బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జోస్యం చెప్పారు. ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి మేజర్ అజెండా కాబోతుందని తెలిపారు. ఏపీలో అధ్యక్షుడ్ని పెట్టి మేము బరిలో ఉన్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పకనే చెప్పారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాక 2019లో చంద్రబాబు నాయుడు సీఎం కాలేరని పేర్కొన్నారు.
‘కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ డౌన్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యారు. ఆ విషయం కార్యకర్తలకు అర్థం అయింది. ఆయనపై నమ్మకం పోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమోదయోగ్యమైన నాయకులు లేరు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టం. మేమే ఇక్కడ ప్రత్యామ్నాయం. తెరాసకి బీజేపీకి భవిష్యత్తులో ఎటువంటి ఒప్పందం ఉండదు. అమిత్ షా పర్యటన తర్వాత పరిస్థితులు మారతాయి. టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయకపొతే మాకే ఇబ్బంది. 35 ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన ఉంటుంద’ని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ పర్యటనలో అమిత్ షా 2019 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు తుదిరూపు ఇచ్చే వెళ్తారనే నమ్మకాన్ని మురళీధర్ రావు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందని, అదే తాము నమ్ముతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ఏమి చేయలేదో అవన్నీ తమ పార్టీ అజెండాలో ఉంటాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని గత పర్యటనలో అమిత్ షా చెప్పిన మాటలను గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్నారు. ఈ నెల (జూన్) 22న రాష్ట్రంలో అమిత్ షా పర్యటన తేది మారే అవకాశం ఉందని మురళీధర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment