మహా కుంభమేళాకు 13వేల రైళ్ల రాకపోకలు
విజయవాడ, సికింద్రాబాద్‌ల నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్‌కు రైళ్లు
హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు నేరుగా విమానసేవలు
అందుబాటులో టెంట్‌లు, విల్లాలు
www.irctctourism.com, www.upstdc.co.in వెబ్‌సైట్ల ద్వారా బస కోసం బుకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: అశేష జనవాహినితో భగవన్నామ స్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పుణ్యస్నానాలనగరి, త్రివేణి సంగమస్థలిలో మహాకుంభమేళాకు భక్తకోటి బారులుతీరింది. భక్తిపారవశ్యంతో పోటెత్తే కోట్లాది మందికి ‘మహా కుంభమేళా’ప్రాంతంలో విడిదిసహా రాకపోకలు, ఇతర సౌకర్యాల కోసం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 40కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సకల సౌకర్యాలపై రాష్ట్ర సర్కార్ దృష్టిసారించింది. మహా కుంభమేళాకు వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. అధునాతన ప్రపంచ ఆధ్యాత్మిక ఘట్టంగా మహా కుంభమేళా నిలిచిపోయేలా యోగీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశం నలుమూలల నుంచి మహాకుంభ మేళాకు వచ్చే భక్తులు www. irctctourism.com తోపాటు www. upstdc. co. in వెబ్‌సైట్‌లో విడిది, ఇతర టూర్ ప్యాకేజీల కోసం బుక్ చేసుకునే ఏర్పాట్లు చేశారు.
తెలుగు ప్రాంతాల నుంచి రైళ్లు
దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కుంభమేళా సమీప రైల్వేస్టేషన్లకు 50 రోజుల్లో మొత్తంగా 10,000 సాధారణ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ, సికింద్రాబాద్‌ల నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళా జరిగే ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి రైల్వేశాఖ రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లు ప్రయాగ్‌రాజ్ చెయోకీ రైల్వేస్టేషన్ వరకు వెళతాయి.
మరికొన్ని ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్ వరకు వెళుతున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా ఒకే ఒక్క విమాన సౌకర్యం ఉంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచి విమానంలో వెళ్లే వారు హైదరాబాద్‌లో ఇదే విమానం ఎక్కాల్సి ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగే ప్రాంతానికి వేల కొద్దీ ఆటోలు, క్యాబ్‌లు, ద్విచక్రవాహనాలు, రిక్షా సౌకర్యాలు ఉన్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.
వెలసిన టెంట్ సిటీ: మహాకుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉండేందుకు రైల్వేశాఖకు చెందిన ఐఆర్‌సిటీసీ పలు ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉండాలనుకునే వారు ఠీఠీఠీ. జీటఛ్టిఛ్టిౌuటజీటఝ.ఛిౌఝ వెబ్‌సైట్‌లలో బుక్ చేసుకోవచ్చు. చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 12గంటలకు, చెక్ అవుట్ టైం మరుసటి రోజు ఉదయం 10గంటలుగా నిర్ణయించారు. టెంట్ అయితే రూ.18,000, విల్లా అయితే రూ.20,000 ధర నిర్ణయించారు.
‘ఐఆర్‌సిటీసీ మహాకుంభ్ గ్రామ టెంట్ సిటీ’పేరుతో బస సౌకర్యం అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. స్నానాల గది, వేడి, చల్లటి నీరు, కుంభమేళాను వీక్షించేందుకు ఎల్‌ఈడీ టీవీ, ఏసీ సౌకర్యాలూ అందిస్తున్నారు. ఒక టెంట్‌లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉండేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకసారి బుకింగ్ పూర్తయ్యాక రద్దు చేసుకుంటే బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వరు.
రూ.1500తో కూడా ఉండొచ్చు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సైతం బస ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసింది. ఒక్క రాత్రి విడిదికి రూ.1,500 నుంచి రూ.35,000 ధరలో వేర్వేరు రకాల భిన్న బస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విల్లా అయితే ఇద్దరు ఉండేందుకు రోజుకు రూ.35,000 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు వ్యక్తికి మరో రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. మహారాజా విభాగంలో ఇద్దరికి రూ.24,000, అదనంగా మరో వ్యక్తి బసచేయాలంటే మరో రూ.6,000 చెల్లించాలి.
స్విస్ కాటేజ్ కేటగిరీలో ఇద్దరు భక్తులకు కలిపి రూ.12,000, అదనంగా మరో వ్యక్తి బసచేస్తే రూ.4,000 చెల్లించాలి. ఈ సౌకర్యాల కోసం www.upstdc.co.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చులో యాత్ర ముగించాలనుకునే వారికీ ఆయా ప్రాంతాల్లో రూ.1500కే బస ఏర్పాట్లు ఉన్నాయి. హోటల్స్, లాడ్జిలు బస నిమిత్తం రోజుకు రూ.1500 నుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. స్థానికుల ఇళ్లల్లో బసకూ ప్రభుత్వం అనుమతించింది.
హోం స్టేకి కూడా రూ.500 నుంచి రూ.10వేల వరకు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. క్యారవాన్‌లో సైతం బస ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఒక్కో క్యారవాన్ 8మందికి అనుమతి ఇస్తోంది. ఒక్క రోజుకు రూ.18,000 వసూలు చేస్తున్నారు. రోజుకు 350 కిలోమీటర్లు ఈ క్యారవాన్‌లో ప్రయాణించొచ్చు. అంతకు మించితే ఒక్కో కిలోమీటర్‌కు రూ.70 వసూలు చేయనున్నారు. ఎక్కడైనా ఓ గంటపాటు నిలిపి ఉంచితే మాత్రం ఒక్కో గంటకు రూ.700 చెల్లించాలి. వీటితో పాటు గంగా నదిలో పడవ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బోటు అయితే ఒక్కో వ్యక్తికి రూ.5,000, మినీ క్రూయిజ్ బోట్ అయితే ఒక్కో భక్తుడి నుంచి రూ.900 వసూలుచేయనున్నారు.
యోగాసనాలకూ అవకాశం
ప్రయాగ్‌రాజ్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్య యోగా టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. దీనికి ఒక్కో వ్యక్తి రూ.500 చార్జ్ చేస్తున్నారు. యోగా టూర్ ప్యాకేజీలో భాగంగా ఉదయం 6గంటలకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ నుంచి టూర్‌ను ప్రారంభించి ‘రహీ త్రివేణి’కి తీసుకెళ్తారు. 6.30గంటలకు నైనీలోని అరైల్ వద్ద యమునా నది ఒడ్డున ఉన్న త్రివేణి పుష్ప్, పర్మార్త్ నికేతన్ అనే ఆకర్షణీయమైన ప్రాంతాలను చూపిస్తారు.
9.30గంటల నుంచి 10.30గంటల వరకు యోగా, ధ్యానం చేసుకోవచ్చు. విరామం, విశ్రాంతిలో భాగంగా మధ్యాహ్నం ఒంటి నుంచి 2 గంటలకు భోజన సౌకర్యాలు కల్పిస్తారు. 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య యోగా, ధ్యానం, సాయంత్రం 5.30గంటలకు సంగం హారతి సదుపాయం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఫ్లోటింగ్ రెస్టారెంట్ వద్దకు తీసుకురావడంతో టూర్ ముగుస్తుంది. రూ.5,000 ప్యాకేజీలో బోట్ సౌకర్యం, పానీయాలు, అల్పాహారం, భోజనం, పర్యావరణహిత చేతి సంచులు, నీళ్ల సీసాలు, కుంభమేళా మ్యాప్‌లు ఉచితంగా ఇస్తారు.
వీవీఐపీల డిజిటల్ భద్రత బాధ్యత కాన్పూర్ ఐఐటీకి
భక్తుల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాయి. సాంకేతిక పరిజ్ఞానంతో మహాకుంభలో భద్రతను పటిష్టం చేశారు. పుణ్య స్నానమాచరించడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశాలకు చెందిన వీవీఐపీలు ప్రయాగ్‌రాజ్ రానున్నారు. దీంతో వీవీఐపీల డిజిటల్ భద్రతను సమీక్షించే బాధ్యతను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాన్పూర్ ఐఐటీకి అప్పగించింది.
మేళాలో వీవీఐపీల భద్రతలో ఐఐటీ కాన్పూర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ పర్యవేక్షణలో పది మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తల బృందం డిజిటల్ భద్రతను పరిశీలిస్తోంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీతో సహా అత్యాధునిక సాంకేతికతను వీవీఐపీల భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. మహాకుంభ్ జరిగే ప్రాంతాల్లో వివిధ చోట్ల సెన్సర్లను, స్కానర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. డిజిటల్ భద్రతకు సంబంధించిన పనులను కాన్పూర్ ఐఐటీ బృందం రెండు నెలల క్రితమే మొదలెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment