మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
సాక్షి, న్యూఢిల్లీ/మహాకుంభ్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. వెయ్యికి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు.
ప్రతి రైల్లోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. జనరల్ బోగీల పరిస్థితైతే వర్ణనాతీతం! ఒక్కో రైలుకు నాలుగైదు చొప్పున జనరల్ బోగీలున్నా అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి! ఢిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. పైగా అప్పటికప్పుడు ప్రయాణ వేళలు మార్చడం, టికెట్ ధరలను విపరీతంగా పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు.
ఇవి పాటించాలి
కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించే విషయంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. కుంభమేళాలో స్నానం మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికని గుర్తుంచుకోవాలి. స్నానం ఆచరించే ముందు సంగమ జలాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మేళాలో తొలి స్నానం క్షేమం కోసం, రెండోది తల్లిదండ్రుల పేరుతో, మూడోది గురువు పేరుతో ఆచరించాలి. త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.
యోగి పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నూతన వారధుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్శించబోతున్నట్లు తెలిపారు. యూపీ యువతకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో యోగి పుణ్యస్నానం ఆచరించారు.
అంతరిక్షం నుంచి కనువిందు
కోట్లాది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపిస్తున్న మహా కుంభమేళా దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. వీటిని అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చిత్రీకరించా రు. టెంట్ సిటీ ఏర్పాటవక ముందు, ఏర్పాటైన తర్వాతి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మేళా పరిసర ప్రాంతాలు సైతం ఆకర్షిస్తున్నాయి. 2023 సెపె్టంబర్‌లో, 2024 డిసెంబర్ 29న చిత్రీకరించిన ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment