ఇరువురు కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన పట్నం, రోహిత్‌రెడ్డి
సాక్షి, తాండూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఈ ఇద్దరు నేతలకు సరితూగుతోంది. నెల క్రితం వరకు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకొన్న వారు మూడు రోజుల నుంచి ఒకే వాహనంలో కలిసి తిరుగుతున్నారు. దీంతో కొందరు సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు నేతల కోసం గొడవలు, ఘర్షణలు పడి జీవితాలను ఫణంగా పెట్టిన నాయకులు ఉన్నారు. రెండు మూడు రోజులుగా ఇద్దరు నేతల ఒకే వాహనంలో వెళ్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడం గమనార్హం.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్‌రెడ్డి, పంజుగుల రోహిత్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏడాది క్రితం మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని ఓడించేందుకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహేందర్‌రెడ్డిని తాండూరులో ఓడించి షాబాద్‌కు తరిమి కొట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
దీంతో అసెంబ్లీ ఎన్నికలలో మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో మహేందర్‌రెడ్డి పైచేయి సాధించారు. ఎన్నికల తర్వాత కూడా ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో కొనసాగింది. అయితే అనూహ్యంగా రోహిత్‌రెడ్డి రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటి నుంచి ఒకే పార్టీలో ఇద్దరు కొనసాగుతున్నారు.
ఎన్నికలకు ముందు.. తర్వాత..
తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడి ఎన్నికలకు ముందు వరకు మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసి ఓటర్లను ఆకర్షించారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన తర్వాత వచ్చిన విమర్శలను అనుకూలంగా మార్చుకునేందుకు కొత్త వ్యూహం రచించారు. మహేందర్‌రెడ్డిని విమర్శించిన రోహిత్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
మూడు రోజులుగా ఒకే వాహనంలో..
ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గతంలో చేసుకున్న విమర్శలను ప్రతి విమర్శలను పక్కన పెట్టారు. తాండూరులో ఏ కార్యక్రమం జరిగిన ఇద్దరు నేతలు ఒకే వాహనంలో వెళ్లి హాజరవుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరులోని తన నివాసంలో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆయన నివాసానికి చేరుకొని ఒకే వాహనంలో ఇద్దరు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరిందా లేకా పార్టీ అధిష్టాన నేతల ఒత్తిడితో కలిశారా పర్యటిస్తున్నారా అనేది స్థానికంగా చర్చనీయాంశమైంది.
సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు
టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న సీనియర్ నేతలు ఇద్దరు నేతల వ్యవహార శైలిని తప్పు పడు తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇద్దరు నేతల కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు గొడవలు, ఘర్షణలు పడ్డారని, ఈ విషయంలో పలు పోలీసు కేసులు నమోదు కావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏ పార్టీలో ఉన్న విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని అవకాశవాద రాజకీయాలను సహించబోమని సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment