సాక్షి,తాండూరు(వికారబాద్): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తాండూరు నుంచి పోటీ చేస్తానని, ఈమేరకు ఇక్కడి ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తంరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను తాండూరులో ఉంటున్నానని, నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానన్నారు. దీంతో ఈ స్థానాన్ని వదులుకొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని, ప్రజల అభీష్టం మేరకు పోటీకి దిగుతానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ తాను విజయం సాధిస్తానని ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు సైతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
పార్టీ కేడర్ పటిష్టంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా తనకు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మంత్రి పదవి రానుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. అది సీఎం చేతిలో ఉందని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలకు ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు. తాండూరు మున్సిపాలిటికి ఐదేళ్లపాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగుతారని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత చైర్‌పర్సన్ మార్పు ఉంటుందని గతంలో ప్రకటించిన విషయాన్ని విలేకర్లు గుర్తు చేయగా.. అది అప్పటి పరిస్థితుల మేరకు టెన్షన్‌లో తీసుకున్న నిర్ణయమని కొట్టిపారేశారు. అనంతరం వీరశైవ సమాజం ప్రతినిధులకు స్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షల నిధులను కేటాయించి ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బొబ్బిలి శోభరాణి, ప్రవీణ్‌గౌడ్, రామకృష్ణ, వెంకన్నగౌడ్, నాయకులు జబేర్‌లాలా, వడ్డె శ్రీనివాస్, బిర్కట్ రఘు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment