అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం | American universities are safe | Sakshi
Sakshi News home page

అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం

Published Tue, Aug 22 2017 7:56 AM | Last Updated on Tue, May 29 2018 1:02 PM

అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం - Sakshi

అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం

జాత్యహంకార దాడులు పెరిగాయనడంలో నిజం లేదు 
- అమెరికాలో అభ్యసించే భారతీయుల సంఖ్య తగ్గలేదు 
వీసాల జారీ, విద్యా విధానంలో మార్పుల్లేవు 
విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దు 
‘సాక్షి’తో అమెరికన్‌ కాన్సులేట్‌ వైస్‌ కౌన్సెల్‌ జొనాథన్‌ అక్లీ 
 
సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ సురక్షితమేనని, జాత్యహంకార దాడులపై తగు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ వైస్‌ కౌన్సెల్‌ జొనాథన్‌ అక్లీ. అమెరికన్‌ వర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. అక్లీతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. 
 
ప్ర: అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కదా.. విద్యా విధానానికి సంబంధించి, వీసా జారీలో మార్పులు జరిగాయా? 
జవాబు: అలాంటివేవీ లేవు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలే కొనసాగుతున్నాయి. అమెరికన్‌ పౌరుల రక్షణ.. చట్టబద్ధంగా ఈ దేశంలో చదువుకునేందుకు వచ్చిన వారు, పర్యటించేందుకు వచ్చిన వారిని భద్రంగా చూసుకోవడమన్నది అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్న విధానం. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. తగిన విద్యార్హతలు, చదువును కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, వీసాలు ఉన్న వారెవరైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమెరికాలో చదువుకోవచ్చు. 
ప్ర: ఒకట్రెండేళ్ల క్రితం కొంతమంది తెలుగు విద్యార్థులను వెనక్కి పంపారు. కొన్ని వర్సిటీలు చేసిన పొరబాట్ల వల్ల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారా? 
జ: అమెరికాలో దాదాపు ఆరు వేల కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో అమెరికా ఉన్నత విద్యా సంస్థ గుర్తించినవి 4,500 మాత్రమే. వేటికి గుర్తింపు ఉంది? వేటికి లేదన్న వివరాలు  www.chea.org  వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కాలేజీ ఎంపిక సమయంలో విద్యా ర్థులు ఈ జాబితా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. 
ప్ర: ఇటీవలి కాలంలో అమెరికాలో జాత్యహంకార దాడులు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్కడ సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
జ: వేర్వేరు దేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం, వర్సిటీలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అక్కడక్కడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్న మాట నిజమే. కొంతమంది వ్యక్తులు చట్టాలను ఉల్లంఘించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు తగిన చట్టాలున్నాయిక్కడ. జాత్యహంకార దాడుల్లాంటివి జరిగినప్పుడల్లా మా న్యాయ వ్యవస్థ ద్వారా దోషులకు శిక్ష పడేలా చేయగలుగుతున్నాం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇలాంటి సంఘటనలకు ఎలా స్పందిచాలన్న విషయంలో తమదైన ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి కూడా. వర్సిటీలను ఎంపిక చేసుకునే సమయంలో విద్యార్థులు రక్షణకు సంబంధించిన ఏర్పాట్లనూ ఒకసారి పరిశీలించడం మేలు. 
ప్ర: అమెరికన్‌ వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది..? 
జ: ఇది నిజం కాదు. గత మూడేళ్ల గణాంకాలు తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి ఈ రకమైన వీసాల జారీ 48 శాతం వరకూ పెరిగింది. విద్యార్థి వీసాల విషయానికొస్తే.. 2014తో పోలిస్తే 2016 నాటికి 122 శాతం పెరిగింది. 2016లో దేశం మొత్తమ్మీద జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య దాదాపు 48 వేల వరకూ ఉంది. హెచ్‌–1బీ వీసాల విషయంలోనూ పెరుగుదలే కనిపిస్తోంది. 2014లో మొత్తం 60 వేల వీసాలు జారీ కాగా.. గత ఏడాది ఇవి 80 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి.
 
‘‘అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 1.66 లక్షల వరకూ ఉంది. అమెరికాలోని ఉన్నత విద్యావకాశాలను భారతీయ విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ అన్ని చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోని ప్రతి ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయులై ఉండటం సంతోషకరం. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న విద్వేష దాడులను అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఉన్నతాధికారులందరూ ఖండించారు. కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇక్కడకు రావాలనుకునే వారు ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన అవసరం లేదు’’ 
– కేథరీన్‌ హడ్డా, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్, హైదరాబాద్‌. 
 
‘‘అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునేవారు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ను సంప్రదిస్తే.. మేము ఉచితంగా కౌన్సెలింగ్‌ ఇస్తాం. అక్రిడెటేడ్‌ కళాశాలల వివరాలు మొదలుకుని ఏ కాలేజీలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అడ్మిషన్‌ విధానాలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తాం. విద్యార్థులు చేయాల్సిందల్లా కాన్సులేట్‌కు ఫోన్‌ చేసి ముందస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం మాత్రమే’’ – పియా బహదూర్, రీజనల్‌ ఆఫీసర్, యునైటెడ్‌ స్టేట్స్‌–ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement