బీజేపీ మహిళా మోర్చా ధర్నా
ఆందోళనకారుల అరెస్టు
హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యపానాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి డిమాండ్ చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ శనివారం నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పద్మజారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మద్యం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుడుంబాను అడ్డుపెట్టుకుని చీప్‌లిక్కర్‌తో ప్రజల ప్రాణాలు తీయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. చీప్‌లిక్కర్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం తెలంగాణ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీప్‌లిక్కర్‌తో పేద ప్రజలు మరింత నష్టపోతారని, ఇది ప్రభుత్వానికి మంచిదికాదని హెచ్చరించారు. నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే ఉపసంహరించుకొని, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ ధర్నాలో మహిళామోర్చా నేతలు విజయలక్ష్మీ, ఉమా రాణి, ఛాయాదేవి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బీజేపీ నేతలు చింతా సాం బమూర్తి, బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్యపానాన్ని నిషేధించాలి
Published Sun, Aug 23 2015 12:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement