మహా కుంభమేళాలో తెలుగు కీర్తి | Telegu Cultural Dancers Will Perform In Maha Kumbh Mela | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళాలో తెలుగు కీర్తి

Published Sat, Jan 11 2025 5:27 AM | Last Updated on Sat, Jan 11 2025 5:27 AM

Telegu Cultural Dancers Will Perform In Maha Kumbh Mela

కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్య ప్రదర్శనలకు కేంద్రం అనుమతి 

దేశవ్యాప్తంగా 160 మంది కళాకారులను ఎంపిక చేసిన సాంస్కృతి శాఖ 

వీరిలో పద్మజా రెడ్డి, ఆనంద శంకర్‌ జయంత్, దీపికా రెడ్డి, కళాకృష్ణ  

నమామీ గంగే, శివసతాయం, శివ పల్లవి థీమ్స్‌తో నృత్య ప్రదర్శనలు

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్‌ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి.

 ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు.  

‘శివోహం’తో ఆనంద 
‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్‌. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్‌ జయంత్‌ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్‌ జయంత్‌.  

‘శివసతాయం’తో దీపికా రెడ్డి 
‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్‌ పర్సన్‌’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. 

‘శివపల్లవి’తో కళాకృష్ణ 
తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్‌ఎన్‌ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు.  

‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి 
కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్‌’ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement