కఠ్మాండులో సదస్సు సందర్భంగా బిమ్స్‌టెక్ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ
కఠ్మాండు: ప్రధాన రంగాల్లో బిమ్స్‌టెక్ సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో జరుగుతున్న బిమ్స్‌టెక్ నాలుగో సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా అడ్డుకట్టకు సభ్య దేశాల మధ్య అనుసంధానం పెరగాలని ఆకాంక్షించారు.
వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు అవకాశాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. బిమ్స్‌టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతం. జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు.
మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట
‘బిమ్స్‌టెక్ సభ్య దేశాలతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడేందుకు భారత్ కట్టుబడి ఉంది. భారత్ విధానాలైన పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్ ఈస్ట్‌లకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంగా మారింది. అలాగే మనందరి భద్రత, అభివృద్ధికి సంబంధించి బంగాళాఖాతానికి ప్రాధాన్యత ఉంది. సభ్య దేశాల్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలతో ఇబ్బంది పడని దేశం లేదు. బిమ్స్‌టెక్ విధివిధానాలకు లోబడి మాదకద్రవ్యాల సంబంధిత అంశాలపై సదస్సు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
ఈ సమస్య ఒక దేశానికి సంబంధించిన శాంతిభద్రతల అంశం కాదు. దీనిని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. తరచూ వరదలు, తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తు సంభవించే హిమాలయాలు, బంగాళాఖాతం మధ్య బిమ్స్‌టెక్ దేశాలు ఉన్నాయని.. అందువల్ల మానవతా సాయం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో సభ్య దేశాలు సహకారం, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ‘శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఏ ఒక్క దేశం ఒంటరిగా ముందుకు సాగలేదు. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి’ అని ప్రధాని పేర్కొన్నారు.
డిజిటల్ సాంకేతికతలో సహకారం..
సభ్య దేశాల ఉమ్మడి లబ్ధి కోసం వ్యవసాయ పరిశోధన, స్టార్టప్స్ తదితర అంశాల్లో సదస్సు నిర్వహిస్తామని, బంగాళాఖాతం ప్రాంతంలోని కళలు, సంస్కృతి, ఇతర అంశాలపై పరిశోధన కోసం నలంద యూనివర్సిటీలో ‘బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ సాంకేతికత రంగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌కు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహకారాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలోని దేశాలతో అనుసంధానంలో ఈశాన్య రాష్ట్రాలు కీలక ప్రాత పోషిస్తాయని, ఆ రాష్ట్రాల్లో చేపడుతోన్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్ని బిమ్స్‌టెక్ దేశాలకు విస్తరించవచ్చని చెప్పారు. ‘నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’లో చదివేందుకు బిమ్స్‌టెక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు స్కాలర్‌షిప్ అందచేస్తామన్నారు. బిమ్స్‌టెక్ వేదికగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment