K Chandrashekar Rao (KCR)
-
కేసీఆర్‌కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
అసెంబ్లీకి వెళ్లనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తుంటి ఎముక సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొనేందుకు గత రెండు విడతల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నివాళులు అర్పించనున్నారు. మరోవైపు పార్టీ మారిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే జాబ్ కేలండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో గళం వినిపించనుంది. చేనేత కార్మీకుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షల వల్ల రైతులకు జరుగుతున్న నష్టం తదితరాలను కూడా ప్రస్తావించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీకి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ... అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళవారం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కమిషన్ నుంచి తప్పుకోండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్‌గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు.. విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్‌రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్‌గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణిజస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్‌లలో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, అంబేడ్కర్ ఓవర్సీస్, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలి.. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే. మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్ తెలంగాణకు కేసీఆర్ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్నిజామాబాద్ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో అందజేశారు. నగరంలో రోడ్ షో ముగిసిన అనంతరం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్‌కు రాకేశ్ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు మహేశ్ బిగాల, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్గల్ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు. -
నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్‌కర్నూల్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
12 లోక్‌సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్‌షోలలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. పంటలు ఎండటం ఇదే మొదటిసారి బీఆర్ఎస్ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్‌లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులకు అన్యాయం జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. ధాన్యం ఎందుకు కొనడం లేదు? తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్ డ్యామ్‌పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్ టెయిల్ పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. తులం బంగారం ఏమైంది? మా హయాంలో రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ కాన్వాయ్‌లో వాహనాలు ఢీ మిర్యాలగూడ టౌన్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొన్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కేసీఆర్ భయపడతడా? ‘‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. లోక్‌సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్‌తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు.మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రైతులతో కేసీఆర్ మాటా మంతీ నల్లగొండ రూరల్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. అన్నెపర్తి వద్ద.. రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్.. కేసీఆర్: ఎందుకు.. ఏమైంది? రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. కేసీఆర్: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్ అరవింద్‌రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు) మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్. ఐకేపీ సెంటర్లో బాధలు చూడాలి సార్. కేసీఆర్: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్‌రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆర్జాలబావి వద్ద.. రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్. కేసీఆర్: ధాన్యం కొంటలేరా? రైతు: కొంటలేరు సార్. ఎండకు చస్తున్నాం. కేసీఆర్: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్‌కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేసీఆర్
ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్ అవుతదా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్‌ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నరు? గత డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు. ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏప్రిల్ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు. మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం.. మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మేం పవర్‌గ్రిడ్‌కు అనుసంధానించి.. కరెంట్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్‌ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్ అవర్స్‌లో ఎంత షార్టేజ్ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. పంటలు ఎందుకు ఎండుతున్నాయి రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్‌లో మినిమమ్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం. ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్‌లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు. నాగార్జునసాగర్ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్ చేయట్లేదు. ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్ భగీరథను పునరుద్ధరించాలి. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
నేటి నుంచి భేటీలతో దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్టీ అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నుంచి లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేసి క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని అభ్యర్థులను ఆదేశించారు. మరోవైపు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, కరువు పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ప్రచార షెడ్యూల్‌పై కొనసాగుతున్న భేటీలు ఏప్రిల్ రెండో వారం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పరేడ్ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు లక్ష్యంగా ఎజెండా.. ఎన్నికల ప్రచార షెడ్యూల్, ప్రచార ఎజెండా తదితరాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు, ప్రచారం చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల ఉల్లంఘన, అప్రజాస్వామిక విధానాలు, బెదిరింపులు, వేధింపులు వంటి అంశాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ నియంతృత్వం, అణచివేత విధానాలు, లౌకికత్వానికి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలనూ ఎత్తి చూపాలని భావిస్తున్నట్టు సమాచారం. జెండా మోసిన వారికే పెద్దపీట పార్టీ జెండా మోసిన వారికి పెద్దపీట వేస్తూ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కేసీఆర్ పూర్తి చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును సోమవారం ఖరారు చేశారు. మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గాను ఇంతకుముందే నాలుగు విడతల్లో 16 మంది పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. అందులో 13 మంది పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారుకాగా.. ముగ్గురు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరినవారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక్కరే ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత దక్కింది. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన సీట్లలో సగం బీసీలకే కేటాయించింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్సీలకు మూడు (రెండు మాదిగ, ఒక మాల), ఎస్టీలకు రెండు (బంజారా, గోండులకు చెరొకటి), బీసీలకు ఆరు (మున్నూరు కాపు రెండు, ముదిరాజ్, గౌడ, యాదవ, కురుమలకు ఒక్కోటి), ఓసీలకు ఆరు (నాలుగు రెడ్డి, వెలమ, కమ్మకు చెరో స్థానం) సీట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు తెరమీదకు..! బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు ఇతర పార్టీల్లో చేరగా.. కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో ముగ్గురు సిట్టింగులతోపాటు కరీంనగర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్‌కుమార్‌లకు పోటీ అవకాశం దక్కింది. ఇక నేతలు పార్టీని వీడిన చోట కొత్తవారికి ఇన్చార్జులుగా బా«ధ్యతలు అప్పగిస్తున్నారు. సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డిలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. -
చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: బీరు, బ్రాందీ వ్యాపారాలు చేసి.. ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిలదీశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు సంస్థల నోటీసులకు ఆన్సర్ ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకొని తిరిగారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ దీని మీద డొంక తిరుగులు తిరుగుతూ.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు కాదు.. సాక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధం లేదని కేసీఆర్ చెప్తారా?. ఆప్ నేతలకు ఢిల్లీ స్కాంకి ఆప్ నేతలకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? అంటూ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్లు చేతులు మారాయని నేను నిరుపిస్తా?. ఇది తప్పని కేసీఆర్ నిరుపిస్తారా?. దీనిపై చర్చకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్ట్‌కు, తెలంగాణకు సంబంధం పెడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ కూడా తప్పు బడుతుంది. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు చేసే పార్టీ. కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచే ప్రయత్నం చేస్తుంది’’ అని ధ్వజమెత్తారు. ‘‘గతంలో కేసీఆర్ అవినీతిపై రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ దర్యాప్తు ఏమైంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయలేమని వారు రీప్లే ఇచ్చారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా?. మీకు దమ్ముంటే సీబీఐ దర్యాఫ్తు కు లేఖ రాయండి. మీరు లేఖ రాసిన రెండు గంటల్లో అనుమతి ఇప్పించే బాధ్యత నాది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు -
కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్య క్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రజల స్పందన, ప్రభుత్వ వ్యతిరేకత, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పలువురు నేతలు పార్టీని వీడటం ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తుండగా, పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత భరోసా ఇస్తున్నారు. జిల్లాల వారీగా భేటీలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో పాటు జిల్లాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మెదక్, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. నాగర్‌కర్నూలు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు ఖరారు కాగా హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థి బరిలోకి దిగుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరమీదకు రాగా, దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది. సోమవారం హోలీ పండుగ తర్వాత బీఆర్ఎస్ తుది జాబితా వెలువడే అవకాశముంది. మంచి ఫలితాలు ఖాయం! మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, ముధోల్‌లో వేణుగోపాలచారి, హుజూర్‌నగర్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు ఎన్నికల సన్నాహాలను సమన్వయం చేస్తున్నారు. కింది స్థాయిలో స్థానికంగా చురుగ్గా ఉన్న కేడర్‌కు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు జిల్లాల వారీగా ఫోన్ల ద్వారా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ సర్వే ఏజెన్సీల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు ఆయనను కలిసిన నేతలు చెప్తున్నారు. మెదక్‌లో హరీశ్ పోటీ చేస్తారనే ప్రచారం మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ లోకక్భ బరిలో ఉంటారని సామాజిక మాధ్యమాల్లో గురువారం విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని, అలాంటి చర్చ పార్టీలో జరగడం లేదని హరీశ్ స్పష్టత ఇచ్చారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తారంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌తో సుదీర్ఘ భేటీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో ఈ నెల 16న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న హరీశ్ గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కవిత విచారణ సహా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ శనివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. -
మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం లభించింది. దీంతో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉండటంతో, మరో ఐదు స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థు లను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో గురువారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి గైర్హాజరుపై కేసీఆర్ ప్రశ్నించగా, వ్యక్తిగత పనులతో రాలేకపోయినట్లు నిర్మల్ జిల్లా నేతలు వెల్లడించారు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి గైర్హాజరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని.. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారన్న కేసీఆర్.. బీఆర్ఎస్తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ పట్టించుకోవద్దని.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే యాదికొస్తాం.. ఎల్ఆర్ఎస్ గతంలో మనం ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామంటూ కామెంట్ చేసినోళ్లు.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి టైం సరిపోతుంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తాం. బీఆర్ఎస్కు గెలుపు, ఓటములు కొత్త కాదు. కుంగి పోయేది...పొంగి పోయేది ఏమీ లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం.. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
22న ఢిల్లీకి కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. పొత్తు లేదని ఇరు పార్టీలూ చెబుతున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుకు అవకాశం లేదని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీల నేతలు తెగేసి చెప్తున్నా.. ఆ వాదనలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలతో పాటు కొందరు కీలక నేతలు కూడా ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాకుండా లోక్‌సభ షెడ్యూలు విడుదల తర్వాతే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో కీలక నేతలతో భేటీ.. విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు మరో వారం పది రోజుల్లో వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్ష, సన్నద్ధత సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎన్నికలకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్ఎస్ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కేఆర్ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి -
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్‌రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్‌రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. -
రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగే ఎన్నికకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలతో చర్చించి వద్దిరాజు అభ్యర్థిత్వంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వద్దిరాజు గురువారం నామినేషన్ దాఖలు చేస్తారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్‌కు రెండు.. బీఆర్ఎస్కు ఒకటి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వద్దిరాజు రవిచంద్ర తన రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున లభించనుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు పేరు ఖరారు కావడంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. వరుసగా రెండోసారి.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వద్దిరాజు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2022 మేలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ రాజీనామా చేయడంతో అదే నెల 23న వద్దిరాజును బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో వద్దిరాజుకు రెండోమారు బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. -
కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు ‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది. కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం ‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్‌లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్‌సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు ‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది. దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. ‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే. గవర్నమెంట్‌ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది ‘మంత్రి ఉత్తమ్‌కుమార్ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది. ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోతదా?’ అని కేసీఆర్ నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. ‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. అవి గట్టిగా ఉంటాయ్. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి. చలో నల్లగొండ పెడితే కేసీఆర్‌ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్‌ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్‌కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? ‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా? మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి. అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట ‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్‌ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్‌పై విచారణకు ఆదేశిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. శాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం రేషన్ కార్టుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు. కాళేశ్వరం టూర్‌కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒకరోజు ముందు వెనుక అయినా మేం రెడీగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ సారి 23 శాతం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. ఇరిగేషన్లో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ఇస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులు తేలుతారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
టచ్ చేసి చూడు: కేసీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏనాడూ వెనక్కిపోడు. ఉడుత బెదిరింపులకు భయపడడు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. కొత్త సీఎం బీఆర్ఎస్ పార్టీని, వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. తొలిసారిగా మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి వాటిల్లే నష్టాలు, ఇతర పర్యవసానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన వైఖరి వారికి వివరించారు. ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేం ‘రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన జుట్టును కేంద్రం చేతికి అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ఏనాడూ తలొగ్గలేదు. ప్రాజెక్టులు తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నన్ను బెదిరించారు. కానీ నేను.. కావాలంటే తెలంగాణలో నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. రాష్ట్రపతి పాలన పెట్టుకో. తెలంగాణకు అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది., పదేళ్ల పాటు కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ ప్రాజెక్టులను కాపాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించింది..’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం ‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రజా మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర, మూర్ఖపు వైఖరిని తిప్పికొడుతూ, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన వాటాలను, ఉన్న హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకానైనా పోరాడాల్సిందే. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది. తెలంగాణ ఉద్యమకారులది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సాగు, తాగునీటి హక్కుల కోసం పోరాడాం. ‘మా నీళ్లు మాకే ’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండగడదాం..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలన చేతకాక రేవంత్ కారుకూతలు ‘అసెంబ్లీలో మనం తక్కువేంలేం..39 మందిమి ఉన్నాం. ప్రతి అంశాన్ని అక్కడ ఎండగడతాం. ఈ సీఎం ఎక్కువ మాట్లాడుతున్నాడు. సీఎం అనేటోడు ఈరోజు ఉంటాడు. రేపు పోతాడు. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. మీరు ఎవరూ గాబరా పడొద్దు. రేవంత్‌వి పిల్ల చేష్టలు. పాలన చేతకాక నా మీద కారు కూతలు కూస్తున్నడట. నల్లగొండలో సభ పెట్టనివ్వరట. మన సభను అడ్డుకునేది ఎవ్వడు? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవ్వడు అడ్డుకోవడానికి. నల్లగొండ ఆయన జాగీరా? ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దాం. ఇలాంటి వాళ్లను చాలామందిని చూసినం. ఈ ప్రభుత్వాన్ని మనం కూల్చాల్సిన అవసరం లేదు ప్రాజెక్టుల విషయంలో మన ఎమ్మేల్యేలు సభలో కొట్లాడతరు. మనం అందరం వెళ్లి నల్లగొండలో కొట్లాడుదాం. మనం ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రకటించిన పథకాలు అమలు చేయలేక వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తది. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వెయ్యి శాతం మనమే అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ సభను విజయవంతం చేయాలి తెలంగాణ భవన్లో సమావేశానంతరం నందినగర్ నివాసంలో కేసీఆర్ మరోసారి నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్లగొండలో బహిరంగసభ నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం , మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయ కర్తలతో చర్చించారు. ప్రాజెక్టుల అప్పగింతతో ఎదురయ్యే దుష్పరిణామాలు తెలంగాణ సమాజానికి తెలిసేలా ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పని చేద్దామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసే ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. 2014 జూన్2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ఎలా పని చేసిందీ, కృష్ణా జలాల్లో హక్కుల రక్షణకు ఎంతగా శ్రమించిందీ సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేద్దామని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెండు, మూడురోజుల్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుదామని తెలిపారు. శనివారం కేసీఆర్ నందినగర్నివాసంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి మాజీ చీఫ్విప్వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య ఆయనతో సమావేశమయ్యారు. ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు విశ్వసనీయం సమాచారం మేరకు.. బీఆర్ఎస్అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఒప్పుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బలవంతంగా గెజిట్‌అమలు చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణాలో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్కౌన్సిల్తేల్చాలని కేఆర్ఎంబీ 17వ సమావేశంలో నిర్ణయించినా, ఆ తర్వాత అపెక్స్కౌన్సిల్సమావేశమే జరగలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్సర్కార్.. శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టుల్లోని పది ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని చెప్పారు. జల విద్యుత్ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఏటా శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో మొదలవగానే టీఎస్‌జెన్ కో విద్యుదుత్పత్తిమొదలు పెట్టేదని, తద్వారా రాష్ట్రంలోని ఎత్తిపోతలప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో కరెంట్ఉత్పత్తి చేసుకునే వారమని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఏపీ.. కృష్ణా బోర్డు మొదలు పార్లమెంట్వరకు అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిందని, సుప్రీం కోర్టులోనూ కేసు దాఖలు చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్‌ను కలిసిన ప్రముఖులు కేసీఆర్‌ను శనివారం సినీ నిర్మాత దిల్‌రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. తన తమ్ముడు శిరీ‹Ùరెడ్డి కుమారుడు ఆశి‹Ùరెడ్డి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా సీనియర్జర్నలిస్ట్దేవులపల్లి అమర్ ఏపీ రాజకీయాలపై తాను రాసిన ‘ది డెక్కన్పవర్ప్లే’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేశారు. మరో సీనియర్జర్నలిస్ట్వనం జ్వాలా నర్సింహారావు.. ‘ఆంధ్రా వాలీ్మకి రామాయణంలో చంద్ర ప్రయోగం’పుస్తకాన్ని బహూకరించారు. -
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్‌లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. కాగా, కేసీఆర్‌కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేసిన బీఆర్ఎస్.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు.