
చదువుతున్నారా? పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా? అని ఏఐ సాయంతో ఆరా
ధ్రువపత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు సేకరణ
కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన భారత ఎంబసీ
కన్సల్టెన్సీల సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రధాన వర్సిటీలపై దృష్టి
అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెల్స్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది.
తలనొప్పిగా ఓపీటీ
అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు.
ఏఐతో పటిష్టమైన డేటా
ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు.
కన్సల్టెన్సీలపై నిఘా
అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది.
పత్రాలన్నీ చూస్తున్నారు
ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది.
– విక్రమ్ శశాంక్, ప్రవాస భారతీయుడు.
ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి?
రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు.
– అఖిలేష్ పూనాటి, అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన విద్యార్థి.
హెచ్–1బీకీ తిప్పలే
ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే.
– మంజులా రాయ్, హెచ్–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని.
అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు
యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య
న్యూయార్క్ వర్సిటీ న్యూయార్క్ 27,247
నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ బోస్టన్ 21,023
కొలంబియా వర్సిటీ న్యూయార్క్ 20,321
అరిజోనా స్టేట్ వర్సిటీ టెంపే 18,430
యూనివర్సిటీ ఆఫ్
సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ 17,469.