సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి.
ఇతర వర్గాలపై చిన్నచూపు
రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్‌లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్‌లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్‌కే ఓటేశారు.
పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా
‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది.
ప్రభుత్వ వ్యతిరేకత
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్‌ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు.
పనిచేయని హిందూత్వ కార్డు
హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది.
ఫలితాలపై స్పందన
వచ్చే లోక్‌సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు.
–తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ
ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి.
–ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు
–కర్ణాటక మాజీ సీఎం బొమ్మై
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు
– ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు.
– ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్
కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది.
– ప్రియాంక గాంధీ
Comments
Please login to add a commentAdd a comment