
కుటుంబంలో సోషల్ మీడియా చిచ్చు
మొదటి భర్త ఆవేదన
నెలమంగల వద్ద విడ్డూరం
దొడ్డబళ్లాపురం: ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లయ్యింది. భర్త, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం ఏదో సాఫీగా సాగిపోతోంది. అయితే సోషల్ మీడియా అనే భూతం జీవితంలో చిచ్చు పెట్టింది. ఇన్‌స్టాలో పరిచయమైన యువకునితో ఆమె వెళ్లిపోవడంతో భర్త లబోదిబోమంటున్నాడు. వారం రోజుల కిందట అతడిని వివాహం చేసుకుని సదరు వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసి భర్తకు షాక్ ఇచ్చింది.
ఇంటి నుంచి వెళ్లిపోయి..
అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా జక్కసంద్రలోని రాఘవేంద్రనగరలో చోటుచేసుకుంది. నేత్రావతి ఈ స్టోరీలో సూత్రధారి. నేత్రావతికి 13 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నేత్రావతి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె సంతోష్ అనే యువకున్ని పెళ్లి చేసుకుని వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అది చూసి మొదటిభర్త నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరాడు.
గోడు వెళ్లబోసుకుంటున్న రమేశ్, అత్తమామలు
మోసం చేసింది: అత్తమామలు
రమేశ్, అతని తల్లిదండ్రులు ఠాణా వద్ద మీడియాతో మాట్లాడారు. కోడలు తమను మోసం చేసిందని, రెండేళ్లుగా ఇన్‌స్టా ప్రియునితో దందా సాగిస్తోందని వారు ఆరోపించారు. తమ మనవన్ని కూడా తీసుకెళ్లిందని, ఆ చిన్నారి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వాపోయారు. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినలేదని అన్నారు. నేత్రావతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అనాథ అనే జాలితో పెళ్లి చేసుకుంటే ఇలా చేసిందని రమేశ్ వాపోయాడు. తన భార్యకు రూ.50 లక్షల విలువ చేసే పొలం ఉందని, రెండో భర్త దానిపై కన్నేశాడని చెప్పాడు.
పోలీస్‌స్టేషన్‌కు నేత్రావతి
ఈ కేసులో ట్విస్టులు ఇంకా ఉన్నాయి. నేత్రావతి, తన లాయరుతో బుధవారం నెలమంగళ ఠాణాకు వచ్చింది. భర్త ఇంటిలో ఉన్న తన వస్తువులను తీసుకెళ్లడానికి పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది. మొదటి భర్త రోజూ తాగి వచ్చి కొడతాడని, అతనితో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. ఇటీవలే అతనిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. జిల్లాలో ఇది సంచలనమైంది.