టీఆర్‌ఎస్‌కు పోటీగా చంద్రబాబు సభ!
- 23న పాలమూరులో విస్తృతస్థాయి సమావేశం
- 24న హైదరాబాద్‌లో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీకి పోటీగానే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నెలకో జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సభలు ఏర్పాటు చేయిస్తున్న టీటీడీపీ నేతలు ఈసారి అందుకు మహబూబ్‌నగర్ జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 23న మహబూబ్‌నగర్ పట్టణంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పేరిట బాబుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ నగరాల్లో బాబు సభలను నిర్వహించిన దృష్ట్యా పార్టీకి ఒకప్పటి కంచుకోటగా భావించే పాలమూరులో భారీ ఎత్తున జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
ఈనెల 24న అధికార టీఆర్‌ఎస్ ప్లీనరీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకన్నా ఒకరోజు ముందు చంద్రబాబుతో తెలంగాణలో సభను ఏర్పాటు చేయడం ద్వారా పైచేయి సాధించాలన్నది టీటీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శలు చేసే అవకాశాలున్నాయని ఊహించిన తమ్ముళ్లు.. ఒకరోజు ముందే చంద్రబాబు చేత కేసీఆర్‌పై విమర్శలు చేయించాలని జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రణాళిక వేసినట్లు సమాచారం. దీనికి ఒప్పుకున్న బాబు భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని ఆదేశించినట్లు తెలిసింది.
పాలమూరుకు తరలిన టీటీడీపీ నేతలు
చంద్రబాబు సభను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో జనసమీకరణపై టీటీడీపీ నేతలు పదిరోజుల ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టారు. సోమవారం నుంచి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి బాబు సభకు జనాన్ని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం కోస్గి (కొడంగల్), నారాయణపేటల్లో పార్టీ తెలంగాణ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు సమావేశాలు నిర్వహించారు.
ఖర్చు రేవంత్‌దే!
మహబూబ్‌నగర్‌లో బాబు సభను విజయవంతం చేసే బాధ్యతను టీటీడీపీలో కీలక పదవిని ఆశిస్తున్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం ఎన్నికలకు ముందే చెల్లాచెదురైంది. జిల్లా టీడీపీలో కూడా రేవంత్ అన్నీ తానై వ్యవహరించడం కొందరు సీనియర్లకు రుచించట్లేదు. దీంతో పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో బాబు సభపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో జనసమీకరణతోపాటు అందుకయ్యే ఖర్చును భరించేందుకు రేవంత్ ముందుకొచ్చినట్లు సమాచారం.