అధికారిక ప్రకటన.. కుంభామేళా తొక్కిసలాటలో మరణాలు ఎన్నంటే? | DIG Mahakumbh Vaibhav Krishna Keys Comments On Stampede | Sakshi

అధికారిక ప్రకటన.. కుంభామేళా తొక్కిసలాటలో మరణాలు ఎన్నంటే?

Jan 29 2025 6:52 PM | Updated on Jan 29 2025 7:27 PM

DIG Mahakumbh Vaibhav Krishna Keys Comments On Stampede

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు చనిపోయినట్టు మహాకుంభ డీఐజీ వైభవ్‌ కృష్ణా అధికారికంగా వెల్లడించారు. ఇదే సమయంలో 60మంది త్రీవంగా గాయపడినట్టు వెల్లడించారు. కాగా, మరణించిన వారిలో 25 మందిని గుర్తించినట్టు తెలిపారు. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

తాజాగా డీఐజీ వైభవ్‌ కృష్ణా మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో తొక్కిసలాట జరిగింది. అఖారా మార్గ్‌లో భారీగా భక్తులు గుమ్మిగూడారు. ఈ రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో 25 మందిని గుర్తించాం.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1920ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటన తర్వాత దాదాపు 90 మందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు భక్తులు అప్పటికే చనిపోయారు. 36 మంది స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీసినట్లు ప్రధాని వెల్లడించారు.

ఇక, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.

 

 

ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్‌ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement