జీవితమే ఒక నృత్యం | Today is International Dance Day | Sakshi
Sakshi News home page

జీవితమే ఒక నృత్యం

Published Tue, Apr 28 2015 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

జీవితమే ఒక నృత్యం

జీవితమే ఒక నృత్యం

నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం
 
డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్.. అంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని అందించే పాఠాలు కళలే! అందులో నాట్యం వేసే ముద్రా ప్రాధాన్యమైనదే! వినోదమే ప్రధానంగా ఉన్న టీవీలో చాలా రియాలిటీ షోలకు నేటికీ డాన్సే ముఖ్యాంశం అయిందంటే దానికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. అంతలా డాన్స్‌కి ప్రాధాన్యం లభించేలా చేసింది యునెస్కో మొదలుపెట్టిన ‘ఇంటర్నేషనల్ డాన్స్ డే’! ఈ సందర్భంగా మన శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి ప్రముఖ కళాకారిణులు అచ్యుతమానస, డాక్టర్ హిమబిందు కనోజ్‌ల అభిప్రాయాలివి.
 - సరస్వతి రమ
 
జీవించడం ఎలాగో నేర్పుతుంది: ‘కూచిపూడి మై లైఫ్’ అంటూ కూచిపూడి నృత్యాన్ని అనాథ ఆడపిల్లలకు నేర్పిస్తూ తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న  కూచిపూడి, భరతనాట్యం, కథక్, మోహినీ ఆట్టం కళాకారిణి అచ్యుత మానస. నాట్యం ఓ కళే కాదు, విజ్ఞానాన్ని అందించే గురువు కూడా అంటారు ఆమె. ‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలాగా డాన్స్‌కి ఓ డే ఉండడం నిజంగా సంతోషమే. అయితే నేనీ డేస్‌కి వ్యతిరేకం. నా దృష్టిలో ప్రతిరోజు మాతృదినోత్సవమే.. పితృదినోత్సవమే. డాన్స్‌కి సంబంధించైతే లైఫ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ డాన్స్. ప్రతిరోజూ నవరసాలను అనుభవిస్తుంటాం.  శాస్త్రీయ నృత్యం జీవించడం నేర్పిస్తుంది. ఆత్మసంతృప్తి కలిగిస్తుంది.  మన శాస్త్రీయ నృత్యాల్లో వినోదం, విద్య రెండూ ఉన్నాయి. కానీ చాలామంది కేవలం వినోదాన్నే ఆస్వాదిస్తూ అది పంచే విజ్ఞానాన్ని గమనించక నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేశం కళలకు కాణాచి. కానీ అంతటి ప్రాధాన్యం అందట్లేదు. మానసిక వికాసాన్నిచ్చే ఇలాంటి కళలను పాఠ్యాంశాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్లకి నేర్పిస్తే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో అసాంఘిక శక్తులు మటుమాయమవుతాయి. ఆ దిశగా ఆర్ట్స్‌ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది’’ అంటారు మానస.

పిల్లల వ్యక్తిత్వం వికసిస్తుంది: డాక్టర్ హిమబిందు కనోజ్ కూచిపూడిలో డాక్టరేట్ చేసిన కళాకారిణి. హైదరాబాద్‌లోని చందానగర్‌లో ‘మువ్వ నృత్యరాగ నిగమం’ను నిర్వహిస్తున్న గురువు. ‘‘నాట్యం అంటే దైవారాధన. పెద్దల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల గౌరవం, ఆరాధన, మొత్తంగా విశ్వాన్నే ప్రేమించే తత్వాన్ని నేర్పిస్తుంది. మనలో కోపాన్ని, అహాన్ని తగ్గిస్తుంది. సహనాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని పెంచుతుంది. కళారూపంగా భావించి దీన్ని నేర్చుకుంటే ఓటమిని అధిగమించడమెలాగో తెలుపుతుంది. ఇవే కాదు, జీవితానికి అవసరమైన క్రమశిక్షణనూ నేర్పిస్తుంది. అందుకే నాట్యానికి వయసు అంతరం లేదు. వర్గ భేదాల్లేవ్. ఆసక్తి ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు. మా ఇన్‌స్టిట్యూట్‌లో పిల్లలు, పెద్దలు, (తల్లీ బిడ్డల కాంబినేషనూ ఉంది) గృహిణులు, వర్కింగ్ ఉమన్ అందరూ నేర్చుకుంటున్నారు. వర్కింగ్ ఉమన్, గృహిణులు అయితే నాట్య సాధనను మంచి స్ట్రెస్ రిలీజ్‌గా భావిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, టీవీ తప్ప వేరే ప్రపంచమే లేకుండా పోయిన నేటి పిల్లల్లోనైతే ఈ డాన్స్ ద్వారా మార్పు తెప్పిస్తున్నాం. దీనివల్ల మన కళలు, సంస్కృతి ఏంటో తెలుసుకోగలుగుతున్నారు వాళ్లు. ఒకరితో ఒకరు కలిసిపోవడం, ఒకరికోసం ఒకరు సర్దుకుపోవడం. ఒకరు గెలిచినప్పుడు అభినందించడం, గెలిచిన వాళ్లు మిగిలినవాళ్లను ఎంకరేజ్ చేయడం వంటివీ అలవడతాయి. వీటిని పెంపొందిం చేందుకు ప్రతి ఆరునెలలకోసారి మేం పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తుంటాం.

ఇందులో అతిథులను ఆహ్వానించడం దగ్గర్నుంచి యాంకరింగ్ చేయడం వరకు అన్నీ పిల్లలే చూసుకుంటారు. దీనివల్ల ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన పోటీని అలవర్చుకుంటారు. అన్నిటికీ మించి సృజన బయటకు వస్తుంది. ఏ అడ్డంకినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకుంటారు’’ అని చెప్తారు డాక్టర్ హిమబిందు! డాన్స్ ఈజ్ డివైన్ అన్నది అందుకేనేమో! నాట్యంతో సేవచేసిన, చేస్తున్న నాట్యకళామహానుభావులు అందరికీ కళాభివందనాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement