
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర సంగీత నాటక ఆకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జి. పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి భామా కలాపం నృత్య ప్రదర్శన అలరించింది. ఇటీవల న్యూఢిల్లీలో కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సుమారు 30 మంది ప్రఖ్యాత శాస్త్రీయ కళాకారులు హాజరై నృత్యాలు ప్రదర్శించారు. డాక్టర్ పద్మజారెడ్డి ప్రదర్శించిన భామా కలాపం ప్రధానితో పాటు అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పద్మజా రెడ్డిని ప్రశంసిస్తూ ‘పద్మాజీ.. సత్యభామ పాత్ర గురించి నేను విన్నాను.. చదివాను.. ఇప్పుడు మీలో ఆమెను చూడగలగటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ప్రధాని ప్రశంసనీయ వ్యాఖ్యలపై పద్మజారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నివాసంలో ప్రదర్శనకు అవకాశం రావడం తనకెంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. తాను ప్రదర్శన ప్రారంభంలో వేదికపై వెళ్లినప్పుడు కొద్దిగా ఉద్వేగానికి గురయ్యానని.. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కమిటీకి పద్మజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment