
ఆదివారం 1.42 కోట్ల మంది
ఇప్పటికి 42 కోట్లు దాటిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు.
సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment