టికెట్ దక్కని సిట్టింగ్‌లు..
ఆత్రం సక్కు (ఆసిఫాబాద్–ఎస్టీ),రాథోడ్ బాపూరావు (బోథ్–ఎస్టీ), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), బేతి సుభాష్రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్–ఎస్సీ), రాములు నాయక్ (వైరా–ఎస్టీ), చెన్నమనేని రమేశ్‌బాబు (వేములవాడ–జనరల్)
వీరి స్థానంలో టికెట్లు పొందినవారు
కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), బానోత్ మదన్‌లాల్ (వైరా), చల్మెడ లక్ష్మీకాంతరావు (వేములవాడ).
ఏడుగురు మహిళలకు టికెట్లు
ఎమ్మెల్యేలు సబితా (మహేశ్వరం), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), బానోత్ హరిప్రియనాయక్ (ఇల్లందు)తోపాటు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బడే నాగజ్యోతి (ములుగు),లాస్య నందిత (కంటోన్మెంట్)కు టికెట్ ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఊహించినట్టుగానే బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సిట్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తూ, పెద్దగా మార్పు చేర్పులేవీ లేకుండానే.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. నాలుగు సీట్లు మినహా మిగతా 115 నియోజకవర్గాల టికెట్లను ప్రకటించారు.
మిగతా నాలుగు చోట్ల స్థానిక పరిస్థితులను మరోసారి మదింపు చేశాక అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితుల మేరకు ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా.. 4 చోట్ల కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మూడు చోట్ల వారసులకు అవకాశమిచ్చారు.
అభ్యర్థుల విశేషాలు ఇవీ..
► తాజాగా ప్రకటించిన బీఆర్‌ఎస్ జాబితాలో నలుగురు.. అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), లాస్య నందిత (కంటోన్మెంట్), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
► చాలామంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినా.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మృతి చెందడంతో.. ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చారు.
► దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పోటీ చేయనున్నారు.
► గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో.. ఆమె గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ నిరాకరించారు.
► పౌరసత్వ వివాదం నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును తప్పించి.. చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశం ఇచ్చారు.
► మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని తప్పించి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని భావించారు. అయితే ఇద్దరూ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టడంతో పెండింగ్‌లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించాకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించనున్నారు.
► నాలుగైదు రోజులుగా చర్చనీయాంశంగా మారిన జనగామ స్థానం కూడా పెండింగ్‌లో పడింది. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేశారని.. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒత్తిడి నేపథ్యంలో పెండింగ్‌లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముత్తిరెడ్డి సోమవారం ఉదయం టికెట్ల ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి.. తనకే టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
► ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం పార్టీతో మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతుందని ప్రకటించారు. ఎంఐఎం ప్రాబల్యం కలిగిన నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను పెండింగ్‌లో పెట్టారు.
ముందుగా నిర్ణయించిన సమయానికే
► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించుకున్న సమయానికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు వచ్చారు.
తాండూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. మైనంపల్లికి ఇష్టముంటే పోటీ చేస్తారని, లేదంటే వారేవాళ్లు పోటీ చేస్తా రని పేర్కొన్నారు. ఇక మైనంపల్లి వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. మంత్రి హరీశ్‌రావుకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. కాగా తాను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పట్నం మహేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment