
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది.
ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.
జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.
(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)
బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు.
ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లు
కాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment