నాట్యోత్సవం | Kuchipudi classical dance .. | Sakshi
Sakshi News home page

నాట్యోత్సవం

Published Sat, Dec 28 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

నాట్యోత్సవం

నాట్యోత్సవం

కూచిపూడి సంప్రదాయ నృత్యరీతులు.. విభిన్న నాట్య విన్యాసాలు.. వెరసి తానీషా యువ నాట్యోత్సవాలు రసజ్ఞులను ఆనందడోలికల్లో ముంచెత్తారుు. కళాకారుల అందెల సవ్వళ్లు.. వీక్షకుల కరతాళ ధ్వనులతో కూచిపూడిలోని సిద్ధేంద్రయోగి కళావేదిక శుక్రవారం మార్మోగిపోరుుంది. ఆద్యంతం కళామయంగా సాగిన మొదటిరోజు కార్యక్రమాలకు జనుల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతర్జాతీయ కళాకారులు తమ నాట్య విన్యాసాలతో ఆకట్టుకున్నారు.
 
కూచిపూడి, న్యూస్‌లైన్ : అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నాట్యక్షేత్రమైన కూచిపూడిలో నిర్వహించే ‘తానీషా యువ నాట్యోత్సవ్’ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమాలను పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్మారక నాట్యోత్సవం పేరిట నిర్వహించారు. శ్రీసిద్ధేంద్ర యోగి కళావేదికపై ఏర్పాటుచేసిన నాట్య ప్రదర్శనలకు ప్రేక్షకులు నీరాజనాలర్పించారు.
   
తొలిగా అమెరికా కళాకారిణి హేమశిల్ప ఉప్పల కూచిపూడి అంశాలను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. సదాశివ బ్రహ్మేంద్ర రచించిన శృంగార ప్రాధాన్యత కలిగిన ‘జావలి ఎంతటి కులుకే..’ అంశంలో నాయిక విరహవేదన, భక్తి భావాలను ఆమె చూడచక్కగా ప్రదర్శించారు.
 
హాంకాంగ్‌కు చెందిన భరతనాట్య కళాకారిణి రూపా కిరణ్ విఘ్నేశ్వర స్తుతితో నాట్యాన్ని ప్రారంభించారు. పురందరదాస్ రచించిన ‘గజవదనా బేడువే..’ అంటూ పుష్పాంజలి అంశాన్ని ప్రదర్శించారు. మద్వాచార్యులు విరచిత ద్వాదశ స్తోత్రం (దశావతారం) ‘దేవకీనందన...’తో ప్రారంభించి విష్ణుమూర్తి అవతారాలను చూపించారు. చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లే రచిం చిన ‘మధురానగరిలో చల్లనమ్మబోవుదారి..’ అంటూ ప్రదర్శించిన అంశం ఆకట్టుకుంది.
 
పండిట్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత యేలేశ్వరపు శ్రీనివాసులు బృందం ప్రదర్శించిన ‘భక్తప్రహ్లాద’ సంక్షిప్త యక్షగానం ఆహ్లాదకరంగా సాగింది. ప్రహ్లాదుడిగా యేలేశ్వరపు లక్ష్మీసంధ్య వైష్ణవి, హిరణ్యకశ్యపుడిగా యేలేశ్వరపు శ్రీనివాసులు, నృసింహస్వామిగా యేలేశ్వరపు పూర్ణచంద్రరావు నర్తించారు.
 
చివరిగా ముంబరుుకి చెందిన నాట్యాచారిణి మేకల రాధామోహన్ బృందం ‘పద్మావతి కల్యాణం’ నృత్య నాటకం ప్రదర్శించింది. పద్మావతిగా శివానంద్, వేంకటేశ్వరస్వామిగా రాధామోహన్ నటన అద్భుతమనిపించింది. అన్నమాచార్యుడి కీర్తనల్లో ఈ అంశానికి సంబంధించిన కీర్తనలను క్రోడీకరించి రాధామోహన్ కోరియోగ్రఫీ చేసిన తీరు శభాష్ అనిపించుకుంది. శివుడిగా అంజలీసుందరం, పార్వతీదేవిగా ఇసికాజిందల్, భృగుమహర్షిగా కె.ప్రశాంత్‌కుమార్, నారదుడిగా పీటీఎన్ వీఆర్ కుమార్‌తో పాటు మీత, కేటికి, రాజేశ్వరి తదితర 24మంది కళాకారిణులు ఈ నృత్య నాటకంలో పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement