కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్రకందని కాలం నుంచీ జరుగుతూ వస్తోందని చెబుతారు. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభ మేళా అనే పేరు అమృతకలశం నుంచి వచ్చింది.
సాగరమథనం వల్ల పుట్టుకొచ్చిన అమృత భాండం నుంచి నాలుగు చుక్కలు భూమిపై ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో పడ్డాయని ఐతిహ్యం. తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతభాండం తెస్తుండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ నాలుగు చోట్లా కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది.
నాలుగు రకాలు
కుంభమేళా నాలుగు రకాలు. ఏటా మాఘ మాసంలో జరిగేది మాఘ మేళా. ఇది కేవలం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఆరేళ్లకు ఓసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయోగరాజ్‌ల్లో జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత, అంటే 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహా కుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయోగరాజ్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహా కుంభమేళా.
ఏం చేస్తారు?
కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా ఆచరించేది త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం. తద్వారా పాపాలు తొలగి దేహత్యాగానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందన్నది విశ్వాసం. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఆరు ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు. ఆ రోజుల్లో సంగమ స్థలికి ఇసుక వేసినా రాలనంతగా జనం పోటెత్తుతారు. పుణ్య స్నానం తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్షయ వటవృక్షాన్ని. ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని, అక్కడికి సమీపంలో ఉండే మాధవేశ్వరీ శక్తి పీఠాన్ని దర్శిస్తారు. మామూలు రోజుల్లో కంటే మేళా సమయంలో సంగమ స్థలిలో చేసే పుణ్యకార్యాలు అత్యంత ఫలప్రదాలని నమ్ముతారు.
కల్ప
వాసం కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు కల్పవాసం. భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో సంగమ ప్రాంతంలో నెల రోజుల పాటు దీన్ని నిష్టగా పాటిస్తారు. మేళా మొదలయ్యే పుష్య పౌరి్ణమ నాడు కల్పవాస సంకల్పం తీసుకుంటారు. అప్పటినుంచి మాఘ పూరి్ణమ దాకా కల్పవాసాన్ని పాటిస్తారు. ఆ నెల పాటు సంగమ స్థలం దాటి వెళ్లరు. రోజూ గంగలో మూడు మునకలు వేయడం, యోగ, ధ్యానం, పూజలు, ప్రవచనాల శ్రవణం వంటివాటితో పూర్తి భక్తి భావనల నడుమ కాలం గడుపుతారు. ఈసారి 15 నుంచి 20 లక్షలకు పైగా భక్తులు కల్పవాసం చేయనున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. వారి కోసం కుంభ్‌నగర్‌లో విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment