక్షిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారు. పాక్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమేనని.. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. పాక్ ఎన్నికల్లో గెలిచాక ద్వైపాక్షిక బంధాలపై ఇమ్రాన్ మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. శాంతికి ముందడుగు: పీడీపీ ఇమ్రాన్ లేఖకు మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఆశాభావం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా భారత్–పాక్ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని పేర్కొంది. ఐరాస సభ సమావేశం సందర్భంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగితే.. శాంతి చర్చలకు ముందడుగు పడినట్లేనని వెల్లడించింది. భేటీ కానున్న విదేశాంగ మంత్రులు ఐరాస సర్వప్రతినిధి సభ సందర్భంగా న్యూయార్క్‌లో వచ్చేవారం భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. 2016 పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. మోదీకి ఇమ్రాన్ లేఖలో ప్రతిపాదించినందుకు సానుకూలంగా వీరిద్దరి భేటీ జరుగనుందని.. ఈ సమావేశం ద్వారా భారత్–పాక్ మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని భావించనక్కర్లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ దృష్టికోణంలో మార్పు ఉండబోదన్నారు. పాక్ గడ్డపై ఉగ్రవాద కేంద్రాల విషయంలో పాక్‌ను నిలదీసే వైఖరినే భారత్ ప్రదర్శిస్తుందన్నారు. పాకిస్తాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత సిక్కులు దర్శించుకునేందుకు అనుమతివ్వడంపైనా సుష్మాæస్వరాజ్ మాట్లాడతారని రవీశ్ చెప్పారు. -
రష్యాతో క్షిపణి ఒప్పందానికే మొగ్గు
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై తన నిర్ణయాన్ని తర్వలో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో జరగనున్న సమావేశంలో భారత్ స్పష్టం చేయనుంది. రష్యాపై అమెరికా ఆంక్షలకు విరుద్ధంగా ఉన్న రూ. 40 వేల కోట్ల ఈ ఒప్పందంపై ముందుకెళ్లాలని అమెరికాకు మనం దేశం తేల్చిచెప్పనుంది. ప్రాంతీయ రక్షణ వ్యవస్థను పటిష్టపర్చడం అత్యవసరమైన నేపథ్యంలో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ భారత్‌కు తప్పనిసరి.. అందువల్ల ఒప్పందాన్ని ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని ట్రంప్ యంత్రాగాన్ని కోరనుంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలపై సెప్టెంబర్ 6న భారత్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో రష్యాతో ఒప్పందంపై మన మంత్రులు ఒత్తిడి తేనున్నారు. -
ప్రోత్సహించేవారూ బాధ్యులే
కఠ్మాండు: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయాలని బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) దేశాలు పిలుపునిచ్చాయి. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కావని ఎండగట్టాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. నేపాల్ రాజధాని కఠ్మాండులో నాలుగో బిమ్స్టెక్ దేశాల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా 7 సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరిగిందని, విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలు పునరుద్ఘాటించాయని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్ నేపాల్ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. అనంతరం నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యారు. తదుపరి బిమ్స్టెక్ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. డిక్లరేషన్ ముఖ్యాంశాలు.. ► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి. ► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి. ► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి. ► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి. ► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి. ► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్టెక్ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. ► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి. ► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి. ► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్టెక్ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి. భాగమతి తీరంలో యాత్రికులకు బస.. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన 400 పడకల విడిది భవనాన్ని మోదీ, నేపాల్ ప్రధాని ఓలితో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో భాగమతి నదీ ఒడ్డున నిర్మించిన ఈ భవనంలో యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి గదులు, కిచెన్, భోజన శాల, లైబ్రరీ తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇది కేవలం విశ్రాంతి భవనమే కాదని, భారత్–నేపాల్‌ల స్నేహానికి చిహ్నమని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా మోదీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాక్సాల్ (బిహార్)–కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి. -
‘బిమ్స్టెక్’తో కలిసి పనిచేస్తాం
కఠ్మాండు: ప్రధాన రంగాల్లో బిమ్స్టెక్ సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో జరుగుతున్న బిమ్స్టెక్ నాలుగో సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా అడ్డుకట్టకు సభ్య దేశాల మధ్య అనుసంధానం పెరగాలని ఆకాంక్షించారు. వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు అవకాశాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతం. జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట ‘బిమ్స్టెక్ సభ్య దేశాలతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడేందుకు భారత్ కట్టుబడి ఉంది. భారత్ విధానాలైన పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్ ఈస్ట్‌లకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంగా మారింది. అలాగే మనందరి భద్రత, అభివృద్ధికి సంబంధించి బంగాళాఖాతానికి ప్రాధాన్యత ఉంది. సభ్య దేశాల్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలతో ఇబ్బంది పడని దేశం లేదు. బిమ్స్టెక్ విధివిధానాలకు లోబడి మాదకద్రవ్యాల సంబంధిత అంశాలపై సదస్సు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ సమస్య ఒక దేశానికి సంబంధించిన శాంతిభద్రతల అంశం కాదు. దీనిని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. తరచూ వరదలు, తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తు సంభవించే హిమాలయాలు, బంగాళాఖాతం మధ్య బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయని.. అందువల్ల మానవతా సాయం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో సభ్య దేశాలు సహకారం, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ‘శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఏ ఒక్క దేశం ఒంటరిగా ముందుకు సాగలేదు. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతలో సహకారం.. సభ్య దేశాల ఉమ్మడి లబ్ధి కోసం వ్యవసాయ పరిశోధన, స్టార్టప్స్ తదితర అంశాల్లో సదస్సు నిర్వహిస్తామని, బంగాళాఖాతం ప్రాంతంలోని కళలు, సంస్కృతి, ఇతర అంశాలపై పరిశోధన కోసం నలంద యూనివర్సిటీలో ‘బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ సాంకేతికత రంగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌కు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహకారాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని దేశాలతో అనుసంధానంలో ఈశాన్య రాష్ట్రాలు కీలక ప్రాత పోషిస్తాయని, ఆ రాష్ట్రాల్లో చేపడుతోన్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్ని బిమ్స్టెక్ దేశాలకు విస్తరించవచ్చని చెప్పారు. ‘నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’లో చదివేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు స్కాలర్షిప్ అందచేస్తామన్నారు. బిమ్స్టెక్ వేదికగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
ఇమ్రాన్‌కు బ్యాటు బహుమానం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కాబోయే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరిద్దరు చర్చించారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు తదితర అంశాలపై ఇమ్రాన్ వద్ద అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున అజయ్ అభినందించారు. భారత క్రికెట్ జట్టు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహూకరించారు. భారత్–పాక్ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న సార్క్ సదస్సలో భారత్ పాల్గొనాలని కూడా ఆయన కోరారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పీటీఐ ప్రకటించింది. భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సునీల్ గావస్కర్‌లను ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొంది. ఆగస్టు 13 నుంచి పాక్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. -
డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు. పుతిన్‌తో మోదీ భేటీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస.. రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది. -
శాంతికి సిద్ధం.. కశ్మీర్ కీలకం!
ఇస్లామాబాద్: భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కీలమైన కశ్మీర్ వివాదం సహా అన్ని అంశాలపై ఇరుదేశాల నేతలు పరిష్కారం కుదుర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. 2016లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఇంతవరకు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అనంతరం కుల్‌భూషణ్ జాధవ్ అనే మాజీ నేవీ అధికారిని భారత నిఘా అధికారి అని ఆరోపిస్తూ.. ఆయనకు పాక్ కోర్టు మరణశిక్ష విధించడంతో పరిస్థితులు జఠిలంగా మారాయి. కశ్మీర్ అంశంపై.. ‘ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి’ అని ఇమ్రాన్ అన్నారు. రెండు దేశాల మధ్య కశ్మీర్ ఒక్కటే కీలకమైన అంశం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరుదేశాలు సిద్ధం కావాలి. 30 ఏళ్లుగా భారత ఆర్మీ ద్వారా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇరుదేశాల ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ఈ సమస్యపై అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటకే వస్తున్నాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సంబంధాలపై ‘ఒకవేళ భారత నాయకత్వం కోరుకుంటే.. ఆ దేశంతో సంబంధాలు బలోపేతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దానికి భారత్‌దే బాధ్యతని.. అలాగే కశ్మీర్లో జరుగుతున్న ఘటనలకు పాకిస్తాన్ బాధ్యతంటూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం సరికాదు. ఇలాంటి ఆరోపణలతో మనం వృద్ధి చెందలేం. ఇవి ఉపఖండానికి చేటుచేస్తాయి. భారత్–పాకిస్తాన్ సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. రెండు దేశాలు ఆర్థికంగా సమృద్ధి చెందుతాయి’ అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. భారత మీడియాపై.. తనపై భారత మీడియా పేర్కొంటున్న కథనాలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్ సినిమాల్లో విలన్ మాదిరిగా చిత్రీకరిస్తోంది. ఆ వార్తలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే ఓ పాకిస్తానీని నేను. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్ అంతా చుట్టేశాను. భారత్, భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మనం కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరికాన్ని పారద్రోలవచ్చు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీర్. ఈ అంశంపై రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలి’ అని అన్నారు. చైనా, అరేబియా దేశాలతో దోస్తీ అమెరికాతో సత్సంబంధాలతో పాక్‌కు మేలు జరుగుతుంది. అమెరికాకు పాక్‌తో బంధాలు కాపాడుకోవడం అవసరం. ఇది పరస్పర ప్రయోజనాల అంశం. ఇరాన్, సౌదీ అరేబియాలతోనూ మా దోస్తీ కొనసాగుతుంది. చైనాతో మా బంధాలను బలోపేతం చేసుకుంటాం. చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి వారు మాకో అవకాశాన్ని కల్పించారు. అవినీతిపై యుద్ధం, ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో చైనా నుంచి మేం చాలా నేర్చుకుంటాం. ఉగ్రవాదంపై పోరు కారణంగా అఫ్గనిస్తాన్ నష్టపోయింది. ఆ దేశంలో శాంతి నెలకొనటమంటే పాక్‌లో శాంతి నెలకొన్నట్లే’ అని అన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా! న్యూఢిల్లీ: ఆర్మీ అండదండలతో ప్రస్తుత పాక్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని నిరసించేవారు. కొద్దికాలానికే సైన్యంపై తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడంతో తాజాగా పాక్ ప్రధాని పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో ఖాన్ మాట్లాడుతూ.. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటాన్ని మీరు చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ 35 సీట్లతో చతికిలపడింది. కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ పాక్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం ఎన్నికల ఫలితాలే కాదు.. ఈ ఐదేళ్లలో ఆర్మీ పట్ల ఇమ్రాన్ అభిప్రాయం, వ్యవహారశైలి మారాయి. ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ ఇంటర్వ్యూలో. ‘అది పాక్ ఆర్మీయే తప్ప శత్రు దేశపు సైన్యం కాదు. నేను ఆర్మీని కలుపుకునిపోతాను’ అని అన్నారు. భారత్‌పైనా ఇమ్రాన్ అభిప్రాయాలు మారాయి. గతంలో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలో భారత్ షరీఫ్‌తో కలసి పాక్ సైన్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రచేస్తోందన్నారు. కశ్మీర్లో భారత సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. మదీనాలా పాక్ పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ పాక్‌ను మదీనా తరహాలో అభివృద్ధి చేస్తానని ఇమ్రాన్ అన్నారు. ‘మహ్మద్ ప్రవక్త స్ఫూర్తితో పాకిస్తాన్‌ను మదీనాగా మారుస్తా. మానవత్వం పరిమళించే దేశంగా మారుస్తా. నేను చేపట్టే సంక్షేమపథకాలు ధనికుల కోసం కాదు. పేద ప్రజలకోసమే. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తాం. విలాసవంతమైన పాకిస్తాన్ ప్రధాని నివాసంలో నేనుండను. దాన్ని విద్యాకేంద్రంగా మారుస్తా’ అని అన్నారు. -
రువాండాలో ప్రధాని మోదీ
కిగాలీ / న్యూఢిల్లీ: ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రువాండాకు చేరుకున్నారు. రాజధాని కిగాలీలోని ఎయిర్‌పోర్టులో మోదీకి రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనతో రువాండాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పర్యటనలో కగమేతో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. రువాం డాలో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ తోళ్ల అనుబంధ పరిశ్రమ, వ్యవసాయ పరిశోధనకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రువాండాలో పారిశ్రామిక పార్కులు, కిగాలీ సెజ్ అభివృద్ధికి రూ.1,379.10 కోట్ల రుణాన్ని, వ్యవసాయం, నీటివనరుల అభివృద్ధికి మరో రూ.689.55 కోట్ల సాయాన్ని భారత్ అందజేయనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. తర్వాత మంగళవారం ఉగాండాకు వెళ్లనున్న మోదీ.. ఆ దేశ ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 200 ఆవుల బహుమతి.. రువాండా పర్యటనలో మోదీ ఓ గ్రామానికి 200 ఆవుల్ని బహుమతిగా ఇవ్వనున్నారు. రువాండా ప్రారంభించిన ‘గిరికా’ కార్యక్రమం కింద ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ఆవు ఇవ్వనున్నారు. ఇందుకు స్థానిక ఆవుల్ని సేకరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం సమకూర్చడమే పథకం లక్ష్యం. -
బ్రిక్స్ సదస్సుకు మోదీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది జరగబోయే 10వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని∙మోదీ హాజరుకానున్నారు. జూలై 25 నుంచి 27 వరకు జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఈసారి అంతర్జాతీయ శాంతి, రక్షణ అంశాలపై చర్చ జరిగే వీలుంది. అంతకుముందు రువాండా, ఉగాండాలో పర్యటించనున్నారు. జూలై 23 నుంచి 27 వరకు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రువాండాలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. తర్వాత జూలై 24న ఉగాండాకు బయల్దేరి వెళ్లి, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడి జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ శాంతి, రక్షణ, అంతర్జాతీయ పరిపాలన, వాణిజ్య సంబంధ సమస్యలపై సభ్య దేశాల నేతలు చర్చిస్తారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా, బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరువురు నేతలు వాణిజ్యంలో అమెరికా వైఖరి సహా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. -
బలమైన బంధం దిశగా..!
చింగ్‌దావ్: పొరుగుదేశమైన చైనాతో ద్వైపాక్షిక బంధాలను మరింత పరిపుష్టం చేసుకునే దిశగానే ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో విస్తృతాంశాలపై భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు మోదీ చెప్పారు. చైనాలోని చింగ్దావ్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సుకు ముందు ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఏప్రిల్ చివరివారంలో చైనాలోని వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీలో చర్చించిన అంశాలకు కొనసాగింపుగా శనివారం నాటి భేటీ జరిగింది. బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి సహా పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. వుహాన్ సదస్సులో బంధాల బలోపేతం దిశగా బ్లూప్రింట్‌పై చర్చించారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. డోక్లాం వివాదం తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంతోపాటు పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే దిశగానే వీరి భేటీ జరిగింది. ‘జిన్‌పింగ్‌తో సమావేశం జరిగింది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించాం. భారత్–చైనా స్నేహ బంధాన్ని ఈ చర్చలు బలోపేతం చేయనున్నాయి. అంతర్జాతీయ సమాజానికీ మేలుచేసే అంశాలపై చర్చించాం. వుహాన్‌లో జరిగిన భేటీలోనూ చాలా అంశాలపై ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా ఆసక్తిగా ఉందని.. పరస్పర విశ్వాసం పెంచుకునేందుకు వుహాన్ సమావేశం తొలిమెట్టని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది. తమ సైన్యాలు పరస్పర సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకునేలా వ్యూహాత్మక మార్గదర్శనం చేయాలని కూడా భేటీలో నిర్ణయించారు. గత నాలుగేళ్లలో వీరిద్దరూ భేటీ కావడం ఇది 14వ సారి. ఒకరికొకరుగా ముందుకు.. డోక్లాం వివాదం, అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు అణ్వాయుధ దేశాలు మళ్లీ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాయి. గతవారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ–లా డైలాగ్ సదస్సులో ‘భారత్–చైనాలు పరస్పర విశ్వా సం, పరస్పర సహకారంతో పనిచేయడం ద్వారా ఆసియాతోపాటు మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తుంద’ని మోదీ పేర్కొనటం ఇరుదేశాలు ఒకరి సామర్థ్యాలను మరొకరు గుర్తించి ముందుకెళ్లాలన్న ప్రయత్నాన్ని సూచిస్తోంది. ఎస్సీవోతో కలసి పనిచేస్తాం: మోదీ ఎస్సీవోలోని సభ్య దేశాలతో చురుకుగా పనిచేసేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎస్సీవో సెక్రటరీ జనరల్ రశీద్ అలిమోవ్తో ఆయన శనివారం భేటీ అయ్యారు. ‘ఎస్సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత భారత్ పాల్గొంటున్న తొలి సమావేశం ఇది. ఇందులో భాగంగా రశీద్ అలిమోవ్తో పలు అంశాలపై జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి’ అని మోదీ పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజింగ్‌లోని ఎస్సీవో ప్రధాన కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తామని రశీద్ చెప్పారు. 2005 నుంచి ఈ కూటమిలో భారత్ అబ్జర్వర్‌గా ఉంది. అంతకుముందు, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తదుపరి పనిచేయాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్తోనూ మోదీ భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌కు మోదీ ఆహ్వానం భారత్‌లో వుహాన్ తరహా భేటీ ఇటీవల వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేకమైన ఇష్టాగోష్టి తరహా సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రావాలని ద్వైపాక్షిక చర్చల అనంతరం జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు చైనా అధ్యక్షుడు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు. 2019లో భారత్‌లో వుహాన్ తరహా భేటీని నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. దీనికి రావాలంటూ జిన్‌పింగ్‌ను కోరగా ఆయన ఈ ఆహ్వానాన్ని మన్నించారు. అయితే.. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఇరుదేశాల దౌత్య అధికారులు దీనిపై చర్చించి ఖరారు చేస్తారు’ అని గోఖలే వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జూలైలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మళ్లీ మోదీ–జిన్‌పింగ్ కలవనున్నారు. ముంబైలో బ్యాంక్ ఆఫ్ చైనా శాఖను తెరిచేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా మోదీని జిన్‌పింగ్ కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించారు. అటు, ఇరుదేశాల విదేశాంగ శాఖల మంత్రులు సుష్మా స్వరాజ్, వాంగ్ యీల నేతృత్వంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకానుంది. ఈ వ్యవస్థ తొలి సమావేశం ఈ ఏడాది చివరికల్లా జరగనుంది. -
మనది సహజ సంబంధం
సింగపూర్: భారత్, సింగపూర్ మధ్య సుహృద్భావ, సన్నిహిత సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సింగపూర్‌తో భారత్‌కు సహజ భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాల మైత్రిలో ఎలాంటి బేషజాలు, అనుమానాలు లేవన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా గురువారం మోదీ సింగపూర్ చేరుకున్నారు. ‘బిజినెస్, ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఈవెంట్’ అనే కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేస్తున్నామని, నవ భారత్ తయారవుతోందని ప్రవాసులకు తెలిపారు. సింగపూర్ చిన్న దేశమైనా ఎన్నో విజయాలు సాధించిందని కితాబిచ్చారు. రెండు దేశాల మధ్య ఏటా జరిగే భద్రతా కార్యక్రమం షాంగ్రి–లా డైలాగ్‌లో మోదీ నేడు మాట్లాడనున్నారు. కాలానికి అనుగుణంగా భారత్, సింగపూర్ తమ సంబంధాలను నిర్మించుకుంటున్నాయని మోదీ తెలిపారు. ఈ ఏడాది ఆసియాన్‌కు సింగపూర్ నేతృత్వం వహిస్తున్నందున భారత్–ఆసియాన్ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. సింగపూర్‌లోనూ రూపే, భీమ్ యాప్‌లు.. భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌ల అంతర్జాతీయీకరణలో ముందడుగు పడింది. భీమ్, రూపే, ఎస్బీఐ యాప్‌లను ప్రధాని మోదీ సింగపూర్‌లో ఆవిష్కరించారు. దీనిలో భాగంగా రూపే యాప్‌ను సింగపూర్‌కు చెందిన నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్(నెట్స్)తో అనుసంధానించారు. ఫలితంగా రూపే వినియోగదారులు సింగపూర్ వ్యాప్తంగా నెట్స్ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయొచ్చు. అలాగే, సింగపూర్ నెట్స్ వినియోగదారులు భారత్‌లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ–కామర్స్ వెబ్సైట్లో కొనుగోళ్లు చేయొచ్చు. ఇక్కడి మెరీనా బే సాండ్స్ కన్వెన్షన్ సెంటర్లో భారత్–సింగపూర్ దేశాల స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ఆయన వెంట సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఉన్నారు. రెండు దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి. మలేసియాలో మజిలీ.. గురువారం ఉదయం ఇండోనేసియా పర్యటన ముగించుకుని సింగపూర్ బయల్దేరిన మోదీ మార్గమధ్యలో మలేసియాలో కొద్దిసేపు ఆగారు. ఇటీవలే మలేసియా ప్రధానిగా ఎన్నికైన మహాథిర్ మొహమ్మద్‌ను కలుసుకుని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. మహాథిర్తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఉన్న మార్గాలపై మోదీ, మహాథిర్ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మలేసియా ఉపప్రధాని డా.వాన్ అజీజా వాన్ ఇస్మాయిల్‌ను కూడా మోదీ కలుసుకున్నారు. -
వ్యూహాత్మక భాగస్వామ్యంతో..!
జకార్తా: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడంతోపాటు పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇండోనేసియా నిర్ణయించాయి. ఉగ్రవాదంపై పోరులోనూ ప్రపంచదేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలని పిలుపునిచ్చాయి. బుధవారం జకార్తాలో భారత ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతంతోపాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలను గౌరవిస్తూ, ఇతర అంశాల్లోనూ సహకరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత్, ఇండోనేసియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర–సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. విస్తృతస్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు మోదీ చెప్పారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు ఇండోనేసియాలో ఇటీవల చర్చిలపై జరిగిన దాడిని ప్రధాని ఖండించారు. ఇరువురు నేతలు కూడా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని దేశాలూ ఉగ్రవాదం, వీరికి ఆర్థిక సాయం చేస్తున్న మార్గాలపై పోరాటంలో ఒకే తాటిపైకి రావాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 కల్లా 50 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.37 లక్షల కోట్లు) తీసుకెళ్లే దిశగా రెట్టింపు కృషితో పనిచేయాలని కూడా నిర్ణయించారు. సముద్రం ద్వారా జరిగే వ్యాపారాన్ని పెంచే అంశాలపై చర్చించారు. దక్షిణ చైనా సముద్రంపై.. భారీగా ఇంధన నిల్వలున్న తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు పారదర్శకమైన నియమాలతో కూడిన విధానం ప్రాముఖ్యతనూ మోదీ–విడోడోలు చర్చించారు. 1982లో చేసిన సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (యూఎన్సీఎల్ఓఎస్), 1976 నాటి ఆగ్నేయాసియా మైత్రి, సహకార ఒప్పందం (టీఏసీ)ల ప్రకారం భారత్, ఇండోనేసియా, ఇతర ఇండో–పసిఫిక్ దేశాల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతనూ చర్చించారు. అండమాన్ (భారత్), సబంగ్ (ఇండోనేసియా) మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా ఇరు ప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను వృద్ధి చేసేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని మోదీ–విడోడో నిర్ణయించారు. అర్జునుడి విగ్రహం సందర్శన ఈ చర్చల అనంతరం మోదీ, విడోడో కలిసి జకార్తాలోని అర్జునుడి రథం విగ్రహాన్ని సందర్శించారు. 1987లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత రామాయణ, మహాభారతాల థీమ్‌తో ఏర్పాటుచేసిన కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. 30 రోజుల ఉచిత వీసా ఇండోనేసియా పౌరులు భారత్‌లో పర్యటించాలని మోదీ కోరారు. ఇందుకోసం వీరికి 30రోజుల పాటు ఉచిత వీసా ఇస్తామన్నారు. నవభారత అనుభవాన్ని పొందేందుకు భారత ఇండోనేసియన్లు భారత్‌కు రావాలన్నారు. జకార్తా కన్వెన్షన్ సెంటర్లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇండియా–ఇండోనేసియాల పేర్లలో సారూప్యత ఉన్నట్లే ఈ రెండు దేశాల సంస్కృతి సంప్రదాయాల్లోనూ బలమైన స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. భారత ఇండోనేసియన్లు తరచూ ఇండియాను సందర్శించే అలవాటు చేసుకోవాలని.. అక్కడి తమ అనుభూతులను ఇక్కడి వారితో పంచుకునే వారధుల్లా పనిచేయాలని ప్రధాని కోరారు. ‘భారత్‌లో పర్యటించాలని ఇండోనేసియన్లను ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాది అలహాబాద్‌లో ప్రయాగ కుంభమేళా ఉంది. ఇక్కడికొస్తే మీకు నవభారతాన్ని ఒకేచోట చూసే అవకాశం కలుగుతుంది. భారత్‌లో పర్యటించేందుకు 30 రోజుల వరకు ఉచిత వీసా ఇస్తాం’ అని కరతాళధ్వనుల మధ్య మోదీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మనుషులు ఒకచోట చేరే అతిపెద్ద కార్యక్రమంగా ప్రయాగ కుంభమేళా ప్రత్యేకత సంతరించుకుంది. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ -
ప్రపంచ ఆర్థిక రంగానికి భారత్-చైనాలే వెన్నెముక
బీజింగ్: భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక రంగానికి వెన్నెముకలాంటివని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఈ రెండు దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. వువాన్లో జరిగిన ఇరుదేశాల ప్రతినిధుల సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బిలియన్ జనాభాలు ఉన్న ఈ రెండు దేశాలు.. ప్రపంచ మార్కెట్‌కు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘ప్రపంచ సుస్థిరత కోసం భారత్-చైనా మధ్య సంబంధాలు అవసరం. ప్రపంచ అభివృద్ధిలో రెండు దేశాల అర్థిక సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సోషలిజం దారిలో చైనా నూతన ఒరవడిని సృష్టించింది. సరికొత్త సంస్కరణలతో మోదీ భారత్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. 21వ శాతాబ్ధంలో చైనా- భారత్ మధ్య సంబంధాలు ప్రపంచ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నాయి. చైనా, భారత్ పోరుగు దేశాలు. అంతకు మించి మంచి స్నేహితులు’ అని జిన్‌పింగ్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా.. జిన్‌పింగ్ ప్రసంగాన్ని యథాతథంగా ప్రచురించింది. రెండు దేశాలు స్వతంత్ర్య విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నాయని.. ఇరు దేశాల ఆలోచనా ధోరణి ఒకే రీతిలో ఉందని ఆయన తెలిపారు. చైనా, భారత్ మధ్య 1950లో కుదిరిన పంచశీల ఒప్పందంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. -
స్వీడన్‌తో బంధం బలోపేతం
స్టాక్‌హోం: రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్లు నిర్ణయించాయి. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికీ అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రాత్రి స్వీడన్ చేరుకున్నారు. స్టాక్‌హోం విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్ స్వాగతం పలికారు. తర్వాత స్వీడన్ ప్రధాని కార్యాలయంలో లోఫెన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. లోఫెన్తో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయని విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. ‘స్వీడన్ రాజుతో భేటీ, ఆ దేశ ప్రధాని, 4 నార్డిక్ దేశాల నేతలతో చర్చలు, స్వీడిష్ సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశం, ప్రతిపక్ష నేతలతో సమాలోచనలతోపాటు భారత్–నార్డిక్ సమిట్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్లో ప్రధాని పాల్గొన్నారు’ అని తెలిపారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ప్రాంతీయ, బహుముఖ సహకారంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారన్నారు. భారత్ – స్వీడన్లు సంయుక్తంగా నిర్వహించిన 4 నోర్డిక్ దేశాల(ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్, నార్వే) సదస్సులో మోదీ మాట్లాడారు. ఆ దేశాల ప్రధానులతో విడివిడిగా చర్చించారు. స్వీడన్ పర్యటన అనంతరం ప్రధాని మంగళవారం రాత్రి బ్రిటన్‌కు(గ్రీన్విచ్ కాలమానం) బయల్దేరారు. బ్రిటన్‌లో జరిగే చోగమ్(కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం)లో ఆయన పాల్గొంటారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ద్వైపాక్షిక చర్చలతో పాటు రాణి ఎలిజబెత్–2తో భేటీ కానున్నారు. భారత్ అభివృద్ధిలో స్వీడన్ సహకారంపై చర్చలు: మోదీ చర్చల తర్వాత మోదీ, లోఫెన్‌లు మీడియాకు సంయుక్త ప్రకటన విడుల చేశారు. ‘భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో స్వీడన్ ఏ విధంగా సాయపడగలదన్న అంశంపై దృష్టిసారించాం. మొదటి నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమానికి స్వీడన్ బలమైన మద్దతుదారుగా ఉంది. 2016లో మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో లోఫెన్ తమ వ్యాపార ప్రతినిధి బృందంతో కలిసి పాల్గొన్నారు. సరికొత్త భాగస్వామ్యం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు రెండు దేశాలు అంగీకరించాయి. ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, ఉత్పత్తి మొదలైనవి ఇరు దేశాల మధ్య సహకారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటితో పాటు పునరుత్పాదక ఇంధనం, పట్టణ రవాణా, వర్థ్యాల నిర్వహణకు మేం ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని ప్రకటనలో మోదీ తెలిపారు. ‘రక్షణ రంగంలో స్వీడన్ భారతదేశ భాగస్వామిగా ఉంది. రక్షణ రంగ ఉత్పత్తులు, సైబర్ సెక్యూరిటీతో సహా రక్షణ, భద్రతా అంశాలపై అవగాహన కుదిరింది’ అని ప్రధాని వెల్లడించారు. అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను స్వీడన్ ప్రధాని లోఫెన్ కొనియాడారు. రెండు దేశాలు మంచి జోడీ అని సంయుక్త ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. హరిత సాంకేతికత, స్మార్ట్ సిటీస్ రంగాల్లో సహకారంపై ఇరు నేతల మధ్య చర్చలు జరిగాయి. చర్చల కోసం స్వీడన్ ప్రధాని నివాసం నుంచి కార్యాలయానికి లోఫె న్‌తో కలిసి ప్రధాని నడిచివెళ్లడం గమనార్హం. లండన్‌లో మోదీకి నిరసన స్వాగతం లండన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి నిరసనల స్వాగతం లభించనుంది. చిన్నారి అసిఫాపై హత్యాచారానికి నిరసనగా బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. భారత్‌లో అత్యాచారాల్ని ఖండిస్తూ తెల్లని దుస్తుల్లో నేడు వీరు నిరసన తెలపనున్నారు. అలాగే పార్లమెంట్ స్క్వేర్ వద్ద జరిగే భారత వ్యతిరేక ప్రదర్శనకు పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు లార్డ్ అహ్మద్ నేతృత్వం వహించనున్నారు. ‘పంజాబ్ రిఫరెండం 2020 ఖలిస్తాన్’ పేరిట యూకే సిక్కు సమాఖ్య లండన్‌లో బస్సులపై బ్యానర్లను ప్రదర్శించి నిరసన తెలియచేస్తోంది. -
మతం పేరు దుర్వినియోగాన్ని అరికట్టాలి..
మస్కట్: ఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. మతం పేరును దుర్వినియోగం చేస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఇరుదేశాధినేతలు నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ ఖబూస్ నిర్ణయించారు. ఒమన్ పర్యటనలో భాగంగా సుల్తాన్ ఖబూస్‌తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన పురోగతికి ఈ పర్యటన తోడ్పడిందని మోదీ పేర్కొన్నారు. అనంతరం మోదీ గల్ఫ్, పశ్చిమాసియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించారు. ఉగ్రవాదంపై ప్రత్యేకంగా.. ‘ఇరుదేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో, అంతర్జాతీయంగా శాంతినెలకొల్పే ప్రయత్నాల్లో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని ఏకాకి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని ఇరుదేశాధినేతల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను సుల్తాన్ ఖబూస్ ప్రశంసించారు. వారి కష్టపడి పనిచేసేతత్వం, నిజాయితీని మరిచిపోలేమన్నారు. 8 ఒప్పందాలు: మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర, వాణిజ్యపరమైన అంశాల్లో న్యాయ సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందం కూడా ఈ జాబితాలో ఉంది. వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మధుర స్మృతి ‘భారత్–ఒమన్ దేశాల ప్రజల మధ్యనున్న శతాబ్దాల పురాతనమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదపడింది. వాణిజ్యం, పెట్టుబడుల బంధాలు సహా అన్నిరంగాల్లోనూ సహకారం మరింత వేగవంతమవనుంది. గౌరవనీయులైన సుల్తాన్ ఖబూస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, స్నేహం.. నా ఒమన్ పర్యటనను మధురస్మృతిగా మార్చేశాయి’ అని పర్యటన ముగింపు సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అనంతరం మస్కట్‌లోని 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ ఖబూస్ మసీదునూ ప్రధాని సందర్శించారు. -
దావోస్‌లో ప్రధాని మోదీ
-
దావోస్‌లో ప్రధాని మోదీ
దావోస్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత భవిష్యత్తును, వ్యాపార, పెట్టుబడి అవకాశాలను సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ వివరించనున్నారు. ఐదురోజులపాటు జరిగే దావోస్ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొననున్నారు. ఈ ఒకరోజు బిజీ షెడ్యూల్లోనే అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశాలు, వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జ్యూరిచ్ చేరుకున్న మోదీకి భారత దౌత్య కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి బయలుదేరిన మోదీ దావోస్ చేరుకున్నారు. దావోస్‌లోనూ మోదీకి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) దాదాపు 60 అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల సీఈవోలతో విందు సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఎయిర్‌బస్, హిటాచీ, ఐబీఎం, బీఏఈ సిస్టమ్స్, కార్లిల్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ భేటీలో భారత్‌లో వ్యాపార అవకాశాలు, అనుకూల వాతావరణంపై వారికి వివరించనున్నారు. 21 ఏళ్ల తర్వాత తొలి ప్రధాని మంగళవారం ఉదయం ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం ప్రపంచ వ్యాపార, పరిశ్రమ వర్గాలతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోఫ్వెన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించనున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు దావోస్ వెళ్లారు. ఆర్థిక సదస్సుకు బయలుదేరేముందు మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో ప్రపంచదేశాలతో భారత సంబంధాలు బహుముఖంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక, రాజకీయ, భద్రత అంశాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ బలమైన బంధాలను ఏర్పర్చుకుంటున్నాం. దావోస్‌లో అంతర్జా తీయ సమాజంతో భారత భవిష్యత్ కార్యాచరణను పంచుకుంటా’ అని మోదీ చెప్పారు. దావోస్‌లో యోగా సదస్సు కోసం దావోస్ చేరుకున్న వివిధ దేశాధినేతలు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై మేథోమధనంతోపాటు యోగా లో శిక్షణ పొందనున్నారు. ఈ శిక్షణ కోసం ఇద్దరు భారతీయ యోగా ఉపాధ్యాయులు మోదీ బృందంలో భాగంగా దావోస్ చేరుకున్నారు. పంతజలి యోగా టీచర్లు.. ఆచార్య భరద్వాజ్, ఆచార్య సుమిత్‌లు ఈ వేదికపై రోజూ యోగా క్లాసులు నిర్వహిస్తా రు. భారత సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఇదో అవకాశ మని బాబా రాందేవ్ ట్విటర్లో పేర్కొన్నారు. -
నేటి నుంచి దావోస్ సదస్సు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నేటి నుంచి ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం ప్రారంభ ఉత్సవాలు ముగిశాక.. మంగళవారం నుంచి అధికారికంగా మొదలయ్యే ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఉపన్యాసం ఇస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు రుచికరమైన భారతీయ వంటకాలు వడ్డించడంతో పాటు.. సదస్సు జరిగినన్ని రోజులు యోగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్ ఆల్స్ పర్వతాల మధ్య ఉన్న విడిది కేంద్రం దావోస్‌లో జరగనున్న ఈ 48వ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, కళలు, విద్యా, సామాజిక రంగాలకు చెందిన 3 వేల మందికి పైగా నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదక శక్తి అన్న అంశాన్ని ఈ సమావేశాల్లో మోదీ నొక్కి చెప్పనున్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లౌస్ స్వాబ్ సోమవారం సాయంత్రం సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆస్ట్రేలియన్ నటి కేట్ బ్లాన్‌చెట్, ప్రముఖ సంగీతకారుడు ఎల్టన్ జాన్‌లను ‘క్రిస్టల్’ అవార్డులతో సత్కరించనున్నారు. దేవెగౌడ తర్వాత మోదీనే.. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంతో సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ అనేది సదస్సు ప్రధాన ఎజెండా. 1997లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ అనంతరం దావోస్ సదస్సుకు హాజరవుతున్న మొదటి భారత ప్రధాని మోదీనే. భారత్ స్వేచ్ఛా వాణిజ్య దేశమని, ప్రపంచ వ్యాప్త పెట్టుబడుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రపంచ దేశాలకు ప్రధాని స్పష్టం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేవలం 24 గంటలు మాత్రమే ప్రధాని దావోస్‌లో ఉంటారు. సోమవారం సాయంత్రం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోలకు విందు ఇస్తారు. ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 20 కంపెనీలు, 40 విదేశీ కంపెనీల సీఈవోలు పాల్గొంటారు. అలాగే అంతర్జాతీయ వ్యాపార కూటమికి చెందిన 120 మంది సభ్యులతో మోదీ సమావేశమవుతారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంజే అక్బర్, జితేందర్ సింగ్‌లు కూడా దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే భారతీయ పరిశ్రమల విభాగం సీఐఐ నేతృత్వంలోని సీఈవోల బృందంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీం ప్రేమ్‌జీ, రాహుల్ బజాజ్, ఎన్.చంద్రశేకరన్, చందా కొచ్చర్, ఉదయ్ కొటక్, అజయ్ సింగ్‌లు సదస్సుకు హాజరవుతున్నారు. మోదీతో పాటు సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, షారుక్ ఖాన్లు కూడా ప్రసంగిస్తారు. -
అమెరికాకు ఝలక్ ఇచ్చిన పాక్!
ద్వైపాక్షిక చర్చలు, అమెరికా పర్యటనలు రద్దు సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దాయాది నిరసన వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగా అమెరికాతో ద్వైపాక్షిక చర్చలను, అమెరికా పర్యటనలను రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్‌పై అమెరికా విధాన ప్రకటన సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ సెనేట్ కమిటీకి ఆ దేశ విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారని 'ద నేషన్' పత్రిక తెలిపింది. ఖవాజా గతవారం అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. చివరక్షణంలో వెనుకకు తగ్గిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌కు అమెరికా సీనియర్ అధికారి పర్యటన సైతం వాయిదా పడింది. కరాచీలో అమెరికా వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా వేసుకోవాలని పాక్ కోరిందని, ఈ నేపథ్యంలో ఇరుదేశాలకు సౌకర్యవంతమైన సమయంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక ఉప కార్యదర్శి అలైస్ వెల్స్ ఇస్లామాబాద్ పర్యటన ఉంటుందని పాక్‌లోని అమెరికా రాయబారి తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికన్ పౌరులను చంపుతున్న ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారి ఆశ్రయం ఇస్తున్నదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలకు దూరం జరిగామని పాక్ పేర్కొంటున్నది. -
కలసి నడుద్దాం..!
► పరస్పర భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం ► జీఎస్టీపై ట్రంప్ ప్రశంసలు.. ► అమెరికా మా అత్యంత ప్రాధాన్య భాగస్వామి: మోదీ ► అమెరికన్ వస్తువుల దిగుమతికి అడ్డంకులు తొలగించండి: ట్రంప్ వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం శ్వేతసౌధంలో సుహృద్భావ వాతావరణంలో కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా.. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతంచేయటంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి (భారతకాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో జరిగిన చర్చల అనంతరం వీరిద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘ఐసిస్, అల్‌కాయిదా, జైషే, లష్కరే, డీ–కంపనీ తదితర ఉగ్రవాద సంస్థలను ఏరివేయటమే మా తొలి ప్రాధామ్యం. ఈ దిశగా మా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాం’ అని వీరిద్దరు నేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇస్లామిక్ అతివాదంపై చర్చించామని.. ఈ అంశాల్లో పరస్పర సహకారానికి అంగీకరించామని ట్రంప్ వెల్లడించారు. వీరిద్దరి మధ్య సమావేశంలో ఉగ్రవాదంపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి సమగ్ర సదస్సుకు ఇరువురు నేతలూ సంపూర్ణ మద్దతు తెలిపారు. చెప్పిందే చేస్తున్నా: ట్రంప్ ‘నా ఎన్నికల ప్రచారంలోనే స్పష్టంగా చెప్పాను. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్వేతసౌధంలో భారత్‌కు విశ్వసనీయ మిత్రుడు ఉంటాడని చెప్పాను. చెప్పినట్లే చేస్తున్నాను’ అని ట్రంప్ తెలిపారు. నాలుగు రోజుల్లో అమల్లోకి రానున్న జీఎస్టీపైనా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ’గా పేర్కొన్నారు. ‘దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలని, మౌలికవసతుల కల్పన జరగాలని మీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలోని అవినీతిపైనా పోరాటం చేస్తున్నారు. అవినీతి ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా పరిణమించింది’ అని మోదీతో ట్రంప్ పేర్కొన్నారు. ‘భారత సామాజిక–ఆర్థిక పరిణామక్రమంలో, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, పథకాల్లో అమెరికాను మా అత్యంత ప్రాధాన్య భాగస్వామిగా గుర్తిస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. ‘నా న్యూ ఇండియా ఆలోచన, ట్రంప్ ‘మేకింగ్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదాలు కలిసి.. మన దేశాలమధ్య సహకారాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్తాయని నేను భావిస్తున్నాను’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘ద్వైపాక్షిక’ చరిత్రలో కీలక పేజీ ట్రంప్‌తో జరిపిన చర్చలను భారత–అమెరికా సంబంధాల చరిత్రలో అత్యంత ముఖ్యమైన పేజీగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం, సాంకేతికత, సృజనాత్మకత వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని వెల్లడించారు. కాగా, భారత మార్కెట్లలో అమెరికన్ వస్తువుల దిగుమతికున్న అడ్డంకులను తొలగించాలని ఈ సందర్భంగా మోదీని ట్రంప్ కోరారు. ‘మీ దేశంతో మా వాణిజ్యలోటును తగ్గించుకోవటం మాకు చాలా ముఖ్యం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 100 అమెరికన్ విమానాలకోసం ఆర్డరు చేయటాన్ని కూడా ట్రంప్ స్వాగతించారు. దీని వల్ల లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అంతకుముందు, వైట్‌హౌజ్‌లో ప్రధాని మోదీకి సాదర స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, వైట్‌హౌస్‌లోనికి తీసుకువెళ్లారు. అమెరికాకు తలొగ్గారు: విపక్షాలు న్యూఢిల్లీ: మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆ ప్రకటన ఇస్లాం ఉగ్రవాదంపై అమెరికా అభిప్రాయాలకు దగ్గరగా ఉందన్నాయి. అది పూర్తిగా నిరాశపరచిందని తెలిపాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబం ధించి కొత్త విషయాలేం అందులో లేవని ఎత్తిపొడిచాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు తేవడానికి బదులు, పక్కదారి పట్టించేలా ప్రకటన ఉందన్నాయి. ఇస్లాం మతం, ఉగ్రవాదాలకు ఇచ్చే వివరణలపై ట్రంప్ ప్రభుత్వం, భారత్ ఒకే రీతిలో స్పందించకలేకపోయాయని కాంగ్రెస్ ప్రతినిధి తివారి ఆరోపించారు. -
మయన్మార్‌కు అండగా ఉంటాం
-
మయన్మార్‌కు అండగా ఉంటాం
* ఆ దేశాధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ * భారత్‌తో సంబంధాల మెరుగే మా అభిమతం: హతిన్ క్యా * ఉగ్రవాదం, చొరబాట్లపై ఉమ్మడి పోరుకు అంగీకారం న్యూఢిల్లీ: మయన్మార్ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని భారత్ సోమవారం హామీఇచ్చింది. మయన్మార్ సరికొత్త ప్రయాణంలో అండగా ఉంటామంది. మయన్మార్ అధ్యక్షుడు యు హతిన్ క్యా భారత పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సంబంధాల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది భారత్ ఆకాంక్షని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల నిరోధంలో కలిసికట్టుగా సాగాలని, చురుకైన సహకారం అందించుకోవాలని భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. మయన్మార్‌కు దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నాల నేపథ్యంలో... క్యా భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల సందర్భంగా ఇరు దేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రసంస్థలు మయన్మార్‌లో విస్తరించిన విషయాన్ని భారత్ గుర్తుచేసింది. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్‌ల గుండా సాగే రహదారి ప్రాజెక్టులో భాగంగా కలేవా-యార్గి విభాగం నిర్మాణం, 69 వంతెనల నిర్మాణం, అభివృద్ధి కోసం 2ఒప్పందాలు జరిగాయి. మయన్మార్ అభివృద్ధిలో భాగస్వామ్యం భేటీ తర్వాత మోదీ మాట్లాడుతూ... ‘మయన్మార్ వేసే ప్రతీ అడుగులో 125 కోట్ల మంది భారతీయులు భాగస్వాములుగా, స్నేహితులుగా అండగా ఉంటారని హామీనిస్తున్నా. ఒకరి భద్రతా అవసరాలు మరొకరితో ముడిపడి ఉన్నాయని ఇరుదేశాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరు, చొరబాటు ప్రయత్నాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. దాదాపు రూ. 13,600 కోట్ల అభివృద్ధి పనుల్లో మయన్మార్‌కు భారత్ సాయం అందిస్తోంది. రవాణా, మౌలిక సదుపాయలు, విద్య, వైద్యం, ఇతర రంగాల్లో ప్రాజెక్టులకు సహకరిస్తున్నాం. ఈ ఏడాది చివరిలో మయన్మార్‌లోని కాలాదాన్ పోర్టు ప్రాజెక్టు పూర్తి కానుంది. ఏప్రిల్‌లో మయన్మార్‌లోని తముకు విద్యుత్ సరఫరా చేసి చిన్న అడుగు ముందుకేశాం. విద్యుత్ సరఫరా సాయాన్ని పెంచుతామని ఆ దేశాధ్యక్షుడికి చెప్పాను. భారత్‌తో నైరుతి ఆసియాను కలపడంలో మయన్మార్ వారధిగా ఉంది. ‘21వ శతాబ్ది పాంగ్లాంగ్ సదస్సు’లో నిర్ణయించిన మేరకు మయన్మార్‌లో శాంతి ప్రక్రియకు పూర్తి మద్దతు ఇస్తాం. మయన్మార్ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆ దేశ నాయకుల పరిణితి, నిబద్ధతను అభినందిస్తున్నా. బౌద్ధ మతంలోని దయను ప్రేమించడం, అన్ని మతాల మధ్య సమానత్వం మన జీవితాల్ని నిర్వచిస్తుంది. బగన్‌లోని ఆనంద ఆలయం పునరుద్ధరణలో మన పాత్ర ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇతర చారిత్రక నిర్మాణాలు, పగోడాలు పునరుద్ధణలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ’ అని మోదీ చెప్పారు. గయను సందర్శించిన హతిన్ క్యా ఈ సందర్భంగా హిన్ క్వా మాట్లాడుతూ... భారత్‌తో సంబంధాలు బలపరచుకోవాలనేది తమ కోరికన్నారు. శనివారం భారత్ చేరుకున్న క్వా.. బౌద్ధ పుణ్యక్షేత్రం గయలో పర్యటించారు. మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. దైజోక్యో బౌద్ధ ఆలయం, మయన్మార్ బౌద్ధ విహారాన్ని కూడా తిలకించారు. అనంతరం ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను సందర్శించారు. సోమవారం ఉదయం ప్రధానితో భేటీకి ముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. -
ప్రధాని హోదాలో అమెరికాకు మోడీ
న్యూఢిల్లీ : ఎట్టకేలకు నరేంద్ర మోడీ భారత ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై అడుగు పెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ ఘన విజయాన్ని దక్కించుకున్న సందర్భంగా మోడీకి... అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. తమ దేశానికి రావాలని మోడీని ఈ సందర్భంగా ఒబామా ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లనున్నారు. వాషింగ్టన్లో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ఒబామా పాల్గొననున్నారు. దీంతో భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలకు కొత్త అధ్యయనం మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశాలు జరిగే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వీలుగా ఇరువురికీ ఆమోదనీయమైన సమయంలో రావాలని అమెరికా సెప్టెంబర్ 30వ తేదీని ప్రతిపాదించగా, భారత్ మాత్రం సెప్టెంబర్ 26వ తేదీని సూచించింది. దీనిపై మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా 2002నాటి గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలతో అమెరికా ఆయన వీసాపై 2005లో నిషేధం విధించింది. ఆ నిషేధం మోడీ ప్రధాని పీఠం ఎక్కేవరకూ కొనసాగిన విషయం తెలిసిందే. -
జమా మసీదులో నవాజ్ షరీఫ్ ప్రార్థనలు
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చారిత్రక జమా మసీదులో ప్రార్థనలు చేసి, ఎర్రకోటను సందర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన.. మంగళవారం నాడు ఢిల్లీలో పర్యటించారు. ఆయనతో పాటు పలువురు పాక్ అధికారులు కూడా ఉన్నారు. నరేంద్రమోడీతో నవాజ్ షరీఫ్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సహకారం, ఇతర అంశాలపై వీరిద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. వాజ్‌పేయి హయాంలో మొదలైన ప్రక్రియను ఇప్పుడు మళ్లీ కొనసాగించాలని భావిస్తున్నట్లు షరీఫ్ చెప్పారు. మోడీని కూడా పాకిస్థాన్‌కు ఆయన ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా ఏమాత్రం బాగోని సంబంధాలు ఇప్పుడు కాస్త మెరుగుపడొచ్చని అంటున్నారు.