American University
-
Israel-Hamas war: అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు. -
భద్రత ఉంటేనే అమెరికా చదువులకు!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తమ పిల్లలను పంపే తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడి భద్రతపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీలకన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల ఉదంతాల నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్త కనిపిస్తోంది. ఈ క్రమంలో సవాలక్ష సందేహాలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయని అమెరికా వర్సిటీల్లో మన విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో సాయం చేసే కన్సల్టెంట్లు చెబుతున్నారు. చేర్చాలనుకునే వర్సిటీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుగా ఓ వ్యక్తిని పంపి అక్కడి పరిస్థితుల గురించి వాకబు చేయిస్తున్నారు. 2024 అడ్మిషన్ల ఫలితాలు వెల్లడువుతున్న తరుణంలో ఇలాంటి భయాలు తల్లిదండ్రుల్లో ఎక్కువయ్యాయని కన్సల్టెంట్లు అంటున్నారు. అమ్మాయిలను అమెరికాలో పైచదువులకు పంపే తల్లిదండ్రులు మరింత ఎక్కువగా విచారణ చేయిస్తున్నారని బెంగుళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో ఆదర్శ ఖండేల్వాల్ తెలిపారు. ‘ప్రస్తుతం అడ్మిషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. 2024లో భద్రత అనేది ఒక ప్రధాన అంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్రైం రేటుపై వాకబు.. అమెరికాలోని ఏయే యూనివర్సిటీల పరిధిలో ఎంత క్రైం రేటు ఉంది? ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం పిల్లలను పంపే తల్లిదండ్రుల్లో నేరాలపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తొలిసారి దేశానికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని విదేశీ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి. షికాగో, బోస్టన్, ఇండియానా వంటి ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులతోపాటు అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా నివేదికలు ఇవే వెల్లడించడంతో ఈ ప్రాంతాలకు పంపాలంటే తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. సమస్యాత్మకం కాని వర్సిటీల వైపే అమెరికన్ యూనివర్సిటీలకు వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువ సమస్యాత్మకమైన వాటినే భారతీయ విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీనిపై సమగ్ర అవగాహన కలిగాకే విదేశీ చదువులపై ప్రణాళిక రచిస్తున్నారని విదేశాల్లోని స్టడీ కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు కరణ్ గుప్తా తెలిపారు. పెద్ద నగరాలు లేదా తక్కువ సమస్యాత్మకమైనవిగా గుర్తించే యూఎస్ వర్సిటీల ఆఫర్లను మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఫ్లోరిడాలోని ‘చి’ యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతంపై సమగ్ర సమాచారం సేకరించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆ వర్సిటీలో కాకుండా ఎన్‌వైయూ యూనివర్సిటీ మంచిదని అందులో చేర్పించారు. 95% కేసుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో కన్సల్టెంట్ గుప్తా తెలిపారు. ఆరిజోనా, ఒహాయో, టెక్సాస్, లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, డాలస్ వంటి ప్రాంతాలకు తమ పిల్లలను పంపాలనుకొనే తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు కోరుతున్నారు. వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో చేరాలని ఇష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం దానికి బదులుగా బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ను తీసుకోవాలని పట్టుబట్టారు, విద్యార్థి మేనమామ అక్కడ నివసిస్తున్నాడని, అది భద్రత కల్పిస్తుందని భావించారు. కన్సల్టెన్సీల్లోనూ ఆందోళన భారతీయ విద్యార్థులపై ఆందోళనల నేపథ్యంలో కన్సల్టెన్సీలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కన్సల్టెన్సీలన్నీ కలిపి తొలిసారిగా విద్యార్థుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాయి. ముందుగా విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆన్లైన్లో ఆయా ప్రదేశాల సమాచారం అందుబాటులోకి తేవడంతోపాటు అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రుల బృందాలు కూడా ఆయా వర్శిటీలను సందర్శించేందుకు, అక్కడి సీనియర్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. -
ఐదు నిమిషాల ఛార్జ్‌తో 482 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోని చాలా దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న కొత్త ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేదు, కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ఛార్జింగ్ కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి.. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధక బృందం ఓ సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే కావడం గమనార్హం. ఒక ఛార్జ్‌తో ఈ బ్యాటరీ 300 మైళ్లు లేదా 482 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో వినియోగంలో ఉన్న చాలా వాహనాలకు ఫాస్ట్ ఛార్జర్ అవకాశాలు ఉన్నప్పటికీ.. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే అమెరికన్ యూనివర్సిటీ బృందం రూపోంచిన బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవడం వల్ల వాహన వినియోగదారులకు సమయం చాలా ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధిత కంపెనీలు నార్మల్ హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి గంటల సమయం పడుతుంది. ఇలాంటి వాహనాలను ఉపయోగించాలంటే వినియోగదారుడు ముందుగానే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ అమెరికన్ పరిశోధక బృందం రూపొందించిన బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది, భారతదేశానికి ఈ బ్యాటరీలు వస్తాయా? వస్తే ఏ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తారనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది. వీటి గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నాము. -
అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసంకోసం వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్ కాన్సులేట్ పలు సూచనలు చేసింది. అమెరికాలో చదువు, ఆపై ఉద్యోగం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వెళ్తున్న విషయం విదితమే. అమెరికా వెళ్లే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీల ఎంపిక ఎలా? వీసా దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వీసా ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్సెన్ మాట్లాడుతూ, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారని, అమెరికాలో చదువుకుని స్థిరపడే వారి సంఖ్య ప్రతీయేటా పెరుగుతోందని ఆమె వివరించారు. వీసాల మంజూరులో... యూఎస్ వెళ్లే వారికి వీసా మంజూరులో ఆలస్యమవుతోందన్న ప్రశ్నకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి సమాధానమిస్తూ వీసాల జారీని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారికి అనుకున్న సమయంలోనే వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్లాట్లు విడుదలకాగానే బుక్ చేసుకోవాలని, వీసాకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధ్రువపత్రాలు చెక్ చేసిన తర్వాత, ఫింగర్‌ప్రింట్స్‌ను నమోదు చేసి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెక్ చేసిన వెంటనే వీసాను మంజూరు చేస్తున్నామని వివరించారు. వీసా స్లాట్ల బుకింగ్ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నాలుగు యూఎస్ కాన్సులేట్స్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్.. అమెరికాలో చదవాలనే విద్యార్థులకు ఉచితంగా ‘స్టడీ ఇన్‌ద యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ సుజనా మైరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నొవాటెల్ కన్వెన్షన్‌లో ఆగస్ట్ 26 ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫెయిర్ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమానాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎస్ఐఈఎఫ్.ఓఆర్జీ.ఐ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. అమెరికాలో 4,700 యూనివర్సిటీలు ఉన్నాయని, ఈనెల 26న నిర్వహించే ఫెయిర్‌కు 40 ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు యూనివర్సిటీ ప్రతినిధులు సమాధానమిస్తారన్నారు. ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా కనుక్కోవాలి? ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు సుజనా సమాదానమిస్తూ... అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని యూనివర్సిటీల వివరాలను అధికారికంగా వెబ్సైట్లలో ఉంచుతుందని చెప్పారు. జాయిన్ కావాలనుకున్న యూనివర్సిటీ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయో లేదో విద్యార్థులు చెక్ చేసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి అమెరికాకు చెందిన 8 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని.. వీటిలో సంప్రదించినా గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
అమెరికాలో ఉద్యోగావకాశాలు.. ఎస్ఎల్యూ నుంచి లెవెల్అప్ ప్రోగ్రాం
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్ఎల్యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్అప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎల్యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్బ్రెక్ట్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు. -
జాన్సన్ బేబీ పౌడర్ ఇక దొరకదు
న్యూజెర్సీ: చిన్నారుల నాజూకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని ఆకర్షించిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడాలో 2020 నుంచి ఈ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కమ్ పౌడర్లు కేన్సర్‌కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కోర్టులో 40 వేలకు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్లలో ఉండే అస్బెస్టాస్ అనే పదార్థం వల్ల కేన్సర్ సోకుతోందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకెక్కారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి)తో తయారు చేసిన పౌడర్‌ను విక్రయించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కేన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకునే టాల్కమ్ పౌడర్ అమ్మకాలనే నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్‌లో ఎలాంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. వివాదం ఎలా వెలుగులోకొచ్చింది ? జాన్సన్ బేబీ పౌడర్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పౌడర్ పూస్తే తమ బిడ్డల చర్మం మరింత మృదువుగా, పొడిగా ఉంటుందని ఎందరో తల్లులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. డైపర్లు వాడినçప్పుడు ఏర్పడే ర్యాష్‌ని కూడా ఈ పౌడర్ నిరోధించడంతో ఎంతోమంది తల్లుల మనసు దోచుకుంది. తాజాదనం కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పౌడర్ని వాడుతూ వస్తున్నారు. అందుకే కొన్ని దశాబ్దాలు ఈ పౌడర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2017లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌కి చెందిన మహిళ తాను సుదీర్ఘకాలం జాన్సన్ బేబీ పౌడర్ వాడడంతో ఒవేరియన్ కేన్సర్ బారిన పడ్డానంటూ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని స్పష్టం చేస్తూ కంపెనీకి 7 కోట్ల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కేన్సర్ కారకాలున్న పౌడర్ని అమ్ముతున్నందుకు మరో 34.7 కోట్ల డాలర్లను జరిమానాగా విధించింది. పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్‌తో దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, అండాశయ ముఖద్వార కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి. వాస్తవానికి 1957లో జాన్సన్ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తేలింది. కానీ దీర్ఘకాలం వాడాకే దుష్ప్రభావాలు బయటపడ్డాయి. -
అమెరికాలో విద్యావకాశాలపై ఎడ్యుకేషన్ ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం అక్కడి వర్సిటీలు వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించనున్నాయి. గుర్తింపు పొందిన వందకుపైగా యూఎస్ వర్సిటీలు, కాలేజీలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా సంభాషించడానికి ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా అవకాశం కల్పించనున్నారు. మాస్టర్స్ లేదా పీహెచ్డీ కోర్సులపై ఈ నెల 27న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఫెయిర్ జరగనుంది. ఇందులో పాల్గొనడానికి ( https://bit.ly/EduSAFair21EmbWeb) లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం సూచించింది. వచ్చే నెల 3న బ్యాచిలర్స్ కోర్సులపై.. బ్యాచిలర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం సెప్టెంబర్ 3న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెబ్ లింక్ (https://bit.ly/ UGEdUSAFair21 Emb Web) ద్వారా రిసిస్ట్రేషన్ చేసుకోవాలి. యూఎస్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నత విద్యాసంస్థలు ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొంటాయి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టొరల్ స్థాయిల్లో కోర్సులు అందిస్తున్నాయి. యూఎస్ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ యూఎస్ఏ విభాగం సలహాదారులతో ఈ ముఖాముఖి ఉంటుంది. అమెరికాలో చదువులు, ఫండింగ్, స్కాలర్షిప్లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖాముఖి సాయపడుతుంది. విద్యార్థి వీసాల గురించి యూఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికార వర్గాల నుంచి విద్యార్థులకు అవసరమైన సమాచారం లభించనుంది. పూర్తి వివరాల కోసం (https://drive.google.com/drive/floders/1 dcOlvRx6 AQkZGBU9 URf1 lblqMU&pXZMm) వీడియో లింక్‌ను సందర్శించాలని యూఎస్ కాన్సులేట్ సూచించింది. -
Corona Vaccine: గర్భంలోని మాయకు నష్టం లేదు
న్యూఢిల్లీ: కరోనా టీకాపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా గర్భిణులు ఈ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌తో గర్భానికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. గర్భంలోని మాయకు (ప్లాసెంటా) ఏమాత్రం ఇబ్బంది ఉండదని, అనుమానాలు అక్కర్లేదని వెల్లడించింది. ఈ వివరాలను అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. ‘ప్లాసెంటా అనేది విమానంలోని బ్లాక్‌బాక్స్ లాంటిది. గర్భంలో ఏవైనా పొరపాట్లు జరిగితే మాయలో మార్పులను గమనించవచ్చు. తద్వారా అసలేం జరిగిందో కనిపెట్టవచ్చు’ అని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ఫీన్‌బర్గ్ స్కూల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ గోల్ట్‌స్టీన్ చెప్పారు. కోవిడ్ టీకా ప్లాసెంటాను దెబ్బతీయదని అన్నారు. గర్భిణులు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించారు. తమ అధ్యయనం గర్భిణుల్లో కరోనా వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలను దూరం చేస్తుందని భావిస్తున్నట్లు పరిశోధకుడు ఎమిలీ మిల్లర్ చెప్పారు. అధ్యయనంలో భాగంగా 84 మంది కరోనా టీకా (మోడెర్నా లేదా ఫైజర్ టీకా) తీసుకున్న గర్భిణులు, 116 మంది టీకా కోసం తీసుకోని గర్భిణుల్లోని ప్లాసెంటాను పరిశీలించారు. టీకా తీసుకున్న గర్భిణుల్లో ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) వృద్ధి చెంది, మాయలోని పిండానికి కూడా బదిలీ అయినట్లు గుర్తించారు. అంటే కరోనా టీకాతో మాయలోని పిండానికి కూడా పూర్తి రక్షణ కలుగుతున్నట్లు నిర్ణయానికొచ్చారు. ఇక గర్భంతో ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకితే తల్లికి, గర్భంలోని బిడ్డకు మధ్య అసా«ధారణంగా రక్తప్రసారం జరుగుతున్నట్లు గమనించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందితే, రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తేల్చారు. కరోనా వ్యాక్సిన్‌తో తల్లికి, బిడ్డకు.. ఇద్దరికీ రక్షణే. సురక్షితమైన గర్భానికి వ్యాక్సిన్ దోహదపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. (చదవండి: మీ వద్ద కరోనా మందులు ఉన్నాయా.. మేము తీసుకుంటాం!) -
పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగం నుంచి పిల్లల్ని రక్షించేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా తాము సాగిస్తోన్న పోరాటంలో మరో కొత్త దశ ప్రారంభమైందని ఎఫ్‌డీఏ కమిషనర్ జెనెట్ వుడ్‌కాక్ పేర్కొన్నారు. దీంతో పిల్లల పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఫెడరల్ వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల ప్రకారం..12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను వేయాలని సిఫారసు చేసిన తరువాతనే అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రపంచంలోనే తొలిదేశంగా కెనడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా సైతం పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు 12 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 2 వేల మంది పిల్లలపై ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వేశారు. గతంలో కంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలో కోవిడ్ పై పోరాటం చేసే ప్రతిరోధకాలు ఉత్పత్తి అయినట్లు గుర్తించామని చిల్డన్ స్పెషలిస్ట్, ఫైజర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బిల్ గ్రుబెర్ తెలిపారు. కాగా, ఫైజర్-జర్మన్ బయోఎంటెక్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను వినియోగించాలని ఇటీవల యూరోపియన్ యూనియన్‌తోపాటు ఇతర దేశాలు వినియోగించుకోవాలని కోరాయి. చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
ఏపీ వైపు విదేశీ వర్సిటీల చూపు
సాక్షి, అమరావతి: పలు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు రాష్ట్రం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో తెస్తున్న విప్లవాత్మక మార్పులు, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఆయా వర్సిటీలను ఆకట్టుకుంటోంది. దీంతో రాష్ట్రంలో తమ వర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జియాటెక్ యూనివర్సిటీ, అలబామా స్టేట్ యూనివర్సిటీ, క్లెమ్సన్ యూనివర్సిటీ, అస్ట్రేలియాకు చెందిన మరో ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి. ఆయా వర్సిటీల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇవి ఒక కొలిక్కి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు రాష్ట్ర విద్యార్థులు విదేశీ విద్య సులభంగా పొందడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థికి సులభంగా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, అక్కడి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పరిశోధనల్లో బాగస్వాముల్ని చేయడానికి వారధిగా పనిచేసేలా విదేశీ విద్యా విభాగాన్ని రూపొందించారు. విదేశీ విశ్వ విద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు విదేశీ నిధులు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు పరిశోధన, విద్యా బోధన తదితర రంగాల్లో విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని 36 ప్రతిష్టాత్మక వర్సిటీలు ఏపీతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి మధ్య కుదిరిన ఎంవోయూతో పరిశోధన కార్యక్రమాల కోసం 44 వేల అమెరికా డాలర్ల (రూ.32.80 లక్షలు) నిధులు మంజూరు అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యకు చర్యలు అలాగే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలున్న ఏరోస్పెస్, సౌర, ఇంధన, వ్యవసాయం, ఆతిథ్య రంగం, బయోకెమిస్ట్రీ విభాగాల్లో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా రంగాల్లో రాష్ట్ర విద్యార్థులకు సహకారం అందించడానికి జార్జియాటెక్, క్లెమ్సన్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, ఎ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, లామర్ , డ్యూక్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమ్రార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్క్రిస్టీ తదితర విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర విదేశీ ఉన్నత విద్యా విభాగం రాష్ట్రంలోని 1,000 మంది విద్యార్థులకు ఉచిత విదేశీ ఆన్లైన్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వనుంది. -
అమెరికా వర్సిటీల్లో చైనా, భారత్‌ల హవా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గరిష్ట స్థాయిలో నమోదైంది. ఇది ఆల్‌టైమ్ రికార్డని అమెరికా ప్రక టించింది. ఈ ఏడాది చేరిన 10,95,299 మంది విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌లదే అగ్రస్థానం. మొత్తం విద్యార్థుల్లో ఈ రెండు దేశాలకు చెందిన వారే 52.18 శాతం మేర ఉన్నారు. తరువాత స్థానాల్లో దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కె నడా ఉన్నాయి. మొత్తం 10,95,299 మంది అంతర్జాతీయ విద్యార్థులు 2019 లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరారు. వారిలో 5,71,562 మంది చైనా, భారత్ విద్యార్థులు. ఆ తరువాత అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగి ఉన్న దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా వి ద్యార్థులను కూడా కలుపుకుంటే టాప్ 5 దేశాలకు చెందిన విద్యార్థులు 62.72 శాతం మంది అయ్యారు. మిగిలిన దేశాలకు చెందిన విద్యార్థులు 4,08,285 మంది ఉండగా మొత్తం విద్యార్థుల్లో వా రిది 37.26 శాతం. యూరప్ దేశాల నుంచి గరిష్టంగా 1.5 శాతం మంది, కనిష్టంగా 0.75 శాతం మంది విద్యార్థులుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తా న్, మలేసియా, హాంకాంగ్ నుంచి 1.5 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. -
అప్పులు... అవస్థలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాజధాని శాక్రిమెంటోలో అదొక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్. వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన సరిత (పేరు మార్చాం) అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఆమెపై నమోదైన కేసు విచారణ మార్చి 14 వరకు వాయిదా పడటంతో ఆ నాలుగ్గోడల మధ్యే కాలం గడపాల్సిన పరిస్థితి. కాళ్లకు రేడియో ట్రాకర్లతో ఎటూ వెళ్లలేక, భవిష్యత్ అంధకారంగా మారడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. చేతిలో ఉన్న డాలర్లతోనే ఆమె ఈ నెలన్నర గడపాలి. చుట్టుపక్క లున్న భారతీయ కుటుంబాలు దయ చూపితే కడుపు నిండుతుంది. లేదంటే లేదు. భవిష్యత్‌పై కోటి కలలతో అమెరికా వచ్చిన సరిత హోంల్యాండ్ సెక్యూరిటీ పన్నిన వలలో చిక్కుకొని ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరింది. ‘‘హఠాత్తుగా ఒకరోజు ఉదయం 6.30కే పోలీసులు వచ్చి నన్ను లేపారు. రెండు గంటలసేపు ప్రశ్నించారు. నా కాళ్లకు రేడియో ట్యాగ్ వేసి ఎటూ కదలొద్దని ఆదేశించారు. ప్రతి గురువారం కాలిఫోర్నియా పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలంటూ హుకుం జారీ చేశారు. నాకు ఇక్కడ స్నేహితులు, బంధువులెవరూ లేరు. ఏం చేయాలో అర్థంకాని స్థితి’’అంటూ కన్నీరుమున్నీరైంది. అమెరికాలో ఉన్నత విద్య కోసం సరిత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు కేసులు, లాయర్ల ఫీజులకు మరో రూ. 20 లక్షల వరకు ఖర్చు కానుంది. ఒక మధ్య తరగతి కుటుంబంపై మోయలేని 40 లక్షల అప్పు భారం పడింది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి ట్రంప్ సర్కార్ పన్నిన ‘ఉచ్చు’లో చిక్కుకున్న సరిత లాంటి భారతీయ విద్యార్థులు ప్రత్యేకించి తెలుగువారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేతిలో పెద్దగా డబ్బు లేక, అధికారుల నిర్బంధం నుంచి బయటపడే మార్గం తెలియక లబోదిబోమం టున్నారు. అమెరికా హోంల్యాండ్ అధికారులు మొత్తం 130 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేయగా వారిలో 129 మంది విద్యార్థులు భారతీయులే. అందులోనూ తెలుగువారే 80 శాతం మంది ఉన్నారు. ఈ విద్యార్థుల్లో ఇప్పటికే 10 మందికి బెయిల్ వచ్చి భారత్‌కు తిరిగి వచ్చారు. మరో ఆరుగురికి కూడా బెయిల్ వచ్చింది. ఏ క్షణమైనా వారు భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కానీ సరితలాంటి అమాయకులు ఇంకా చాలా మంది కాళ్లకు ట్రాకర్లతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. న్యాయమూర్తుల కొరతతో విచారణలో ఆలస్యం... షికాగో, న్యూజెర్సీ, న్యూయార్క్, డెట్రాయిట్, డాలస్‌లలోని డిటెన్షన్ సెంటర్లలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు. భారతీయ దౌత్య కార్యాలయం, వివిధ తెలుగు సంఘాలు విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో న్యాయపరమైన చిక్కులెన్నో ఎదురవుతున్నాయి. అమెరికా లాంటి అతిపెద్ద దేశంలో ఒక రాష్ట్రానికి మరో రాష్టానికి న్యాయపరమైన నిబంధనలు మారిపోతాయి. దీంతో వారి విడుదల కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం సాధ్యం కావడం లేదు. అదీకాక అమెరికావ్యాప్తంగా న్యాయవ్యవస్థ సంక్షోభంలో ఉంది. న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. అందుకే విద్యార్థులకు బెయిల్ మంజూరు చేయడం ఆలస్యమవుతోంది. దీంతో విద్యార్థులు పదేళ్లపాటు అమెరికాలో అడుగు పెట్టకుండా ఆదేశాలు జారీ అవుతున్నాయి. సూత్రధారి స్టీఫెన్ మిల్లర్? వీసాలు దుర్వినియోగం చేస్తున్న విదేశీ విద్యార్థుల్ని వల వేసి పట్టుకోవాలని తెరవెనుక నుంచి ఆదేశాలు ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లరేనని వార్తలు వస్తున్నాయి. 33 ఏళ్ల వయసున్న మిల్లర్‌ది కరకు గుండె. ఎంతటి కఠిన నిర్ణయాలనైనా అమలు చేయగలరు. తీరూతెన్ను లేని వలస విధానాన్ని ఆయన రూపొందించారు. వలసదారులందరూ క్రిమినల్స్ అనేది ఆయన అభిప్రాయం. వారి నుంచి అమెరికన్లను కాపాడతానంటూ పదేపదే ప్రకటనలు కూడా ఇచ్చారు. శరణార్థులెవరూ అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా చేస్తానంటూ శపథం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారినందరినీ హుటాహుటిన నిర్బంధించి దేశం నుంచి పంపించేయాలంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్ని, హెచ్1బీ వీసా దారుల్ని నిర్బంధించడానికి ఆయన ఏకంగా 22 తప్పుడు మార్గాలకు వ్యూహరచన చేశారంటేనే మిల్లర్ వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. మరిన్ని ఆపరేషన్లకు ట్రంప్ సర్కార్ సన్నాహాలు? అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మరిన్ని రహస్య ఆపరేషన్లకు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ఉపాధ్యక్షుడు రవి వేమూరి వెల్లడించారు. ఏదైనా యూనివర్సిటీలో చేరే ముందు వర్సిటీ మంచి చెడులపై పూర్తి వివరాలు కనుక్కున్నాక చేరాలని విద్యార్థులకు హితవు పలికారు. మరోవైపు అమెరికా హోంల్యాండ్ అధికారులు నకిలీ యూనివర్సిటీని స్థాపించి భారతీయ విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించడం ముమ్మూటికీ ప్రభుత్వం తప్పిదమేనని భారత సంతతికి చెందిన న్యాయవాది అను పెషవారియా విమర్శించారు. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్ వల్ల వందలాది మంది యువతీ యువకుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులతో యూనివర్సిటీల ఆటలు... అమెరికాలో ఎన్నో అసలైన యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుం టున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే హెచ్1బీ వీసా మంజూరు లాటరీ విధానంలో జరుగుతుంది. కాబట్టి అది వస్తుందో రాదో ఎవరూ చెప్పలేని స్థితి. అందుకే చాలా యూనివర్సిటీలు తమ విద్యార్థులుగా ఉంటూ విద్యార్థి వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటి) ద్వారా వారానికి 40 గంటలు పనిచేయడానికి వీలు కల్పిస్తున్నాయి. అలా ఉద్యోగం చేసే విద్యార్థుల జీతంలో కొంత భాగం ఇవ్వాలంటూ బేరాలు సాగిస్తాయి. అమెరికాలో నివసించాలంటే పే చేయాలంటూ షర తులు విధిస్తాయి. మెరుగైన జీవితం వస్తుందన్న ఆశ, అమెరికాలో చదువు అంటే భారత్‌లో వచ్చే హోదా కోసం మన విద్యార్థులు కూడా ఆ యూనివర్సిటీల వలలో చిక్కుకుంటున్నారు. హెచ్1బీ రాని విద్యార్థులను ఈ తరహా యూనివర్సిటీల్లో చేరాలంటూ ఇమ్మిగ్రేషన్ లాయర్లు కూడా సలహాలివ్వడం గమనార్హం. మన విద్యార్థుల నుంచి వర్సిటీలకు భారీ ఆదాయం అమెరికా యూనివర్సిటీలకు వచ్చే ఆదా యంలో సింహభాగం భారతీయ విద్యార్థుల నుంచే వస్తుంది. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో 2018లో 1.86 లక్షల మంది భారతీయ విద్యార్థులు చేరారు. అమెరి కాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. విదేశీ విద్యార్థుల నుంచి అమెరికా యూనివర్సిటీలు ఏటా అత్యధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయి. వారి నుంచి ఫీజుల రూపంలో 3,900 కోట్ల డాలర్ల (రూ. 2.77 లక్షల కోట్లు) వరకు ఆదాయం వస్తోంది. కానీ ట్రంప్ సర్కారే స్వయంగా విదేశీ విద్యార్థులను వల వేసి పట్టుకోవడం వంటి చర్యలతో ఎందరో విద్యార్థులు భయాందోళనకు లోనవుతు న్నారు. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లిపోతు న్నారు. దీనివల్ల ఆర్థికంగా అమెరికాకు నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘స్టెమ్’లో ఇండియన్ జమ్స్..
అమెరికాలో సైన్స్ – టెక్నాలజీ – ఇంజనీరింగ్ – మేధమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చేస్తున్న భారతీయ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాములో చేరేందుకు భారీగా అనుమతులు పొందారు. యూఎస్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక, అక్కడే వుండి ఉద్యోగం చేయాలనుకుంటే ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ తప్పనిసరి. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం – సెప్టెంబరు 30తో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో – మొత్తం విదేశాలకు చెందిన 89,839 మంది ‘స్టెమ్’ విద్యార్థులు ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ పొందారు. ఇందులో అత్యధికులు ( 50,507 మంది / 56శాతం) భారతీయులే. 21,705 (24శాతం) ఓపీటీ అనుమతులతో చైనా విద్యార్థులు ఆ తర్వాత స్థానంలో వున్నారు. స్టెమ్ – ఓపీటీ విద్యార్థులకు భారీగా ఉద్యోగాలిచ్చిన సంస్థల్లో అమెజాన్ (2,393) ముందుంది. గూగుల్ (1,142) ఇంటెల్ (1,139) మైక్రోసాఫ్ట్ (893) ఇంటెగ్రా టెక్నాలజీస్ (512) మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. ఎఫ్ –1 స్టడీ వీసాలపై అమెరికా వెళ్లిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కాలంలో లేదా ఆ తర్వాత ఓపీటీ కింద 12 మాసాలు పని చేసేందుకు వీలుంటుంది. స్టెమ్ డిగ్రీలు చేసేవారు ఓపీటీ ఆథరైజేషన్‌ను మరో 24 మాసాల కాలం పొడిగించుకునేందుకు అవకాశముంటుంది. ఓపీటీ అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులూ వుండవు. 2,49,763 భారతీయ విద్యార్థులు స్టూడెంట్ అండ్ ఎక్సే్చంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) విడుదల చేసిన నివేదిక ప్రకారం – 2017 నాటికి అమెరికాలో మొత్తం 15.90 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చైనా విద్యార్థులే (4,81,106) ఎక్కువ. 2,49,763 మందికి పైగా విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో వుండగా.. దక్షిణ కొరియా (95,701) సౌదీ అరేబియా (72,358) జపాన్ (41,862) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. విదేశీ విద్యార్థుల సమాచారం విషయమై మరింత పారదర్శకత ఇచ్చేందుకు ఈ నివేదికను విడుదల చేసినట్టు సెవిస్ పేర్కొంది. విదేశీయుల్ని ఆకర్షిస్తోన్న వర్సిటీలివే.. విదేశీ విద్యార్థులను అత్యధికంగా ఆకర్షిస్తున్న అమెరికన్ యూనివర్సిటీల్లో న్యూయార్క్ వర్సిటీ (22,238 మంది) ముందుంది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (18,786) కొలంబియా యూనివర్సిటీ ఇన్ న్యూయార్క్ సిటీ (18,332) నార్త్ ఈస్టర్న్ వర్సిటీ (17,304) యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయస్ (14,735) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. -
అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం
జాత్యహంకార దాడులు పెరిగాయనడంలో నిజం లేదు - అమెరికాలో అభ్యసించే భారతీయుల సంఖ్య తగ్గలేదు - వీసాల జారీ, విద్యా విధానంలో మార్పుల్లేవు - విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దు - ‘సాక్షి’తో అమెరికన్ కాన్సులేట్ వైస్ కౌన్సెల్ జొనాథన్ అక్లీ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ సురక్షితమేనని, జాత్యహంకార దాడులపై తగు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వైస్ కౌన్సెల్ జొనాథన్ అక్లీ. అమెరికన్ వర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. అక్లీతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ప్ర: అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కదా.. విద్యా విధానానికి సంబంధించి, వీసా జారీలో మార్పులు జరిగాయా? జవాబు: అలాంటివేవీ లేవు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలే కొనసాగుతున్నాయి. అమెరికన్ పౌరుల రక్షణ.. చట్టబద్ధంగా ఈ దేశంలో చదువుకునేందుకు వచ్చిన వారు, పర్యటించేందుకు వచ్చిన వారిని భద్రంగా చూసుకోవడమన్నది అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్న విధానం. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. తగిన విద్యార్హతలు, చదువును కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, వీసాలు ఉన్న వారెవరైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమెరికాలో చదువుకోవచ్చు. ప్ర: ఒకట్రెండేళ్ల క్రితం కొంతమంది తెలుగు విద్యార్థులను వెనక్కి పంపారు. కొన్ని వర్సిటీలు చేసిన పొరబాట్ల వల్ల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారా? జ: అమెరికాలో దాదాపు ఆరు వేల కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో అమెరికా ఉన్నత విద్యా సంస్థ గుర్తించినవి 4,500 మాత్రమే. వేటికి గుర్తింపు ఉంది? వేటికి లేదన్న వివరాలు www.chea.org వెబ్సైట్లో ఉన్నాయి. కాలేజీ ఎంపిక సమయంలో విద్యా ర్థులు ఈ జాబితా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్ర: ఇటీవలి కాలంలో అమెరికాలో జాత్యహంకార దాడులు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్కడ సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జ: వేర్వేరు దేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం, వర్సిటీలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అక్కడక్కడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్న మాట నిజమే. కొంతమంది వ్యక్తులు చట్టాలను ఉల్లంఘించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు తగిన చట్టాలున్నాయిక్కడ. జాత్యహంకార దాడుల్లాంటివి జరిగినప్పుడల్లా మా న్యాయ వ్యవస్థ ద్వారా దోషులకు శిక్ష పడేలా చేయగలుగుతున్నాం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇలాంటి సంఘటనలకు ఎలా స్పందిచాలన్న విషయంలో తమదైన ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి కూడా. వర్సిటీలను ఎంపిక చేసుకునే సమయంలో విద్యార్థులు రక్షణకు సంబంధించిన ఏర్పాట్లనూ ఒకసారి పరిశీలించడం మేలు. ప్ర: అమెరికన్ వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది..? జ: ఇది నిజం కాదు. గత మూడేళ్ల గణాంకాలు తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఈ రకమైన వీసాల జారీ 48 శాతం వరకూ పెరిగింది. విద్యార్థి వీసాల విషయానికొస్తే.. 2014తో పోలిస్తే 2016 నాటికి 122 శాతం పెరిగింది. 2016లో దేశం మొత్తమ్మీద జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య దాదాపు 48 వేల వరకూ ఉంది. హెచ్–1బీ వీసాల విషయంలోనూ పెరుగుదలే కనిపిస్తోంది. 2014లో మొత్తం 60 వేల వీసాలు జారీ కాగా.. గత ఏడాది ఇవి 80 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి. ‘‘అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 1.66 లక్షల వరకూ ఉంది. అమెరికాలోని ఉన్నత విద్యావకాశాలను భారతీయ విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ అన్ని చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోని ప్రతి ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయులై ఉండటం సంతోషకరం. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న విద్వేష దాడులను అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఉన్నతాధికారులందరూ ఖండించారు. కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇక్కడకు రావాలనుకునే వారు ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన అవసరం లేదు’’ – కేథరీన్ హడ్డా, యూఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్. ‘‘అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునేవారు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ను సంప్రదిస్తే.. మేము ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తాం. అక్రిడెటేడ్ కళాశాలల వివరాలు మొదలుకుని ఏ కాలేజీలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అడ్మిషన్ విధానాలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తాం. విద్యార్థులు చేయాల్సిందల్లా కాన్సులేట్‌కు ఫోన్ చేసి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రమే’’ – పియా బహదూర్, రీజనల్ ఆఫీసర్, యునైటెడ్ స్టేట్స్–ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ -
అన్నారం టు అమెరికా
లక్ష డాలర్ల వార్షిక వేతనంతో కొలువుదీరిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ అబ్రాడ్ అమెరికాలో ఉన్నత విద్య అవకాశం లభించడం ఎంతో కష్టం. సుదీర్ఘ నిరీక్షణ.. అనేక నిబంధనలు.. టెస్టుల్లో స్కోర్స్. ఆ యువకుడు వాటన్నింటినీ అధిగమించాడు. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో అడ్మిషన్ సొంతం చేసుకున్నాడు. ఎంఎస్ పూర్తి చేశాక అక్కడే ప్రముఖ రిటైల్ సంస్థ ‘టార్గెట్’లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి యూఎస్‌లో ఉన్నత విద్య కోసం అడుగుపెట్టి.. అక్కడే సొంతగా ఉద్యోగాన్వేషణ సాగించి.. విజయం సాధించిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ స్టోరీ. మా స్వస్థలం కామారెడ్డి జిల్లాలోని అన్నారం. మాకున్న కొద్దిపాటి భూమిలో నాన్న దేవేందర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ జ్యోత్స్న గృహిణి. పదో తరగతి వరకు సిద్దిపేటలోనే చదువుకున్నా. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఎంసెట్ ర్యాంకుతో హైదరాబాద్‌లోనే ఓ సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేశా. నా చదువు పరంగా అమ్మానాన్న ఎంతో సహకరించారు. బీటెక్ నుంచే యూఎస్ కల బీటెక్‌లో చేరినప్పటి నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కన్నా. బాగా చదువుకొని అక్కడే స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ దిశగా ముందస్తుగానే జీఆర్ఈకి ప్రిపరేషన్ ప్రారంభించా. దాంతో మంచి స్కోర్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీలకు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేశా. యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్, నార్త్‌వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ, క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైంది. స్కాలర్‌షిప్‌తో అడుగు యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ 60 శాతం స్కాలర్‌షిప్‌తో ఆఫర్ ఇవ్వడంతో అందులో చేరాను. ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగున్న విద్యార్థులకు స్కాలర్షిప్ను మంజూరు చేస్తుంది. నా స్కోర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఫీజులో 60 శాతం స్కాలర్షిప్ అందించింది. 2013 ఫాల్ సెషన్లో ఎంఎస్–కంప్యూటర్ సైన్స్‌లో చేరాను. ఇబ్బందులు సహజం అమెరికాలోని ఏ యూనివర్సిటీ క్యాంపస్‌ను చూసినా.. ప్రపంచంలోని భిన్న దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులు కనిపిస్తారు. కాబట్టి ప్రారంభంలో ఎవరికైనా అక్కడి పరిస్థితుల్లో ఇమిడిపోయే విషయంలో కొంత ఇబ్బంది ఎదురవడం సహజమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొత్త ప్రదేశం.. మనవాళ్లతో కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇండియన్ స్టూడెంట్స్‌తోనే ఇంటరాక్షన్‌కు ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. ఇది సరికాదు. ఇతర దేశాలకు చెందిన వారితోనూ మాట్లాడాలి. అలాగే క్యాంపస్‌కే పరిమితం కాకుండా వీలైన సమయంలో బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి స్థానిక సంస్కృతి, జీవనశైలిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా భవిష్యత్‌లోæజాబ్ మార్కెట్ కోణంలో వాస్తవంగా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఉద్యోగాన్వేషణ.. స్వయంగానే ఎంఎస్ పూర్తవుతూనే ఉద్యోగాన్వేషణలో పడ్డాను. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి. కానీ అక్కడికి వచ్చే కంపెనీలు స్థానికుల (అమెరికన్ల)కే ప్రాధాన్యమిస్తాయి. ఇతర దేశాల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ లభించడం చాలా అరుదు. దీంతో నేను కోర్సు చివరి సెమిస్టర్ నుంచే ఉద్యోగం కోసం స్వీయ అన్వేషణ సాగించాను. ఇందుకోసం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డిన్, స్థానిక కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేశాను. ‘టార్గెట్’లో కొలువు.. లక్ష డాలర్ల వేతనం కన్సల్టింగ్ సంస్థల ద్వారా అమెరికాలోని ప్రముఖ కామర్స్ అండ్ రిటైల్ సంస్థ టార్గెట్ కార్పొరేషన్లో సీనియర్ డేటా ఇంజనీర్‌గా 2016 జనవరిలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం లక్ష డాలర్ల వార్షిక వేతనంతోపాటు పెయిడ్ లీవ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అదనపు భత్యాలు అందుతున్నాయి.. హడూప్, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్‌కు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాలో అడుగుపెట్టడం.. అంతేకాకుండా ఫార్చూన్–500 జాబితాలోని కంపెనీలో కొలువు సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిన సంఘటనలు. డేటాసైన్స్‌లో ఎంబీఏ ప్రస్తుతం సీనియర్ డేటా ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ఈ విభాగంలోనే ఉన్నత హోదాలు అందుకునేందుకు మార్గం కల్పించే డేటా సైన్స్‌లో ఎంబీఏ చదవాలనేది నా తదుపరి లక్ష్యం. ఇప్పుడు కంపెనీ లన్నీ డేటా అనలిటిక్స్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులకు కూడా ఆ నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి. ముందస్తు ప్రణాళికతో ఉన్నత విద్య పరంగా అమెరికాను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూనివర్సిటీల అన్వేషణ పరంగా కేవలం కన్సల్టెన్సీలపైనే ఆధారపడకుండా.. స్వయంగా తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న కోర్సు, యూనివర్సిటీల గురించి అన్వేషణ సాగించాలి. వాటి అర్హత ప్రమాణాలను తెలుసుకుని వాటిని అందుకునేలా బీటెక్ నుంచే కృషి చేయాలి. అప్డేట్ అయితేనే అమెరికాలో విద్యా విధానం బాగుంటుందని, కరిక్యులం పరంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయని చాలామంది విద్యార్థులు భావిస్తారు. అయితే అమెరికాలోనూ కెరీర్ పరంగా రాణించేందుకు సెల్ఫ్ అప్డేట్ ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రొఫెసర్లు, సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తుండాలి. ఫలితంగా స్థానికంగా ఉన్న ఉద్యోగావకాశాల గురించి, వాటిని అందుకోవడానికి గల మార్గాల గురించి తెలుస్తుంది. అడుగుపెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా, అకడమిక్‌గా, సామాజికంగా వినూత్న దృక్పథంతో వ్యవహరిస్తే కోర్సు పూర్తయ్యాక ఇక్కడే కొలువుదీరే అవకాశాలు ఎన్నో!! -
కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు..!
-
కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు..!
చికాగో: ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కోర్సు కమెన్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన అతను డీన్ కాళ్లకు దండం పెట్టి కిందికి వెళ్లిపోయాడు. భారతీయ సంప్రదాయం తెలియని డీన్ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కొంచెం తెరుకున్న తర్వాత విద్యార్థి కాళ్లకు దండం పెట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ షేర్ అవుతోంది. ట్వీటర్లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలిచింది. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయరాదు. -
ట్రంప్ వచ్చాక వీసాల జారీలో గందరగోళం
అమెరికా కాన్సులేట్ విభాగ ముఖ్య అధికారి డాక్టర్ ముల్లిగన్ చేబ్రోలు (పొన్నూరు): అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వీసాల జారీ విషయంలో గందరగోళ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఉండదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ విభాగ ముఖ్య అధికారి డాక్టర్ ముల్లిగన్ అన్నారు. అమెరికాలో ప్రస్తుత పరిణామాలు, అక్కడ ఎంఎస్ చేసేందుకు ఉన్న అవకాశాలు, వీసా దరఖాస్తులో భారతీయ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. భారతీయ విద్యార్థులకు వీసా జారీ చేసే కాన్సులేట్ విభాగ ప్రధానాధికారి ముల్లిగన్తో పాటు ఆయన బృందం పాల్గొన్నారు. అమెరికా యూనివర్సిటీల్లో ఎంఎస్ కోర్సు చేసేందుకు ఐ20 లెటరు అందుకున్న తర్వాత విద్యార్థులు వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముల్లిగన్ వివరించారు. ట్రంప్ అధికారం చేపట్టాక వీసాల జారీలో కొత్త నిబంధనలతో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మరో కన్సోలర్ అ«ధికారి లారొన్ వినే, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్, వైస్ చైర్మన్లు లావు రత్తయ్య, శ్రీకృష్ణదేవరాయలు, వీసీ తంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు
- గోదావరి తీరం వెంట మూడు వేల ఏళ్లనాటి మానవ చరిత్ర జాడలు - ఖమ్మం, భూపాలపల్లి అడవుల్లో అద్భుత నిర్మాణాలు - ఒకేచోట వేల సంఖ్యలో సమాధులు - గుట్టువిప్పేందుకు ముందుకొచ్చిన అమెరికా వర్సిటీ సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి పది అడుగుల ఎత్తున్న రాతి పలకాలతో చుట్టూ గోడ.. పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పు, అడుగు మందంతో రాతి పైకప్పు.. దానికి చిన్న ద్వారం.. లోపల పదడుగుల వెడల్పు, అంతే పొడవుండే గండ శిలతో చెక్కిన తొట్టిలాంటి ఆకృతి. దానికి రాతి మూత.. దాని బయట అస్పష్టమైన మానవాకృతితో గండశిలలు.. ఆ ప్రాంగణం చుట్టూ భారీ శిలలు..! అలాంటివి ఒకటి కాదు రెండు కాదు.. వందలు... వేలు... దట్టమైన అడవిలో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు! ఇంతకూ ఏంటవి..?? ఎవరు నిర్మించారు.. ఎక్కడున్నాయి? రాతి తొట్టిలో ఎముకలు కనిపించటంతో అవి సమాధులని, ఆదిమానవుల కాలానివని దాదా పు వందేళ్ల క్రితమే తేల్చారు. కానీ అవి ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణాలని అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం గుర్తించింది. వీటిపై అధ్యయనానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి ఆసక్తిగా ఉంది. ఇంతకూ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో తెలుసా? భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల పరిధిలోని గోదావరి నదీతీరం వెంట! వారంతా వలస వచ్చినవారా? గోదావరి తీరం వెంట భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని తాడ్వాయి, దామరవాయి, జానంపేట, దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలబ, గుండాల... అటవీప్రాంతాల్లో వేల సంఖ్యలో సమాధులున్నాయి. వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. తాజాగా సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వారు వలస జీవులని తేలింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆచార్యులు కేపీరావు ఆధ్వర్యంలో సర్వే జరిగిన సమయంలో సీసీఎంబీ.. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఈ సమాధుల్లోని ఎముకల డీఎన్ఏను పరీక్షించిం ది. అది స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని భావించారు. దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఈ సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లో కూడా డీఎన్ఏ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీసీఎంబీ భావిస్తోంది. దానికంటే ముందు వీటి గుట్టు విప్పేందుకు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని సంఖ్య లో.. ఆకృతిలో భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక బలమైన చరిత్ర ఉందని ఆ వర్సిటీ భావిస్తోంది. తాజాగా ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ థామస్ లెవీ వాటిని పరిశీలించారు. వీటి గుట్టు విప్పేందుకు తెలంగాణ పురావస్తు శాఖ ముందు ప్రతిపాదన ఉంచారు. పశువుల కొట్టాల్లోకి తొట్లు: సమాధుల్లో రాతి తొట్లను స్థానికులు కొందరు అక్రమంగా ఇళ్లకు తరలించి పశువుల కొట్టాల్లో తొట్లుగా వాడుతున్నారు. వాటిపై అవగాహన లేకపోవటంతో అత్యంత అరుదైన సంపద ధ్వంసంఅవుతోంది. ఆ నిర్మాణాల్లో ఎన్నో ప్రత్యేకతలు సాధారణంగా సమాధులు భూమి లోపల నిక్షిప్తమై ఉంటాయి. వాటికి గుర్తుగా పైన గండ శిలలను వృత్తాకారంలో పాతటం నాటి అలవాటు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా భూమి ఉపరితలంలోనే రాతి పలకలతో గుడారం తరహా నిర్మాణం ఉంది. సమాధుల ముందు అస్పష్టమైన మానవాకృతి రాళ్లు పాతి ఉన్నాయి. మగవారి ఆకృతి ఉన్న రాళ్లు క్రెస్తవ శిలువ ఆకృతిని పోలి ఉన్నాయి. కానీ అది క్రెస్తవంతో సంబంధం లేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు తెలిపారు. మహిళా రూపం అయితే శిలలపై స్థనభాగం రూపొందించి ఉంది. ఇలాంటి ఆకృతులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. గతంలో ఈ నిర్మాణాలపై పలుమార్లు పరిశోధన జరిగినా 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ వీటిని పరిశీలించి రిపోర్టు రూపొందించారు. 1991లో పురావస్తు అధికారులు రంగాచారి, గోవిందరెడ్డిలు పరిశీలించి వీటిలోని తొట్టి తదితర వివరాలను బహిర్గతం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి మెరుగైన అధ్యయనం ఇదే. 2000లో ప్రొఫెసర్ పుల్లారావు బృందం మరికాస్త పరిశోధించి వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వీరి ఆధ్వర్యం లోనే ఇటీవల డీఎన్ఏ పరీక్షలు జరిగాయి. యునెస్కో గుర్తింపు అర్హత ఉంది: పురావస్తుశాఖ డైరెక్టర్ ఈ సమాధులు అరుదైనవి, అద్భు తమైనవి. శాన్ డియాగో విశ్వవిద్యాల యం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిశోధనలు చేయాలనే విష యంలో మేం ప్రణాళిక రూపొందిస్తాం. ఇన్ని వేల సంఖ్యలో మరెక్కడా సమా ధులు లేవు. వాటి గుట్టువిప్పి ప్రపంచం ముందు పెడితే తెలంగాణకు తొలి యునెస్కో గుర్తింపు రావటం ఖాయం. -
అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్
♦ అఫ్గానిస్తాన్ దాడిలో 16 మంది మృతి ♦ 53 మందికి గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని అమెరికా యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసులున్నారు. వర్సిటీలో నష్టాన్ని తగ్గించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదులతో దాదాపు 10 గంటలపాటు హోరాహోరీగా పోరాడి ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. ఇంతవరకు ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించకున్నా.. అఫ్గానిస్తాన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాలిబాన్లు దాడులకు పాల్పడుతుండటంతో.. వారే ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్నారు. అయితే.. వర్సిటీపై దాడికి పాకిస్తాన్లో ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందని అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ్రఘనీ తెలిపారు. ఈ విషయమై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌కు ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పాక్ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో భద్రత విషయంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు. మృతిచెందిన వారిలో ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో అధిక భాగం కిటికీల వద్ద కూర్చున్నవారేనని అధికారులు తెలిపారు. దాదాపు 9 గంటల పాటు జరిగిన ఈ దాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. దాడి జరిగిన సమయంలో యూనివర్సిటీలో 200 మందికి పైగా ఉన్నారు. -
ఆఫ్ఘనిస్ధాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
కాబూల్‌లోని అమెరికా వర్సిటీపై ఉగ్రదాడి
-
టాప్ టెన్ యూనివర్శిటీల్లో అమెరికాదే హవా
బీజింగ్: ప్రపంచ టాప్ యూనివర్శిటీల్లో ఈ ఏడాది కూడా అమెరికా యూనివర్శిటీలదే హవా. వరుసగా పదమూడవ సంవత్సరం కూడా హార్వర్డ్ యూనివర్శిటీ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. స్టాన్‌ఫర్డ్, మసాచుసెట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎఐటీ) ద్వితీయ, తృతీయ స్థానాల్లో, బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ప్రిన్సిటన్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలు ఈసారి కూడా నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. కొలంబియా యూనివర్శిటీ, షికాగో యూనివర్శిటీ ఎనిమిది, తొమ్మిదవ స్థానాలను సాధించాయి. మొత్తం టాప్ టెన్ యూనివర్శిటీల్లో ఎనిమిది యూనివర్శిటీ అమెరికావే కావడం విశేషం. అమెరికేతర యూనివర్శిటీలైన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలు వరుసగా ఐదు, పదవ స్థానాలను ఆక్రమించాయి. షాంగ్ జియాటాంగ్ యూనివర్శిటీ పర్యవేక్షణలో చైనీస్ రిసెర్చ్ సెంటర్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సారి ఫ్రెంచ్ యూనివర్శిటీలు బాగా వెనకపడి పోయాయి. టాప్ వంద యూనివర్శిటీల్లో ఫ్రెంచ్ యూనివర్శిటీలకు మూడు స్థానాలు మాత్రమే లభించాయి. ఫ్రాన్స్‌లోని పియరీ అండ్ మేరి క్యూరి యూనివర్శిటీకి 39వ స్థానం, పారిస్ సూద్‌కు 46, ఎకోల్ నార్మేల్ సుపీరియర్‌కు 87వ స్థానం లభించాయి. ఒక్క మాథమేటిక్స్ విభాగంలోనే ఫ్రెంచ్ యూనివర్శిటీలకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే యూనివర్శిటీ ర్యాంకులను నిర్ణయించేందుకు చైనా అనుసరించిన ప్రమాణాలే పూర్తిగా తప్పని, వారు కేవలం సైన్స్ విభాగాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి తియరీ మాండన్ విమర్శించారు. తమ విద్యానాన్నే చైనా తప్పుగా అర్థం చేసుకొందని, ప్రపంచంలో నెంబర్ ర్యాంకును సాధించడం తమ విద్యావిధానం లక్ష్యం కాదని ఆయన చెప్పారు. అయితే తాము అనేక విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొనే ర్యాంకులు నిర్ణయించామని, పైగా మూడవ పార్టీ అధ్యయనంతోనే ర్యాంకులను శాస్త్రీయ ప్రమాణాలతో ఖరారు చేశామని చైనా యూనివర్శిటీ తెలిపింది. పూర్వ విద్యార్థుల రాణింపును, యూనివర్శిటీ సిబ్బందికి వచ్చే నోబెల్ బహుమతులను, ఫీల్డ్ మెడళ్లను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయించామని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1200 యూనివర్శిటీలను అధ్యయనం చేసి ప్రతి ఏట 500 టాప్ యూనివర్శిటీల ర్యాంకులను నిర్ణయిస్తామని, ఈసారి కూడా అలాగే చేశామని చైనా యూనివర్శిటీ వివరించింది. ర్యాంకింగ్‌ల కోసం అధ్యయనం నిర్వహించిన చైనా జియాటాంగ్ యూనివర్శిటీకి 118వ స్థానం లభించింది. గత ఏడాదికన్నా నాలుగు స్థానాలు ముందుకు జరిగింది. -
మూడేళ్లు ఇక్కడ.. నాలుగోది అమెరికాలో..
నిజామాబాద్‌అర్బన్ : ఎస్ఆర్ ఐఐటీ ద్వారా మూడేళ్లు హైదరాబాద్‌లో చదివి నాలుగోఏట అమెరికా యూనివర్శిటీలో విద్యనందిస్తున్నట్లు ఎస్ఆర్ ఐఐటీ హైదరాబాద్ ప్రిన్సిపాల్ గండికోట ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌పై వంశీ హోటల్లో అవగాహన సదస్సు జరిగింది. దీనిలో ఆయన మాట్లాడారు. కళాశాల విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. అమెరికా విద్యాబోధనకు అనుసంధానం చేసి తద్వారా విద్యార్థులు అంతర్జాతీయ పరిమాణాలతో కూడిన విద్యను అసభ్యసించవచ్చునన్నారు. అమెరికాలోని సెంట్రల్ వర్సిటీ ఆఫ్ మిస్సోరి ప్రతినిధులు డాక్టర్ ఎలీస్గ్రీఫ్ మాట్లాడుతూ తమ వర్సిటీలో టీమ్‌వర్క్ అనేది ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. యూఎస్ఏ ఎఫ్-1 వీసా ప్రాసెసింగ్, వర్సిటీలో ఫీజుల వివరాలను తెలిపారు. అక్కడి వాతావరణం, క్యాంపస్‌లో ఉండే వసతులను వివరించారు. ఈ వర్సిటీలో ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చ చదువుతున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి యూఎస్ వర్సిటీ ఎస్ఆర్ఐఐటీతో జేఎన్టీయూ అనుబంధంగా ఒప్పందం జరిగిందన్నారు. మిస్సోరీ వర్సిటీ ప్రతినిధులు టేలర్ ఘీ, డాక్టర్ మహ్మద్‌యూసుఫ్, విద్యాసంస్థల జిల్లా ఇన్చార్జి గోవర్ధన్‌రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘వీసా’ వివాదానికి ఎయిరిండియానే కారణం
అమెరికన్ వర్సిటీ ఆరోపణ వాషింగ్టన్: తమ సంస్థను అమెరికా ప్రభుత్వం ‘బ్లాక్‌లిస్ట్’లో ఉంచిందని ఎయిరిండియా తప్పుడు ప్రచారం చేస్తూ యూఎస్‌కు వస్తున్న తమ భారత విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందని అక్కడి నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ(ఎన్పీయూ) ఆరోపించింది. ఇటీవల ఆ వర్సిటీలో చేరేందుకు అమెరికా వెళ్లిన కొందరు భారత విద్యార్థులను అక్కడి అధికారులు వెనక్కి పంపడం తెలిసిందే. కొందరు విద్యార్థులు కూడా పుకార్లు పుట్టించి తమ విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ఎన్పీయూ అధ్యక్షుడు పీటర్ హిసియా విద్యార్థులకు లేఖ రావారు. ‘ముఖ్యంగా ఎయిర్‌ఇండియావల్ల మా వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది. వర్సిటీలో చేరేందుకు వస్తున్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు’ అన్నారు. అమెరికాకు రావాల్సిన విద్యార్థులను విమానం ఎక్కకుండా ఎయిరిండియా అడ్డుకుంటోంది. ఒకవేళ విద్యార్థులను అమెరికాలోకి అనుమతించకపోతే తిరిగి తీసుకురావల్సి వస్తుందని, ఎయిరిండియాపై ఆర్థిక భారం పెరుగుతుందని భావిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఎయిర్ఇండియా స్పందించలేదు.