మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించిన ప్రధాని మోదీ
మస్కట్: ఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. మతం పేరును దుర్వినియోగం చేస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఇరుదేశాధినేతలు నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ ఖబూస్ నిర్ణయించారు.
ఒమన్ పర్యటనలో భాగంగా సుల్తాన్ ఖబూస్‌తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన పురోగతికి ఈ పర్యటన తోడ్పడిందని మోదీ పేర్కొన్నారు. అనంతరం మోదీ గల్ఫ్, పశ్చిమాసియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించారు.
ఉగ్రవాదంపై ప్రత్యేకంగా..
‘ఇరుదేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో, అంతర్జాతీయంగా శాంతినెలకొల్పే ప్రయత్నాల్లో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని ఏకాకి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని ఇరుదేశాధినేతల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను సుల్తాన్ ఖబూస్ ప్రశంసించారు. వారి కష్టపడి పనిచేసేతత్వం, నిజాయితీని మరిచిపోలేమన్నారు.
8 ఒప్పందాలు:
మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర, వాణిజ్యపరమైన అంశాల్లో న్యాయ సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందం కూడా ఈ జాబితాలో ఉంది. వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
మధుర స్మృతి
‘భారత్–ఒమన్ దేశాల ప్రజల మధ్యనున్న శతాబ్దాల పురాతనమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదపడింది. వాణిజ్యం, పెట్టుబడుల బంధాలు సహా అన్నిరంగాల్లోనూ సహకారం మరింత వేగవంతమవనుంది. గౌరవనీయులైన సుల్తాన్ ఖబూస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, స్నేహం.. నా ఒమన్ పర్యటనను మధురస్మృతిగా మార్చేశాయి’ అని పర్యటన ముగింపు సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అనంతరం మస్కట్‌లోని 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ ఖబూస్ మసీదునూ ప్రధాని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment