సప్తవర్ణ శోభితం..సప్తరాగ రంజితం..
సప్తవర్ణ శోభితం..సప్తరాగ రంజితం..
Published Sun, Jun 4 2017 10:10 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
-కన, విన వేడుకగా ఏడు నృత్యరూపకాలు
–అలరించిన కూచిపూడి నృత్యోత్సవం
రాజమహేంద్రవరం కల్చరల్ : వీనులకు విందుచేసే మధురమైన సంగీతానికి ఉత్తమ విలువలతో కూడిన సాహిత్యం అబ్బింది. సంగీత సాహిత్యాలకు రాగభావతాళయుక్తమైన చక్కని నృత్యాభినయం తోడైంది. వెరసి కళాభిమానుల కనులకు, వీనులకు విందు దక్కింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిర్విరామ సప్తనృత్యరూపకాల కూచిపూడి నృత్యోత్సవం హృదయరంజకంగా సాగింది. సంగీత త్రిమూర్తులు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, పదకవితాపితామహుడు అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్యపదాలు, నారాయణతీర్థుల తరంగాలతో పాటు ఆదిశంకరుల స్తోత్రసాహిత్యాలకు నృత్యరూపకాలు కళాదర్పణం పట్టాయి.
నాట్యశాస్త్రం పంచమవేదమని కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్ నృత్యోత్సవానికి జ్యోతిప్రకాశనం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నాట్యశాస్త్రాన్ని బోధించిన భరతముని పేరులో మొదటి అక్షరమైన ‘భ’–భావాన్ని, ‘ర’ రాగాన్ని, ‘త’ తాళాన్ని తెలియచేస్తుందన్నారు. తాన్‌సేన్ సంగీతంతో వర్షంకురిపించాడన్నారు. నృత్యరూపకాలన్నిటిలో సనాతన భారతీయ వైభవాన్ని చాటడానికే ప్రయత్నించామన్నారు.
ప్రతి రూపకం.. రసపూరితం..
తొలి నృత్యరూపకం సంగీత నాట్యామృత వైభవంలో భారతీయ సంగీత, నాట్యవైభవాలను చాటిచెప్పారు. గోరుగంతు లక్ష్మీదీపిక ప్రదర్శించిన ‘భామనే, సత్యభామనే, ఇంతినే, చామంతినే’ ఆకట్టుకుంది. ‘బ్రోచేవారెవరురా’, ‘మత్స్య, కూర్మ,వరాహ, మనుష్యసింహవామనా’ కీర్తనలకు కళాకారులు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. రెండోదైన సనాతన సాంప్రదాయ వైభవం రూపకంలో త్రిమూర్తుల్లో ఎక్కువతక్కువలు లేవని, జగన్మాత వలనే ముగ్గురికీ శక్తి కలుగుతోందన్న సందేశాన్ని ఇచ్చారు. ‘దశరథవర కుమారుడవయితివి’, ‘శంభో శివశంభో’, కీర్తనలకు, ఆదిశంకరుల‘అయిగిరి నందిని’ వంటిశ్లోకాలతో పాటు మహాకవి కాళిదాసు విచిత ‘చేటీభవన్నిఖిల కోటీ’ శ్లోకాన్ని వినిపించారు, ప్రదర్శించారు. దుర్గాసప్తశతి శ్లోకాలకు చిన్నారులు ప్రదర్శించిన అభినయనం ఆకట్టుకుంది. సనాతన గురువైభవం రూపకం ద్వారా భారతీయ సనాతన ధర్మంలో గురువు వైభవాన్ని తెలియచేశారు. ‘ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో’, ‘తక్కువేమి మనకు, రాముండొక్కడు తోడుండు వరకు’ ‘కృష్ణం వందే జగద్గురుం’ వాడవాడలా వెంట వసంతము’ వంటి కీర్తనలకు చక్కటి అభినయనాన్ని ప్రదర్శించారు. సాయి మహిమామృతం రూపకంలో సద్గురు సాయినాథుడు భక్తులకు తమ ఇష్టదైవం రూపంలో కనిపించడం వృత్తాంతం. ద్వాదశరాశి వైభవంలో యదువంశసుధాంబుధి చంద్ర, స్వామిరారా వంటికీర్తనలతో 12 రాశుల ప్రభావాన్ని కళ్లకు కట్టించారు. శ్రీశంకరవైభవంలో పరమేశ్వరుని ముఖం నుంచి ఉద్భవించిన పంచభూతాలు, సప్తస్వరాలు, పంచ వాయిద్యాలు, పంచతన్మాత్రలు, పది ఇంద్రియాలు,4 అంతఃకరణలు–ఇలా మొత్తం 36 తత్త్వాలను అభినయించారు. నక్షత్రమాలికాచరితంలో పదకవితా పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలతో, 27 నక్షత్రాలను వర్ణించారు. ఖగోళశాస్త్రం ఘనతను, త్రిమూర్తుల జీవన పరిమాణాన్ని వివరించారు. చివరిగా ,కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ రూపొందించిన గోదావరి హారతి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
రికార్డులకెక్కిన ప్రదర్శన
ఏడు నృత్యరూపకాలను ఒకే ఆహార్యంతో ఉన్న 63 మంది కళాకారులు 12 గంటల 23 నిమిషాల ఒక సెకండులో పూర్తి చేశారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైనట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ప్రదర్శన ముగిశాక జరిగిన సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ పసుమర్తి శేషుబాబు మాట్లాడుతూ, దివినుంచి దిగి వచ్చిన అప్సరసలు చేసిన నాట్యం తిలకించిన అనుభూతి కలిగిందన్నారు. నిర్వాహకులను అభినందించారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన సినీ నటులు పూర్ణిమ, కిన్నెర కళాకారులను అభినందించారు. రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్, విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళాక్షేత్ర నిర్వాహకులు గోరుగంతు నారాయణ, గోరుగంతు ఉమాజయశ్రీ, ప్రపంచరికార్డుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement