మహా కుంభమేళాలో మన సాంస్కృతిక పరిమళాలు | Maha Kumbh Mela: Kuchipudi dancers Padmaja Reddy and Deepika Reddy selected from Hyderabad | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళాలో మన సాంస్కృతిక పరిమళాలు

Published Wed, Jan 29 2025 2:08 AM | Last Updated on Wed, Jan 29 2025 9:56 AM

Maha Kumbh Mela: Kuchipudi dancers Padmaja Reddy and Deepika Reddy selected from Hyderabad

అనేక శాస్త్రీయ నృత్యప్రదర్శనలు మహా కుంభమేళాలో జరుగుతున్నాయి. వీటిలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, సత్రియా.. ఇతర నృత్యరూపాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వడానికి ఎంపికయ్యారు. వారిలో హైదరాబాద్‌ నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణులు పద్మజారెడ్డి, దీపికారెడ్డిలు ఉన్నారు.

నయనానందం
ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజున గంగా పండాల్‌లో పెద్దస్టేజీపై ప్రదర్శన ఇచ్చాం. యు.పి. ప్రభుత్వంతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉదయం మా శిష్య బృందంతో కలిసి నదీ స్నానాలు చేశాం. చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాదిగా భక్తులు ఒక ప్రవాహంలా కదలి వెళ్లడం చూస్తుంటే మాకందరికీ రోమాంచితం అయ్యింది. దారిలో ఖిలా ఘాట్‌ దగ్గర జనగణమన, వందేమాతరం వినిపిస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనుభూతి. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచాం.

నదీ స్నానం చేసి, రూమ్‌కి వచ్చి, సాయంత్రం ప్రదర్శన చేశాం. గంగామాతగా నా కూతురు శ్లోకారెడ్ది, పార్వతిగా నేను, రుత్విక అనే అమ్మాయి శివుడిగా, 12 మంది శిష్యబృందంతో ప్రదర్శన ఇచ్చాం. డి.ఎస్‌.శాస్త్రి సంగీతం అందించారు. అక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది తమ హర్షధ్వానాలతో మా ప్రదర్శనను అభినందించారు. జవాన్లు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో శివపార్వతి కళ్యాణం, గంగను భగీరథుడు భూమికి తీసుకురావడంలో చేసిన తపస్సు ప్రధానాంశాలు.

 కుంభమేళాకు తగినట్టు కొన్ని మార్పులు చేసి, ఇందులో ప్రదర్శన ఇచ్చాం. పవిత్ర నదీస్నానం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా కళాసేవ చేయడం వల్ల మహాకుంభమేళాలో ప్రదర్శించే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. మా శిష్యబృందం చాలా ఆనందించారు. అన్ని కోట్లమందిని చూడటమే నయనానందకరం అనుకుంటే, మా నృత్యం ద్వారా అక్కడకు వచ్చినవారికి మేం నేత్రానందం కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాం. – దీపికారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి

నమామి గంగే: డాక్టర్‌ పద్మజారెడ్డి
గంగ పారే చోటుకి యాత్రలకు వెళితే ఆ నీటిని ఇంటికి తెచ్చుకుంటాం. మన ఇళ్లలో అందరూ తలపై చల్లుకుంటారు. బంధుమిత్రులకు కూడా ఆ నీటిని ఇస్తుంటారు. ఎందుకంటే, గంగ స్వచ్ఛమైనది కాబట్టి. మనం ఒక దేవతను కలుషితం చేసి, మన బిడ్డలకు ఇస్తున్నామా.. ఇది కరెక్టేనా.. ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలా, మనకి బాధ్యత లేదా.. ఈ విషయాన్నే ఆలోచించి ‘నమామి గంగే’ పేరుతో మహా కుంభమేళాలో 30 మంది శిష్యబృందంతో కలిసి కూచిపూడి నృత్యం చేస్తున్నాను. కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి కుంభమేళాకు రెండు వారాల ముందే ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 9న పాల్గొనబోయే ఈ కార్యక్రమం గురించే కాదు ఏ కాన్సెప్ట్‌ అనుకున్నా దానికి ముందు నాకు కొన్ని నిద్రలేని రాత్రులే ఉంటాయి.

కాన్సెప్ట్‌ ఎలా ఉండాలి, దానికి తగిన కొరియోగ్రఫీ, ఎంతమంది, డ్రెస్సింVŠ ... అన్నింటి గురించి అర్ధరాత్రులు కూర్చొని నోట్స్‌ రాసుకుంటాను. గ్రాఫ్స్‌ గీస్తూ, ప్లాన్స్‌ రాసుకుంటూ ఉంటాను. టాపిక్‌ గురించి ఎవరూ నన్నేం అడగలేదు. కుంభమేళా నదీస్నానం. కాబట్టి నేనే ‘గంగానది’ గురించి టాపిక్‌ ఎంచుకున్నాను. నృత్యమంతా గంగ, శివుడు, శక్తి ప్రధానంగా ఉంటుంది. గతంలో స్వచ్ఛగంగలో భాగంగా దేశంలో మొత్తంలో ప్రధానంగా గంగానది పారే ఐదు చోట్లలో నృత్య ప్రదర్శన ఇచ్చాను. కళ సామాజిక చైతన్యానికి తోడ్పడాలి. ఆ తపనతోనే పురాణాల నుంచి ఎన్నో కథనాలు తీసుకొని చేశాను.

‘భ్రూణ హత్యలు, హెచ్‌ఐవి పట్ల అవగాహన, ప్రకృతిని కాపాడుకోవడం... వంటి సామాజిక అంశాలమీద నృత్యప్రదర్శనలు ఇచ్చాను. ఇందుకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి మహా కుంభమేళాలలో నా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. 50 ఏళ్ల నా నృత్య జీవనంలో 30 ఏళ్లుగా సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన కలిగించేలా వేలాది ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం చేస్తున్న మూసీ ప్రక్షాళనలో ‘నమామి మూసీ’ కథనాన్ని నృత్యరూపకంగా తీసుకురాబోతున్నాను. – డాక్టర్‌ పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement