మహా కుంభమేళాకు కొనసాగుతున్న భక్తుల వరద
మూడు రోజుల్లోనే ఏకంగా ఆరు కోట్లు దాటిన వైనం
ఒక్క సంక్రాంతి రోజే 3.5 కోట్ల పై చిలుకు
29న మౌనీ అమావాస్యకు 10 కోట్ల మంది వస్తారని అంచనా
సాక్షి, న్యూఢిల్లీ: మహా కుంభమేళాకు భక్తుల వరద అంచనాలకు మించుతోంది. మేళాలో పాల్గొని పవి త్ర స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నానాయుధ ధారులైన నాగా సాధువులు, సంతులు తొలి ‘షాహీ స్నాన్ (రాజస్నానం)లో పాల్గొన్నారు.
తెల్లవారుజాము 3 గంటల వేళ శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచయతీ అటల్ అఖాడా సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిపై హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది. ఈ సందర్భంగా డమరుక, శంఖనాదాలతో సంగమ స్థలమంతా ప్రతిధ్వనించింది. ఇక బుధవారం కూడా దాదాపు కోటి మంది దాకా భక్తులు వచ్చినట్టు చెబుతున్నారు.
తొలి రోజు సోమవారం 1.65 కోట్లకు పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించినట్టు వెల్లడించడం తెలిసిందే. తొలి మూడు రోజుల్లో భక్తుల సంఖ్య 6 కోట్లు దాటినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు భక్తుల సంఖ్య ఏకంగా 10 కోట్లు దాటుతుందని అంచనా! అందుకు ఏర్పాట్లూ చేయాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు.
ఆరోగ్యానికి పెద్దపీట
భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా యూపీ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంది. 100 పడకలతో ‘సెంట్రల్’ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఓపీతో పాటు ఇందులో ఆపరేషన్లు కూడా చేసే వీలుంది. ఇక్కడి మెడికల్ స్టోర్‌లో 276 రకాలకు చెందిన ఏకంగా 107 కోట్ల ట్యాబ్లెట్లున్నాయి! 380 పడకలతో 43 తాత్కాలిక ఆసుపత్రులు, అసంఖ్యాకంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 14 ఎయిర్ అంబులెన్సులూ అందుబాటులో ఉన్నాయి. 400 మంది వైద్యులు, వెయ్యికి పైగా సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు.
లారెన్ పావెల్ కాళీ బీజదీక్ష
యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ బుధవారం త్రివేణి సంగమ ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ‘‘అనంతరం శ్రీ నిరంజనీ పంచాయ్ అఖాడా అధిపతి స్వామీ కైలాసానందగిరి నుంచి ఆమె కాళీ బీజదీక్ష స్వీకరించారు. గురుదక్షిణ కూడా సమర్పించారు’’ అని అఖాడా ప్రతినిధి వెల్లడించారు. ఆమె సోమ, మంగళవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పవిత్ర స్నానం అనంతరం కోలుకున్నట్టు ప్రతినిధి తెలిపారు.
నాగసాధువులతో ‘వాక్
బయటి ప్రపంచానికి ఎప్పుడూ మిస్టరీగానే ఉండే నాగ సాధువుల జీవితాలను గురించి తెలుసుకునేందుకు కుంభ మేళా సందర్భంగా యూపీ సర్కారు వీలు కల్పించింది. వారితో ‘వాక్ టూర్’ను అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీని బట్టి రూ.2వేల నుంచి రూ.3,500 దాకా చెల్లిస్తే చాలు, నాగ సాధువులతో వాక్ టూర్ చేయవచ్చు. అఘోరీలు, కల్పవాసీల గురించి కూడా టూర్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం 900 మందికి పైగా సుశిక్షిత టూర్ గైడ్‌లు అందుబాటులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment