MahaKumbh2025: ప్రారంభమైన ఆధ్యాత్మిక సంరంభం | Maha Kumbh Mela 2025 Started At Triveni Sangam In Uttar Pradesh Prayagraj, Know About Interesting Rare Details And Arrangements | Sakshi
Sakshi News home page

MahaKumbh2025: ప్రారంభమైన ఆధ్యాత్మిక సంరంభం

Published Mon, Jan 13 2025 6:09 AM | Last Updated on Mon, Jan 13 2025 10:00 AM

Maha Kumbh Mela to be held at Triveni Sangam in Prayagraj in Uttar Pradesh

45 రోజులు.. 50 కోట్ల భక్తులు

ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభమేళా

144 ఏళ్లకు వచ్చే అరుదైన వేడుక 

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మికోత్సవం

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో ఉదయం 5గం.15ని. పుష్య పూర్ణిమ పుణ్య స్నానాలతో మొదలైంది. 144 ఏళ్లకోసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా..  45 రోజుల పాటు కొనసాగనుంది.  ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పుణ్య స్నానాలతో ఈ ఆధ్యాత్మిక సంరంభం ముగియనుంది.

తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. అనంతరం భక్త జనాన్ని స్నానాలకు అనుమతిస్తున్నారు. దేశ నలుమూలల నుంచే గాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు, ఔత్సాహికులు కుంభమేళాను తిలకించేందుకు పోటెత్తనున్నారు. మహా కుంభమేలా ప్రారంభమైన కాసేపటికే ప్రముఖులు.. మరీ ముఖ్యంగా విదేశీ సందర్శకులు సందడి కనిపించింది. తొలిరోజే కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా. 

 

 

ప్రయాగ్‌రాజ్‌కు ‘కుంభ కళ’ 
కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ ఉత్సవ కళ సంతరించుకుంది. ప్రపంచ నలుమూల నుంచీ కోట్లలో వచ్చే భక్తులు, సందర్శకులతో కళకళలాడనుంది. రాత్రి వేళల్లో రేడియం వెలుగుల్లో మెరిసిపోతోంది. కార్యాలయాలు, గోడలు, ఫ్లై ఓవర్ల పొడవునా సనాతర ధర్మం, దేవీదేవతలకు సంబంధించిన పెయింటింగులతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్య కూడళ్లు కలశం, శంఖచక్రాలు, ఓంకారం యోగాసనాల థీమ్‌లతో కూడిన ఏర్పాట్లతో అలరిస్తున్నాయి. ఎంట్రీ పాయింట్ల వద్ద భారీ స్వాగత స్తంభాలు ఆకర్షణగా నిలిచాయి.

 ముఖ్యమైన రోజులు  
జనవరి 13    పుష్య పౌర్ణమి 
జనవరి 14    మకర సంక్రాంతి 
జనవరి 29    మౌనీ అమావాస్య 
ఫిబ్రవరి 2    వసంత పంచమి 
ఫిబ్రవరి 12    మాఘ పౌర్ణమి 
ఫిబ్రవరి 26    మహాశివరాత్రి

విశేషాలెన్నో... 
త్రివేణిసంగమం, పరిసరాల్లో 10 వేల ఎకరాల పై చిలుకు స్థలంలో ప్రత్యేకంగా ‘కుంభ్‌నగర్‌’ పేరుతో ఏకంగా ఓ ప్రత్యేక పట్టణమే పుట్టుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక ఆవాస ప్రాంతంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. మేళాకు తరలివచ్చే భక్తులకు ఆశ్రయం తదితర అవసరాలను ఇది తీర్చనుంది. ఇందులో కనీసం కోటి మందికి సరిపడా ఏర్పాట్లున్నాయి. 
→ గంగా నదిపై 30 బల్లకట్టు వంతెనలు 
→ 2,700 ఏఐ కెమెరాలు, వెయ్యికి పైగా సీసీ కెమెరాలు, వందల డ్రోన్లు 
→ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వాటర్‌ అంబులెన్సులు 
→ విదేశీ పర్యాటకులకు ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా పెవిలియన్‌’ 
→ 1800111363, 1363 నంబర్లలో టోల్‌ఫ్రీ సేవలు

ప్రథమ చికిత్స కేంద్రాలు 
→ కోట్ల మంది వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. 
→ అత్యవసర చికిత్స కోసం విస్తృతంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు పెట్టారు. 
→ అన్ని సౌకర్యాలతో కూడిన 10 పడకల మినీ ఐసీయూలు పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.

భక్తుల నుంచి పీఠాధీశుల దాకా...
.సాధారణ భక్తులతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాల అధిపతులూ కుంభమేళాలో పాల్గొంటారు. వారంతా ఇప్పటికే త్రివేణిసంగమం చేరుకున్నారు. గత నెల రోజులుగా ఒక్కొక్కరుగా అట్టహాసంగా నగరప్రవేశం చేసి ఆకట్టుకున్నారు. 13 ప్రఖ్యాత అఖాడాలతో పాటు పలు సంప్రదాయాలకు చెందిన చిన్నా పెద్దా పీఠాలు సంగమ స్థలిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ఆశ్రమాలు, టెంట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిలోనే ప్రత్యేకంగా పూజా మందిరాలు కూడా వెలిశాయి. నెలన్నర పాటు రాత్రిళ్లు నెగళ్లు వేసి, అక్కడే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసాద వితరణ వంటివి జరపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి సూచకగా ఆదివారం సంగమ స్థలిలో నమామి గంగే బృందం ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ క్రతువు నిర్వహించారు. నది పవిత్రతను, స్వచ్ఛతను కాపాడతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్‌ రహితంగా ఉత్సవం జరుపుకుందామని పిలుపునిచ్చారు. భక్తులకు జ్యూట్‌ బ్యాగులు పంచారు. 

దక్షిణాది నుంచి 60 లక్షల మంది 
మహా కుంభమేళాకు తెలుగు వారు లక్షలాదిగా తరలనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి కనీసం 60 లక్షల మందికి పైగా ఉత్సవంలో పాల్గొంటారని అంచనా. 

స్వచ్ఛత కోసం పది వనాలు 
మహా కుంభమేళాకు కోట్ల మంది వస్తున్నందున పరిశుభ్రమైన, స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం రెండేళ్ల నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. జపాన్‌ విధానంలో 10 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చిన్న చిన్న వనాలను పెంచింది.

రైలు ప్రయాణికులకు ఎన్‌క్లోజర్లు 
కుంభమేళా భక్తుల్లో అత్యధికులు రైలు ద్వారానే వస్తారని యోగీ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్‌ రైల్వే జంక్షన్‌ వద్ద వారికోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వారికోసం నాలుగు వైపులా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో నాలుగింటిని సిద్ధం చేశారు. రైలు దిగి రాగానే అవి కనిపిస్తాయి. ప్రతి ఎన్‌క్లోజర్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, మొబైల్‌ ఛార్జింగ్‌ తదితర సౌకర్యాలున్నాయి. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 1800 4199 139 టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెచ్చింది.

‘‘అనాదికాలం నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న భారత ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆధునిక ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటిచెప్పేందుకు 
మహా కుంభమేళా చక్కని వేదికగా నిలవనుంది’’    
 – యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 

 

వాటర్‌ అంబులెన్సులు 
ముఖ్యమైన పర్వదినాల్లో పవిత్ర స్నానాల కోసం కోట్ల మంది భక్తులు రానున్నందున అదుపు తప్పి నీట మునిగేవారిని కాపాడేందుకు వందల సంఖ్యలో డీఆర్‌ఎప్‌ బృందాలు మోహరించాయి. రక్షించేందుకు, ప్రథమ చికిత్స అందించేందుకు వాటర్‌ అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. వాటిలో వైద్యుడు, పారా మెడికల్‌ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీఐజీ ఎంకే శర్మ తెలిపారు.

విదేశీ పెవిలియన్‌ 
విదేశీ పర్యాటకులు, పండితులు, పరిశోధకులు, జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, ప్రవాస సంఘం, భారతీయ డయాస్పోరా కోసం 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర పర్యాటక శాఖ ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా పెవిలియన్‌’ ఏర్పాటు చేసింది. కుంభమేళా ప్రాముఖ్యతను తెలిపే విశేషాలను ఇక్కడ పొందుపరిచారు. విమాన ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేలా విమానయాన సంస్థలు కస్టమర్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి.

మహా కుంభమేళా యాప్‌ 
కుంభమేళాను వీక్షించేందుకు గూగుల్‌ ప్రత్యేక మ్యాప్‌ను సిద్దం చేసింది. బ్రిడ్జి, ఆశ్రమం, ఎరీనా రోడ్డు మొదలుకుని జాతరనంతా ఈ యాప్‌లో చూడొచ్చు. ఇది గూగుల్‌ పేస్టోర్, యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉంది. దేవాలయాల లోకేషన్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రదేశాలకు సంబంధించిన సమాచారమంతా ఇందులో పొందుపరిచారు.

మొత్తమ్మీద 40 కోట్ల దాకా భక్తులు రావచ్చని తొలుత భావించారు.  కానీ శని, ఆదివారాల్లో ఏకంగా 25 లక్షల మంది చొప్పున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం విశేషం! దాంతో 45 రోజుల్లో మేళాకు వచ్చే భక్తులు 50 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని యూపీ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా జనవరి 29న ఒక్క మౌనీ అమావాస్య నాడే ఏకంగా 5 కోట్ల మందికి పైగా పోటెత్తే అవకాశం ఉంది! 

ఇంతటి మహా క్రతువును సజావుగా నిర్వహించేందుకు కేంద్రం సహకారంతో సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. దాదాపు రూ.7,000 కోట్లు వెచ్చించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 

:::ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement