ట్రంప్ వచ్చాక వీసాల జారీలో గందరగోళం
అమెరికా కాన్సులేట్ విభాగ ముఖ్య అధికారి డాక్టర్ ముల్లిగన్
చేబ్రోలు (పొన్నూరు): అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వీసాల జారీ విషయంలో గందరగోళ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఉండదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ విభాగ ముఖ్య అధికారి డాక్టర్ ముల్లిగన్ అన్నారు. అమెరికాలో ప్రస్తుత పరిణామాలు, అక్కడ ఎంఎస్ చేసేందుకు ఉన్న అవకాశాలు, వీసా దరఖాస్తులో భారతీయ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది.
భారతీయ విద్యార్థులకు వీసా జారీ చేసే కాన్సులేట్ విభాగ ప్రధానాధికారి ముల్లిగన్‌తో పాటు ఆయన బృందం పాల్గొన్నారు. అమెరికా యూనివర్సిటీల్లో ఎంఎస్ కోర్సు చేసేందుకు ఐ20 లెటరు అందుకున్న తర్వాత విద్యార్థులు వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముల్లిగన్ వివరించారు. ట్రంప్ అధికారం చేపట్టాక వీసాల జారీలో కొత్త నిబంధనలతో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మరో కన్సోలర్ అ«ధికారి లారొన్ వినే, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్, వైస్ చైర్మన్‌లు లావు రత్తయ్య, శ్రీకృష్ణదేవరాయలు, వీసీ తంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.