patnam mahendar reddy
-
పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
సాక్షి,హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లగచర్లలో అధికారులపై దాడి ఘటన వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే?దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టాడు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్ చేశాడు. నిందితులకు ఆర్థిక,నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాడు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడు. అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌కు హామీ ఇచ్చాడు నరేందర్ రెడ్డి.పట్నం నరేందర్‌రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారు. నిందితుడు పట్నం నరేందర్‌రెడ్డి ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు నరేందర్‌రెడ్డి.అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్‌రెడ్డి చెప్పాడు. రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సురేష్‌ను ఫోన్లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. నిందితుడు బి. సురేష్ సీడీఆర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. -
ఇప్పటివరకు నా భర్తతో మాట్లాడలేదు: పట్నం నరేందర్ సతీమణి
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆయన సతీమణి శృతి తప్పుపట్టారు. తన భర్తను ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేశారని అన్నారు. ‘‘సమాచారం లేకుండా ఇలా అరెస్ట్ చేయటం సరికాదు. నిన్న(మంగళవారం) రాత్రి, ఇవాళ ఉదయం ఇంటి ముందు పోలీసులు కూడా ఉన్నట్టు కనిపించలేదు. హఠాత్తుగా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు నా భర్త నాతో మాట్లాడలేదు. వాకింగ్‌కు వెళ్లి నేను వచ్చేశాను. తర్వాత ఆయన వస్తున్న సందర్భాన్ని చూసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని అన్నారు.మరోవైపు.. ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని.. ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ అప్రజస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. అనంతరం..నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టుపైన కోర్టులో పోరాటం చేస్తుందని కేటీఆర్ శృతికి హామీ ఇచ్చారు. -
పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన హరీష్ రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు?.అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్నం మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు..పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని’ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు
-
115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా.. సిట్టింగులకే సై!
టికెట్ దక్కని సిట్టింగ్‌లు.. ఆత్రం సక్కు (ఆసిఫాబాద్–ఎస్టీ),రాథోడ్ బాపూరావు (బోథ్–ఎస్టీ), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), బేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్–ఎస్సీ), రాములు నాయక్ (వైరా–ఎస్టీ), చెన్నమనేని రమేశ్‌బాబు (వేములవాడ–జనరల్) వీరి స్థానంలో టికెట్లు పొందినవారు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), బానోత్ మదన్‌లాల్ (వైరా), చల్మెడ లక్ష్మీకాంతరావు (వేములవాడ). ఏడుగురు మహిళలకు టికెట్లు ఎమ్మెల్యేలు సబితా (మహేశ్వరం), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), బానోత్ హరిప్రియనాయక్ (ఇల్లందు)తోపాటు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బడే నాగజ్యోతి (ములుగు),లాస్య నందిత (కంటోన్మెంట్)కు టికెట్ ఇచ్చారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సిట్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తూ, పెద్దగా మార్పు చేర్పులేవీ లేకుండానే.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. నాలుగు సీట్లు మినహా మిగతా 115 నియోజకవర్గాల టికెట్లను ప్రకటించారు. మిగతా నాలుగు చోట్ల స్థానిక పరిస్థితులను మరోసారి మదింపు చేశాక అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితుల మేరకు ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా.. 4 చోట్ల కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మూడు చోట్ల వారసులకు అవకాశమిచ్చారు. అభ్యర్థుల విశేషాలు ఇవీ.. ► తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో నలుగురు.. అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), లాస్య నందిత (కంటోన్మెంట్), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ► చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినా.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మృతి చెందడంతో.. ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. ► దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ► గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో.. ఆమె గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ నిరాకరించారు. ► పౌరసత్వ వివాదం నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును తప్పించి.. చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశం ఇచ్చారు. ► మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని తప్పించి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని భావించారు. అయితే ఇద్దరూ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టడంతో పెండింగ్‌లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించాకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ► నాలుగైదు రోజులుగా చర్చనీయాంశంగా మారిన జనగామ స్థానం కూడా పెండింగ్‌లో పడింది. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేశారని.. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒత్తిడి నేపథ్యంలో పెండింగ్‌లో పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముత్తిరెడ్డి సోమవారం ఉదయం టికెట్ల ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి.. తనకే టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ► ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం పార్టీతో మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతుందని ప్రకటించారు. ఎంఐఎం ప్రాబల్యం కలిగిన నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను పెండింగ్‌లో పెట్టారు. ముందుగా నిర్ణయించిన సమయానికే ► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించుకున్న సమయానికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు వచ్చారు. తాండూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. మైనంపల్లికి ఇష్టముంటే పోటీ చేస్తారని, లేదంటే వారేవాళ్లు పోటీ చేస్తా రని పేర్కొన్నారు. ఇక మైనంపల్లి వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. మంత్రి హరీశ్‌రావుకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. కాగా తాను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పట్నం మహేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. -
బీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు .. రాజకీయం.. రసకందాయం
‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అనే నానుడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. కొత్త, పాతల మధ్య కుదిరిన సయోధ్య చెదరడంతో భవిష్యత్తు రాజకీయం రసకందాయంగా మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కీలక నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు క్రమక్రమంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. నాయకుల వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. సాక్షి, రంగారెడ్డి: జిల్లా రాజకీయాలను శాసించే మహేశ్వరం, తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తి మరింత పెరిగేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నంమహేందర్రెడ్డి, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా రాజుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ ఒకటే అయినా వైరివర్గం ఆధిపత్యం మింగుడుపడక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో అసంతృప్త నేతలు ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ పీఠాలపై కూర్చున్నా సరే ప్రత్యర్థుల పెత్తనాన్ని ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతూ తిరుగుబాటుకు సిద్ధపడుతుండడం గమనార్హం. పైలెట్‌తో పట్నం ఢీ గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. తర్వాత తన సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడంతో సంతృప్తి పడ్డారు. అనంతరం జెడ్పీ ఎన్నికలు రావడంతో సారథిగా సతీమణి సునీతను గెలిపించుకోవడం ద్వారా వికారాబాద్ జిల్లాలో తన రాజకీయ పలుకుబడి తగ్గలేదని నిరూపించుకున్నారు. అయితే, తనను ఓడించిన పైలెట్‌ను అధిష్టానం అక్కున చేర్చుకోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రెండువర్గాలు విడిపోవడంతో గులాబీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. వీరి ఆధిపత్యపోరులో శ్రేణులు కూడా చీలిపోవడం.. ప్రొటోకాల్ సమస్యలతో తాండూరు రాజకీయ రంజుగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో ప్రగతిభవన్‌కు దగ్గరయిన పైలెట్ మెడకు ఈడీ కేసు బిగుసుకుంటుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమనే ధీమాలో పట్నం వర్గీయులు ఉన్నారు. రోహిత్ మాత్రం తన కెరీర్‌ను ఫణంగా పెట్టి బీజేపీపై కేసీఆర్‌కు పోరాటాస్త్రం అందించానని, ఈ సారి గులాబీ బీఫారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్న పట్నం అవసరమైతే కండువా మార్చయినా జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సబిత వర్సెస్ తీగల మహేశ్వరంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పొసగడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరి కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కినుక వహించిన కృష్ణారెడ్డి పలుమార్లు మంత్రి వ్యవహారశైలిని తప్పుబడుతూ వస్తున్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం.. ఆయన కోడలు అనితారెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో కొన్నాళ్లు గుంభనంగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తిరిగి మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి జరగడంలేదని,తన వర్గీయులను అణిచివేస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ను కాదని తనకు టికెట్ ఇచ్చే అవకాశం మృగ్యమనే ప్రచారం నేపథ్యంలో పక్కపారీ్టలవైపు చూస్తున్నారు. మేడ్చల్‌లోనూ సేమ్ సీన్ 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఈసారి మాత్రం అధిష్టానంతో చావోరేవో తేల్చుకునేదిశగా అడుగులేస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈ పరిణామం మింగుడుపడని మలిపెద్ది.. తన అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను సంతృప్తి పరిచేందుకు కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి మేడ్చల్ జెడ్పీ పీఠాన్ని అప్పగించారు. దీంతో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, సుధీర్‌రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసిన మల్లారెడ్డి.. నెమ్మదిగా అన్ని మండలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోని సుధీర్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబీకులపై జరిగిన ఐటీ దాడులతో మంత్రి ప్రతిష్ట మసకబారిందని.. ఈసారి తనకు టికెట్ ఖాయమనే భావనలో ఉన్నారు. అధిష్టానం నుంచి రిక్తహస్తం ఎదురైతే ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొనేందుకు కూడా వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది. -
బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు. పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు. తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ప్రస్తుతం ఔటర్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్సన్పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు. -
పొరపాటున నోరు జారా.. క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్సీ పట్నం
సాక్షి, హైదరాబాద్: తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు.తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో సీఐను కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ‘పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను.రు. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అని గురువారం ఓప్రకటనలో తెలిపారు. కాగా ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసుక అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నానని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. . ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మరడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. చదవండి👉వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ.. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో యాలాల ఎస్సైపై మహేందర్ రెడ్డిపై నోరు జారినందుకు ఈ కేసుపెట్టారు. సీఐని దూషిస్తూ. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. కాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని ఎస్సై అరవింద్ ఆరోపించారు. తీవ్ర పరుష పదజాలాన్ని వాడారని, తనకు నచ్చని వాళ్లను స్టేజి పైనుంచి కిందకు దించాలంటూ బూతులు తిట్టారని అన్నారు. అరేయ్ ఎస్సై.. తమాషాలు చేస్తున్నావా అని తిట్టాడని. పబ్లిక్‌లో తిట్టడం అవమానకరంగా ఉందన్నారు. మహేందర్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఒత్తిడి చేస్తున్నారు.. అక్కడి నుంచే పోటీ చేస్తా
సాక్షి,తాండూరు(వికారబాద్): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తాండూరు నుంచి పోటీ చేస్తానని, ఈమేరకు ఇక్కడి ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తంరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను తాండూరులో ఉంటున్నానని, నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానన్నారు. దీంతో ఈ స్థానాన్ని వదులుకొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని, ప్రజల అభీష్టం మేరకు పోటీకి దిగుతానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ తాను విజయం సాధిస్తానని ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు సైతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ కేడర్ పటిష్టంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా తనకు ఫోన్లో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మంత్రి పదవి రానుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. అది సీఎం చేతిలో ఉందని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలకు ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు. తాండూరు మున్సిపాలిటికి ఐదేళ్లపాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగుతారని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత చైర్పర్సన్ మార్పు ఉంటుందని గతంలో ప్రకటించిన విషయాన్ని విలేకర్లు గుర్తు చేయగా.. అది అప్పటి పరిస్థితుల మేరకు టెన్షన్లో తీసుకున్న నిర్ణయమని కొట్టిపారేశారు. అనంతరం వీరశైవ సమాజం ప్రతినిధులకు స్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షల నిధులను కేటాయించి ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బొబ్బిలి శోభరాణి, ప్రవీణ్‌గౌడ్, రామకృష్ణ, వెంకన్నగౌడ్, నాయకులు జబేర్లాలా, వడ్డె శ్రీనివాస్, బిర్కట్ రఘు ఉన్నారు. -
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం!
తాండూరు రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. కొంతకాలంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరు టీఆర్ఎస్ పార్టీనే అయినా వైరం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి గులాబీ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఆయన ఖండించారు. వైరి వర్గం కావాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాండూరు: టీఆర్ఎస్లో పుకార్లు షికార్లు చేస్తున్నా యి.మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తో పాటు మరికొందరు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు త్వరలో ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటారని ఆయన వైరివర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. పొమ్మన లేక పొగపెడుతున్నట్లు అనే చందంగా వ్య వహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి బలమైన నేతగా ఎదిగారు. కొంతకా లంగా జరుగుతున్న ప్రచారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నా రు. మహేందర్‌రెడ్డి పార్టీ మారితే పట్నం కుటుంబసభ్యులంతా కారు దిగే అవకాశాలు లేకపోలేవు. అంతటా ఇదే చర్చ.. జిల్లాలోని తాండూరు నియోజకవర్గ రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పక్షం రోజులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగుతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యనేతలు ఒకచోట కలిసినప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. మహేందర్‌రెడ్డి 2014లో టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. అలాంటి సమయంలో మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సైతం పలు బహిరంగ సభలో ప్రశంసించారు. తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగిన నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. పైలెట్ పార్టీ మారడంతో.. తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన పైలెట్ రోహిత్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఆయన జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో వెనుకబడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రాజకీయ గురువు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. కొన్నిరోజులకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కారు. అనంతరం మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి కొన్నాళ్ల పాటు సన్నిహితంగా మెలిగారు. తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను టీఆర్ఎస్లో చేర్చుకొని ఓ సొంత కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా ఇదరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్నాయి. కొన్నిసార్లు వీరిద్దరు పాల్గొన్న సమావేశాల్లో అనుచరులు గొడవపడి కొట్టుకున్నారు. పట్నం పార్టీ మారితే .. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సతీమ ణి సునీతారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గొ కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి హవా ఉంది. ఒకవేళ వీరంతా పార్టీ మారితే గులాబీదళానికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పట్నం పోటీలో లేకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రాభవం కోల్పోయారని వైరి వర్గం ప్రచారం చేస్తోంది. రోహిత్‌రెడ్డికే టికెట్ కేటాయిస్తారని అంటున్నారు. మహేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం సాగిస్తోంది. నాపై విష ప్రచారం.. నేను టీఆర్ఎస్ను వీడి వెళుతున్నానని వైరివ ర్గం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారానికి తెరతీశారు. నేను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేద్దాం. – పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ -
జీవితమంటే ఆట కాదు
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్’. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్. ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్. ∙పి. మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్, పులి అమృత్ గౌడ్, జి. పాండురంగా రావు -
ప్రత్యర్థులు మిత్రులయ్యారు!
సాక్షి, తాండూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఈ ఇద్దరు నేతలకు సరితూగుతోంది. నెల క్రితం వరకు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకొన్న వారు మూడు రోజుల నుంచి ఒకే వాహనంలో కలిసి తిరుగుతున్నారు. దీంతో కొందరు సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు నేతల కోసం గొడవలు, ఘర్షణలు పడి జీవితాలను ఫణంగా పెట్టిన నాయకులు ఉన్నారు. రెండు మూడు రోజులుగా ఇద్దరు నేతల ఒకే వాహనంలో వెళ్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడం గమనార్హం. తాండూరు నియోజకవర్గంలో.. తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్‌రెడ్డి, పంజుగుల రోహిత్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏడాది క్రితం మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని ఓడించేందుకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహేందర్‌రెడ్డిని తాండూరులో ఓడించి షాబాద్‌కు తరిమి కొట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో మహేందర్‌రెడ్డి పైచేయి సాధించారు. ఎన్నికల తర్వాత కూడా ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో కొనసాగింది. అయితే అనూహ్యంగా రోహిత్‌రెడ్డి రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి ఒకే పార్టీలో ఇద్దరు కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు.. తర్వాత.. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడి ఎన్నికలకు ముందు వరకు మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసి ఓటర్లను ఆకర్షించారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన తర్వాత వచ్చిన విమర్శలను అనుకూలంగా మార్చుకునేందుకు కొత్త వ్యూహం రచించారు. మహేందర్‌రెడ్డిని విమర్శించిన రోహిత్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. మూడు రోజులుగా ఒకే వాహనంలో.. ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గతంలో చేసుకున్న విమర్శలను ప్రతి విమర్శలను పక్కన పెట్టారు. తాండూరులో ఏ కార్యక్రమం జరిగిన ఇద్దరు నేతలు ఒకే వాహనంలో వెళ్లి హాజరవుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరులోని తన నివాసంలో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆయన నివాసానికి చేరుకొని ఒకే వాహనంలో ఇద్దరు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరిందా లేకా పార్టీ అధిష్టాన నేతల ఒత్తిడితో కలిశారా పర్యటిస్తున్నారా అనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు టీఆర్ఎస్లో కొనసాగుతున్న సీనియర్ నేతలు ఇద్దరు నేతల వ్యవహార శైలిని తప్పు పడు తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇద్దరు నేతల కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు గొడవలు, ఘర్షణలు పడ్డారని, ఈ విషయంలో పలు పోలీసు కేసులు నమోదు కావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏ పార్టీలో ఉన్న విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని అవకాశవాద రాజకీయాలను సహించబోమని సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీలు విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏకపక్ష విజయం ఇచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా
సాక్షి, హైదరాబాద్ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను అధికార పక్షం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై గెలుపొందారు. చిన్నపరెడ్డికి 640, లక్ష్మికి 414 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (850) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంగాల వెంకట్రామిరెడ్డి(23)పై ఆయన 827 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ నెల 31న జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి 98.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,799మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు గాను 2,753మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. నల్లగొండ మొత్తం ఓట్లు : 1085 పోలైనవి :1073 టీఆర్ఎస్ : 640 కాంగ్రెస్ : 414 చెల్లనవి : 19 సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కొండా వర్సెస్ పట్నం
మరో బిగ్ ఫైట్‌కు ఉమ్మడి జిల్లా వేదిక కానుంది. హోరాహోరీగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన నెల రోజులకే ఇద్దరు ఉద్ధండులు అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలుమిరియాలు నూరుతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడనున్నారు. సాక్షి, రంగారెడ్డి: జిల్లాస్థానిక కోటాలో ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ఖరారు చేసింది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. మహేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో.. పట్నంపై పైచేయి సాధించేందుకు కొండా కదన కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామంతో జిల్లా రాజకీయ యవనికపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి వైరమే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నం చేరికపై కొండా అయిష్టంగానే ఉన్నారు. 2014 జనరల్ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీసెగ్మెంట్ నుంచి గెలుపొందిన పట్నం కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు షురూ మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపడం మొదలయ్యాయి. దీనికితోడు నియోజకవర్గంలో తనను మహేందర్ రెడ్డి తిరగనివ్వడం లేదని, తన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని అంతర్గతంగా కొండా సీరియస్ కావడానికి ప్రధాన కారణమైంది. ఈ వైరం కాస్త ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో కారుకు గుడ్‌బై చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కొండా ప్రధాన అనుచరుడు పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కొండానే ఎందుకు? ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. వీరు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్లయిన ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లను ప్రభావితం చేయడం కష్టం. అలాగే టీఆర్ఎస్ ఓటర్ల సంఖ్యా బలం అధికంగా ఉండటంతో.. తమకు ఓటమి తప్పదని వారు భావిస్తున్నారు. పైగా క్యాంపుల నిర్వహణ డబ్బులతో ముడిపడి ఉన్న వ్యవహారం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నేతలు పోటీ చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం, తన రాజకీయ శత్రువుగా భావిస్తున్న మహేందర్ రెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉండడంతో కొండా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో పట్టు ఉండటంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన.. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారని పార్టీ కూడా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వీలుంది. ఒకవేళ విశ్వేశ్వర్‌రెడ్డి కాకపోతే ఆయన సతీమణి సంగీతారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. -
కొంప ముంచిన ‘కోటరీ’
సుదీర్ఘ రాజకీయ అనుభవం... పోల్ మేనేజ్మెంట్లో దిట్ట... ఎన్నికలకు ముందు అందివచ్చిన అధికారం... నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి... కేసీఆర్ చరిష్మా.. కారు జోరు... ఇవేవీ తాండూరులో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఓటమిని నిలువరించలేకపోయాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేసిన నాయకుడి ముందు ఈయన రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఏమాత్రం పనిచేయకుండాపోయింది. మహేందర్‌రెడ్డి చుట్టూ ఉన్న కోటరీయే దీనికి ప్రధాన కారణమని అటు నియోజకవర్గంతో పాటు ఇటు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రజలు, క్షేత్రస్థాయి నాయకులు కొంతకాలంగా మహేందర్‌రెడ్డిని నేరుగా కలిసే అవకాశం లేకుండా పోయింది. తన చుట్టూ ఎప్పుడూ ఉండే నలుగురైదుగురు నాయకులు వ్యవహరించిన తీరు కారణంగానే ఆయన ప్రజలకు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. మంత్రిగా చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలు తప్పుపట్టకపోయినా, కనీసం ఆయన్ను కలవాలంటే కూడా కష్టమైందనే భావనతోనే ఓట్లు వేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోటరీతో పాటు మరికొన్ని చిన్నా చితకా కారణాలు కూడా మాజీ మంత్రి ఓటమికి కారణాలయినప్పటికీ ప్రజలకు దూరంగా చుట్టూ ఉన్న నలుగురితోనే కార్యకలాపాలు నడపడమే ప్రధాన కారణమైందని తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం ఎందుకో..? మహేందర్‌రెడ్డి ఓటమికి మరికొన్ని అంశాలు కూడా కారణమయ్యాయి. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తరఫున పి.మహేందర్‌రెడ్డి అనే మరో నాయకుడు బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లు మహేందర్‌రెడ్డి కావడం, ఇద్దరి గుర్తులు (కారు, ట్రక్కు) పోల్చుకోలేని విధంగా ఉండడంతో ట్రక్కు గుర్తుకు 2,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. మహేందర్‌రెడ్డి ఓడిపోయింది కూడా కేవలం 2,875 ఓట్లతోనే. రాజకీయ వ్యూహంలో భాగంగా తన పేరున్న వ్యక్తితో నామినేషన్ వేయించి తన ఎన్నికల గుర్తుతో సామీప్యత ఉన్న గుర్తు వచ్చేలా ప్రత్యర్థి పోటీలో పెట్టినప్పటికీ దాన్ని సరిగ్గా గ్రహించడంలో, ఈ విషయాన్ని తన కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఇదే ఆయన పుట్టి ముంచింది. దీనికి తోడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పైలెట్ రోహిత్‌రెడ్డిపై వ్యవహరించిన తీరు ఆయనపై సానుభూతి పెరిగే విధంగా చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రజల్లోకి వస్తున్న నాయకుడిపై కేసులు పెట్టించడం, వేధింపుల కారణంగా రోహిత్‌కు నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై కూడా ప్రజల్లో సదాభిప్రాయం లేదు. పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా గులాబీ నేతలు అక్రమరవాణా చేస్తున్నా మంత్రి హోదాలో ఉండి కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇందుకు కూడా తన చుట్టూ ఉన్న కోటరీననే చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది. మొత్తంమీద కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు... ఎన్నికల నిర్వహణలో ఘనాపాటీగా పేరుతెచ్చుకున్న మహేందర్‌రెడ్డి ఈసారి ఓట్ల బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టారు. ఓటమిని మూటగట్టుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాంతించిన మహేందర్‌రెడ్డి ఓటమికి అనేక కారణాలున్నాయి. తన రాజకీయ జీవితానికి పునాది వేసిన టీడీపీని వీడి.. 2014 ఎన్నికల వేళ టీఆర్ఎస్లో చేరారు. అప్పటినుంచి ఈయనకు తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని భావించారు. కానీ ద్వితీయశ్రేణి నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. తాండూరు నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కుటుంబీకులను, బీజేపీ టికెట్ ఆశించి పార్టీ వీడిన రమేష్‌కుమార్‌ను టీఆర్ఎస్లో చేర్చుకున్నప్పటికీ.. ఎన్నికల్లో వీరి ప్రభావం ఏమీ లేకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రజల సమస్యలను నేరుగా వినే సమయం ఇవ్వకపోవడం, ఏ పని కోసం వెళ్లినా.. కిందిస్థాయి నాయకులకు చెప్పాలని సూచించడం వంటివి మహేందర్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి మహేందర్‌రెడ్డి 6 సార్లు పోటీ చేసి.. 4 సార్లు విజయం సాధించి, 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో భాగంగా గత మూడు నెలలుగా మంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. రూ.2 వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశానంటూ ఆత్మస్తుతి చేసుకోవడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. చుట్టూ ఉన్న ఆ నలుగురు చెప్పిందే విని గెలుస్తామనే ధీమాకు వచ్చేశారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పసిగట్టలేకపోయారు. ఫలితంగా ఓటమిని మూటగట్టుకుని కుంగిపోతున్నారు. ఇటీవల తాండూరులో జరిగిన ప్రజాశీర్వాద సభలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినా.. ఓటర్లు మాత్రం ప్రతికూల తీర్పు ఇచ్చారు. -
గులాబీ ప్రభంజనంలో కీలక మంత్రులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ అంతటా గులాబీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ.. పలువురు ఆపద్ధర్మ మంత్రులకు మాత్రం ఎదురుగాలి వీస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్రావు ఓటమిపాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలవ్వడం గమనార్హం. కొల్లాపూర్‌లో మరో సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ములుగులో అజ్మీరా చందూలాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం భుపాలపల్లిలో మధుసూదనాచారిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి హోరాహోరీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది. ఇక, ఇతర కీలక మంత్రులు భారీ విజయాల దిశగా సాగుతున్నారు. ఎప్పటిలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆయన మెజారిటీ లక్షదాటడం కొత్త రికార్డులు సృష్టించింది. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో 70వేలకుపైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు మంచి ఊపుతో ఉన్నారు. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్ 30వేలకుపైగా మెజారిటీతో గెలుపొందగా.. పద్మారావు మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
అడ్డుకున్న వారే ఒక్కటయ్యారు..
సాక్షి, మద్దూరు (కొడంగల్):‘పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 1.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ భావించారు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పథకాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు. ఇక కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా అడ్డుతగుతున్నారు.. ఇప్పుడు వీరిద్దరూ ఏకమై ఓట్ల అడగడానికి వస్తున్నారు.. జాగ్రత్తా! మన బతుకలను ఆగం చేసే కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమి కొట్టండి..’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 14 ఏళ్ల సుదీర్ఘపోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వకపోయినా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తదితర పథకాలను పెట్టారని వివరించారు. గతంలో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గతంలో పాలమూరును దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసునని కేటీఆర్ అన్నారు. అయినా మళ్లీ మాయమాటలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని జిల్లాలోని రెండు స్థానాల్లో బరిలోకి దిగారని విమర్శించారు. ఇక్కడి ప్రజల బతుకులను ఆగం చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను ఓడించడానికి మహాకుటమిని ఏర్పాటుచేసుకున్న వారి సీట్ల కుంపటే ఇంకా ముగియలేదని ఎద్దేవా చేశారు. నామినేషన్ల పూర్తయినా వారి పంచాయతీ మాత్రం తెగడం లేదని.. ఆ పంచాయతీ తెగేలోగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తాము అధికారంలోకి ఉన్న నాలుగేళ్లలో 87వేల ప్రభుత్వా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 38 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది వాస్తవం కాదా, రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 700 గురుకులాలు ఏర్పాటుచేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక తొమ్మిదేళ్ల పాటు రేవంత్‌రెడ్డికి అధికారం ఇచ్చిన కొడంగల్ ప్రజలు.. ఒక్కసారి పట్నం నరేందర్‌రెడ్డి గెలిపించి కారులో అసెంబ్లీకి పంపించాలని కోరారు. అలా చేస్తే కొడంగల్‌ను దత్తత తీసుకుని ఐదేళ్లలో సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో పాటు నరేందర్‌రెడ్డి అండగా ఉండి ఇన్నేళ్లు వివక్షకు గురైన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి సంక్షేమానికి రూ.42 వేల కోట్లు ఖర్చు చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటేనని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ఉద్యమించితెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశవపెట్టిన రైతుబంధు, రైతు భీమా పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయం తెలిసిందే అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కేసీఆర్ పథకాలపై చర్చ జరుగుతుందన్నారు. డిసెంబర్ 7న కారు గుర్తుకు ఓట్లు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఈ ప్రాంతానికి జూరాల ద్వారా నీళ్లు ఇవ్వాలని కోయిలకొండ రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తే ఇదే మండలంలోని బావాజీ ఆలయం దగ్గర సమావేశం నిర్వహించి రిజర్వాయర్‌ను రాకుండా చేసింది రేవంత్‌రెడి అని ఆరోపించారు. కోయిలకొండలో రిజర్వాయర్ నిర్మాణం జరిగితే మద్దూరు మండలంలోని అన్ని బోర్లు రీచార్జ్ అయ్యేవన్నారు. ఇక్కడి ప్రజల కడుపు కొట్టి రూ.కోట్లు సంపాదించే రేవంత్‌రెడ్డిని ఓటు ద్వారా తరిమికొట్టాలని కోరారు. కొడంగల్ ఓటర్లు అమాయకులు కాదని.. తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి కేసీఆర్ ఆశీర్వాదంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాష్, ఎంపీపీ సంగీతశివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు సలీం, బాల్‌సింగ్‌నాయక్, జగదీశ్వర్‌రెడ్డి, వీరేష్‌గౌడ్, సతీష్‌ముదిరాజ్, పున్నంచంద్ లాహోటి, శివకుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేతల అడ్డా.. చేవెళ్ల గడ్డ
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రసిద్ధి గాంచింది. ఓటర్లలో చైతన్యంలోనూ, జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులను అందించడంలోనూ విశిష్టమైన గుర్తింపు పొందింది. ఒక నియోజకవర్గం నుంచి ఒక్కరో ఇద్దరో ఎమ్మెల్యేలు ఇతర నియోజకవర్గాలకు ఎన్నికవుతుండడం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సబితారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, యాదవ్‌రెడ్డిలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే. చేవెళ్ల గడ్డ రాజకీయ నాయకుల అడ్డాగా ప్రత్యేకత చాటుకుంటోంది. సాక్షి, చెవెళ్ల : పట్లోళ్ల సబితారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెం దినవారు. ప్రస్తు తం మహేశ్వరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పి. ఇంద్రారెడ్డి సతీమణి ఈమె. 2000 ఏప్రిల్ 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. చేవెళ్ల నియోజకవర్గ చరిత్రలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి మొదటి సారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొంది వైఎస్సార్ మంత్రి వర్గంలో భూగర్భజలవనరుల శాఖమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు చేవెళ్ల రిజర్వు అయ్యింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని తప్పని పరిస్థితులలో వదిపెట్టాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సూచనమేరకు జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంనుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన మంత్రివర్గంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో పోటీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడ. మేనమామ దివంగత ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో 1994లో టీడీపీ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో గెలుపొందారు. ఆ తరువాత 1999లో వరుసగా రెండోసారి గెలిచారు. 2004లో ఓటమి చెందారు. తిరిగి 2009లో 2014లో విజయం సాధించారు. తెలంగా ణ రాష్ట్రంలో తొలి రవాణశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాను శాసించే నాయకునిగా ఎదిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా, జిల్లా రాజకీయల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారవేత్త అయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామం. ఈయన సికింద్రాబాద్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత వ్యాపారవేత్తగా మారి బోర్‌వెల్స్ పరికరాలు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించారు. స్నేహితుడిగా ఉన్న అప్పటి ఎమ్మెల్యే పి.ఇంద్రారెడ్డితో విభేదించి రాజకీయాలలో చేరారు. తెలుగుదేశం పార్టీనుంచి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి 1999లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికలలో సబితారెడ్డిపై కూడా ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సాఆర్ సూచనమేరకు మేడ్చల్ నియోజకవర్గంనుంచి 2009లో పోటీచేసి మొదటిసారిగా విజయం సాధించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కొరగాని సాయన్న రత్నం మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజ ర్వు కావడంతో టీడీపీలోకి వచ్చారు. ఇంద్రారెడ్డి అనుచరుడిగా ఉండడంతో శంషాబాద్ జెడ్పీటీసీగా పోటీచేయించి జిల్లా పరిషత్ పదవిని కట్టబెట్టారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన వ్యక్తి కాలె యాదయ్య. స్థానిక సంస్థల్లో ఎంపీపీ. జెడ్పీటీసీ స్థాయినుంచి వచ్చిన ఆయన చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రత్నంపై గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పట్నం మహేందర్‌రెడ్డి స్వయాన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కొండగల్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. 2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి మరోసారి అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా కలిసిన కొండగల్‌లో కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ విధంగా ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ అశించినా టికెట్ రాక రెబల్‌గా పోటీ చేస్తున్న పీ. కార్తీక్‌రెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తియే. -
ప్రజల అభ్యున్నతే టీఆర్ఎస్ లక్ష్యం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ప్రజల ప్రగతే టీఆర్ఎస్ లక్ష్యమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల టీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం రాత్రి హిమయత్‌నగర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథ«కాలతో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషిచేశారని అన్నారు. కాలే యాదయ్యను గెలిపించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ విజయన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మళ్లీ మంత్రిగా తానున ఉంటానని, చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషిచేస్తానని, గ్రామాలభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తానని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేస్తే పార్టీ అభ్యర్థి విజయం తథ్యమని అన్నారు. వృద్ధులకు ఫించన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, పెట్టుబడి సహాయం గ్రామీణ రోడ్లు అభివృద్ధి, ఇంటింటికి నల్లా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్‌రెడ్డి, జిల్లా మత్స్యకార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటపూర్ బాల్‌రాజ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ శ్రీహరియాదవ్, పీఏసీఏస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మంగలి పెంటయ్య, డప్పు ఆనంద్, యాదయ్య, నాయకులు గుండుగోపాల్, పాండుగౌడ్, మంగలి రాములు, అద్వాని, అలకుంట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పట్నం బ్రదర్స్‌ను బొంద పెడతా: రేవంత్
సాక్షి, వికారాబాద్ : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కొడంగల్‌లో గెలిచేది తానేనంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. పట్నం బ్రదర్స్(పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి)ను గుంత తవ్వి బొంద పెడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్ల పాటు వారిద్దరిని రాజకీయ సన్యాసం చేయిస్తానంటూ వ్యాఖ్యానించారు. కొడంగల్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నినదించారు. కేసీఆర్, కేటీఆర్‌లు తనను ఏమీ చేయలేరని, తనపై గెలిచే దమ్ము ఎవరికీ లేదంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చేది మేమే.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతమొందించి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీపీసీసీ పదవి పొందడం ద్వారా ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అవకాశం దక్కిందన్నారు. తన జీవితం ఎప్పుడూ ప్రజా సేవకే అంకితమని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. మహేందర్ తాండూర్ నుంచి పోటీ చేయనుండగా, నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి బరిలో దిగనున్నారు. -
దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి
మహబూబ్‌నగర్ , కోస్గి: పోరాడి సాధించుకున్న తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేస్తూ దేశం గర్వించేలా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలో చంద్రవంచ, ముక్తిపాడ్, బొలుగోనిపల్లి, పోతిరెడ్డిపల్లి, కోస్గి, కడంపల్లి, మాసాయపల్లి, అమ్లికుంట్ల, మల్రెడ్డిపల్లి, సంపల్లి గ్రామాల్లో వారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రులు మాట్లాడారు. కాగా, కార్యక్రమాల్లో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా పాల్గొని కోస్గిలో జరిగిన సభలో మాట్లాడారు. ఆ తర్వాత చివరగా సంపల్లిలో జరిగిన సభలో మాత్రం ఆయన పాల్గొనకుండా వెళ్లిపోయారు. అభివృద్ధిని అడ్డుకోవద్దు.. కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిపుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ హుందాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాల కోసం అభివృద్దిని అడ్డుకుంటే పుట్టగతులుండవన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. పాలమూర్ జిల్లాకు రోడ్ల కోసం గత పాలకులు రూ.2 కోట్లు అందించని దుస్థితి ఉంటే ప్రస్తుతం కేవలం పాలమూర్ జిల్లాకే రూ.140 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గం కోసం రూ.50 కోట్లు ఇచ్చామన్నారు. మరో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అడుగడుడున అభివృద్ధిని అడ్డుకుంటూ తన రాజకీయ ఉనికి కోసం పాకులాడే రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమేనని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నారని ఇందులో భాగంగనే కొడంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు. కోస్గి బస్ డిపోకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర పార్టీలో ఉండి తెలంగాణ రాకుండా అడ్డుకున్న దద్దమ్మలు నేడు రాజకీయ మనుగడ కోసం పార్టీ మారి అభివృద్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌లో చేరి ఏం చేస్తారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాజకీయాల కోసం ప్రజల్ని మభ్యపెట్టి మాయమాటలతో కాలం గడిపాయని, కేసీఆర్‌ది మాటలు చెప్పేతత్వం కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఏనాడు అభివృద్ది కోసం పని చేయలేదని తన జీవితమంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, దందాలకే పరిమితమైందని విమర్శించారు. ఇటు తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన సొంత దందాల కోసం తిరుగుతున్న రేవంత్‌రెడ్డి అభివృద్ధి్దని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అభివృద్ధి్దకి నిరంతరం కృషి రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించానని, గేల్ సంస్థ సహాకారంతో జూనియర్ కళాశాలను నిర్మించానన్నారు. బస్‌డిపో ఏర్పాటు కోసం సొంతంగా భూమి కొనుగోలు చేసి తన ఎమ్మెల్యే నిధుల్ని కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా ర్యాలీలు మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలు పోటాపోటీ ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. ఈ మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి ఇరువర్గాలను వేరు చేయడంతోపాటు శంకుస్థాపనకు ముఖ్యులనే అనుమతించారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే వాహన శ్రేణి ఓ వైపు, మంత్రుల కాన్వాయ్ ఓ వైపు వెళ్తుండడంతో పోలీసులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. బొల్వోన్‌పల్లి దగ్గర ఎమ్మెల్యే వెంట మమ్మల్ని ఎందుకు అనుమతించడంలేదంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్, నాయకులు అంజయ్య, రహీం, ఇద్రీస్, నరేందర్ తదితరులు సీఐ రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. -
అన్ని కులాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సిద్ధిస్తుందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అన్ని కులాలకు రూ. 4 వేల కోట్ల నిధులు కేటాయించి రికార్డు సృష్టించారని అన్నారు. మండలంలోని అలియాబాద్ చౌరస్తా మల్లారెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం జంట నగరాల కురుమ సంఘం 39వ దసరా–దీపావళి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గి మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కురుమ, గొల్ల, యాదవుల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లతో గొర్రెలను అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని ఒక్కో కులానికి హైదరాబాద్‌లో రూ. 10 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో సంక్షేమ భవనాలు నిర్మించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి హెచ్.ఎం.రేణప్ప మాట్లాడుతూ.. కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కురుమల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్‌తో జరుగుతున్న బీసీ సంక్షేమ సమావేశంలో కురుమల సమస్యలు, రిజర్వేషన్, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తానని అన్నారు. ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్లలో యాదవ, గొల్లలతో పోలిస్తే కురుమలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో ఒగ్గు కళాకారులు, మహిళలు పలు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.చంద్ర«శేఖర్ యాదవ్, పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నాగేశ్, కార్పొరేటర్లు కన్న చైతన్య, రావుల విజయ జంగయ్య, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మహిళా అధ్యక్షురాలు దయ్యాల బాలమణి, కురుమ సంఘం జంటనగరాల అధ్యక్షుడు నారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్క ప్రభాకర్‌గౌడ్, తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ
హైదరాబాద్: దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలాంను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. -
హామీలు నెరవేర్చితీరుతాం
ఇబ్రహీంపట్నం: పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని..ఇందులో రాజీపడే ప్రసక్తి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మండల పరిధిలోని శేరిగూడలో రూ.70లక్షల వ్యయంతో నిర్మిం చిన ఉప్పరిగూడ పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు నెరవేర్చి తీరుతామని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్ల రుణమాఫీని ప్రకటించిందని, లక్ష పైచి లుకు రైతులకు రుణమాఫీ పథకం వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడత రుణమాఫీ కింద రూ.253 కోట్లమేర అందజేసినట్లు చెప్పారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా గ్రామానికో చెరువును వినియోగంలోకి తెస్తామన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంక్‌లకు దీటుగా ఎదగాలని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పండ్ల తోటలు, పూల తోటల పెంపకంపై ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఓ రాందాస్, ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య, కర్నాటి రమేష్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ ఈర్ల వెంకట్‌రెడ్డి, ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఫొటో లేదని రగడ... అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు ముద్రించలేదంటూ సీఈఓ గణేశ్‌ను నిలదీశారు. అంతటితో ఆగకుండా సీఎం ఫొటో లేని ఫ్లెక్సీని తొల గించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. తోబుట్టువు మరణించినా విధుల్లోకి.. ఉప్పరిగూడ పీఏసీఎస్ నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పీఏసీఎస్ సీఈఓ గణేశ్ తోబుట్టువు మైసమ్మ గురువారం ఉదయం మరణించింది. అంత్యక్రియలు కూడా కాలేదు. ఇదే రోజు సహకార సంఘం భవనం ప్రారంభం ఉండడంతో బాధను దిగమింగుకుని ఆయన విధులకు హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.