సాక్షి, సిద్దిపేట: ‘నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటైనా ప్రజలు నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు.. నిధులన్నీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది.. నియామకాలూ సీఎం కుటుంబానికే పరిమితమయ్యా యి’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు.
అనంతరం సభలో స్మృతిఇరానీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడేందుకే ఈ యాత్ర చేపట్టారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అనేక నిధులిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని ప్రధాని త్వరలో పున: ప్రారంభిస్తారు. దేశం లోని 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా ఉచితంగా రేషన్ బియ్యాన్ని కేంద్రం అందిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ 20 నెలలైనా అమలు కావడం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎంఐఎంను చూసి భయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు కారున్నా.. దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది’అని కేంద్ర మంత్రి విమర్శించారు. సంజయ్ చేపట్టిన తొలిదశ యాత్ర దిగ్విజయవంతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండిని అభినందించారని స్మృతిఇరానీ వివరించారు.
ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం..
పాదయాత్రలో ప్రజల సమస్యలు, కష్టాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందని.. 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం ఎవరైనా ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం పెడతారని బండి సంజయ్ అన్నారు. ‘రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. టీఆర్‌ఎస్ గడీల పాలనను బద్ధలుకొట్టేందుకు ఇదే చివరి పోరాటం కావాలి. ధరణి పోర్టల్ టీఆర్‌ఎస్‌కు భరణిగా.. పేదలకు దయ్యంలా మారింది.
పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. మాట్లాడితే కేసీఆర్ ధనిక రాష్ట్రమని అంటున్నారు.. మరి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదు. రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు. పోడు భూముల సమస్యతో గిరిజనులు అల్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ పాలనలో హిందువులు గణేష్ ఉత్సవాలను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. బీజేపీ ఏరోజు సభ పెడితే.. కాంగ్రెస్ అదే రోజు మీటింగ్ పెడుతోంది. దాని కథేందో వారికే తెలియాలి.
యాత్రలో 15వేలకు పైగా వినతిపత్రాలు వచ్చాయి. వాళ్లందరి తరఫున పోరాటానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌ను. ఈటల రాజేందర్ గెలుపు తరువాత మళ్లీ మలిదశ పాదయాత్ర ప్రారంభిస్తా’అని బండి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా సంగ్రామయాత్ర తొలివిడత పాదయాత్రను విజయవంతంగా ముగించిన బండి సంజయ్ ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు.
దళితుల అభ్యున్నతికి కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులను వెచ్చించింది. స్టాండప్ ఇండియా స్కీం పేరుతో దళితులను పారిశ్రామికవేత్తలను చేశాం. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులిచ్చాం. కేంద్రం.. ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులకు ఆ పథకాన్ని అమలు చేయడం లేదు.
ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటే.. రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. సొంత ఇంటి కోసం కేసీఆర్ ప్రగతిభవన్ నిర్మించుకున్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పేదలకు మాత్రం ఉండటానికి సొంత ఇళ్లు మాత్రం నిర్మించి ఇవ్వరు. – స్మృతి ఇరానీ
హుజూరాబాద్‌లో ఐదు నెలలుగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలుకావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగమే అమలవుతోందని మాజీ మం త్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ‘మద్యం ఏరులై పారుతోంది. మనుషులకు విలు వ కట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నేను గెలవొద్దని కేసీఆర్ ఆదేశిస్తే.. ఆయన బానిసలు అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న హుజూరాబాద్‌లో కురక్షేత్ర యుద్ధం జరగబోతోంది.
కేసీ ఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరి గే యుద్ధం ఇది. టీఆర్‌ఎస్ ఎన్ని సర్వేలు చేసినా.. 75 శాతం ఓట్లు బీజేపీకే వస్తున్నయ్. ఎన్ని కుట్ర లు చేసినా వాళ్ల ఆటలు సాగడం లేదు’అని అన్నా రు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతోందని బీజేపీ శాసన సభ పక్షనేత రాజాసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ‘బంధు’పథకం అమలు చేయా లని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేవారు. ఒక పక్క ధనిక రాష్ట్రం అని చెబుతూ.. మరోపక్క ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని విమర్శించారు. ఈ యాత్ర ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment