Padmaja Reddy
-
డాక్టర్ పద్మజారెడ్డి.. సామాజికాంశాలే నా నృత్య కళ
‘‘ఈ అవార్డు నాకు శివుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. నా కృషిని గుర్తించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా గురువు శోభానాయుడు, మా అమ్మనాన్నల ఆశీస్సులతో ఈ అవార్డు నన్ను వరించిందనుకుంటున్నాను. రానున్న రోజుల్లో నృత్యకళలో మరింతగా కృషి చేయడానికి ఈ అవార్డు నాకు ఊపిరి పోసిందనుకోవాలి. ఐదు దశాబ్దాలుగా నృత్యమే ప్రాణంగా జీవిస్తున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కంటున్న నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ అవార్డును మా గురువైన శోభా నాయుడు గారికి అంకితం చేస్తున్నాను’’ అన్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. మంగళవారం ఆమెకు కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. ‘నేనేం చెప్పాలనుకున్నా నా నృత్యకళ ద్వారానే ప్రదర్శించగలను. సామాజిక సమస్యల పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి శాస్త్రీయ నృత్యం ఎంత ప్రభావ వంతమైన సందేశాన్ని ఇవ్వగలదో నా ప్రదర్శన ద్వారా చూపడమే లక్ష్యం. నా నృత్య కృషి గురించి రాసి, ప్రజలలో మరింత గుర్తింపు తెచ్చిన ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు పద్మజారెడ్డి. కాకతీయం తెచ్చిన గుర్తింపు ‘తెలంగాణకు ప్రత్యేకమైన నాట్యకళ ‘కాకతీయం’ను నృత్య దృశ్యకావ్యంగా ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించాను. ఇందుకు నృత్యంలోనే కాకుండా కాకతీయుల నాటి వస్త్రధారణకు తగినట్టుగా డ్రెస్సులు, ఆభరణాల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ తరువాయి భాగం కాకతీయం–2 పేరుతో కిందటి నెలలో ప్రదర్శన ఇచ్చాను. వంద మంది మా అకాడమీ విద్యార్థులతో చేసిన ఈ ప్రదర్శన ఎంతోమందిని ఆకట్టుకుంది. తెలంగాణకు ఓ నృత్యరీతి ఉందని తెలియపరచడానికే నేను కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం ప్రధానంగా గుర్తించందనుకుంటున్నాను. అవగాహనే ప్రధానం కళలు ఉన్నవే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు కళ్లకు కట్టేలా నృత్యకళ ద్వారా చూపడమే నా ధ్యేయం. నా కళ ద్వారా జనాన్ని జాగృతం చేయడం శివాజ్ఞగా భావిస్తాను. సామాజికాంశాలలో బాలికల గురించిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిదిమేసే దారుణ కృత్యాలను నృత్యం ద్వారా చూపగలిగాను. అలాగే, ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలను చూపాను. కుటుంబ ప్రోత్సాహం మా వారు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి నా ఈ కృషిని వెన్నుదన్నుగా నిలిచి అందించిన ప్రోత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. అటు పుట్టిల్లు, ఇటు అత్తింటివైపు వారిలో ఎవరూ నృత్య కళలో లేరు. చిన్ననాటి నుంచి ఇష్టంతో నేర్చుకున్న కళ పెళ్లి తర్వాతా కొనసాగించాను. మా కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఇందులో భాగం కావాలని అడిగారు. కానీ, నా ధ్యాస, శ్వాస నృత్యమే అని తెలిసి కుటుంబం నాకు అన్ని విధాలా మద్దతునిచ్చింది’’ అంటూ ఇన్నేళ్ల తన కృషిని వివరించారు పద్మజారెడ్డి. గత నెల 26న ‘కాకతీయం–2 ప్రదర్శన’ సందర్భంగా ‘సాక్షి’ ఫ్యామిలీలో ప్రచురించిన కథనం... – నిర్మలారెడ్డి -
కాకతీయం.. చారిత్రక నృత్య సౌరభం
ప్రజల్లో చైతన్యం నింపేలా కూచిపూడి నృత్యకళకు ఆధునికతను జోడించారామె. కాలం పరిచయం చేస్తున్న నృత్యరీతులను కళ్లకు అద్దుకున్నారు. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని మన ముందుకు అంచెలంచెలుగా తీసుకువస్తున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి. కాకతీయుల కాలంలో తెలుగు నేలను అసమాన ధైర్య సాహసాలతో, అత్యంత సమర్థ వంతంగా పరిపాలించిన రాణి రుద్రమదేవి మేనమామ జాయపసేనాని. ఆయన రచించిన ‘నృత్యరత్నావళి’ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ‘కాకతీయం’ అనే నృత్య దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించారు పద్మజారెడ్డి. ఆ తరువాయి భాగం నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కాకతీయం–2 పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నృత్య అకాడమీకి వెళ్లినప్పుడు శిష్యబృందంతో సాధన చేస్తూ కనిపించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘శాస్త్రీయ నృత్యరీతులు అనగానే మనకు కూచిపూడి, భరతనాట్యం వంటివి కళ్లముందు నిలుస్తాయి. కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అదే కాకతీయం. కాకతీయుల నృత్యకళ అనగానే మనకు సాధారణంగా పేరిణి నృత్యం గుర్తుకు వస్తుంది. కానీ, జాయపసేనాని రచించిన ‘నృత్యరత్నావళి’లోని నృత్యరీతులను చూస్తే వాటిని పరిచయం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. సముద్రమంతటి ఆ కళను నేను ఏ కొద్దిగానైనా పరిచయం చేయగలిగితే అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏడేళ్ల కృషి కూచిపూడి నృత్యకారిణిగా ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. సత్కారాలు పొందాను. ఒకానొక సందర్భం లో రచయిత పప్పు వేణుగోపాలరావు ఆంగ్లంలోకి అనువదించిన ‘నృత్యరత్నావళి’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇంత మంచి కళారీతిని పరిచయం చేయకుండా ఉండగలమా?! అంతటి సమర్థత నాలో ఉందా?! అనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. విజయదుంధుభి వేళ ఆనందహేల, శృంగార, క్రోధ, కరుణ.. ఇలా నవరసాల కాకతీయ సౌరభాలు ఈ నృత్యరీతుల్లో కనిపిస్తాయి. ఇదొక సవాల్. నేను గతంలో చేసిన నృత్యరీతులన్నీ సవాల్‌గా తీసుకుని చేసినవే. ఈ కళారూపాన్ని కూడా నేటి ప్రజలకు పరిచేయాల్సిందే అనుకున్నాను. దీంట్లో భాగంగా వరంగల్లోతో పాటు ఎన్నో గ్రంథాలయాలు, కాకతీయుల గుడులన్నీ సందర్శించాను. గైడ్స్‌తో మాట్లాడాను. పరిశోధకులను కలిశాను. ఏడేళ్లుగా ‘కాకతీయం’ తప్ప నా మనసులో మరో ఆలోచన లేదు. అంతగా ఈ కళలో మమేకం అయిపోయాను. ఆన్‌లైన్‌లోనూ సాధన పదిహేనేళ్లుగా ప్రణవ్ నృత్య అకాడమీ ద్వారా దాదాపు 700 మంది శిష్యులు నృత్యంలో ప్రావీణ్యం సాధించారు. నా దగ్గరకు వచ్చే శిష్యుల్లో ఆరేళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వారి వరకు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన కాకతీయం పార్ట్ 1 కి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండవభాగాన్ని తీసుకువద్దామని రెండేళ్ల క్రితమే సాధనకు శ్రీకారం చుట్టాను. అయితే, కరోనా కారణంగా నృత్యక్లాసులు ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చురుకుదనం, ఆసక్తితో నేర్చుకున్నారు కాబట్టి ఈ నృత్యరీతుల్లో నిష్ణాతులు అయ్యారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అకాడమీలోనే శిక్షణ జరుగుతోంది. సామాజిక సమస్యలపై అవగాహన శాస్త్రీయ నృత్యం అనగానే పురాణేతిహాస ఘట్టాలే ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ, ఈ నృత్యం ద్వారా సమాజ సమస్యలను అద్దంలా చూపుతూ, వాటికి పరిష్కారం కూడా సూచించే కళారీతులను ప్రదర్శించాను. వాటిలో భ్రూణహత్యలు, ఎయిడ్స్ పై అవగాహన, నమస్తే ఇండియా, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్‌తో పాటు పురాణేతిహాసాలను నృత్యరూపకాల్లో ప్రదర్శించాను. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్రయోగి, భరతనాట్యం అనగానే భరతముని పేరు గుర్తుకు వస్తాయి. అలాగే, కాకతీయం అనగానే జాయప పేరు గుర్తు రావాలన్నదే నా తపన’’ అంటూ శిష్యులవైపు కదిలారు ఈ నృత్యకారిణి. వందమంది శిష్య బృందంతో నృత్యరత్నావళిలోని పిండి, గొండలి, రాసకం, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, చాలన.. నృత్యరీతులను కాయతీయంలో ప్రదర్శిస్తున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కళాహృదయానికి ఈ సందర్భంగా అభివాదం చెబుదాం. నృత్యరూపకంలో... – నిర్మలారెడ్డి -
అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..
సాక్షి, హైదరాబాద్ : బుధవారం అద్రాస్ పల్లిలో హత్యకు గురైన ఆంజనేయులుకు తిన్న తరువాత బైటకు వెళ్లే అలవాటు ఉందని, అలవాటు ప్రకారం అతను 8.30 సమయంలో శ్మశానం వైపు వెళ్లాడని అతడి బంధువులు చెప్పినట్లు బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట యువకుడి హత్య ఘటనపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష్మి గత 5 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఆంజనేయుల్ని లక్ష్మి బంధువులు చితిలో దహనం చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న ఆంజనేయులు కనపడటం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిన్న రాత్రి 10.30కు మాకు ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ బావ బలరాంపైన ఆంజనేయులు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. సంఘటనా స్థలంలో లభించిన రక్తం ఎములను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి నిర్ధారణ కోసం తరలించాం. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంది. ముందు జాగ్రత్తగా పికెటింగ్ ఏర్పాటు చేసా’’మని ఆమె తెలిపారు. చదవండి : మహిళ చితిపైనే యువకుడి శవాన్ని.. -
ఆటా ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) ఆహ్వానం మేరకు ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డి అమెరికాలోని హూస్టన్ నగరంలో ఈ నెల 29, 30, జులై –1 తేదీల్లో మూడు రోజుల పాటు నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పద్మజారెడ్డి లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జీవిత సాఫల్య పురస్కారంతో తనను సత్కరించనున్నారని తెలిపారు. తాను ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యూచిపూడి డ్యాన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభవాన్ని కాకతీయం నృత్య రూపకం ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారన్నారు. హూస్టన్ నగరంలో తమ మూడు రోజుల పర్యటనలో నవదుర్గలు నృత్య రూపకంతో పాటు.. కాకతీయం నృత్యంలోని కొన్ని భాగాలను ప్రదర్శిస్తామన్నారు. భద్రాచలం అర్చకులు సీతారామకల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను శిష్య బృందంలోని ఆరుగురితో కలిసి సీతారామ కల్యాణానికి సంబంధించి అంశాలను నృత్యరూపంలో ప్రదర్శిస్తామని పద్మజారెడ్డి వివరించారు. అంతేకాకుండా కెనడా, సింగపూర్, మలేషియా, సిడ్నీల్లో ఇదే రకంగా ప్రదర్శనలకు ఆహ్వానం వచ్చిందన్నారు. భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు మదన్ మోహనాచార్య మాట్లాడుతూ.. భద్రాది రామయ్య కల్యాణాన్ని అమెరికాలోని హూస్టన్‌లోని నగరంలో నిర్వహించేందుకు అనుమతించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాదాయ కమిషనర్ శివశంకర్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో నాట్య బృందంలోని నర్తకిలు అమరనేని షాలిని, ఆవుల భూమిక, కనక హర్షిణి, త్రిష, చందన, మ్రేనిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు కార్డులు చూసి ఇళ్లు అద్దెకివ్వండి
అత్తాపూర్: నేరస్తులను గుర్తించేందుకు శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, బాబానగర్, హసన్‌నగర్ ప్రాంతాలలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆరు మంది రౌడీ షీటర్లతో పాటు 12 మంది అనుమానితులను, 50 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లకు, ఆటోలకు ఎలాంటి పత్రాలు లేవని డీసీపీ తెలిపారు. కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు ప్రజలను పలు విషయాలపై అప్రమత్తం చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానితులు కనపడితే వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని, నేరం చేయడంతో పాటు నేరస్తులకు ఆశ్రయం కల్పించడం కూడా నేరమే అని డీసీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు భారీ ఎత్తున లభ్యమవడంతో వీటిని ఏఏ ప్రాంతాలలో కోనుగోలు చేశారు, ఎవరు వీరికి అమ్మారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్‌లో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్‌తో పాటు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరి ఆధార్‌కార్డును తనిఖీ చేయడంతో పాటు ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేశారు. -
సత్యభామ గురించి విన్నాను.. ఇప్పుడు చూశాను
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర సంగీత నాటక ఆకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జి. పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి భామా కలాపం నృత్య ప్రదర్శన అలరించింది. ఇటీవల న్యూఢిల్లీలో కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సుమారు 30 మంది ప్రఖ్యాత శాస్త్రీయ కళాకారులు హాజరై నృత్యాలు ప్రదర్శించారు. డాక్టర్ పద్మజారెడ్డి ప్రదర్శించిన భామా కలాపం ప్రధానితో పాటు అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పద్మజా రెడ్డిని ప్రశంసిస్తూ ‘పద్మాజీ.. సత్యభామ పాత్ర గురించి నేను విన్నాను.. చదివాను.. ఇప్పుడు మీలో ఆమెను చూడగలగటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ప్రధాని ప్రశంసనీయ వ్యాఖ్యలపై పద్మజారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నివాసంలో ప్రదర్శనకు అవకాశం రావడం తనకెంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. తాను ప్రదర్శన ప్రారంభంలో వేదికపై వెళ్లినప్పుడు కొద్దిగా ఉద్వేగానికి గురయ్యానని.. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కమిటీకి పద్మజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
మద్యపానాన్ని నిషేధించాలి
బీజేపీ మహిళా మోర్చా ధర్నా ఆందోళనకారుల అరెస్టు హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యపానాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి డిమాండ్ చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ శనివారం నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పద్మజారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మద్యం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుడుంబాను అడ్డుపెట్టుకుని చీప్‌లిక్కర్‌తో ప్రజల ప్రాణాలు తీయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. చీప్‌లిక్కర్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం తెలంగాణ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీప్‌లిక్కర్‌తో పేద ప్రజలు మరింత నష్టపోతారని, ఇది ప్రభుత్వానికి మంచిదికాదని హెచ్చరించారు. నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే ఉపసంహరించుకొని, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ ధర్నాలో మహిళామోర్చా నేతలు విజయలక్ష్మీ, ఉమా రాణి, ఛాయాదేవి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బీజేపీ నేతలు చింతా సాం బమూర్తి, బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.