conferences
-
వైద్య సదస్సులను కమ్మేస్తున్న ‘ఫార్మా’
తెనాలి: వైద్య రంగంలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, కొత్త ఔషధాలు, రోగనిర్ధారణలో నవీన విధానాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సదస్సులు గతి తప్పుతున్నాయి. ఫార్మా కంపెనీల “స్పాన్సర్షిప్’లతో వైద్య సదస్సులు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విలాసవంతంగా.. వైద్యులపై వలవైద్యుల సదస్సుల నిర్వహణలో ఫార్మ కంపెనీలు భాగం కాకూడదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ఉంది. అలాగే వైద్యులు, వారి అసోసియేష¯న్లతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. సదస్సులకు వైద్యులు హాజరయ్యేందుకు అవసరమైన విమాన టికెట్ల నుంచీ ఆయా ప్రాంతాల్లో తిరిగేందుకు లగ్జరీ కార్లు, బస చేసేందుకు విలాసవంతమైన హోటళ్లు తదితర సకల సదుపాయాలన్నీ ఫార్మా కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి. వైద్య సదస్సు జరిగే ప్రాంగణమంతటినీ తమ బ్రాండ్లు కనపడేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేస్తున్నాయి. తమ స్టాల్‌కు విచ్చేసినందుకు ఖరీదైన బహుమతులు, వివిధ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లతో వైద్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొద్ది నెలల కిందట జరిగిన వైద్యుల సదస్సులో ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించటంతో అతడికి దేహశుద్ధి చేశారు. చెన్నైలో కొద్దిరోజుల కిందట జరిగిన మరో సదస్సు అశ్లీల నృత్యాలకు వేదికైంది. విజ్ఞానం పెంచాల్సిన వైద్య సదస్సులను ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి.‘క్రెడిట్ అవర్స్’పైనా ఫార్మా కంపెనీలదే పెత్తనంవైద్యవిజ్ఞాన సదస్సులకు హాజరయ్యే వైద్యులకు మెడికల్ కౌన్సిల్.. క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తుంది. ప్రతి వైద్యుడు వివిధ సదస్సుల్లో పాల్గొని సంవత్సరానికి ఆరు క్రెడిట్ అవర్స్ చొప్పున ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్ సంపాదించాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్లో తమ వైద్య సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు ఈ క్రెడిట్ అవర్స్ దోహదపడతాయి. ఈ సదస్సులకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు హాజరై సదస్సు జరిగే తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్‌పైనా మెడికల్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉంటాయి. ఇన్ని నియమ నిబంధనలున్నా పలు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. వైద్యుల పేర్ల నమోదు నుంచి సదస్సు తర్వాత ఇచ్చే క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్ల జారీ వరకు.. అన్నింటిలోనూ ఫార్మా కంపెనీలదే పెత్తనం. సదస్సుకు హాజరుకాని వైద్యుల పేర్లను కూడా ఫార్మా కంపెనీల ప్రతినిధులే నమోదు చేసి.. సర్టిఫికెట్లను తీసుకెళ్లి మరీ వైద్యులకు అందజేస్తుంటారు. తమ ఉత్పత్తులను రోగులకు సూచించేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తగ్గిన మందుల నాణ్యతఫార్మా కంపెనీలు, కొందరు వైద్యుల వల్ల రోగులపై మందుల అధికభారం పడుతోంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ తాజాగా చేసిన పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందుల్లో నాణ్యత లేదని తేలింది. గత ఆగస్టులో 156 కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ నిషేధం విధించింది. -
రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు. -
జనసేన x టీఢీపీ
గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య అంతరాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ జనసేన నేతకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్ హాజరయ్యారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్ ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, రాయలసీమ కోకన్వినర్ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్ ప్రసంగించారు. తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్ మహేష్ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు దిగారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు. కుర్చిలతో కుమ్ములాట కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్ సురేష్‌ను నియమించడం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్సు«దీర్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్చార్జి సురేష్ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సురేష్‌ను ఏ విధంగా పెడనకు ఇన్చార్జిగా నియమించారంటూ రామ్సు«దీర్ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు. జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి బయటకు వెళ్లిపోయారు. జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్ కేర్! విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్ అక్కడ కాకుండా లైన్ చివరిలో కూర్చున్నాడు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్ చూడలేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు. జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నవంబర్ 18 నుండి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్
ముంబై: ఈ నెల (నవంబర్) 18 నుండి 21 వరకు ముంబైలో 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ (డబ్ల్యూసీవోఏ) జరగనుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్ఏసీ) దీన్ని నిర్వహించనుంది. ఐఎఫ్ఏసీ 118 ఏళ్ల చరిత్రలో ఈ సదస్సును ముంబైలో నిర్వహించడం ఇదే ప్రథమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ దేబాశీష్ మిత్రా తెలిపారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ కాంగ్రెస్‌ను తొలిసారిగా 1904లో అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో నిర్వహించారు. ముంబైలో జరిగే నాలుగు రోజుల సదస్సులో సుమారు 35 సెషన్లు ఉంటాయని, 150 మంది పైగా వక్తలు మాట్లాడతారని మిత్రా చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, పారిశ్రామికవేత్తలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చీఫ్ గౌతం అదానీ తదితరులు వీరిలో ఉంటారని వివరించారు. డబ్ల్యూసీవోఏ చరిత్రలోనే అత్యధికంగా 9,000 మంది పైచిలుకు డెలిగేట్లు ఇందులో పాల్గొంటున్నట్లు మిత్రా తెలిపారు. చదవండి: Steve Jobs పాత చెప్పులు వేలం: రికార్డు ధర -
India Game Developers Conference: 8 బిలియన్ డాలర్లకు దేశీ గేమింగ్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2027 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది 2.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అలాగే, గేమ్స్ ఆడేందుకు చెల్లించే వారి సంఖ్య 12 కోట్లకు చేరింది. గేమర్లు సగటున 20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ల్యూమికాయ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) సదస్సులో దీన్ని విడుదల చేశారు. సుమారు 2,250 మంది గేమర్లు, థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లు, పరిశ్రమ దిగ్గజాలపై సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గత రెండేళ్లు దేశీ గేమింగ్ సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని ల్యూమికాయ్ వ్యవస్థాపక జనరల్ పార్ట్నర్ సలోని సెహ్గల్ తెలిపారు. మూడు సంస్థలు యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగాయని, ఒక సంస్థ స్టాక్ ఎక్సే్చంజీల్లో కూడా లిస్ట్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దేశీ గేమింగ్ పరిశ్రమలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు రాబోతున్నాయని వివరించారు. నవంబర్ 3న ప్రారంభమైన ఐజీడీసీ మూడు రోజుల పాటు 5 వరకూ జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా పలు గేమింగ్ సంస్థలు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► భారత్‌లో గేమర్ల సంఖ్య 50.7 కోట్లు. ఇందులో పెయిడ్ యూజర్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. ► 1500 కోట్ల డౌన్లోడ్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొబైల్ గేమ్స్‌కు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగ దేశంగా భారత్ నిలుస్తోంది. హిట్‌వికెట్ భారీ నిధుల సమీకరణ హైదరాబాదీ గేమింగ్ యాప్ సంస్థ హిట్‌వికెట్ తాజాగా ప్రైమ్ వెంచర్ పార్ట్నర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కాశ్యప్ రెడ్డి, కీర్తి సింగ్ వెల్లడించారు. గేమింగ్ స్టూడియో, ప్రపంచ స్థాయికి క్రికెటింగ్ అనుభూతిని అందించే గేమ్‌లను తీర్చిదిద్దేందుకు వీటిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అలాగే హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గేమింగ్ విభాగంలో స్థానిక స్టార్టప్‌లు ముందు వరుసలో ఉండటం సంతోషకరమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్ కంపెనీలు, బయోటెక్ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషి స్తారు. నోబెల్ గ్రహీతలు డాక్టర్ కుర్ట్ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్ జుర్ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరుకానున్నారు. -
వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగు వారి అధ్వర్యంలో ఆగస్టు 28, 29 తేదిల్లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని గౌరవించేందుకు ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందజేస్తున్నారు. ఈ మేరకు ఎంట్రీలను ఆగస్టు 10 వరకు ఎంట్రీలకు స్వీకరించారు. జ్యూరీ సభ్యులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల, లక్ష్మణ్, తొట్టెంపూడి గణేశ్‌లు ఎంట్రీలను పరిశీలించి తెలుగు సాహిత్యం కోసం పాటుపడిన 12 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. వీరికి తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే వాటిని ప్రదానం చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు -
రారండోయ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు 2019 జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతితో నవలల పోటీ ప్రకటించింది. తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించాలి. పేజీల పరిమితి లేదు. రచయిత పేరును రచనపై కాకుండా కవరింగ్ లెటర్ మీద మాత్రమే రాయాలి. రచనలు అందవలసిన ఆఖరు తేది: మార్చి 30. చిరునామా: అక్షర క్రియేటర్స్, ఏజీ–2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్–29. వివరాలకు: 9849310560. tana.novel.2019 @gmail.com కు కూడా పంపవచ్చు. కాంచనపల్లి కథాసంపుటి ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ ఆవిష్కరణ, ఆయన పదవీ విరమణ ఉత్సవం డిసెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళం పరంపరలో భాగంగా డిసెంబర్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో వానమామలై జగన్నాథాచార్యుల ‘రైతు రామాయణం’పై డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ప్రసంగిస్తారు. మంజు యనమదల ‘అంతర్లోచనాలు’ ఆవిష్కరణ డిసెంబర్ 15న సా. 6 గంటలకు టాగూర్ స్మారక గ్రంథాలయం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం. డాక్టర్ ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘దేశం లేని ప్రజలు’ ఆవిష్కరణ డిసెంబర్ 16న సా. 5:30 కు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో జరగనుంది. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని రామా చంద్రమౌళి కథాసంపుటి ‘తాత్పర్యం’కు ప్రకటించారు. ఫిబ్రవరి 2019లో సిరిసిల్లలోని రంగినేని చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తారు. 2018 విమలాశాంతి సాహిత్య పురస్కారాలను శిఖామణి ‘చూపుడువేలు పాడే పాట’, ఇబ్రహీం నిర్గుణ్ ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటాలకు ప్రకటించారు. శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2019ని ఆధునిక సాహిత్య అనువాద గ్రంథాలకు ఇవ్వనున్నారు. 2016 జనవరి నుండి 2018 డిసెంబర్ మధ్య ప్రచురించిన పుస్తక నాలుగు ప్రతులను జనవరి 30లోగా ‘షేక్ మస్తాన్‌వలి, 38/712, పి.ఎస్.నగర్, సెంట్రల్ విజన్ పోస్ట్, కడప–2’ చిరునామాకు పంపాలి. పురస్కార విలువ పదివేలు. వివరాలకు: 9704073044 కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ, కడప– గురజాడ కథా, కందుకూరి నవలా, శ్రీశ్రీ కవితా, జానమద్ది సాహిత్య, రావూరి భరద్వాజ బాల సాహిత్య పురస్కారాలకు 2016–18 మధ్య ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తోంది. పురస్కార విలువ ఒక్కోటీ ఐదు వేలు. మూడు ప్రతులు పంపాలి. చివరి తేది: డిసెంబర్ 31. చిరునామా: బోయపాటి దుర్గాకుమారి, 42/169, ఎన్జీవో కాలనీ, కడప–2. ఫోన్: 08562–253734 -
భారత్– ఇటలీ వాణిజ్యానికి ఎన్నో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–ఇటలీ మధ్య భిన్న రంగాల్లో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఇటలీ ఆర్థికాభివృద్ధి ఉప మంత్రి మైఖేల్ గెరాసి పేర్కొన్నారు. డీఎస్టీ– సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భారత్ ఇటలీ టెక్నాలజీ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య భవిష్యత్తు ఆర్థిక, ద్వైపాక్షిక సహకారానికి ఈ రంగాలన్నీ మూలస్తంభాలుగా నిలుస్తాయన్నారు. మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఆర్థిక ప్రోత్సాహకాల పెంపు, న్యాయ వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేసే దిశగా తమ ప్రభుత్వం ఓ విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పారు. ‘‘స్టార్టప్ కంపెనీల కోసం ఓ కార్యకమ్రాన్ని తీసుకురానున్నాం. ఇందులో భాగంగా కొన్ని దేశాలను ఎంపిక చేసుకుంటున్నాం. ఇందులోకి భారత్‌ను కూడా తీసుకోవాలన్నది మా ఆలోచన. స్థిరమైన ఆర్థిక వృద్ధితో, మరింత అభివృద్ధి చెందే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి’’ అని గెరాసి చెప్పారు. -
ఏంటి మాట్లాడవు?!
ఆ రాత్రప్పుడు భార్యకు ఫోన్ చేద్దామనే అనుకున్నాడు కాలజ్ఞ. కానీ చెయ్యలేదు. చేద్దామా వద్దా అని ఆగాడు. ఈలోపు మళ్లీ ఇంట్లోంచి ఎవరిదో సన్నగా ఏడుపు వినిపించింది! అతడు తప్ప అంతపెద్ద ఇంట్లో ఎవరూ లేరు. ఎవరూ లేకుండానే కాలజ్ఞకు ఏడుపు వినిపిస్తోందంటే ఇంట్లో ఎవరో ఉండి ఉండాలి! నవ్వుకున్నాడు కాలజ్ఞ. ‘భ్రాంతి’ కావచ్చు. బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్లింది స్థిమిత. ఈమధ్యే వాళ్ల పెళ్లయింది. పెళ్లిరోజు అంతా అనుకున్నారు.. కాలజ్ఞ, స్థిమిత.. పేర్లు భలేగున్నాయని. ఆ రోజు ఎవరో జోక్ చేశారు కూడా. అమ్మాయి స్థిమితంగా ఉంటూ.. అబ్బాయి టైమ్ సెన్స్‌తో పరుగులు తీస్తూ ఉంటే.. ఆ దాంపత్యం చూడముచ్చటగా ఉంటుందని! ‘‘చూస్తుంటే అబ్బాయే స్థిమితంగా, అమ్మాయి పరుగులు తీస్తున్నట్లుగా ఉంది. అలాగున్నా కూడా దాంపత్యం చూడ ముచ్చటగానే ఉంటుందిలెండి’’.. అని నవ్వారెవరో. ‘‘దాంపత్యం ముచ్చటగా ఉండాలి కానీ, చూడ ముచ్చటగా ఉండకూడదు. ఉంటే.. చెడు కళ్లు పడతాయి’’.. ఇంకెవరో అన్నారు. పెళ్లయి అప్పటికి కొన్ని రోజులే అవడం వల్లనో, భార్య బెంగళూరు వెళ్లి అప్పుడే ఇన్ని గంటలు అయిందా అనే భావన వల్లనో, ఇంట్లోంచి ఏడుపులేవో వినిపిస్తున్నాయన్న భయం వల్లనో.. కాలజ్ఞ తన భార్యకు ఫోన్ చేయాలని అనుకోలేదు. ఇంట్లో ఒక్కడికే ఏమీ తోచకుండా ఉంది. అందుకు చేయాలనుకున్నాడు. అతడికెప్పుడూ పక్కన ఒకరు ఉండాలి.. తను మాట్లాడ్డానికి, తనను మాట్లాడించడానికి.వాల్ క్లాక్‌లో టైమ్ చూశాడు కాలజ్ఞ. పదిన్నర. ఎందుకో అది కరెక్ట్ టైమ్ కాదనిపించింది. కనీసం పన్నెండైనా అయి ఉంటుందనుకుని ఫోన్లో చూసుకున్నాడు. తొమ్మిది కావస్తోంది! ‘స్ట్రేంజ్’ అనుకున్నాడు. అనుకుంటూ, వాల్ క్లాక్ వైపు చూశాడు. ఆగిపోయి ఉంది. ఒకవేళ వాల్‌క్లాక్ అప్పుడే ఆగిపోయి ఉండొచ్చని అనుకున్నా.. తొమ్మిది దగ్గర ఆగి ఉండాలి. పదిన్నర దగ్గర ఆగిపోయిందంటే.. ఆ ఉదయం పదిన్నరకో, క్రితం రోజు రాత్రి పదిన్నరకో ఆగి ఉండాలి. తను గమనించలేదా! హైవేకి కాస్త దగ్గరగా రెండు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది కాలజ్ఞవాళ్లు ఉంటున్న కాలనీ. అక్కడివన్నీ కొత్తగా కట్టిన ఇళ్లు. వాటిల్లో వీళ్లదొకటి. కొత్త ఇంట్లో కొత్త దంపతులు కాలజ్ఞ, స్థిమిత.రాత్రి తొమ్మిది గంటలకే జీవితం ఇంత అర్థరహితంగా అనిపిస్తోందంటే తెల్లారేవరకు ఈ రాహిత్యాన్ని భరించడం ఎలాగో కాలజ్ఞకు అర్థం కాకుండా ఉంది. బట్టలు వేసుకుని బైక్ తీశాడు. కారు కూడా ఉంది కానీ, బైక్ తీశాడు.అతడికి బైక్ నడపడం ఇష్టం. మణికొండలో సిద్ధార్థ వాళ్ల రూమ్‌కి వెళ్లి, రాత్రికి అక్కడే ఉండి, ఉదయాన్నే రావచ్చని అతడి ఆలోచన. అక్కడింకా ఇద్దరు ముగ్గురు ఓల్డ్మేట్స్ ఉంటారు. పెళ్లయ్యేవరకు ఆ రూమ్‌లోనే ఉండేవాడు కాలజ్ఞ. పెళ్లయ్యాక ఇతడు రూమ్ ఖాళీ చేసి వచ్చేస్తుంటే అంతా బోరుమన్నంత పనిచేశారు. ‘‘నీ ప్లేస్‌లోకి ఇంకొకర్ని రానివ్వం’’ అన్నాడు సిద్ధార్థ ఎమోషనల్‌గా. ‘‘అంటే.. నెల నెలా రెంట్లో నా షేర్ నేను పంపించాల్సిందేనా!’’ అని నవ్వాడు కాలజ్ఞ. ‘‘మమ్మల్ని మర్చిపోకు. అదే నీ షేర్’’ అన్నారు సిద్ధార్థ అండ్ బ్రోస్. ‘‘అయితే డన్’’ అని బొటనవేలెత్తి చూపించాడు కాలజ్ఞ. అదే ఆఖరు.కాలజ్ఞ మళ్లీ వాళ్ల వైపే చూడలేదు. ‘లైఫ్‌లో పడిపోయినట్లున్నాడు’ అని ఓసారెప్పుడో జోక్ చేసుకున్నారు ఓల్డ్మేట్స్. ‘లైఫ్‌లో కాదు. వైఫ్లో పడి ఉంటాడు’ అని కూడా అనుకున్నారు. అలా అనుకున్న సంగతి కాలజ్ఞకు ఫోన్ చేసి చెప్పారు కూడా. బైక్ మీద కొంత దూరం వెళ్లగానే.. హైవే మీదకు టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు.. ఆ మధ్యాహ్నం బెంగళూరు బయల్దేరేముందు స్థిమిత అన్న మాటలు గుర్తొచ్చాయి అతడికి.‘మార్నింగ్ కాన్ఫరెన్స్ అవగానే, ఈవెనింగ్ ఫ్లయిట్‌కి వచ్చేస్తాను. ఈ ఒక్కరాత్రికి ఫ్రెండ్స్ రూమ్‌కి వెళితేనేం అనుకోవద్దు’ అని చెప్పింది తను. సిటీ అంతా ఊరికే ఓ రౌండ్ కొట్టి, ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు కాలజ్ఞ. మెయిన్ గేటు తీసి, బైక్‌ని లోపల పెట్టాడు. మెయిన్ గేట్‌కి తాళం వేసి, ఇంటి తలుపు తాళం తీస్తుండగా లోపలి నుంచి సన్నటి ఏడుపు వినిపించింది.షాక్ తగిలినట్లు ఆగిపోయాడు.అంతకు క్రితం తను ఇంట్లో ఉండగా వినిపించిన ఏడుపు లాంటిదే అది. లాంటిదే కాదు. అదే! ఆ ఏడుపును అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నాడు. తాళం తీద్దామా వద్దా అని అక్కడే ఆగిపోయాడు. తియ్యకుండా బయటే ఉండి చేసేదేం లేదు. తీసి లోపలికి వెళ్లాడు. ఏడుపు ఆగిపోయింది. పక్కన ఇళ్లున్నాయి కానీ, ఏడుపు వినిపించేంత దగ్గరగా అవి లేవు. టీవీ ఆన్ చేశాడు.మళ్లీ సన్నగా ఏడుపు! ఈసారి చెవికి దగ్గరగా!అదిరిపడ్డాడు కాలజ్ఞ. తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. ఫ్రిజ్ డోర్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. గటగటా రెండు గుక్కలు తాగాడు. తాగుతూ తాగుతూ టీవీ చానల్లో టైమ్ చూశాడు. పన్నెండు దాటి ఏడు నిముషాలు అవుతోంది. మరీ మనుషులు భయపడేంత టైమేతే కాదది. కాలజ్ఞకైతే అసలే కాదు. వాటర్ బాటిల్‌ని తిరిగి ఫ్రిజ్‌లో పెట్టబోతూ, ఫ్రిజ్‌పైన గోడకు ఉన్న వాల్‌క్లాక్ వైపు చూశాడు. పన్నెండూ ఏడు నిముషాలు!అప్పుడు భయపడ్డాడు కాలజ్ఞ. జీవితంలో ఎప్పుడూ భయపడనంతగా! పదిగంటల మీద ఆగిపోయిన గడియారం ముళ్లు ఇప్పుడు రైట్ టైమ్ చూపిస్తున్నాయి! బ్యాటరీ వీక్ అయి టైమ్ ఆగిపోయుంటే, ఒకవేళ బ్యాటరీ మళ్లీ తనంతటదే యాక్టివేట్ అయి ఉంటుందనుకున్నా.. ఫో¯Œ లో అంతకు క్రితం తను చూసినప్పుడు ఉన్న టైమ్కీ, వాల్ క్లాక్ టైమ్కీ గంటన్నర తేడా ఉండాలి. అలా లేదంటే.. ఇంట్లో కచ్చితంగా ఎవరో ఉన్నట్లు! ఎవరో ఉన్నట్లు కాదు. ఏదో ఉన్నట్లు. ఏర్పోర్ట్లో స్థిమితను పికప్ చేసుకున్నాక, ఇద్దరూ కార్లో ఇంటికి వస్తున్నారు. రాత్రి ఇంట్లో జరిగిన వింతలు, విడ్డూరాల గురించి చెబుదామనుకున్నాడు. అలాంటివి తను నమ్మదు. అందుకే చెప్పలేదు. ఇంటి దగ్గర కారాగింది. బ్యాగ్‌తో పాటు చిన్న మొక్కను కూడా కార్లోంచి బయటికి తీసింది స్థిమిత. ‘‘తులసి మొక్కే కదా. ఏంటి స్పెషల్.. అంత దూరం నుంచి’’ అడిగాడు కాలజ్ఞ.‘‘కాన్ఫరెన్స్ అయ్యాక, టైమ్ దొరికితే.. అక్కడున్న మఠానికి వెళ్లాం. తిరిగొస్తుంటే స్వామీజీ నన్నొక్కదాన్నీ ఆగమని చెప్పి ఈ మొక్కను ఇచ్చారు. ‘కోట కట్టించి పెట్టు. పారిపోతుంది’ అన్నారు. ‘ఏం పారిపోతుంది?’ అని అడిగాను. ‘ఉన్నదే పారిపోతుంది’ అన్నారు’’ అని గలగలా నవ్వుతూ చెప్పింది స్థిమిత.కాలజ్ఞ మౌనంగా వింటున్నాడు. ‘‘ఏంటి మాట్లాడవు. నాకు తెలీకుండా ఎవరైనా ఉంటున్నారా మనింట్లో!’’.. అదే నవ్వుతో భర్త వైపు చూస్తూ అడిగింది స్థిమిత. కాలజ్ఞ నవ్వలేదు. నవ్వు ముఖం మాత్రం పెట్టగలిగాడు. - మాధవ్ శింగరాజు -
‘బిమ్స్టెక్’తో కలిసి పనిచేస్తాం
కఠ్మాండు: ప్రధాన రంగాల్లో బిమ్స్టెక్ సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో జరుగుతున్న బిమ్స్టెక్ నాలుగో సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా అడ్డుకట్టకు సభ్య దేశాల మధ్య అనుసంధానం పెరగాలని ఆకాంక్షించారు. వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు అవకాశాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతం. జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట ‘బిమ్స్టెక్ సభ్య దేశాలతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడేందుకు భారత్ కట్టుబడి ఉంది. భారత్ విధానాలైన పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్ ఈస్ట్‌లకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంగా మారింది. అలాగే మనందరి భద్రత, అభివృద్ధికి సంబంధించి బంగాళాఖాతానికి ప్రాధాన్యత ఉంది. సభ్య దేశాల్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలతో ఇబ్బంది పడని దేశం లేదు. బిమ్స్టెక్ విధివిధానాలకు లోబడి మాదకద్రవ్యాల సంబంధిత అంశాలపై సదస్సు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ సమస్య ఒక దేశానికి సంబంధించిన శాంతిభద్రతల అంశం కాదు. దీనిని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. తరచూ వరదలు, తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తు సంభవించే హిమాలయాలు, బంగాళాఖాతం మధ్య బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయని.. అందువల్ల మానవతా సాయం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో సభ్య దేశాలు సహకారం, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ‘శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఏ ఒక్క దేశం ఒంటరిగా ముందుకు సాగలేదు. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతలో సహకారం.. సభ్య దేశాల ఉమ్మడి లబ్ధి కోసం వ్యవసాయ పరిశోధన, స్టార్టప్స్ తదితర అంశాల్లో సదస్సు నిర్వహిస్తామని, బంగాళాఖాతం ప్రాంతంలోని కళలు, సంస్కృతి, ఇతర అంశాలపై పరిశోధన కోసం నలంద యూనివర్సిటీలో ‘బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ సాంకేతికత రంగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌కు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహకారాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని దేశాలతో అనుసంధానంలో ఈశాన్య రాష్ట్రాలు కీలక ప్రాత పోషిస్తాయని, ఆ రాష్ట్రాల్లో చేపడుతోన్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్ని బిమ్స్టెక్ దేశాలకు విస్తరించవచ్చని చెప్పారు. ‘నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’లో చదివేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు స్కాలర్షిప్ అందచేస్తామన్నారు. బిమ్స్టెక్ వేదికగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
ఆసియాన్ సదస్సులో రామాయణ కథలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహాకావ్యం రామాయణానికి ఒక్క భారత్‌తోనే కాదు ఆసియాన్ దేశాలతోనూ విడదీయరాని బంధముంది. చరిత్ర, నాగరికతల పరంగా భారత్‌ను ఆసియాన్ దేశాలతో మమేకం చేసింది ఈ ఇతిహాసమే. ఈ విశేషాలు ప్రస్ఫుటించేలా 25–26న ఢిల్లీలో జరిగే భారత్–ఆసియాన్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన కళాకారులు రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఆసియాన్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ రామాయణం దోహదపడింది. -
ఏప్రిల్ 1న సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలు-చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ 2వ మహాసభలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో నిర్వహించను న్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేయా లని ఆయన పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో సంఘ్ పరివార్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమ ర్శించారు. 56 రోజులపాటు పోరుబాట చేపట్టామని, ఈ కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా సాగుదామని చాడ పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ హత్యలే!: డీవైఎఫ్ఐ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఓయూలో మురళి, నిర్మల్ పట్టణంలో భూమేశ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విప్లవ్‌కుమార్, ఎ.విజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓయూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. -
10 నుంచి ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు
గుత్తి: మధ్యప్రదేశ్ రాజధాని బోపాల్‌లో డిసెంబర్10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల పిలుపునిచ్చారు. పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీలో శనివారం ఐద్వా జెండాను ఆవిష్కరించారు. మహసభలకు సంబంధించిన జీపు జాతా డిసెంబర్ 5న గుత్తికి వస్తోందన్నారు. -
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్సీ) 17వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్రవిభజన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు. గుంటూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీఎల్సీ రాష్ట్ర ప్రతినిధులు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, 1973లో గుంటూరు కేంద్రంగా ఆవిర్భవించిన ఏపీసీఎల్సీ.. ప్రజాహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోనూ పౌరహక్కుల సంఘం నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యహింస, మతహింసలకు వ్యతిరేకంగా.. వనరుల దోపిడీ, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగానూ ఉద్యమించాల్సి ఉందన్నారు. మహాసభలకు ప్రధాన వక్తలుగా ఖరగ్‌పూర్, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు అనంద్ తేల్ తుంబ్డే, కాత్యాయనీ విద్మహేలు హాజరవుతున్నారన్నారు. 13వ తేదీ సాయంత్రం గుంటూరులోనే బహిరంగసభ జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం నేతలు వైకే, వి.ప్రభాకర్, లక్ష్మారెడ్డి, రాజారావు, నరసింహారావు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు పోటీగా చంద్రబాబు సభ!
23న పాలమూరులో విస్తృతస్థాయి సమావేశం 24న హైదరాబాద్‌లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి పోటీగానే... సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నెలకో జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సభలు ఏర్పాటు చేయిస్తున్న టీటీడీపీ నేతలు ఈసారి అందుకు మహబూబ్‌నగర్ జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 23న మహబూబ్‌నగర్ పట్టణంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పేరిట బాబుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ నగరాల్లో బాబు సభలను నిర్వహించిన దృష్ట్యా పార్టీకి ఒకప్పటి కంచుకోటగా భావించే పాలమూరులో భారీ ఎత్తున జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈనెల 24న అధికార టీఆర్ఎస్ ప్లీనరీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకన్నా ఒకరోజు ముందు చంద్రబాబుతో తెలంగాణలో సభను ఏర్పాటు చేయడం ద్వారా పైచేయి సాధించాలన్నది టీటీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శలు చేసే అవకాశాలున్నాయని ఊహించిన తమ్ముళ్లు.. ఒకరోజు ముందే చంద్రబాబు చేత కేసీఆర్‌పై విమర్శలు చేయించాలని జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రణాళిక వేసినట్లు సమాచారం. దీనికి ఒప్పుకున్న బాబు భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని ఆదేశించినట్లు తెలిసింది. పాలమూరుకు తరలిన టీటీడీపీ నేతలు చంద్రబాబు సభను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో జనసమీకరణపై టీటీడీపీ నేతలు పదిరోజుల ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టారు. సోమవారం నుంచి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి బాబు సభకు జనాన్ని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం కోస్గి (కొడంగల్), నారాయణపేటల్లో పార్టీ తెలంగాణ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు సమావేశాలు నిర్వహించారు. ఖర్చు రేవంత్‌దే! మహబూబ్‌నగర్‌లో బాబు సభను విజయవంతం చేసే బాధ్యతను టీటీడీపీలో కీలక పదవిని ఆశిస్తున్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం ఎన్నికలకు ముందే చెల్లాచెదురైంది. జిల్లా టీడీపీలో కూడా రేవంత్ అన్నీ తానై వ్యవహరించడం కొందరు సీనియర్లకు రుచించట్లేదు. దీంతో పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో బాబు సభపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో జనసమీకరణతోపాటు అందుకయ్యే ఖర్చును భరించేందుకు రేవంత్ ముందుకొచ్చినట్లు సమాచారం. -
మైదానాలను 45 రోజులు వాడుకోవచ్చు..
సాక్షి, ముంబై: శివాజీపార్క్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర మైదానాల్లో ఇక నుంచి 45 రోజులపాటు రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదివరకు ఈ మైదానాలలో సంవత్సరంలో 30 రోజులపాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉండేది. చట్టంలో సవరణలుచేసి అదనంగా 15 రోజులు మైదానాలు వాడుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. దీంతో ప్రభుత్వ, రాజకీయ, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలాంటి నగరంలో సభలు, సమ్మేళనాలు నిర్వహించేందుకు మైదానాలు దొరకడమే కష్టతరంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మైదానాల కొరతవల్ల ముఖ్యంగా రాజకీయ పార్టీలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్ణయంతో శివాజీపార్క్‌లో గతంలో లాగే 30 రోజులు ధార్మిక, సామాజిక కార్యాక్రమాలు, అదనంగా మంజూరైన 15 రోజుల్లో రాజకీయ సభలు నిర్వహించేందుకు అనుమతి లభించనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు క్రీడల శిక్షణకు తగినంత సమయం దొరకదని వారు పేర్కొంటున్నారు. -
నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ
-
నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ
21న విశాఖ జిల్లా నేతలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 19న(బుధవారం) గుంటూరు, 21న(శుక్రవారం) విశాఖపట్టణం జిల్లాల నేతలతో సమావేశమవ్వనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. అలాగే త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఈ నెల 22న పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24, 25 తేదీల్లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. జగన్ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. -
వెరైటీ పబ్లిసిటీ
పెరిగిన ప్రచార జోరు రూటు మార్చిన నేతలు విచిత్ర వేషాలు విభిన్నమైన పనులు {పచారం కొత్త పుంతలు తెరచాటు మంతనాలు సాక్షి, సిటీబ్యూరో: సభలు.. సమావేశాలు.. పాదయాత్రలు.. బస్తీ పర్యటనలు.. గ్రూప్ మీటింగ్‌లు.. ఇదంతా రొటీన్ ప్రచార శైలి. దోశలు పోయడం.. దరువేయడం.. వాహనాలు నడపడం.. వెల్డింగ్ చేయ డం.. పాదాలకు మొక్కడం.. పిల్లల్ని ఆడించడం.. ఆనక ఫొటోలకు పోజులివ్వడం.. ఇది లేటెస్ట్ పబ్లి‘సిటీ’ స్టంట్. విచిత్రమైన పనిచేస్తే మీడియాలో ప్రచారం వస్తుందనే అంచనాతో అభ్యర్థులు హేర్కటింగ్ల నుంచి మొదలు పెడితే పాలు పితకడం దాకా ఏ పని పడితే ఆ పని చేసేస్తున్నారు. వెరసి కోటి విద్యలు ఓటు కోసమే.. అన్న చందాన నేతల ప్రచారం విచిత్ర రీతిలో, విభిన్న తరహాలో సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రచారానికి ఇక మిగిలింది నాలుగైదు రోజులే..! ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు.. విభిన్న పద్దతులను అనుసరిస్తున్నారు. ఉన్న కొద్ది సమయాన్నీ అనుకూలంగా మలచుకునేందుకు.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉదయాన్నే లేచింది మొదలు పాదయాత్రలు, బస్తీపర్యటనలు కొనసాగిస్తున్న నేతలు.. మధ్యాహ్న భోజన విరామ సమయంలో బస్తీ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, ఇతరత్రా గ్రూపులతో చర్చలు కొనసాగిస్తున్నారు. తమకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. ఎండ తగ్గుముఖం పట్టాక మళ్లీ సాయంత్రం నుంచి బస్తీ పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. రాత్రివేళల్లోనూ లోపాయికారీ చర్చలు జరుపుతున్నారు. ఆయా కులసంఘాలను ఆకట్టుకునేందుకు వారికి హామీల జల్లులు కురిపిస్తున్నారు. బస్తీల్లోని వారికి కమ్యూనిటీహాళ్లు వంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. వందల సంఖ్యలో ఓట్లు వేయించగల వారితో బేరసారాలు జరుపుతున్నారు. అందుకుగాను బస్తీల్లో పలుకుబడి గలవారిని, కులసంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు మద్దతిస్తే ఆర్థిక ప్రయోజనాలే కాక, గెలిచాక చేయగలిగినవన్నీ చేస్తామని చెబుతున్నారు. వివిధ వర్గాలు లక్ష్యంగా.. యువకులు, విద్యావంతులను లక్ష్యంగా చేసుకొన్న నేతలు.. వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కరపత్రాల ద్వారా పార్టీ విధానాలను వివరిస్తున్నారు. తమకు మద్దతివ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులనూ తమకు అనుకూలంగా మలచుకునేందుకు వారితో బేరం సాగిస్తున్నారు. తమకు మద్దతిస్తే, భవిష్యత్తులో రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు. మహిళా సంఘాలను, స్వయంసహాయక బృందాలను దారిలోకి తెచ్చుకుంటే కుప్పలు తెప్పలుగా ఓట్లు పడతాయనే అంచనాతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నవారూ ఉన్నారు. రుణాలు, తదిర వరాలను వారికి ఎరగా వేస్తున్నారు. గ్రూపుకింత అని ముట్టజెప్పేందుకూ సిద్ధమవుతున్నారు. కులవృత్తుల వారికి అవసరమైన వనరులు, సదుపాయాలు కల్పిస్తామని కొందరు చెబుతుండగా, పేదలకు ఇళ్లిచ్చే పూచీ తమదని మరికొందరు వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా.. ఎన్ని విధాల వీలైతే అన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి రెండు మూడు గంటల వరకు వివిధ వర్గాల వారితో సమావేశమవుతున్నారు. కేవలం మూడుగంటల నిద్రతోనే రోజులు వెళ్లదీస్తున్న వారూ ఉన్నారు. విధానాలతోనూ.. ఇక ఆయా పార్టీల అభ్యర్థులు తమ విధానాల్ని చెబుతూ ఓట్లడుగుతున్నారు. మాట ఇస్తే తప్పమని కొందరు.. తమకు ఓటు వేస్తేనే బంగారు భవిష్యత్తని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను తమ బుట్టలో వేసుకునేందుకు వివిధ రకాల ప్రచారాలు సాగిస్తున్నారు. చైతన్యరథాలపై కొందరు ప్రచారం నిర్వహిస్తుండగా, వాహనాలు, మైకుల ద్వారా ప్రచారాలు సాగిస్తున్నవారూ ఉన్నారు. జీపు ర్యాలీలు, బైకు ర్యాలీలతో హడావుడి బాగానే జరుగుతోంది. దీంతో, బస్తీలు, కాలనీలతోపాటు ప్రధాన మార్గాల్లోనూ ఎన్నికల నినాదాలు హోరెత్తిపోతున్నాయి. ప్రచారంలో కొత్త పుంతలు బండీపై బజ్జీలు వేస్తూ.. కొబ్బరి బొండాలు కొడుతూ.. కూరగాయలు అమ్ముతూ.. బోరు కొడుతూ.. చిన్న పిల్లలను లాలిస్తూ .. ఇంకా.. ఇంకా విచిత్ర పనులతో ఫోజులిస్తూ నేతలు పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారానైనా ప్రచారం వస్తే చాలుననుకుంటున్నారు. ‘సహస్ర వృత్తుల.. సమస్త ఫోజుల’ అన్నట్లుగా ఓటు కోసం నానా పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులతోపాటు సతులు, సుతులు, కుటుంబ సభ్యులు రంగంలోకి దిగిపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వీలైనన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బొట్టుపెట్టి సెంటిమెంటు ఒలకబోసేవారు కొందరైతే.. బొట్టుబిళ్లలు, గిఫ్ట్‌లిచ్చి ఆక ర్షించేవారు మరికొందరు.. ఇలా ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు తమ వారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ఇది పైకి కనిపించే తంతు కాగా, వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఎక్కడికక్కడ నిలువుగా, అడ్డంగా విభజించి జరుగుతున్న సంప్రదింపులకూ కొదవేం లేదు. -
‘ఆతిధ్యం’ తగ్గింది
=‘ప్రత్యేక’ పరిస్థితుల్లో పడిపోయిన హోటళ్ల వ్యాపారం =భారీగా తగ్గిన ఆదాయం =మూతపడుతున్న చిన్న హోటళ్లు =విక్రయానికి సిద్ధంగా మరికొన్ని.. సాక్షి, సిటీబ్యూరో: ‘అతిథి దేవోభవ’ అంటూ సాదరంగా స్వాగతం పలికే భాగ్యనగరి ఇప్పుడు అతిథులు లేక వెలవెలబోతోంది. ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ అన్నట్లు ప్రతి రోజు సభలు, సదస్సులు, సమావేశాలు, పర్యాటకులతో కిటకిటలాడే బహుళ నక్షత్ర హోటళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్యరంగం సంక్షోభంలో చిక్కుకుంది. గత కొంతకాలంగా ఐటీ, పర్యాటకం, సేవా రంగాలలో అభివృద్ధి నిలిచిపోవడం, పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవడం, అభివృద్ధి, విస్తరణ పథకాలు ఎక్కడికక్కడే స్తంభించిపోవడం తదితర కారణాల రీత్యా ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. హోటళ్లలో పది శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదని పలువురు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలో జరిగిన చాలా మార్పులు హోటళ్ల రంగాన్ని నిర్వీర్యం చేశాయని హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో నిత్యావసర సరకుల ధరలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. ఉప్పులు, పప్పులు, బియ్యం, వంటనూనె, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసర సరకుల ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. దీనికి తోడు సరకుల రవాణాకు అవసరమైన ఇంధన వనరుల ధరలు కూడా పెరిగాయి. వీటన్నిటి భారం తమపైనే పడుతోందంటున్నారు హోటల్ నిర్వాహకులు. ఇదిలా ఉంటే రెండు నెలలకు పైగా సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల గుండా హైదరాబాద్‌కు రావాల్సిన నిత్యావసర సరకుల వాహనాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇదే అదునుగా పలువురు వ్యాపారులు అరకొరగా సరకులను రవాణా చేసి ధరలను అమాంతం పెంచేశారు. రూపాయి విలువ తగ్గిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సముద్రపు ఉత్పత్తులు, మద్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమాంతం పెరిగిన ధరల భారాన్ని మోస్తూ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లను నిర్వహణ సాగిద్దామంటే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లే దని గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకుడు చెప్పారు. విద్య, వైద్యం, నిత్యావసర ధరలు పెరగడంతో నగరవాసులకు ఇంటి నిర్వహణ భారంగా మారిపోయిందని, వారాంతాల్లో రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం చాలా వరకు తగ్గించారన్నారు. తమ హోటల్లో నెల రోజులుగా రూమ్స్ బుకింగ్స్ నిలిచిపోయాయని పేర్కొన్నారు. పడిపోయిన ఆదాయం మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని హోటళ్లలో లాడ్జింగ్ వ్యాపారం 60 శాతంగా ఉండేదని, ప్రస్తుతం 10 శాతానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అడ్వైజర్ నాగరాజు ‘సాక్షి’తో చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుకు సుమారు రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుండేది. కానీ నెల రోజులుగా రూ. 30 కోట్లకు మించడం లేదని అసోసియేషన్ గణాంకాల్లో తేలిందని చెప్పారు. 60 శాతంగా ఉండే రెస్టారెంట్ల టర్నోవర్ కాస్త 30 నుంచి 40 శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. స్టార్ హోటళ్ల నిర్వహణకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా కట్టలేని స్థితిలో హోటళ్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ కృష్ణయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సేల్స్, సర్వీస్, ప్రాపర్టీ, లగ్జరీ పన్నుల పేరిట నెలకు 20 నుంచి 25 శాతం పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారన్నారు. అయితే ఆ మేరకు ప్రభుత్వం నుంచి సేవలు అందటం లేదన్నారు. దెబ్బ మీద దెబ్బ.. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం ఎక్కువ శాతం విదేశీయుల రాకపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది హైదరాబాద్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా నగరానికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తదితర కారణాల వల్ల దాదాపు మూడేళ్లపాటు హైదరాబాద్‌కు విదేశీ పర్యాటకులు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ సమావేశాలు సైతం పెద్దగా జరగకపోవడంతో స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు బోసిపోయాయి. ఏడాదికాలంగా ప్రశాంత వాతావరణం నెలకొని కాస్త కోలుకుంటున్న ఆతిథ్య రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ గడ్డుపరిస్థితుల్లోకి నెట్టేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలమని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా సీమాం ధ్ర ప్రాంతాల్లో ఉద్యమం మొదలైంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినటైంది. ఇలా ఐదేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా ఆతిథ్యరంగం తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. కొన్ని హోటళ్లయితే ఏకంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కారణాలు.. =రాష్ట్రంలో అనిశ్చితి వల్ల అన్ని రకాల వ్యాపారాల్లో మాంద్యం నెలకొంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. =అంతర్జాతీయ, జాతీయ స్థాయి సమావేశాలు, సదస్సులు జరగకపోవటంతో అతిథుల సంఖ్య పడిపోయింది. =తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల ఉద్యమంతో వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారాలివీ.. =ప్రభుత్వం రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితిని తొలగించి ప్రశాంత వాతావారణం నెలకొల్పాలి. =వెంటనే పన్నులు చెల్లించాలని హోటల్ , రెస్టారెంట్లపై ఒత్తిడి తేవొద్దు. =కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు, సదస్సులను నగరంలోనే నిర్వహించాలి. =పర్యాటక, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలి. =‘గ్రేటర్’లో టూరిస్ట్ స్పాట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించాలి. =జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వందకు పైగా ఆహార తనిఖీ అధికారులను నియమించాలి. =ఆయా అధికారులు ప్రతిరోజు హోటళ్లు, రెస్టారెంట్లను విధిగా తనిఖీ చేయాలి. =అన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు జీహెచ్ఎంసీ లెసైన్సులు తీసుకునేలా చేయాలి. =హోటళ్లు, రెస్టారెంట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల భారాన్ని తగ్గించాలి. నష్టాల్లో కూరుకుపోతున్నాం వ్యాపారం సరిగా లేక నష్టాల్లో కూరుకుపోతున్నాం. పన్నులు, వడ్డీల భారాన్ని భరిస్తూ హోటల్‌ను నడిపించలేకపోతున్నాం. చిన్నాచితక హోటళ్లు అయితే మూతపడుతున్నాయి. కొన్ని హోటళ్లు అయితే అమ్మేసేందుకు సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ సమావేశాల్లో చాలా మంది హోటల్ నిర్వాహకులు చె ప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆతిథ్య రంగం కనుమరుగవుతుంది. - జీవీ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఉద్యమాల ప్రభావం అతిథ్య రంగంపై పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలి. ఆందోళనలను అదుపుచేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులను కాపాడాలి. పరిస్థితులు చక్కబడ్డాక పన్నులు చెల్లిస్తాం. అదేపనిగా హోటల్ నిర్వాహకులపై ఒత్తిడి తీసుకురావొద్దు. - నాగరాజు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అడ్వైజర్ -
సేవా పన్ను పథకంపై రాష్ట్రవ్యాప్త సదస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సేవా పన్నులను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంపై (వీసీఈఎస్) పన్నుల విభాగం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలు ఉన్నాయని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ బి.బి. ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది మేలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పట్నుంచి హైదరాబాద్ జోన్లో ఇప్పటిదాకా 100 దాకా దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా వచ్చే సేవా పన్ను మొత్తం సుమారు రూ. 30 కోట్లు ఉండగలదని ఆయన వివరించారు. డిసెంబర్ ఆఖరు దాకా ఈ పథకానికి గడువు ఉన్నందున అప్పటికి వీసీఈఎస్ ద్వారా రూ. 200-300 కోట్ల దాకా వసూలు కావొచ్చని పేర్కొన్నారు. వీసీఈఎస్పై పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు, ఈ పథకాన్ని వ్యాపార వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యురాలు (బడ్జెట్ విభాగం) షీలా సాంగ్వాన్ తెలిపారు. వీసీఈఎస్ గడువును మరింత పొడిగించడం గానీ, దీనికి సవరణలు చేయడంగానీ ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. 2013-14లో వసూలయ్యే మొత్తం సేవా పన్నులో వీసీఈఎస్ ద్వారా వచ్చే వాటా సుమారు 10 శాతంగా ఉంటందని అంచనాలు ఉన్నట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర తెలిపారు.