kuchipudi
-
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
అందెల రవళికి స్వర్ణోత్సవం
నేటి నుంచి జరగబోయే పతాక స్వర్ణోత్సవాలకు కూచిపూడి సిద్ధమైంది. సిద్దేంద్రయోగి అడుగు జాడలతో కూచిపూడి వెలిగిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి అభిమానులు, నాట్యకారులను అమితంగా ఆకర్షిస్తున్న మాట... కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం. ‘కూచిపూడి’ పుట్టిన కూచన్నపూడి గ్రామం పేరు కూచిపూడిగా మారింది. దేశానికి జాతీయ జెండా ఉన్నట్లుగానే కూచిపూడి వైభవాన్ని ప్రతిబించించే పతాకం ఒకటి ఉండాలని వేదాంతం పార్వతీశం సంకల్పించారు. చెరకుగడ, జడ, కర్ర గుర్తులతో 1974లో పతాకాన్ని రూపొందించారు. ఆ రూపకల్పన జరిగి యాభైఏళ్లు పూర్తయిన సందర్భంగా పతాక స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది కూచిపూడి. కూచిపూడి కళా పీఠం దగ్గర 50 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూప పతాకాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. మూడు రోజులపాటు కూచిపూడి గురువులు, కళాకారులు, కళాభిమానుల మధ్య రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పతాక స్వర్ణోత్సావాల నేపథ్యంలో చివరిరోజు రెండు వేల మందికి పైగా కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు కూచిపూడి సిద్ధం అయింది. ప్రదర్శనలకు ముందు అంబాపరాకు పాట పాడడం సంప్రదాయంగా వస్తోంది ‘అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా’ అంటూ కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం తన సంబరాన్ని అంబరంతో పంచుకునే దృశ్యం కనుల విందు చేయనుంది. గత వైభవం ఘనంగా...మన సంప్రదాయ కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. పతాక స్వర్ణోత్సవాలలాంటి కార్యక్రమాల ద్వారా గత వైభవాన్ని మళ్లీ ఘనంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆ ఉత్సాహంతో మన నాట్యకళ మరింత శక్తిమంతమై మరింతగా జనాల్లోకి వెళుతుంది.– జి. శ్రీవత్సల, రాజమహేంద్రవరంనవతరానికి స్ఫూర్తిని ఇచ్చేలా...అమ్మ సలహా మేరకు నేర్చుకున్న కూచిపూడి ఇప్పుడు నాకు మరో అమ్మ. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. దేశ విదేశాల నుంచి నాట్యకారులు పాల్గొనే ఈ కార్యక్రమాలతో ఆ గడ్డపై గత వైభవం మరోసారి పునరావిష్కృతం అవుతుంది. నవతరానికి స్ఫూర్తిని ఇస్తుంది.– ఎం. వసుధ, హైదరాబాదుఆ జెండా రెప రెపలలో...కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల సందడి ఆప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి కళాకారులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆ జెండా రెపరెపలలో కూచిపూడి కళ మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.– లంక సుస్మిత, విజయవాడదిశానిర్దేశం చేసే పతాకంకూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ప్రపంచం నలుమూలలలో ఉన్న కూచిపూడి కళాకారులకు పండగలాంటివి. అంతెత్తున ఎగరబోయే జెండా కూచిపూడి నృత్యానికి సంబంధించి మౌనంగానే దిశానిర్దేశం చేయనుంది.– జల్లూరి శరణ్య, మచిలీపట్నంకెనడాలో కూచిపూడియాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తునందుకు సంతోషంగా ఉంది. కెనడాలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు చేశాను. ఆసక్తి ఉన్న వారికి నేర్పించడంతో పాటు ప్రదర్శనలు ఇస్తున్నాను. కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.– డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతి రావు, కెనడాపేద పిల్లలకు అండగా... ప్రతి ఏటా ఆర్థిక స్థోమత లేని ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చుతో కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నాను. ఇప్పటికి 40 మందికి నేర్పించా. ఇక్కడ నేర్చుకున్న ఎంతోమంది నాట్య పాఠశాలలు మొదలుపెట్టి ఆసక్తి ఉన్న వారికి కూచిపూడి నేర్పిస్తున్నారు.– డా. రవి బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్, కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి– ఎస్.పి యూసుఫ్, సాక్షి, మచిలీపట్నంఫోటోలు: పవన్, సాక్షి, విజయవాడ -
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
Avantika: అద్భుతం.. అవంతిక నృత్యం
కూచిపూడి, భరతనాట్యం, జానపదం, కథకళి, కథక్, మణిపురి, ఒడిస్సీ, మోహినీ అట్టం, యక్షగానం ప్రముఖమైన నృత్యకళలు. వీటిలో భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాల్లో కనిపించే శిల్పాలు భరతనాట్య భంగిమలో దర్శనమిస్తాయి. తంజావూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భరతనాట్యమంటే అందరికీ ఇష్టమే. భరతనాట్య కళాకారులకు గుర్తింపు, గౌరవం కూడా ఎక్కువే. అలాంటి గుర్తింపు, గౌరవాన్ని చిన్న వయసులోనే సొంతం చేసుకుంది మార్కాపురానికి చెందిన చిన్నారి అవంతిక. మార్కాపురం: కళలపై అభిరుచి ఉన్న తలిదండ్రులు తమ పిల్లలను ప్రముఖ కళాకారులుగా చూడాలని కోరుకుంటారు. మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి దంపతులు కూడా తమ కుమార్తె అవంతికను నాట్య కళాకారిణిగా చూడాలని భావించారు. ఐదేళ్ల వయసు నుంచే నాట్య గురువు ప్రతిమ దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నారు. 2016లో ప్రారంభమైన నృత్య శిక్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. మార్కాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి గడిచిన ఏడేళ్లలో సొంతూరితోపాటు ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా నరసింహ కౌతువం ప్రదర్శనలో అవంతిక నాట్యం అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో హావభావాలు, ముఖ కవళికలను చూసి తీరాల్సిందే. 2022లో మలేíÙయా, 2023లో శ్రీలంక, ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయ్‌లోనూ నృత్య ప్రదర్శనలిచ్చిన అవంతిక అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకుంది. అంతే కాదండోయ్.. చదువులో కూడా అవంతిక క్లాస్ ఫస్టే. మరొక విశేషమేమిటంటే అవంతిక సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది.గెలుపొందిన అవార్డులు ⇒ 2020లో నిర్వహించిన జాతీయ నృత్య ఉత్సవాల్లో పాల్గొని నంది పురస్కారం అందుకుంది. ⇒ 2021లో హంపిలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలో అంజనా పురస్కారం, ధూర్జటి పురస్కారం, నాట్యమయూరి పురస్కారం పొందింది. ⇒ 2022లో జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది. డివిజన్ స్థాయి ఐకాన్ అవార్డు పొందింది. అలాగే బాల నాట్య నర్తకీమణి, నర్తన నంది, గజకేశరి పురస్కారాలు పొందింది. ⇒ కాళహస్తిలో నిర్వహించిన నృత్య పోటీలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ⇒ రాజమండ్రిలో నిర్వహించిన పోటీల్లో రెండో స్ధానం, శ్రీశైలంలో నిర్వహించిన జాతీయ స్ధాయిలో మూడో స్ధానంలో నిలిచింది. ⇒ 2023లో అంతర్జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది. నాట్యం, సంగీతం చాలా ఇష్టం మా అమ్మాయి అవంతికకు నాట్యమంటే ఇష్టమని గమనించి నాట్య గురువు ప్రతిమ వద్ద 2016లో శిక్షణలో చేరి్పంచాం. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రేక్షకులను మెప్పించి బహుమతులు సాధించింది. ఈ మధ్య సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ చదువులో కూడా ఫస్ట్ వస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన కళల్లో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తే సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించినవారవుతారు. మానసిక ఆనందంతోపాటు గౌరవం కూడా లభిస్తుంది. – భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి -
ప్రపంచ వారసత్వ దినోత్సవం: వారసత్వ మెట్లు.. ‘కూచిపూడి’ వెలుగులు (ఫొటోలు)
-
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
స్కూల్ బస్సు బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి.. -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
కూచిపూడి వనంలో జాబిల్లి
ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం కూచిపూడి నాట్యం. దీనిలో అభినయానికి, భావ ప్రకటనకు ప్రాధాన్యమిస్తారు. అటువంటి కూచిపూడి నృత్యమే శ్వాసగా.. నాలుగేళ్ల ప్రాయం నుంచే నాట్య కళకు అంకితమై ఘనాపాటిగా పేరొందారు పి.వనజాచంద్రశేఖర్. ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానంతోపాటు వందల వేదికపై సత్కారాలు పొంది ప్రశంసలు అందుకున్నారు. కూచిపూడి శిక్షణాలయాలు ఏర్పాటుచేసి నాట్యగురువుగా అనేక మంది విద్యార్థులకు నృత్యంపై ఆసక్తి పెంచుతున్నారు. గన్నవరం రూరల్: ఏలూరులో జన్మించిన వనజ కూచిపూడి నాట్య ప్రదర్శనలతో దేశమంతా ప్రశంసలు పొందుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే ప్రాయానికి మించి కూచిపూడి నాట్యంపై మక్కువ చూపారు. ఆమెకు నాలుగేళ్ల వయసులో వారి ఇంటికి సమీపంలో ఉండే నాట్యగురువు నాగమణి బుద్ధదేవ్ ప్రభావం ఆమైపె పడటంతో కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ మార్గదర్శకంలో 1990లోనే స్వాగత గీతంతో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 1700కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక సత్కారాలు పొందారు. విద్యార్థులకు శిక్షణాలయాలు 2016లో వివాహం చేసుకున్న వనజ చంద్రశేఖర్ గన్నవరం నియోజకవర్గం పెద అవుటపల్లిలో అత్తవారింట స్థిరపడ్డారు. ఆ తర్వాత కూడా ఆమె కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి నృత్యాన్ని జనజీవనంలో మరింత ప్రాచుర్యం పొందడానికి నాట్య శిక్షణాలయాలు ఏర్పాటు చేశారు. గన్నవరం, పెద అవుటపల్లి, ఆత్కూరు గ్రామాల్లో 70మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అత్తవారింటి ప్రోత్సాహంతో కళను ఔత్సాహికులందరికీ నేర్పాలని ఆకాంక్షతో పలు పాఠశాలల్లో కూడా కూచిపూడి నృత్యాన్ని నేర్పుతున్నారు. 2012లో గిన్నిస్ బుక్‌లో స్థానం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2012లో ప్రదర్శించిన మహా బృంద నాట్యంతో ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గురువు నాగమణి బుద్ధదేవ్ ఆధ్వర్యంలో దేశంలోని మహా నగరాల్లో, ప్రఖ్యాత ఆలయాల్లో, విదేశీయులు, సీఎంలు, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు పాల్గొన్న వేదికలపై కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ప్రదర్శనలు రాంచి, జంషెడ్పూర్, ఆగ్రా, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక మంజునాథ టెంపుల్, తమిళనాడు, కేరళ, రాజస్తాన్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణ లీలలు, దశావతార ఘట్టాలు, గోదాదేవి కల్యాణంలో గోదాదేవిగా, అర్ధనారీశ్వరునిగా, మన్మథుడిగా, నారదుడు, నరసింహుడు, ప్రహ్లాదుడు వేషధారణలు వేసి పండిత పామరులతో ఔరా అనిపించుకున్నారు. మహిషాసుర మర్ధనిగా, మోహినీగా ఆమె హావభావాలు ప్రేక్షకులకు కనులపండువగా నిలిచాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిగా ప్రదర్శించిన కళాఖండాలు ప్రశంసలు పొందాయి. నాట్య కళాపరిషత్‌ల జేజేలు ఆమె చేసిన ప్రదర్శనలకు మెచ్చిన కళాపరిషత్‌లు జేజేలు పలికాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో గురువు నాగమణి బుద్ధదేవ్ ప్రతినెలా 15 ప్రదర్శనలను ఏర్పాటు చేసే వారని తెలిపారు. ముంబాయి అభినయ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, విజయవాడ ధర్మ పరిషత్, అఖిల భారత కూచిపూడి నాట్య మండలి, సిలికాన్ ఆంధ్రా ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్, ప్రపంచ తెలుగు మహా సభలు–ఏలూరు, కుంభమేళా ప్రదర్శనలు ఆమె కీర్తి కిరీటంలో మచ్చు తునకలు. బ్రహ్మాంజలి నృత్యంలో పెట్టింది పేరు. బాలరత్న, కళారత్న, నాట్య కిరీటి బిరుదులతో ఆమె ప్రశంసలు సాధించారు. కూచిపూడి నాట్యానికి పూర్వ వైభవం కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం రావాలి. ప్రభుత్వం కూచిపూడి నృత్యానికి ఆదరణ కల్పించటం ఆనందదాయకం. పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలి. తగిన ఆదరణ కల్పించాలి. ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తే నాట్య గురువులకు గౌరవంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించినవారవుతారు. –వనజ చంద్రశేఖర్ -
కూచిపూడి నృత్య అరంగేట్రం చేసిన శాలిని దేవరకొండ
-
విజయవాడ : నేత్రపర్వం.. నృత్యోత్సవం ( ఫొటోలు)
-
సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు అన్నా నేహాథామస్ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్‌కు పలువురు అభినందనలు తెలిపారు. -
కూచిపూడి కళాకారులకు సినీ హీరో కార్తీ సాయం
బంజారాహిల్స్: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కళాకారులకు కష్టకాలం దాపురించింది. ఈ పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న కూచిపూడి కళాకారులను ఆదుకునేందుకు సినీ హీరో కార్తీ ముందుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ.లక్ష సాయం అందించారు. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లోనే సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తన లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తి చేసుకున్నాడు. గుర్తించిన 50 మంది కళాకారులకు ఈ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేసినట్లు భావన తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి కళాకారుల తరఫున ఆమె కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్న హీరో కార్తి -
ఈ పాదం నటరాజుకే అంకితం
అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. తెలుగువారి నృత్యరీతికి జీవితాన్ని ధారపోసిన ఆమె ప్రయాణం ఇకపై మరోలోకంలో కొనసాగనుంది. శోభానాయుడు అనే అసలు పేరును, కూచిపూడి మహారాణి అనే ముద్దుపేరును కలిగిన ఆ నాట్యశిరోమణి ఒక జీవితకాలంలో పది జీవిత కాలాల కృషిని చేసింది. దేశ విదేశాల్లో రెండువేల మంది విద్యార్థులు ఆమె దారిలో కూచిపూడి నాట్యతారలుగా మెరుస్తున్నారు. ఆమె తయారు చేసిన వందకు పైగా సోలో కొరియోగ్రఫీలు రాబోయే తరాలకు నాట్యగ్రంథంగా మారనున్నాయి. ఆమే సత్యభామ. ఆమే చండాలిక. ఆమే దుర్గ. ఆమే దేవదేవి. ఆమె కోసమే కూచిపూడి రూపుదిద్దుకుంది. కూచిపూడి కోసమే ఆమె జన్మించింది. ఒక నృత్యకారిణి, భారతీయ స్త్రీ సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం... మరెంతో అంకితభావం ఉండాలి. తనకు అవి ఉన్నాయని ఆఖరి శ్వాస వరకూ నిరూపించిన నాట్యవిదుషీమణి శోభానాయుడు. నేడు ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. మువ్వలు మూగపోయాయి. తెలుగు వారి నాట్యం ఈ ధ్రువతారకు సదా రుణపడే ఉంటుంది. శోభానాయుడు జీవితాన్ని తరచి చూస్తే కూచిపూడి కోసం ఆమె ఎంత నిబద్ధతతో పని చేశారో తెలుసుకుని గౌరవం రెట్టింపవుతుంది. ఆమె కూచిపూడి మీద ప్రేమతో ఇతర నాట్యరీతులను కూడా నేర్చుకోలేదు. కోట్లరూపాయలు రాగల సినిమా అవకాశాలను తృణీకరించారు. ఆమె ఆరోప్రాణం మాత్రమే ఆమెది. పంచప్రాణాలూ కూచిపూడే. అనకాపల్లి అమ్మాయి శోభానాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రాజమండ్రిలో పెరిగారు. తండ్రి వెంకట రెడ్డి ఇంజినీరు. తల్లి సరోజమ్మ గృహిణి. తండ్రికి నృత్యాలు, కళలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ పెంచుకున్న కూతురి నైపుణ్యాన్ని గ్రహించి తల్లి సరోజమ్మ ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదనే నమ్మకంతో తొలుత రాజమండ్రిలోని నాట్యాచార్యుడు పి.ఎల్.రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభా నాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా, మెరుగైన శిక్షణ కోసం సరోజమ్మ ఆమెను మద్రాసు తీసుకువచ్చి, వెంపటి చినసత్యం వద్ద చేర్పించారు. కూతురి శిక్షణ కోసం పదకొండేళ్లు ఒక చిన్న ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారు. వెంపటి చినసత్యం వద్ద శోభా నాయుడు గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కుమార్తె శివరంజని తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కూచిపూడి నర్తకిగా రాణిస్తున్నారు. అరండేల్ ఆశీస్సులు... శోభా నాయుడు అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి, భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్ ఎంతగానో ముగ్ధులయ్యారు. ‘అనవసరంగా సినిమాల వ్యామోహంలో చిక్కుకోవద్దు. కూచిపూడి ప్రక్రియకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు’ అంటూ ఆశీర్వదించారు. రుక్మిణీదేవి అరండేల్ సలహాను శోభా నాయుడు అక్షరాలా పాటించి, పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వివిధ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్యరూపకాల్లో కీలక పాత్రలు ధరించి, తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలోనూ ఆమె చిరస్మరణీయమైన కృషి చేశారు. నృత్య రంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో ఊరేగించి.. పల్లకీ మోశారు. సత్యభామ శోభానాయుడు ‘భామా కలాపం’తో చాలా ఖ్యాతి పొందారు. సత్యభామగా సినిమాల్లో జమున అభినయానికి కీర్తిగడిస్తే కూచిపూడిలో శోభానాయుడు ఖ్యాతి గడించారు. ఆమె ప్రదర్శించే శ్రీకృష్ణపారిజాతం రూపకాన్ని తిలకించేందుకు జనం పోటెత్తేవారు. భర్త అయిన కృష్ణుడి మీద దాచుకోవాలనిపించేంత ప్రేమ, తనమీద అతడి ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం దూరంగా నెట్టేస్తూనే దగ్గరకు తీసుకోవాలన్న ఆత్రం... ఇవన్నీ ఆమె సత్యభామ పాత్రలో ఆద్భుతంగా చూపిస్తారు. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘శ్రీకృష్ణ శరణం మమ’, ‘చండాలిక’, ‘మేనక–విశ్వామిత్ర’, ‘విప్రనారాయణ’, ‘విజయోస్తు నారీ’, ‘గిరిజా కళ్యాణం’, ‘స్వామి వివేకానంద’ వంటి దాదాపు పదహారు నృత్యరూపకాలను, నృత్యనాటికలను శోభానాయుడు తన బృందంతో కలసి దేశ విదేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో లెక్కకు మిక్కిలిసార్లు ప్రదర్శించారు. ఎన్నో సోలో ప్రదర్శనలూ ఇచ్చారు. ‘సత్యభామ’ పాత్రలో చేసే అభినయానికి ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నృత్య నాటికలో అన్ని పాత్రలనూ తానే అభినయిస్తూ చేసే ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. బ్లాంక్ చెక్ ఇచ్చినా... ఎన్నో అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చినా శోభా నాయుడు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. పదహారేళ్ల వయసులో ‘అభిమానవంతులు’ (1973) సినిమాలో ‘ఎప్పటివలె కాదురా నా స్వామి... ఎప్పటివలె కాదురా’ అనే పాటలో వెండితెరపై మెరిసిన శోభా నాయుడుకు ఆ తర్వాత కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఆమెను తన సినిమాల్లో నటించమని కోరారు. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కారు పంపించి, తన సినిమాలో నటించాల్సిందిగా తానే స్వయంగా అడిగారు. ఈ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.నాగిరెడ్డి ఏకంగా బ్లాంక్ చెక్ చేతిలో పెట్టినా, తిరిగి ఇచ్చేసి, నాట్యానికే పూర్తిగా అంకితం కాదలచుకున్నానని చెప్పారు. నాగిరెడ్డి కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అలాగని, శోభా నాయుడుకు సినిమాలంటే వ్యతిరేకత ఏమీ లేదు గాని, కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కాగలవనే కారణంతోనే ఆమె చాలా అవకాశాలను వదులుకున్నారు. అయితే, తన గురువు వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వం వహించిన వాటిలో ‘అమెరికా అమ్మాయి’ వంటి అతికొద్ది చిత్రాలకు సహాయ నృత్యదర్శకురాలిగా పనిచేశారు. తీరని కోరిక... నృత్య గ్రంథాలయం కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు ఐదు శతాబ్దాలు పురుషులే నాట్యాచార్యులుగా ఏలారు. శోభా నాయుడు సాగించిన నిరుపమానమైన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూచిపూడి నృత్య అకాడమీ ప్రిన్సిపాల్‌గా 1981లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. ఆమెకు దాదాపు 1500 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్య అకాడమీని శాఖోపశాఖలుగా విస్తరించారు. ఎన్నెన్నో పురస్కారాలు సంప్రదాయ నృత్యరంగంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. నిజానికి శోభానాయుడు కృషి మరో రెండు దశాబ్దాలైనా కొనసాగాల్సింది. ఆమె మరెన్ని ఎత్తులకు ఎదగాల్సింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పాడు సంవత్సరం ఆమెను తీసుకుపోయి తెలుగువారిని నిజంగా వంచించింది. ఇది క్షమార్హం కాని కాలం. – పన్యాల జగన్నాథ దాసు -
అద్భుతంగా సప్తగిరి వైభవం
-
భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్ అవార్డు
హైదరాబాద్ : కూచిపూడి నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి అంతర్జాతీయ లేడీ లెజెండ్-2020 అవార్డు వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, ఆటా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్, ఆట జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూపతిరాజు లక్ష్మి వద్ద పలువురు నాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. -
పట్టుచీర కట్టుతో.. అతనే ఆమైతే..!
సాక్షి, ఆదోని(కర్నూలు): అబ్బాయి అమ్మాయి అయితే ఎలా వుంటుంది? సంప్రదాయ పట్టుచీర కట్టుతో వేదికపైకి వచ్చి.. చక్కటి హావభావాలతో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంటే ఎలా అనిస్తుంది. ఆదోని పట్టణం మండగిరి వీధికి చెందిన శ్రీనివాసులు అచ్చం ఇలాగే చేస్తున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టి, ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 23న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యంలో బెస్ట్ ఫర్మామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఇటీవల ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సెట్కూర్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కళా ప్రదర్శన పోటీల్లో కూడా కూచిపూడిలో మొదటి బహుమతి, భరత నాట్యంలో తృతీయ బహుమతి అందుకున్నాడు. అంతేగాక అంతర్జిల్లా పోటీలకు అర్హత సాదించాడు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో కూడ తన అద్భుత నాట్య కళాభినయంతో అందరి మెప్పు పొందుతున్నాడు. వర్ధమాన కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీనివాసులు.. స్థానికంగా ఉన్న అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్లు విజయ్‌కుమార్, వాసు, రాజ్‌కుమార్‌తో శిక్షణ పొందుతున్నాడు. డిగ్రీ దాకా పూర్తి చేసిన శ్రీనివాసులు తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేస్తానని చెప్పారు. తండ్రి బసన్న.. కట్టెల మండి వ్యాపారి. తల్లి రంగమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందింది. అంతర్ జిల్లా పోటీలకు అర్హత సాదించిన శ్రీనివాసులును అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచోటి రామయ్య బుధవారం అభినందించారు. నాట్యమే తన జీవితంగా భావిస్తున్న శ్రీనివాసులుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని రాచోటి రామయ్య అకాంక్షించారు. తనకు చిన్నతనం నుంచి నాట్యమంటే ఎంతో మక్కువ అని, తన అసక్తి మేరకు నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సొసైటీ నిర్వాహకులు, డాన్స్ మాస్టర్లకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను నాట్యంలో అత్యుత్తమ కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం -
ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి
సాక్షి, విజయనగరం : నృత్యం చిన్నారులకు దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ ఇప్పిస్తే మెలకువలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక నాట్యంలో రాణిస్తారు. వేదికలపై అలరిస్తారు. దీనికి గొట్లాం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోడసింగి త్రివేణి నిదర్శనం. చిన్నవయసులోనే నాట్యంలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంటోంది. విద్యల నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తోంది. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో కీర్తనలకు అడుగులు కదిపి అలరిస్తోంది. చక్కని ప్రతిభ... త్రివేణి కూచిపూడి, భరతనాట్యంలో నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేసింది. పదవర్ణం, థిల్లానా, శబ్దం, అష్టపదులు అద్భుతంగా చేస్తూ అందరిమన్ననలు అందుకుంటోంది. కూచిపూడిలో బ్రహ్మాంజలి, భామా కలాపం, కొలువైతివా.. జతిస్వరం, థిల్లానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి త్రివేణి నాట్యంపై ఉత్సాహం చూపడంతో తల్లిదండ్రులు బి.అప్పలనారాయణ, లక్ష్మిల నర్తనశాల డాక్టర్ భేరి రాధికారాణి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. నాటినుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆమె వద్దనే శిక్షణ పొందుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చిన త్రివేణి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో త్రివేణి విశేష ప్రతిభ కనబరుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమమైనా తమ బృందం తరఫున ప్రధా న పాత్ర వహిస్తూ, గురువుల సారథ్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరిమన్ననలు అందుకుంటోంది. రాజస్థాన్, శ్రీకాళహస్తి, విజయవాడ, భు వనేశ్వర్, హైదరాబాద్, గుణుపూర్, బొబ్బిలి, సాలూ రు, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, తుని, తిరుపతి, భద్రాచలం, ఇలా ఆంధ్ర రాష్ట్రమంతా ప్రదర్శనలిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. పశంసలు, రికార్డులు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నామ సంవత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనతో అవార్డును సొంతం చేసుకుంది. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆçహూతుల ప్రశంసలందుకుంది. విజయనగర ఉత్సవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో త్రివేణి నృత్యం చూపరులను కట్టిపడేసింది. యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో త్రివేణి నృత్యానికి చోటు దక్కింది. డివిజనల్ యూత్ ఫెస్టివల్, గురజాడ 154వ జయంతి, శిల్పారామం, ఇంటర్నేనేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలులో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసపత్రాలు, మన్ననలు అందుకుంది. విశాఖరత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో త్రివేణి ప్రతిభకు నృత్యరత్న అవార్డు వరించింది. -
నృత్య మనోహరం
-
నాట్య విలాసం...
-
సత్యభామ గురించి విన్నాను.. ఇప్పుడు చూశాను
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర సంగీత నాటక ఆకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జి. పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి భామా కలాపం నృత్య ప్రదర్శన అలరించింది. ఇటీవల న్యూఢిల్లీలో కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సుమారు 30 మంది ప్రఖ్యాత శాస్త్రీయ కళాకారులు హాజరై నృత్యాలు ప్రదర్శించారు. డాక్టర్ పద్మజారెడ్డి ప్రదర్శించిన భామా కలాపం ప్రధానితో పాటు అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పద్మజా రెడ్డిని ప్రశంసిస్తూ ‘పద్మాజీ.. సత్యభామ పాత్ర గురించి నేను విన్నాను.. చదివాను.. ఇప్పుడు మీలో ఆమెను చూడగలగటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ప్రధాని ప్రశంసనీయ వ్యాఖ్యలపై పద్మజారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నివాసంలో ప్రదర్శనకు అవకాశం రావడం తనకెంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. తాను ప్రదర్శన ప్రారంభంలో వేదికపై వెళ్లినప్పుడు కొద్దిగా ఉద్వేగానికి గురయ్యానని.. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కమిటీకి పద్మజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
సప్తవర్ణ శోభితం..సప్తరాగ రంజితం..
-కన, విన వేడుకగా ఏడు నృత్యరూపకాలు –అలరించిన కూచిపూడి నృత్యోత్సవం రాజమహేంద్రవరం కల్చరల్ : వీనులకు విందుచేసే మధురమైన సంగీతానికి ఉత్తమ విలువలతో కూడిన సాహిత్యం అబ్బింది. సంగీత సాహిత్యాలకు రాగభావతాళయుక్తమైన చక్కని నృత్యాభినయం తోడైంది. వెరసి కళాభిమానుల కనులకు, వీనులకు విందు దక్కింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిర్విరామ సప్తనృత్యరూపకాల కూచిపూడి నృత్యోత్సవం హృదయరంజకంగా సాగింది. సంగీత త్రిమూర్తులు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, పదకవితాపితామహుడు అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్యపదాలు, నారాయణతీర్థుల తరంగాలతో పాటు ఆదిశంకరుల స్తోత్రసాహిత్యాలకు నృత్యరూపకాలు కళాదర్పణం పట్టాయి. నాట్యశాస్త్రం పంచమవేదమని కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్ నృత్యోత్సవానికి జ్యోతిప్రకాశనం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నాట్యశాస్త్రాన్ని బోధించిన భరతముని పేరులో మొదటి అక్షరమైన ‘భ’–భావాన్ని, ‘ర’ రాగాన్ని, ‘త’ తాళాన్ని తెలియచేస్తుందన్నారు. తాన్సేన్ సంగీతంతో వర్షంకురిపించాడన్నారు. నృత్యరూపకాలన్నిటిలో సనాతన భారతీయ వైభవాన్ని చాటడానికే ప్రయత్నించామన్నారు. ప్రతి రూపకం.. రసపూరితం.. తొలి నృత్యరూపకం సంగీత నాట్యామృత వైభవంలో భారతీయ సంగీత, నాట్యవైభవాలను చాటిచెప్పారు. గోరుగంతు లక్ష్మీదీపిక ప్రదర్శించిన ‘భామనే, సత్యభామనే, ఇంతినే, చామంతినే’ ఆకట్టుకుంది. ‘బ్రోచేవారెవరురా’, ‘మత్స్య, కూర్మ,వరాహ, మనుష్యసింహవామనా’ కీర్తనలకు కళాకారులు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. రెండోదైన సనాతన సాంప్రదాయ వైభవం రూపకంలో త్రిమూర్తుల్లో ఎక్కువతక్కువలు లేవని, జగన్మాత వలనే ముగ్గురికీ శక్తి కలుగుతోందన్న సందేశాన్ని ఇచ్చారు. ‘దశరథవర కుమారుడవయితివి’, ‘శంభో శివశంభో’, కీర్తనలకు, ఆదిశంకరుల‘అయిగిరి నందిని’ వంటిశ్లోకాలతో పాటు మహాకవి కాళిదాసు విచిత ‘చేటీభవన్నిఖిల కోటీ’ శ్లోకాన్ని వినిపించారు, ప్రదర్శించారు. దుర్గాసప్తశతి శ్లోకాలకు చిన్నారులు ప్రదర్శించిన అభినయనం ఆకట్టుకుంది. సనాతన గురువైభవం రూపకం ద్వారా భారతీయ సనాతన ధర్మంలో గురువు వైభవాన్ని తెలియచేశారు. ‘ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో’, ‘తక్కువేమి మనకు, రాముండొక్కడు తోడుండు వరకు’ ‘కృష్ణం వందే జగద్గురుం’ వాడవాడలా వెంట వసంతము’ వంటి కీర్తనలకు చక్కటి అభినయనాన్ని ప్రదర్శించారు. సాయి మహిమామృతం రూపకంలో సద్గురు సాయినాథుడు భక్తులకు తమ ఇష్టదైవం రూపంలో కనిపించడం వృత్తాంతం. ద్వాదశరాశి వైభవంలో యదువంశసుధాంబుధి చంద్ర, స్వామిరారా వంటికీర్తనలతో 12 రాశుల ప్రభావాన్ని కళ్లకు కట్టించారు. శ్రీశంకరవైభవంలో పరమేశ్వరుని ముఖం నుంచి ఉద్భవించిన పంచభూతాలు, సప్తస్వరాలు, పంచ వాయిద్యాలు, పంచతన్మాత్రలు, పది ఇంద్రియాలు,4 అంతఃకరణలు–ఇలా మొత్తం 36 తత్త్వాలను అభినయించారు. నక్షత్రమాలికాచరితంలో పదకవితా పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలతో, 27 నక్షత్రాలను వర్ణించారు. ఖగోళశాస్త్రం ఘనతను, త్రిమూర్తుల జీవన పరిమాణాన్ని వివరించారు. చివరిగా ,కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ రూపొందించిన గోదావరి హారతి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. రికార్డులకెక్కిన ప్రదర్శన ఏడు నృత్యరూపకాలను ఒకే ఆహార్యంతో ఉన్న 63 మంది కళాకారులు 12 గంటల 23 నిమిషాల ఒక సెకండులో పూర్తి చేశారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైనట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ప్రదర్శన ముగిశాక జరిగిన సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ పసుమర్తి శేషుబాబు మాట్లాడుతూ, దివినుంచి దిగి వచ్చిన అప్సరసలు చేసిన నాట్యం తిలకించిన అనుభూతి కలిగిందన్నారు. నిర్వాహకులను అభినందించారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన సినీ నటులు పూర్ణిమ, కిన్నెర కళాకారులను అభినందించారు. రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్, విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళాక్షేత్ర నిర్వాహకులు గోరుగంతు నారాయణ, గోరుగంతు ఉమాజయశ్రీ, ప్రపంచరికార్డుల ప్రతినిధులు పాల్గొన్నారు.