triveni sangamam
-
మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళాను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వరకు 42 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. ఈ సందర్భంగా యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇందులో జనవరి 13న పుష్య పౌర్ణమిన, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ స్నానం రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉండనుందన్నది అధికారుల అంచనా. కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజున షాహి స్నాన్‌లో గరిష్టంగా 4 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరుగనున్న మహాకుంభమేళా మూడు రెట్లు పెద్దదని భావిస్తున్నారు. ఈ పవిత్ర స్నానాల కోసం గతంలో 12 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేళా ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. నాలుగు రెట్ట బడ్జెట్ మహాకుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గతం కంటే బడ్జెట్ నాలుగు రెట్లు పెంచారు. ఈసారి మహాకుంభ బడ్జెట్ రూ.5,060 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు ఇచి్చంది. 2013 కుంభ్ సమయంలో రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా.. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మహాకుంభ్‌మేళా కోసం రూ.1,214 కోట్ల బడ్జెట్ కేటాయించగా రూ.1,017 కోట్లు ఖర్చు చేశారు. 2025లో మహాకుంభ బడ్జెట్ 2013 కంటే రూ.4,043 కోట్లు ఎక్కువ కావడం విశేషం. 38 వేల మంది జవాన్లతో భద్రత మహాకుంభమేళా జరుగుతున్న కుంభ్ నగర్ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు. కుంభ్ నగర్ మాస్టర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రత కోసం 38 వేల మంది సైనికులను మోహరిస్తున్నారు. మొత్తం 56 పోలీస్ స్టేషన్లు, 144 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రెండు సైబర్ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ డెస్క్ ఉంటుంది. కాగా, 2013 మహా కుంభ్‌లో దాదాపు 12 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 12 మంది ఏఎస్పీ, 30 మంది సీఓలు, 409 మంది ఇన్స్పెక్టర్లు, 4,913 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీఐపీల కోసం మహారాజా టెంట్లు వీఐపీల కోసం 150 మహారాజా టెంట్లతో కూడిన ప్రత్యేక నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ఒక్కరోజు ఛార్జీ రూ.30 వేలకు పైగా ఉంటుంది. వీటితో పాటు 1,500 సింగిల్ రూమ్‌లు, 400 ఫ్యామిలీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు డోమ్ సిటీని సిద్ధం చేశారు. వీటి అద్దె లక్షకు పైగా ఉంటుంది. మహాకుంభ్‌లో లక్షన్నర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 300 మొబైల్ టాయిలెట్లు ఉన్నాయి. 2013లో మొత్తం 33,903 మరుగుదొడ్లు నిర్మించారు. ఘాట్ వద్ద దాదాపు 10 వేల దుస్తులు మార్చుకునే గదులను నిర్మించనున్నారు. 2013 కుంభ్‌లో దుస్తులు మార్చుకునే గదుల సంఖ్య దాదాపు రెండున్నర వేలుగా ఉన్నాయి. 23 నగరాల నుంచి విమానాలు మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇది 13 వేలకు పైగా ట్రిప్పులను నడుపనుంది. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తారని రైల్వేశాఖ అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌తో పాటు నగరంలోని 8 రైల్వే స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ వేలకు పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్‌కతాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మహాకుంభ్‌కు వీవీఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్ విమానాలు ప్రయాగ్‌రాజ్ రానున్నాయి. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో కేవలం 15 విమానాలకు మాత్రమే పార్కింగ్ స్థలం ఉంది. అందువల్ల, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు రాష్ట్రా ల్లోని 11 విమానాశ్రయాల నుంచి పార్కింగ్‌కు సంబంధించిన నివేదికలను అందించాల ని కోరింది. నీటి అడుగునా నిఘాం మహాకుంభ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈసారి విద్యుత్‌కు రూ.391.04 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మొత్తం 67 వేల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 85 కొత్త తాత్కాలిక పవర్ ప్లాంట్లు, 170 సబ్ స్టేషన్లు నిర్మించారు. మహాకుంభ్‌లో ఆకాశంతో పాటు డ్రోన్ల ద్వారా నీటి అడుగున కూడా నిఘా ఉండనుంది. నీటి అడుగున భద్రత కోసం తొలిసారిగా నదిలోపల 8 కిలోమీటర్ల మేర డీప్ బారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 25 మెగా ఈవెంట్లు జరగనున్నాయి. దీనిని విదేశీ కంపెనీలు రూపొందించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక కార్యక్రమానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. పదికి పైగా దేశాల అధినేతలు రానున్నారు. -
నీళ్లు లేక బోసిపోయిన కందకుర్తి త్రివేణి సంగమం
-
27 చెట్లు.. ఇనుము వాడకుండా నిర్మాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ ఆగస్టు 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లుగా నిర్మాణం జరగనుంది. ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా.. మిగిలిన 57 ఎకరాలను రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు. ఒక్కొ నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు. నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది. ఇనుము లేకుండా నిర్మాణం ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది. పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు. అంతేకాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నాటనున్నారు. ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు. మందిరం భూమి పూజ తర్వాత రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో శేషవతార్ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్ ప్రతిపాదించింది. మందిర నిర్మాణం ముగిసిన తర్వాత శేషవతార్ శాశ్వత నిర్మణాన్ని చేపడతారు. రాముడి పుట్టుక నుంచి అవతారం ముగిసేవరకు జరిగిన పలు అంశాలతో ‘రామ్ కథా కుంజ్ పార్క్’ నిర్మాణం కూడా జరగనుంది. అలానే మందిరం తవ్వకాలలో లభించిన అవశేషాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు గోశాల, ధర్మశాల, ఇతర దేవాలయాల సముదాయాలు కూడా ఇక్కడ నిర్మిస్తారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మందిరం ఎత్తు మరో 20 అడుగులు పెంపు మందిరం భూమి పూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు. దీని మీద ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా ఆలయం పేరు, ప్రదేశం, సమయం ఈ పలకపై సంస్కృతంలో చెక్కుతారు. 1988లో ప్రతిపాదించిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎత్తు 161 అడుగులు. అయితే ప్రస్తుతం దాన్ని మరో 20 అడుగులు పెంచినట్లు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి సి సోంపురా కుమారుడు నిఖిల్ సోంపురా తెలిపారు. ఆగస్టు 5న జరగనున్న మందిర భూమి పూజ కోసం గంగా, యమున, సరస్వతి నదులు సంగమ క్షేత్రం అయిన త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది. రామ్ మందిర్ ఉద్యమంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పలువురు సాధువులు ప్రముఖ పాత్ర పోషించినందున.. అయోధ్యలో భూమి పూజ జరిగే రోజున వివిధ మఠాలు, దేవాలయాల్లో వేడుకలు జరుగుతాయని వీహెచ్‌పీ ప్రతినిధి అశ్వని మిశ్రా తెలిపారు. (మందిర నిర్మాణంపై పవార్ కీలక వ్యాఖ్యలు) భూమి పూజ నాడు దీపాలు వెలిగించాలి ఆగస్టు 5 న సాయంత్రం తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని వీహెచ్‌పీ హిందువులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా వీక్షకులు, సాధువులు శంఖం పూరిస్తారని అశ్వని మిశ్రా తెలిపారు. ఆగస్టు 5న ఆలయానికి పునాదిరాయి వేయాలని ట్రస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించింది. -
‘ప్రియాంక’ గంగాయాత్ర
అలహాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రాభవాన్ని తిరిగి తెచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నడుం బిగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సోమవారం ‘గంగా యాత్ర’ ప్రారంభించారు. ‘మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా సోదరుడు ఏం చెబుతాడో.. అదే చేసి చూపిస్తాడు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ప్రయాగరాజ్ జిల్లాలోని కఛ్‌నర్ తెహ్సీల్లో ఉన్న మనయ్య ఘాట్ నుంచి గంగానదిలో మోటారు బోటులో ప్రయాణం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో బోటు ద్వారా 100 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణిస్తారు. బోటు ప్రయాణం ప్రారంభించడానికి ముందు సంగం వద్ద ఉన్న బడే హనుమాన్ మందిర్‌లో పూజలు నిర్వహించారు. ప్రసంగాలు ఇవ్వడం కంటే ప్రజల కష్టాలు, సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలు గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటిదని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘వారు వస్తారు. బస చేస్తారు. పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇస్తారు. ఎన్నికలు అయిపోగానే ఏ స్విట్జర్లాండ్‌కో, ఇటలీకో వెళ్తారు’అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ విమర్శించారు. ‘పప్పు కీ పప్పీ వచ్చారు’ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను ‘పప్పు’అని, ఆయన సోదరి ప్రియాంకను ‘పప్పీ’ అని కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని కావాలని పప్పు అంటుంటారు. ఇప్పుడు కొత్తగా ‘పప్పు కీ పప్పీ’ వచ్చారు’’అని శర్మ అన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ‘ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో.. మాటలూ అలాగే ఉన్నాయి. కేంద్రమంత్రి స్థానంలో ఉండి ఓ మహిళ పట్ల అలా ఎలా మాట్లాడతారు’ అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ధీరజ్ గుర్జర్ మండిపడ్డారు. -
ఎంత ఘోరం!
అంత వరకు అక్కడే ఆడుకున్నాడు.. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తూ కేరింతలు, తుళ్లింతలతో ఆనందంగా గడిపాడు.. అంతలో ఏమైందో ఎలా జరిగిందో గానీ ఆ బాలుడు నీళ్లలో కొట్టుకుపోయాడు.. ఈ విషయాన్ని ఒడ్డుకు వచ్చే వరకు తల్లిదండ్రులు గమనించలేదు.. అల్లంత దూరంలో కుమారుడిని చూసి లబోదిబోమన్నారు.. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శ్రీకాకుళం, వంగర: కళ్లెదుటే పేగుబంధం తెగిపోయింది. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని పరమశివుడిని వేడుకోవడానికి వచ్చిన ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. తమ బంధువులు, స్నేహితులతో దైవదర్శనానికి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఇటు తల్లిదండ్రులు, అటు బంధువులు, మరో పక్క స్నేహితుల మధ్యన నదిలో స్నానమాచరిస్తున్న బాలుడు.. విగత జీవుడై విషాదం నింపాడు. ఈ ఘటన వంగర మండలం సంగాంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద జరిగింది. తల్లిదండ్రుల కలల పంట కార్తీక్ పాణిగ్రాహి (10) వారికి కన్నీరు మిగులుస్తూ నీటి పాలయ్యాడు. సంగమేశ్వరస్వామి దర్శనార్ధం, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకోసం కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన జగన్నాథ పాణిగ్రాహి, భాగ్యలక్ష్మి, సోదరి భవానితో కలిసి పాలకొండ మండలం మల్లివీడు సింగుపురం గ్రామంలో ఉన్న పిన్ని వేపాకుల విజయలక్ష్మి, చిన్నాన్న వేపాకుల రామకృష్ణల ఇంటికి చేరుకున్నారు. ఈ రెండు కుటుంబాలతోపాటు ఒడిశాలోని పలు ప్రాంతాలకు చెందిన బంధువులతో కలిసి మంగళవారం వేకువజామున సంగాంకు వచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకోవాలని కుమారుడు కార్తీక్, కుమార్తె భవానితో కలిసి జగన్నాథ్ దంపతులు 25మందితో త్రివేణి సంగమం ప్రాంతానికి వెళ్లారు. రేగిడి మండలం సరసనాపల్లి పంటపొలాలను ఆనుకొని ఉన్న నదీ ప్రాంతమంతా కొద్దిపాటి లోతు ఉంటుంది. ఈ ప్రాంతంలో కార్తీక్ అందరితో కలిసి స్నానం చేస్తున్నాడని భావించి.. అక్కడి వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. కార్తీక్ కనిపించకపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారంతా నదిలో గాలించగా వారు స్నానం చేసే ప్రాంతానికి 15 మీటర్ల దూరంలో కార్తీక్ ఆచూకీ లభ్యమైంది. బందోబస్తులో ఉన్న పోలీసులు హుటాహుటిన సంగమం ప్రాంతం నుంచి యాత్ర స్థలి వరకు బైక్‌పై బాలుడిని తరలించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో.. ఎస్సై జి.అప్పారావు స్పందించి వంగర పీహెచ్‌సీకి పోలీసు వాహనంలో కార్తీక్‌ను తరలించారు. వైద్యుడు వి.రాము బాలుడిని తనిఖీ చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రెయినీ ఎస్సై కొత్తూరు శిరీష బాలుడి మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పారాపురంలో విషాద చాయలు కొత్తూరు: కార్తీక్ పాణిగ్రాహి మృతితో బాలుని స్వస్థలం పారాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు స్థానిక హోలీక్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4 తరగతి చదువుతున్నాడు. కార్తీక్ మృతి చెందిన వార్త పారాపురంలో తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలో మంచి తెలివైన విద్యార్థిగా గుర్తింపు ఉన్న కార్తీక్ మృతి చెందడాన్ని ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నతనంలోనే అందని లోకానికి కొడుకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఎంతో మంచి చదువులు చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలన్న వారి ఆశలు త్రివేణి సంగమంలో గల్లంతయ్యాయి. తల్లడిల్లిన తల్లి హృదయం తన కొడుకు మరణవార్త విని తల్లి భాగ్యలక్ష్మి తల్లడిల్లింది. పుణ్యస్నానం ఆచరించి దైవదర్శనం చేస్తే మంచి భవిష్యత్ వస్తుందని దేవాలయానికి తెస్తే ఏకంగా ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయావా అంటూ కార్తీక్ తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి జగన్నాథ్‌లు గుండెలు అవిసేలా ఏడ్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనపై ఆరోగ్య సిబ్బంది, దేవాదాయశాఖ స్పందించిన తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివేణి సంగమ ప్రాంగణంలో అరకొరగా హెచ్చరిక బోర్డులున్నాయని వారు ఆరోపించారు. -
కుంభమేళాలో కిన్నెర అఖాడా
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్జెండర్లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి. ‘ప్రాచీన భారతంలో ట్రాన్స్జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. మందిరం కోసం 33 వేల దీపాలు అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. -
త్రివేణి సంగమం.. భక్త జనసంద్రం
కాళేశ్వరం (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న గోదావరి పుష్కరాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పుష్కరాల్లో తొలిరోజు కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోత్సవాల మధ్య ఆలయ గోపురం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు పాల్గొని పుష్కరస్నానం చేశారు. గోదావరి ప్రవహించే తీరంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎటు చూసినా ఆధ్యాత్మికం.. భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత పవిత్ర క్షేత్రం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. తొలి రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. -
కాళేశ్వరం దర్శించినంతనే ముక్తి..
పుష్కరస్నానం పుణ్యఫలదాయకం. పితృదేవతలకు పిండ తర్పణాలు, జపాల దానాలు అనాదిగా వస్తున్న సంప్రదాయం. వీటితో మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని నమ్మకం. కాశీలో మరణిస్తే ముక్తి... కానీ, కాళేశ్వరంలో దర్శించినంతనే ముక్తి కలుగుతుందని నమ్మకం. పుష్కర మహత్యం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ క్షేత్ర మహత్యంపై కాళేశ్వ దేవస్థాన ప్రధాన అర్చకులు క్రిష్ణమూర్తి పలు విషయాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... పుష్కర సమయాల్లో పుణ్యనదీ స్నానం పుణ్యప్రథమని హిందువుల నమ్మకం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషదులు, ఔషదుల నుంచి ఆహారం, ఆహారం నుంచి జీవుడు జన్మించాడు. జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. పుష్కరం అంటే పన్నెండు. మన దేశంలో పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ప్రాణకోటికి ఆధారమైన జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలాధాల వెంటనే నాగరికత విస్తరించింది. అలాంటి జలానికి దేవత రూపాన్నిచ్చి తల్లిగా ఆదరించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, మంగళస్నానాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, పితృతర్పణాలు ఇలా అన్నీ జలంతో ముడిపడినవే. నదీ తీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని ఆచారం. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి. రాశులు పన్నెండు, ముఖ్యమైన నదులు పన్నెండు. అందుకే పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాదిపాటు ఆ నదికి పుష్కరమే కానీ, సాధారణంగా పుష్కరం ప్రారంభమైన మొదటి 12 రోజులు ఆది పుష్కరం అని, చివరి 12 రోజులు అంత్యపుష్కరమని నిర్వహిస్తుంటారు. పవిత్ర నదుల్లో మానవులు స్నానాలాచరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు. నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులై బాధపడుతుండగా పుష్కరుడు అనే ప్రభువు బ్రహ్మ కోసం తపస్సుచేసి బ్రహ్మ అనుగ్రహంతో పవిత్రక్షేత్రం గా మారిన పుష్కరుడు పుష్కరతీర్థంగా మారి స్వర్గంలోని మందాకిని నదిలో అంతర్భూతమై 12 ఏళ్లపాటు ఉంటాడు. అటు పిమ్మట ఏటా బృహస్పతి(గురుగ్రహం) ఏ రాశిలో ప్రవేశిస్తుందో... దాని వల్ల ఏ నదికి పుష్కరం వస్తుందో ఆయా నదులను ఆయన దర్శిస్తుంటాడని ఇతిహాసం. స్వయంగా బ్రహ్మ అనుగ్రహం పొందినవాడు వచ్చినప్పుడు సప్తమహారుషులు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని ప్రతీతి. సప్తరుషులు, సమస్త దేవదేవతలు పుష్కర సమయంలో సూక్ష్మదేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదని విశ్వాసం. (కాశీలో మరణిస్తే ముక్తి కాగా, కాళేశ్వరంలో కేవలం దర్శించినంత మాత్రానే ముక్తి లభిస్తుందని ఇక్కడి మహత్యం. కాళేశ్వరం ఆలయంలో ఒకే పానపట్టంపై ముక్తీశ్వరుడు, కాళేశ్వరుడు ఉండ డం ఇక్కడి ప్రత్యేకత. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీ నదుల కలయికతో త్రివేణి సంగమంగా కాళేశ్వరం పేరుగాంచింది. అందుకే ప్రసిద్ధి పొందింది. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరించటంతోపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం, జపాలు, ఇతర దానాలు చేయడం సంప్రదాయం.) - మహదేవపూర్