ruling party
-
జపాన్‌లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్ పార్లమెంట్‌లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. -
Lok sabha elections 2024: హిమజ్వాల!
పేరులో మంచు ఉన్నా హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది... ఆపరేషన్ కమలం... సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్‌ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్‌సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు ప్రాణసంకటం...! తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్‌కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.సర్వేల మాటేంటి? దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.పర్యాటక స్వర్గధామమైన హిమాచల్‌లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్‌సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు!
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు! -
సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..!
నిజామాబాద్: జిల్లాలో ఏళ్లుగా తిష్ట వేసిన పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పైరవీలు షు రూ చేశారు. ప్రస్తుతం ఉన్నవాళ్లంగా బీఆర్ఎస్ ఎ మ్మెల్యేల సిఫార్సుల ద్వారా జిల్లాలో పోస్టింగ్ పొందారు. గతంలో అధికార పార్టీకి అండగా ఉండి ప్రతిపక్షపార్టీలపై కఠినంగా ఉండటంతో కొంత మంది పోలీసు అధికారులకు బదిలీ తప్పదనే ప్రచారం ఉంది. జిల్లాలోని 6 నియోజకవర్గంలో రెండు స్థానా ల చొప్పున బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యేల సి ఫార్సు లేఖలతో ఎస్సైలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు పోస్టింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సిఫార్సుతో వచ్చినవారే విధుల్లో ఉన్నారు. పదిహేను రోజుల్లో జిల్లాలో పోలీసుల బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతుంది. సిఫార్సులతో వచ్చిన వారిపై ఆరా.. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిఫార్సులో వచ్చిన పోలీసులకు సంబంధించిన వివరా ల జాబితాను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. వీరు పని చేసిన ప్రాంతంలో ప్రతిపక్షా పారీ్టలపై వ్యవహరించిన తీ రుపై జాబితాను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవ ల అధికార పార్టీ ఎమ్మెల్యేను సీఐతో పాటు ఎస్సైలు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవగా ఎన్నికల్లో అప్ప టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై సదరు ప్రజాప్రతినిధి ప్రస్తావించడంతో పో లీసు అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వద్ద పోలీసుల జాబితా ఎన్నికల సమయంలో గత సీపీ సత్యనారాయణపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫి ర్యాదు చేయడంతో సీపీ కల్మేశ్వర్‌కు ఎన్నికల సంఘం పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు అధికార పారీ్టకి అండగా ఉన్నారని ఎస్సై, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు, సీపీ కల్మేశ్వర్‌కు జాబితాను అందించినట్లు తెలిసింది. వారికి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సెలవులో బోధన్ ఏసీపీ ఎన్నికల సమయంలో ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిశ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో జరిగిన సమావేశంలో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ పేరును తన రెడ్‌డైరీలో రాసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసి సదరు పోలీసులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బదిలీవేటు తప్ప దని భావించిన ఏసీపీ, ఎస్‌హెచ్‌వో వ్యక్తిగత సెలవులలో వెళ్లినట్లు పోలీస్వర్గాలలో ప్రచా రం జరుగుతుంది. -
ఫ్లెక్సీ వార్..! అధికార పక్షం హామీలపై ప్రతిపక్షాల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలు క్షేత్రస్థాయిలో నువ్వానేనా అనే విధంగా పోటాపోటీ నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష పోరాటాలు, ఘర్షణలు సైతం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీడి యా ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీల శ్రేణులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడా ది ఎన్నికలు జరుగనుండడంతో క్షేత్రస్థాయి పోరు లో సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధానికి దిగుతున్నారు. తెల్లారేపాటికి పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల వార్ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు నెలల కిందట పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు జిల్లాలోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ తాజాగా ఈ ఫ్లెక్సీల వార్ స్పీడందుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామం, మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తల్వేదలో వేసిన ఫ్లెక్సీలో హామీలు మరిచిన ఎమ్మెల్యే తమ గ్రామానికి ఎందుకొస్తున్నావంటూ రాశారు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పో లీసు బందోబస్తుతో గ్రామంలో పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఒక మహిళ జీవన్‌రెడ్డిని నిలదీసింది. పలు సమస్యలపై గ్రామ స్తులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ను పోలీసులు డిలీట్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బాడ్సిలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామ పర్యటన రద్దయ్యింది. ● మీడియా, సోషల్ మీడియా స్థాయి పోరు ఇప్పు డు ఫ్లెక్సీల వరకు రావడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల అంశాలు సైతం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుండడంతో ఈ రకమైన సంస్కృతికి పలువురు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీల పోరుకు అన్ని పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్‌లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్‌లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్‌కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్‌ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్‌సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
ట్విటర్ ఖాతా బ్లాక్.. మస్క్ తీరుతో అసంతృప్తి.. అధికార పార్టీ కీలక నిర్ణయం
ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ తీరుపై అసంతృప్తితో స్లొవెేనియా అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సామాజిక మాధ్యమానికి తాము దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ట్విట్టర్లో తమ పార్టీ కార్యకలాపాలు ఉండవని ప్రకటించింది. ప్రజలకు చేరువ కావడానికి ఈ వేదిక తప్పనిసరి అని తాము భావించడం లేదని చెప్పింది. స్లొవేనియాలో ప్రస్తుతం ఫ్రీడం మూమెంట్ పార్టీ(జీఎస్) అధికారంలో ఉంది. సాంకేతిక కారణాలు చూపి ఈ పార్టీ అధికారిక ఖాతాను ట్విట్టర్ మూడు వారాల పాటు బ్లాక్ చేసింది. ఆ తర్వాత కూడా తిరిగి పునరుద్ధరించలేదు. అదీ కాకుండా ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలపై జోరుగా ప్రచారం జరగడం తమకు ఆందోళన కల్గిస్తోందని, ఎలాన్ మాస్క్ సీఈఓ అయ్యాక పరిస్థితి ఇంకా మారిపోయిందని పార్టీ శనివారం ప్రకటన విడుదల చేసింది. అందుకే తాము ఈ ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా ప్రజలకు చేరువవుతామని పేర్కొంది. మొత్తం 91 స్థానాలున్న స్లొవెేనియా పార్లమెంటులో 41 సీట్లు కైవవం చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారంలోకి వచ్చింది జీఎస్ పార్టీ. అయితే మాజీ ప్రధాని రాబర్ట్ గాలోబ్ ట్విట్టర్‌ను బాగా వినియోగించుకునేవారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారానే ప్రతిపక్షం, మీడియాపై తరచూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాము అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మళ్లీ మర్యాదపూర్వక వాతావరణాన్ని తీసుకొస్తామని, సమన్యాయ పాలన అందిస్తామని జీఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబర్ట్ గాలోబ్ మాత్రం వీటిని విస్మరించి ఓటమి పాలయ్యారు. చదవండి: లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు.. -
తైవాన్‌లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్‌లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
పనిమంతుడికి అక్కర్లేదు ప్రచారం
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ వల్లే మేము తమిళనాడులో పెట్టాలను కున్న పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చాం. తొలుత 600 కోట్ల పెట్టుబడి అనుకున్నాం. ఇప్పుడు 2,600 కోట్లకు పెంచాం.’– ఇది సెంచరీ ప్లైవుడ్ సంస్థ యజమాని వ్యాఖ్య. ‘రావాలి జగన్, కావాలి జగన్... అనే నినాదం రాష్ట్రమంతా మారు మోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు, అభివృద్ధి తెచ్చారు’. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ. ఇలాంటి వ్యాఖ్యలు గత టీడీపీ ప్రభుత్వంలో, ఆనాటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుని ఉద్దేశించి ఎవరైనా చేస్తే, ఒక వర్గం మీడియా ఆహో ఓహో అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవి. అంత కన్నా ఎక్కువగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసిస్తే వాటిని ప్రముఖంగా ఇవ్వకపోవడం ద్వారా ఆ వర్గం మీడియా తన ద్వేషాన్ని వెళ్లగక్కిందనుకోవాలి. రోజూ వ్యతిరేక వార్తలు ఇచ్చే ఈ మీడియా కడప జిల్లా కొప్పర్తిలో అంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడ వస్తుంటే, దానిని తక్కువ చేసి చదువరుల దృష్టి పాజిటివ్ విషయాల మీద పడకుండా ఉండేందుకు రోడ్లు బాగోలేవు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికి పలుమార్లు అలాంటి వార్తలు రాసిన వీరు, పనిగట్టుకుని ఆ రోజు కూడా వేశారంటే అది డైవర్షన్ టాక్టిక్స్ అన్న విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. గతంలో ఆ పరిశ్రమ వెళ్లిపోతోంది, ఈ పరిశ్రమ వెళ్లిపోతోంది అంటూ తెలుగుదేశం వారు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఏకంగా కియా కార్ల ఫ్యాక్టరీ కూడా వేరే చోటికి తరలిస్తున్నారంటూ అసత్య వార్తలను ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గగ్గోలుగా మాట్లాడారు. తీరా చూస్తే ఆ ప్లాంట్ అక్కడే ఉండటంతో పాటు, మరో 400 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి కూడా పెడుతున్నామని ప్రకటించారు. తాజాగా నెల్లూరు శ్రీసిటీలో సుమారు 1,500 కోట్ల వ్యయం చేసే ఏసీ తయారీ ప్లాంట్లను రెండు ప్రముఖ సంస్థలు నెలకొల్పు తున్నాయి. అంతకుమించి కడప జిల్లా కొప్పర్తిలో ఒక పారిశ్రామిక వాడనే జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు అభినందనీయం. అక్కడకు ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలు వస్తున్న వైనం గమనించ వచ్చు. చంద్రబాబు టైమ్‌లో ఇలాంటి పారిశ్రామికవాడను ఒక్కటైనా, ఎక్కడైనా అభివృద్ధి చేశారా అన్నదానికి జవాబు దొరుకుతుందా? కియా కార్ల ప్లాంట్ రావడం వరకు ఆయన కృషి ఉందంటే ఒప్పు కోవచ్చు. ప్రధాని మోదీ దానిని ఏపీకి ఎంపిక చేశారని బీజేపీ నేతలు చెబుతుంటారు. అది తప్ప మరొక ప్రధానమైన సంస్థ ఏదీ పెద్దగా ఏపీకి టీడీపీ హయాంలో రాలేదు. కాకపోతే తిరుపతిలో ఒకటి, రెండు చిన్న భవనాలలో, మంగళగిరి వద్ద రెండు చిన్న భవనాలలో ఏవో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. వాటిలో కొన్ని వెళ్లిపోయాయని అప్పట్లో ప్రచారం చేశారు. నిజంగా స్టాండర్డ్ సంస్థలు ఏవైనా అలా చేస్తాయా? ప్రభుత్వాలు ఏవి ఉన్నా వాటి పని అవి చేసుకు వెళ్లాలి కదా? అంటే వీటిలో కొన్నిటిని వేరే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు. చంద్రబాబు టైమ్‌లో విశాఖలో భారీ సెట్టింగులతో, పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అయ్యా యని అన్నారు. తీరా చూస్తే ఆచరణలోకి వచ్చింది అతి స్వల్పం. కొందరైతే ఉత్తుత్తి ఒప్పందాలు చేసు కున్నారు. విదేశాలకు పరిశ్రమలు తేవడానికి వెళుతున్నామని ప్రత్యేక విమానాలలో తిరిగి వచ్చారు. కాని ఏపీకి వచ్చిన పరిశ్రమలు ఏమిటో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ ఒకసారి వివిధ దేశాల రాయ బారులతో సమావేశం అయి ఏపీలో పరిశ్రమలు పెట్టించాలని కోరారు. ఆ తర్వాత ఏమైనా సమావేశాలు ఉంటే మంత్రి గౌతం రెడ్డి చూసుకుంటున్నారు. జరగవలసిన పని జరిగేలా ముఖ్యమంత్రి కార్యా లయం పర్యవేక్షిస్తుంది. జగన్ సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. సుమారు పది నెలల వ్యవధిలో ఒక పారిశ్రామికవాడను పరిశ్రమల స్థాపనకు అనువుగా సిద్ధం చేశారన్నది కచ్చితంగా విశేష వార్తే అవుతుంది. ఒక వర్గం మీడియా దానికి ప్రాచుర్యం కల్పించనంత మాత్రాన జనానికి అర్థం కాకుండా ఉండదు. కొప్పర్తి వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. అలాగే బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ సంస్థ ఏర్పాటు అవుతోంది. ఈ ప్లాంట్ శంకుస్థాపన సభలోనే ఆ సంస్థ యజమానులు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి సహకారం పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నది వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో ఫాషన్ డిజైన్ సంస్థ వస్తోంది. ఈ గ్రూప్ రాష్ట్రానికి మొదటిసారి వచ్చింది. కడప జిల్లా ముఖ చిత్రాన్ని కొప్పర్తి పారిశ్రామికవాడ మార్చే అవకాశం ఉందని రాయలసీమ ప్రాంత ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇవి కాకుండా మరి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలిలింక్ సంస్థ మౌలిక వసతులపై 1,500 కోట్లు, మొబైల్స్ ఉత్పత్తికి 600 కోట్లు వ్యయం చేయడానికి ప్రతిపాదించింది. ఆ కంపెనీ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. సన్ ఫార్మా అధినేత దిలీప్ షాంగ్వి ఏపీలో ఒక భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి జగన్ చొరవవల్లే తాము ఇక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మొదటిసారి తాను జగన్‌ను కలిశాననీ, ఆయన విజన్ బాగా నచ్చిందనీ షాంగ్వి తెలిపారు.ఈ పరిశ్రమ వాస్తవ రూపం దాల్చితే ఏపీకి కొన్నివేల ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇవే సరిపోతాయని కాదు. ఇలాంటివి ప్రతి జిల్లాలో ఒకటో, రెండో ఏర్పాటు కావాలి. విశాఖలో నెలకొల్పదలచిన ఆదాని డేటా సెంటర్ కనుక సత్వరమే కార్య రూపం దాల్చితే ఏపీ అంతటికీ అది ప్రయో జనం చేకూర్చుతుంది. జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనం తరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతి పాదనను రూ. 2,500 కోట్లకు పెంచింది. విశాఖలోనే హార్ట్ వాల్వ్‌లు తయారు చేసే కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది వినూత్న ప్రయోగం. ఇది సఫలమైతే అనేక కంపెనీలు ఈ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో పోర్టుల నిర్మాణానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రో కారిడార్ వంటివి రావాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రి హబ్‌లు, ఆక్వాహబ్‌లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని వ్యవసాయాధార పరిశ్రమలు వచ్చేలా ప్రోత్సాహక చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇలా ఆయా చోట్ల పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలలో జనావాసాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ఒక వైపు సంక్షేమంపై దృష్టి పెడుతూనే, మరో వైపు ఇలాంటి ప్రగతి గురించి కృషి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారమంతుడుగా మిగిలిపోతే, ప్రచారం లేకుండా తన పని తాను చేసుకు వెళితే జగన్ పనిమంతుడుగా నిలుస్తారని చెప్పడానికి కొప్పర్తి పారిశ్రామికవాడతో సహా పలు పరిశ్రమలకు శ్రీకారం చుట్టిన వైనం నిదర్శనం అవుతుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ఏం చేసినా ఆహా ఓహోలు కొట్టే మీడియా ఒకటుండేది. అది ఇప్పుడూ ఉంది. కానీ ఇప్పటి ప్రభుత్వం అంతకుమించిన పనులు చేస్తున్నప్పటికీ ఉస్సూరంటూ పెదవి విరుస్తుంటుంది. సంక్షేమమే చాలా, అభివృద్ధి అక్కర్లేదా అంటూ విమర్శించిన టీడీపీ, దాని మీడియా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధికి కారణమయ్యే ఎన్నో పరిశ్రమలను తెస్తున్నప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. కానీ ఒకటి... పని చేయకుండా ప్రచారం మాత్రమే చేసుకున్న చంద్రబాబు ప్రచారమంతుడిగానే మిగిలిపోతే, ప్రచారంతో పనిలేకుండా పని చేసుకుంటూ పోతున్న జగన్ పనిమంతుడు అనిపించుకుంటున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు -
నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్ నేత గణేశ్ షా వెల్లడించారు. ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్ నేపాల్‌ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్ కమిటీ జనవరి 15న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్ షా తెలిపారు. -
దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు అవసరమైన వస్తు సామగ్రిని అందించే బదులు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు పట్టుకోవాలని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ ప్రజ లు, విపక్షాలు రాజకీయాల కు అతీతంగా కేంద్రానికి అం డగా నిలిచాయని, అయితే దీప నినాదం ఈ మహమ్మా రి నిరోధానికి ఎలా దోహదపడుతుందని ప్రశ్నించాయి. ప్రస్తుత ఆపత్కాల సమయంలో రాజకీయాలకు తావివ్వవద్దని చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, పోటు రంగారా వు (సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీల బతుకులు ఛిద్రం అయ్యాయని వారు ఆ ప్రకటనలో విమర్శించారు. -
వైఎస్సార్ సీపీ నేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్‌తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు. ఫోన్ ట్యాపింగ్‌లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్‌లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్‌కు సైతం వారు పాల్పడుతున్నారు. యూరప్ నుంచి అధునాతన పరికరాలు ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్‌ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్‌ఫోన్ తయారీ నంబర్ ద్వారా ట్యాపింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్‌కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారుల కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవీ.. ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఊళ్లపై గులాబీ జెండా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగిసింది. గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగిరింది. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,730 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. వివిధ కారణాలతో 47 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. రిజర్వేషన్ల కారణంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 23 పంచాయతీల్లో ఎన్నికలు కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. ఫలితంగా 12,683 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 8,264 స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 2,688 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక భారతీయ జనతాపార్టీ 170, తెలుగుదేశం పార్టీ 77, సీపీఐ 39, సీపీఎం 74 పంచాయతీలు కైవసం చేసుకోగా.. 1,371 పంచాయతీల్లో స్వతంత్రులు పాగా వేశారు. మూడో విడతలో 88.03% పోలింగ్... చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 88.03% పోలింగ్ నమోదైంది. మూడోవిడతలో మొత్తం 4,116 పంచాయతీలకు గాను 4,083 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 45.23లక్షల మంది ఓటర్లుండగా.. 39.82 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసిన వారిలో మహిళలు 20.14 లక్షలు, పురుషులు 19.68 లక్షల మంది ఉన్నారు. యాదాద్రి–భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99% పోలింగ్ నమోదైంది. 94.56 శాతం పోలింగ్‌తో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉండగా.. సూర్యాపేట (92.6%), నల్లడొండ (91.73%), మహబూబాబాద్ (91.54%), సిద్ధిపేట (90.73%), మెదక్ (90.28%), సంగారెడ్డి (90.15%) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 77.7% పోలింగ్ జరిగింది. కాగా మేడ్చల్ జిల్లాలో మూడో దశ పోలింగ్ జరగలేదు. -
ఆధికార పార్టీ నేతలు ఆయిల్ దోపిడి
-
పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన టీడీపీ నేతలు
ఒంగోలు: అధికార పార్టీ ఎమ్మెల్యే సహాయకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కాగితాలను చూపించాలని ట్రాఫిక్ ఎస్సై అడిగినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే సైతం స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న గోపీచంద్ ఆదివారం ఒంగోలులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అద్దంకి బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మహేష్ ఆపి బండి కాగితాలు చూపించాలని కోరారు. అయితే అతడు కాగితాలు చూపకుండా వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అంతేకాకుండా భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబ్బందిని లోపలకు పోనీయకుండా, బయటకు రాకుండా అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ఎస్సై అసభ్యంగా మాట్లాడారని అతన్ని సస్పెండ్ చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అప్పటివరకు అక్కడే బైఠాయించిన కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి చొచ్చుకునివెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యేతో చర్చించారు. ఎస్సై మహేష్ మాత్రం అతను ఎవరో తనకు తెలియదని, తాను అనుచితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డి తెలిపారు. -
‘మార్కెట్’ సందడి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల పందేరం మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 25 వ్యవసాయ మార్కెట్లు, 19 ఉప మార్కెట్లు ఉండగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 13 చేర్చి వ్యవసాయ మార్కెట్ల సంఖ్య 38 చేసింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38 మార్కెట్లకు, జిల్లాల పునర్విభజన తర్వాత మూడు (హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ్) సిద్దిపేట జిల్లాకు, ఒకటి (కాటారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలో 34 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మొత్తం 38 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 21 మార్కెట్ కమిటీల పాలకవర్గం పదవీకాలం మే 6, 12, 19, జూన్ 6, 8, 12 తేదీలలో ముగిసిపోగా, ఇందులో ఏడు కమిటీలకు రెండు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించారు. మరో 17 కమిటీల పాలకవర్గం గడువు జూలై నుంచి అక్టోబర్ మాసాల వరకు ముగియనుంది. ఇదే సమయంలో మార్కెట్ కమిటీలకు రొటేషన్ పద్ధతిలోరిజర్వేషన్లు ప్రకటిస్తూ మే 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదవీకాలం ముగిసిన మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే తర్వాత నియోజకవర్గం స్థాయిలో డిమాండ్ ఉన్న పోస్టు కావడంతో మారిన రిజర్వేషన్లకు అనుగుణంగా సీనియర్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, పాలకవర్గం ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మారిన రిజర్వేషన్లు.. తెరపైకి సీనియర్ నేతలు.. ప్రభుత్వం రొటేషన్ పద్ధతిలో వ్యవసాయ మార్కె ట్ కమిటీల రిజర్వేషన్లను గత నెల 17న ఖరారు చేసింది. ఈ జీవో విడుదలైన తర్వాత రెండేళ్ల పదవీకాలం ముగిసి.. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంది. ఈనెల 2 నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక్కో కమిటీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తూ వస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడక ముందు పొడిగించిన కమిటీలను పక్కనబెట్టి స్పష్టంగా పదవీకాలం ముగిసిన మార్కెట్లకు కమిటీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తం గా ఈనెల 15 వరకు 159 మార్కెట్ కమిటీలకు కాలపరిమితి ముగియగా, ఇందులో ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన 14 కమిటీలు ఉన్నాయి. వీటికి తక్షణమే పాలక వర్గాలను ఖరారు చేయాల్సి ఉండగా, ఈసారి గత రిజర్వేషన్లకు భిన్నంగా మారడంతో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా పరిణమించింది. సాధారణంగా నామినేటెడ్ పదవులు అంటేనే తమకు ‘విధేయులు’గా ఉండే వారినే మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు అవకాశం ఉంటుంది. కాగా.. కాల పరిమితి తీరిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలకవర్గం స్థానంలో పదవుల కేటాయింపులకు సన్నాహాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ నుంచి, ఎవరెవరు.. ‘మార్కెట్ కమిటీ’ల కోసం పోటాపోటీ.. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ప్రధాన మార్కెట్లకు తక్షణమే కమిటీలు వేయాల్సి ఉంది. ఆ తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ నియోజకవర్గాల్లోని మార్కెట్లకు కొత్త పాలకవర్గాన్ని ఖరారు చేయాలి. ఇప్పటికే కొత్త పాలకవర్గంపై కసరత్తు చేస్తున్నా ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు. హుజూరాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈ నెల 9న ముగిసింది. ఈసారి కూడా ఓసీ జనరల్‌కు కేటాయించడంతో అధ్యక్ష పద వి కోసం ప్రస్తుత చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి మరోసారి మంత్రి ఈటల రాజేందర్ ఆశీçస్సులతో ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ సర్పంచ్ కౌరు రజిత భర్త కౌరు సుగుణాకర్‌రెడ్డి, సైదాపూర్ మండలం నుంచి పెరాల గోపాల్‌రావు ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం ఉంది. జమ్మికుంట మార్కెట్ చైర్మన్‌గా ఇప్పటి దాక పింగిళ రమేష్ వ్యవహరించారు. ఈసారి బీసీ మహిళకు రిజర్వు చేయడంతో గత చైర్మన్ పింగిళి రమేష్ ఆయన భార్య పింగిళి రమాదేవికి ఇవ్వాలని మంత్రి రాజేందర్‌ను కోరుతున్నట్లు సమాచారం. కాగా.. గతంలో జమ్మికుంట మార్కెట్ కోసం ప్రయత్నం చేసిన పొనగంటి మల్లయ్య ఈసారైనా తన భార్య పొనగంటి శారదకు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు సమాచారం. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ కోటాలో గోగూరి నర్సింహారెడ్డికి మొదటగా అవకాశం దక్కింది. రొటేషన్‌లో భాగంగా ఈ సారి కరీంనగర్ ఎస్సీ మహిళకు కేటాయించా రు. దీంతో పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, ఇటీవల బావుపేట సర్పంచ్ దావా వాణి, తీగలగుట్టపల్లి సర్పంచ్ మల్లయ్య భార్య జంగపల్లి సుజాత, గోపాల్పూర్ మాజీ సర్పంచ్ బెజ్జంకి లలిత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం మే 6, 2016లో ఏర్పాటైంది. అప్పుడు ఎస్టీకి రిజర్వు కాగా, మాలోత్ బాసునాయక్ చైర్మన్‌గా చేశారు. మే 5తో పాలకవర్గం గడువు ముగిసింది. రొటేషన్‌లో ఇప్పుడు జనరల్‌కు రిజర్వు కాగా కనుకుంట్ల లింగారెడ్డి (ఉ పసర్పంచ్ గొల్లపల్లి), నేరెళ్ల గంగారెడ్డి (ఎంపిటీసీ, ఇబ్రహీంనగర్), ముస్కు కిష్టారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు (గొల్లపల్లి), పల్లె నల్లకొండం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు (గొల్లపల్లి) ప్రయత్నాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ రెండేళ్ల క్రితం పాలకవర్గం నియమించారు. ఈనెల 8తో గడువు ముగిసింది. కొత్తగా ఈసారి ఓసీకి రిజర్వేషన్ కేటాయించారు. ఇందుకోసం గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి, గౌరినేని నారాయణ, ప్రస్తుత టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగన్నగారి దయాకర్ రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులున్న లింగన్నగారి దయాకర్‌రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మొట్టమొదటి మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూలై 6న ఏర్పాటైంది. జనరల్ రిజర్వు కావడంతో కోరుకంటి రాజేశ్వర్‌రావును చైర్మన్ చేశారు. ఈ నెల 6న పాలకవర్గం గడువు ముగియగా, ఈసారి ఇప్పుడు ఎస్టీకి రిజర్వు అయ్యింది. బక్కా నాయక్ (ఏడుమోటలపల్లి), తిరుపతినాయక్ (ఏడుమోటలపల్లి), అజ్మీర చిరంజీవి (మద్దుపల్లి) ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈనెల 5న ముగిసింది. గతంలో ఎస్సీకి రిజర్వు చేయడంతో ముల్కల గంగారాంకు చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఈసారి వెల్గటూరు జనరల్ కోటా కింద రిజ ర్వు చేశారు. దీంతో ఆశవాహుల పేర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఏలేటి చంద్రారెడ్డి(రాజరాంపల్లి), ఏలేటి క్రిష్ణారెడ్డి (ఎండపల్లి), రావు సుగ్రీవరావు (కొత్తపేట), పొనగోటి రాంమోహన్‌రావు (వెల్గటూర్), నూనె శ్రీనివాస్ (వెల్గటూర్), పత్తిపాక వెంటేష్ (వెల్గటూర్), ఏలేటి సత్యనారాయణ రెడ్డి (రాజరాంపల్లి) తదితరులు రేసులో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జల్లా ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని గత 2016 జూన్12న ప్రభుత్వం నియామకం చేసింది. చైర్మన్‌గా గుండ సరోజన రెండేళ్లపాటు పాలన సాగించారు. ఈనెల 12న పదవీకాలం పూర్తయింది. ఈసారి ఓసీ రిజర్వు కావడంతో మల్లుగారి రవీందర్‌రెడ్డి, గుండ ముత్తయ్య, చల్ల నారాయణ, గొడుగు తిరుపతి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వద్దకెళ్లి ఎవరికి వారే వినతులు సమర్పించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూన్ 13న ఖరారు కాగా ఈ నెల 12న ముగిసింది. ప్రస్తుతం మనకొండూర్ మార్కెట్ యార్డ్ బాధ్యతలు డీఎంవో పద్మావతి చూస్తున్నారు. అయితే.. ఈసారి ఈ సీటును జనరల్‌కు కేటాయించగా మాడ తిరుపతిరెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మెటపల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలను 2016 ఏప్రిల్ 21 నియమించారు. వీటి పదవీకాలం ఏప్రిల్ 21న ముగిసింది. మెట్పల్లి మార్కెట్ ఎస్సీ మహిళ కాగా జరుపుల భారతి, మలోవత్ కరుణ పోటీ పడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్సీ మహిళ కాగా గడసనంద లావణ్య, జంగ సరస్వతి పోటీ పడుతున్నారు. కోరుట్ల బీసీ మహిళ కాగా అన్నం లావణ్య, జనరల్ స్థానం మల్లాపూర్ నుంచి ఆదిరెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కథలాపూర్ మార్కెట్‌కు జూలై 8 వరకు గడువుండగా, జనరల్‌కు రిజర్వు కావడంతో నాగం భూమయ్య, వర్థినేని నాగేశ్వరరావు, గడ్డం భూమారెడ్డి, చీటి విద్యాసాగర్‌రావు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ వరకు అన్ని మార్కెట్ కమిటీలు.. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం.. ఈనెల 27 వరకు ఏడు మార్కెట్ కమిటీల పాలకవర్గం కాలపరిమితి తీరనుండగా, వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకు మిగిలిన అన్ని మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యం. ఈ కమిటీల కూర్పులో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం కాగా, ఆశావహులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. కథలాపూర్ మార్కెట్ కమిటీ 2016 సంవత్సరం జూలైలో నియమించారు. అదే కమిటీ గడువును పెంచారు. వాటి గడువు 2018 జూలై 8 వరకు ఉంది. ధర్మపురి పాలకవర్గం 2016 అక్టోబర్ 6న ఏర్పాటు అయ్యింది. బీసీ మహిళ రిజర్వు కావడంతో అల్లం దేవమ్మను చైర్మన్ చేశారు. అక్టోబర్ 6, 2017కు ముగియగా, ఆరు నెలల చొప్పున రెండు పర్యాయాలు గడువు పెంచడంతో ఆమె పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 5 వరకు ఉంది. జగిత్యాల బీసీ రిజర్వేషన్ కాగా శీలం ప్రియాంక చైర్మన్‌గా వ్యవహరించారు. 2016 సెప్టెంబర్ 19న ఏర్పడింది. ఈ పాలకవర్గం కాల పరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగియనుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాటారం, కాల్వశ్రీరాంపూర్, మంథని, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, గంగాధర, చొప్పదండితోపాటు పలు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఈనెల 27 మొదలు అక్టోబర్ వరకు కాలపరిమితి ముగియనుండగా, ఇప్పటి నుంచే ఆశావహులు తొందరపడుతుండటం అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది. -
వైఎస్సార్‌ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
ఓట్ల కోసం బోగస్ పట్టాలు
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు. బయటపడిన 10 వేల పట్టాలు ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు. బాధితులకు పట్టాలు అందజేయాలి ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అనుచరుడా.. మజాకా!
పినిశెట్టి కుమారి.. ముగ్గురు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. దువ్వాడలో దయాళ్‌నగర్‌లో 133 గజాలు కొనుగోలు చేసింది. కొనుక్కున్న స్థలంలో 2017లో రేకుల షెడ్డు వేసింది. ఈ జాగాపై అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు కన్నేశాడు. మార్చి 29, 2018లో సుమారు 30 మందితో ఆమె ఇంట్లోలేని సమయం చూసి తన అనుచరులతో కలిసి ఆ ఇంటిని నామరూపాల్లేకుండా కూల్చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు దువ్వాడ పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక రకాలు భూ కబ్జాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు వంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్వయంగా అధికార పార్టీ నాయకులే తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల వృద్ధి రేటులో కూడా గాజువాక నెం.1. అంతేకాదు.. అధికార టీడీపీ నేతల దందాలు..భూకబ్జాల్లో కూడా అదే స్థానంలో నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరగణం జాగా కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే మీ అంతుచూస్తాం అంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. ఇక్కడ అధికారులు సైతం వీరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. గాజువాకకు కూతవేటు దూరంలో 65వ వార్డు పరిధిలోని హరిజనజగ్గయ్యపాలెంలో ఉన్న మాజీ సైనికుల కాలనీలోని సర్వే నంబర్ 117/3లో సుమారు 15 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మార్కెట్లో రూ.2 కోట్లకు పైగా పలుకుతున్న ఈ ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని పక్కా స్కెచ్ వేసి దర్జాగా కబ్జా చేశాడు. పైగా తన బంధువైన ఓ అంగన్వాడీ కార్యకర్త పేరిట దొంగపత్రాలు సృష్టించాడు. టౌన్‌ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టాడు. గతంలో ఈ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడంతో అటువైపు చూసేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ఇతగాడి భూకబ్జాలపై ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారి హడావిడి చేయడం.. కొద్దికాలం పాటు నిర్మాణాలు ఆపమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప అధికారులు ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. డిప్యూటీ తహసీల్దార్ అండదండలతో... ఇటీవల గాజువాక తహసీల్దార్ బదిలీ అయ్యారు. అప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో తన పీఏగా పని చేస్తున్న చేతన్‌కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోస్టింగ్ ఇప్పించారు. ఇన్చార్జి తహసీల్దార్ బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఇక 65వ వార్డు నాయకుడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్లాన్ అప్రూవల్స్ అంటూ పొంతన లేని ఫ్లెక్సీలు నిర్మాణం వద్ద ప్లాన్ అప్రూవల్స్‌తో పాటు ఇతర అనుమతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రదర్శించాలి. కానీ అందర్ని అయోమయానికి గురిచేసే విధంగా పొంతన లేని నోటీసులు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరించే అంశం సంబంధిత అధికారుల పరిధిలో ఉందంటూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆర్డర్, హౌసింVŠ శాఖ రుణాలు మంజూరు చేసినట్టుగా మరొకటి పొంతన లేని నోటీసులను భారీ ఫ్లెక్సీగా ఏర్పాటు చేసి అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక వీఆర్వో నుంచి జోనల్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించింది. అంతే వారిపై వీరంగం సృష్టించటంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. అధికారులు సదరు నాయకుడి అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని గ్రామానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ఈ వ్యవహారంపై డిప్యూటీ తహసీల్దార్ చేతన్‌ను వివరణ కోరగా అది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని, ఆ భూమి ఎవరికి కేటాయించలేదని, వాటిలో నిర్మాణాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పైగా తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చారు. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తమ దృష్టికే రాలేదంటూ దాటవేశారు. ఆ నాయకుడి ఆగడాలకు అంతేలేదు అధికారపార్టీ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే నా ఇల్లు జీవీఎంసీ అనుమతులతో ఉంది. నా ఇంటి మరమ్మతు కోసం గోడను తొలగించాను. తిరిగి కట్టుకుందామని అనుకుంటే అధికారపార్టీ నాయకుడు జీవీఎంసీ అధికారులతో ఇంటిని కట్టకుండా నరకాన్ని చూపిస్తున్నాడు. బిల్డింగ్ ఇన్స్‌స్పెక్టర్ నాయకుడు చెప్పినట్టు విని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. – పి.ఈశ్వరమ్మ, బాధితురాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే తిరిగి తమమీదే తప్పులు ఎత్తిచూపుతున్నారు. ఆ నాయకుడు అక్రమనిర్మాణం చేపట్టడమే కాకుండా అధికారులతో భయభ్రాంతులకు గురి చేయిస్తున్నాడు. – వై.శ్యామల, స్థానికురాలు -
అధికారులే టార్గెట్ ..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ పాలనా లోపాలను పక్కన పెట్టి అధికారులే టార్గెట్‌గా శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాగింది. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు మండి పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీపీఓ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యశాఖలకు సంబం ధించిన అంశాలపై చర్చ సాగింది. జామిమండల కేంద్రం లో సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లిం చాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జామి జెడ్పీటీసీ సభ్యుడు పెదబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై మండిపడ్డారు. గుర్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ గుర్ల మండలం గరికి వలస ఎస్సీ కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నీటిసరఫరా నిలిచిపోయిందని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సుజయ్ స్పందిస్తూ పథక నిర్మాణం పూర్తయ్యాకే తాగునీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. కురుపాంలో తాగునీటి పథకం పాడవ్వడంతో 10 రోజులుగా అక్కడ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి తెలిపారు. సెప్టిక్‌ట్యాంక్ క్లీన్ చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల మరుగుదొడ్డి నిర్మించడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్డ ఈశ్వరావు సభలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కలుగుజేసుకుని ఆర్డబ్ల్యూఎస్, రవాణశాఖ, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తో సమావేశం నిర్వహించి సహజ ధర నిర్ణయిం చాలని జెసీ–2 నాగేశ్వరావుకు ఆదేశించారు. కొమరాడ జెడ్పీటీసీ పావని మాట్లాడుతూ ఉరిటి గ్రామానికి 293 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇందులో 150 వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వైడీఓ నెట్వర్స్ సంస్థ నిర్మాణాల పూర్తికి చొరవచూపడం లేదని తెలిపారు. డ్వామా పీడీపై మండిపడిన ఎమ్మెల్యే చిరంజీవులు.. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదని, దీనివల్ల వేతనదారులు ఇబ్బందిపడుతున్నారని డ్వామా పీడీ రాజ్‌గోపాల్‌ను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రంగారావు కలుగుజేసుకుని ఎప్పటి నుంచి ఉపాధిహామీ వేతనదారులకు డబ్బులు ఆగిపోయాయో చెప్పాలని అడిగారు. పిభ్రవరి 19 నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉందని, రూ.66 కోట్లు నిధులు పెండింలో ఉన్నాయని, త్వరలోనే «థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తామని రాజ్‌గోపాల్ బదులిచ్చారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనిపై డ్వామా పీడీ కలుగుజేసుకుని నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. డెంకాడ జెడ్పీటీసీ అప్పలనారాయణ మాట్లాడుతూ మోపాడ పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టులు –3, ఒక ల్యాబ్ టెక్సీషియన్ పోస్టును భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కురుపాం ఆస్పత్రికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు లేకపోవడం వల్ల రెండు, మూడు రోజులు మృత దేహాలను ఆస్పత్రుల్లో ఉంచేస్తున్నారని, చందాలు వేసుకుని మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని కురుపాం జెడ్పీటీసీ పద్మావతి అన్నారు. అలమండ ఎంపీటీసీకి నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌డీఎస్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆస్పత్రి మధ్యలో కళ్యాణ మండపానికి అతను రోడ్డు వేసేసాడని, హెచ్బిఎస్ చైర్మన్ నుంచి అతన్ని తొలిగిస్తారా లేదా ఆస్పత్రిని కూడ అతనికే ఇచేస్తారా అని జామి జెడ్పీటీసీ పెదబాబు డిఎంహెచ్వోపై మండి పడ్డారు. రుణాలు మంజూరు చేయడంలేదు.. టీడీపీ కార్యకర్తలకు పీఏసీఎస్‌లలో రుణాలు మంజూరు చేయడం లేదని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తినాయుడులు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభస్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాలగీత, కోళ్ల లలితకుమారి, నారాయణస్వామినాయుడు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం టీఆర్ఎస్లోనే అసంతృప్తిని రాజేస్తోందా? వీడియో ఫుటేజీల నేపథ్యంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందని అధికార పార్టీ నేతలే భావిస్తున్నారా? వీటికి టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని మంత్రులే తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తలెత్తిన ఘటనలు మరిచిపోకముందే ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని వివిధ పార్టీలే కాకుండా ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. వీడియో ఫుటేజీలను ప్రతిపక్ష పార్టీల నేతలకు చూపించకుండా, సరైన ప్రొసీజర్ పాటించకుండానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఒకరిద్దరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద తప్పుబడుతున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం వ్యవహరిం చిన తీరు ప్రపంచానికి అంతా తెలుసు. ఇదే గవర్నర్, ఇలాంటి ప్రసంగం సందర్భంగానే జరిగిన ఘటనలకు సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు అధికారంలో ఉన్నవారూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం సభలో ఉండేవాళ్లమా? ఇలాంటి నిర్ణయాన్ని ఊహించ లేదు’’అని మంత్రివర్గంలోని ముఖ్యుడొకరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వేటు వేయడం ద్వారా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావిచ్చినట్టుగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఒకరిద్దరు మంత్రులు సున్నితంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆ నిర్ణయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వకుండానే ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని వెల్లడించారు. కోమటిరెడ్డి, సంపత్‌లపై సానుభూతిని పెంచామేమో.. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై వివిధ వర్గాల్లో సానుభూతిని తామే పెంచామని టీఆర్ఎస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వారిపట్ల కాంగ్రెస్‌లోనే కాకుండా తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. ‘‘అణచివేతకు గురైనవారిపై ఏ సమాజానికైనా సానుభూతి ఉంటుంది. తెలంగాణలో ఇది కొంచెం ఎక్కువ. ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ఆకాంక్షలతో పాటు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం కూడా టీఆర్ఎస్పై సానుభూతి పెరగడానికి ప్రధాన కారణమే. అప్పుడు టీఆర్ఎస్పై నిర్బంధానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు.. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న అంతకంటే తీవ్రమైన నిర్ణయంతో ఏకీభవిస్తాయా? రాజకీయ వ్యూహం ఏమున్నా సభ్యత్వంపై వేటు వేయడం పార్టీలోనూ చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా చేయొచ్చన్న సందేశాన్ని ఇచ్చినవాళ్లం అవుతున్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది’’అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాంతోనే ఎక్కువ నష్టం.. ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో, శాసనసభ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న అంశాల కంటే ఏజీ రాజీనామా వ్యవహారమే ఎక్కువ నష్టం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇది ఎమ్మెల్యేలపై వేటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనన్న సంకేతాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తే వీడియో ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామికంగా, ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంత సునాయాసంగా తొలగించవచ్చన్న అభిప్రాయం కూడా మంచిది కాదని వారంటున్నారు. ఇదంతా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా ఉందంటూ అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
బీజేపీకి 69, కాంగ్రెస్‌కు 50
న్యూఢిల్లీ: రాజ్యసభలో అధికార పార్టీ బీజేపీ బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకుని తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. శుక్రవారం 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక ముందు బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 54 సీట్లున్నాయి. వచ్చే వారం 17 మంది బీజేపీ సభ్యులు, 14 మంది కాంగ్రెస్ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో తాజాగా బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది ఎన్నికయ్యారు. అందులో రెండోసారి ఎన్నికైన వారూ కొందరున్నారు. కొత్త సభ్యులు ప్రమాణం చేసిన తరువాత రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 69కి, కాంగ్రెస్ బలం 50కి చేరుకుంటుంది. ఎన్డీయేలో భాగం కాని అన్నా డీఎంకే, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ లాంటి పార్టీలు బీజేపీకి సభా కార్యకలాపాల్లో మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన పలు బిల్లులు..బీజేపీకి సరిపడా బలం లేకపోవడంతో రాజ్యసభలో పెండింగ్‌లో పడిపోతున్నాయి. 2014 నుంచి అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా గెలవడం వల్ల ఎగువ సభలో బీజేపీ సభ్యుల సంఖ్య పెరగ్గా, ఆయా రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తోంది. -
అధికారం ఉంది...ఆక్రమించేద్దాం
అధికార బలంతో 2.75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేసి పట్టాలు పుట్టించారు. తీరా.. ఆ భూమి పోరంబోకుగా అధికారులు నిర్ధారించినా.. మరోసారి మంత్రి అండదండలతో రూ.కోటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో స్టోన్ క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డంపెట్టుకొని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు భూ అక్రమాలకు తెర తీశారు. తాజాగా జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లులో పోరంబోకు భూములను కైవసం చేసుకునేందుకు మంత్రి అండదండలతో ఓ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 2లో దాదాపు రూ.కోటి విలువైన 2.75 ఎకరాల భూమిలో స్టోన్ క్రషర్ నెలకొల్పేందుకు అనుకూలంగా భూమిని బదలాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయనకు సన్నిహితుడైన పి.సత్యనారాయణరాజు ఈ భూమిని పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పుట్టించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నాలను గతంలో అధికారులు అడ్డుకున్నా.. మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం గమనార్హం. ఇదీ పరిస్థితి... సీతానగరం మండలం నిడగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 4/1 నుంచి 5 సబ్డివిజన్ల వరకూ 40 ఎకరాలు పైబడి రెవెన్యూ లెక్కదాఖలా ప్రభుత్వ భూమిగా (గయ్యాలు) నమోదై ఉంది. సర్వే నంబర్–1 కొండ పోరంబోకు గానూ, సర్వే నంబర్–2 సాగునీటి చెరువు, సర్వేనంబర్ 3లో 8.5 ఎకరాలు గయ్యాలు భూమి కాగా, 4, 5 సబ్‌డివిజన్ సర్వే నంబర్లలోని భూములు గయ్యాలు భూమిగానే ఎఫ్సీవో (ఫాదర్ రికార్డు), ఎండీఆర్ (మండల్ పైక్లారిటికల్ రికార్డు) రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఈ భూముల్లో సర్వే నంబర్ 4లోని సబ్ డివిజన్ చేసి 4/3, 4/2 నంబర్లలో వ్యవసాయ భూములు, ఫలసాయాన్ని ఇచ్చే తోటలు ఉన్నాయి. ఈ భూములకు పూర్వం డి– నమూనాలు చేసి కొంత మంది రైతులకు జీవనోపాధి కోసం అప్పగించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ 8 ఎకరాల భూమిని టీడీపీ నేత రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. దానిలో సర్వే నంబర్ 4/2లో ఉన్న భూమిని ఆయిల్ కన్వర్షన్ కోసం భూమి కొనుగోలుదారు బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షులు, బేబీనాయనకు సన్హితుడు అయిన పి.సత్యనారాయణ రాజు అప్పటి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన వినతిపత్రం మేరకు ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్స్ పరిశీలించగా వేరొక యజమానుల పేరుతో ఉన్నప్పటికీ సత్యనారాయణరాజు భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. భూ కన్వర్షన్ చేయడానికి ముందు భూమికి సంబంధించిన పూర్వం నుంచి ఉన్న ఎఫ్సివో, ఎండిఆర్ రికార్డులను అధికారులు పరిశీలించారు. పూర్వపరాలు తెలుసుకునేందుకు భౌతికంగా భూములను, రికార్డులను పరిశీలించారు. రికార్డు లెక్కదాఖలా గయ్యాలు భూమిగా నమోదై ఉన్నందున ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని అప్పటి తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే, నిడగల్లులో పోరంంబోకు భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమి రైతు చేతిలో ఉన్నప్పుటి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం 2.75 ఎకరాలను ఆయిల్ కన్వర్జేషన్ చేయాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. అధికారులు కాదన్నా... నిడగల్లు రెవెన్యూ పరిధిలోని భూమి రైతులచేతిలో ఉన్నా.. వేరొకవ్యక్తి కొంత భూమిని కొనుగోలుచేసి స్టోన్ క్రషర్ నెలకొల్పడానికి సర్వేనంబర్ 2లో 2.75 ఎకరాల భూమిని భూ కన్వర్షన్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దరఖాస్తును స్వీకరించిన అప్పటి తహసీల్దార్, సిబ్బంది ఎఫ్సివో, ఎండీఆర్ రికార్డులతో భూములను భౌతికంగా పరిశీ లించారు. ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించారు. జీవనోపాధికోసం పోరంబోకు భూమిపై వ్యవసాయం చేయడానికి ఇబ్బందిలేదని, రికార్డుల ప్రకారం భూ కన్వర్షన్ చేయడానికి సిఫార్స్ చేయలేమని అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అయితే, పార్వతీపురం ఆర్డీవో, సీతానగరం ప్రస్తుత తహసీల్దార్లపై మంత్రి, అతని సోదరుడి ద్వారా సిఫార్సులు చేయించుకొని భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇతర ప్రయత్నాలను చూసిన మిగత నేతలు కొందరు తాము కూడా ఇదే పందాలో వెళ్లి పోరంబోకు భూములను కైవశం చేసుకోవాలని భావిస్తున్నారు. పేదలకు ఇచ్చిన ఈ పట్టా భూములను కొనడమే నేరమైతే వాటిని వ్యాపార అవసరం కోసం తమకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం అంతకన్నా పెద్దనేరం. పాలకులకు, అధికారులకు ఇదేమంత పెద్ద నేరంగానో, తప్పుగానో కనిపించకపోవడం విశేషం. సమాచారం అందజేస్తాం.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో సత్యనారాయణరాజు గతంలో చేసిన అర్జీపై అప్పీల్ చేయడంతో పేరావైజ్డ్ రిమార్కులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం కోరింది. రికార్డులను పరిశీలించి అడిగిన సమాచారం అందజేస్తాం. – అప్పలరాజు, తహసీల్దార్, సీతానగరం -
‘కారు’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గర పలుకుబడి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి తమ స్థానాలను బలంగా చేసుకొని పాత గులాబీ నేతలను పక్కన పెట్టడంలో విజయం సాధించారు. ఖానాపూర్ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొన్నటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనతో ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్ నేతల మనోబలం పెరగగా... పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టుకోసం ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒరిజనల్ గులాబీ నేతలకు స్థానం లేనట్టే..! ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేంతా ప్రస్తుతం సాంకేతికంగా టీఆర్ఎస్ చెందిన వారే. బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), కోనేరు కోనప్ప(సిర్పూరు) ఏకంగా పార్టీనే విలీనం చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారారు. ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. మిగతా ఏడుగురు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారే. నిర్మల్, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల్లో 2014లో ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అక్కడ మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సముద్రాల వేణుగోపాలాచారి ముథోల్ నుంచి ఓడిపోయినప్పటికీ, మళ్లీ ఆ నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు. రాజ్యసభకు పంపిస్తే వెళ్లే ఆలోచనలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు సమాచారం. ఇక సిర్పూరు నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ... కోనేరు కోనప్ప పట్లనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సానుకూల ధృక్పథంతో ఉన్నారు. కోనప్ప సైతం ప్రజల మధ్య ఉంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం టీఆర్ఎస్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కూచాడి శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ, మంత్రి ఏలుబడిలో పార్టీకే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురిలో టిక్కెట్టు రాని పక్షంలో వేరే మార్గం చూసుకునే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా వ్యూహాలు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురిలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సదాభిప్రాయంతో లేరనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వచ్చేసారికి అవకాశం ఇస్తా’ అనే హామీ పొందినట్లు కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటూ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ఎదురు లేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసారి కూడా ఆయనకే అవకాశం అనడంలో అతిశయోక్తి లేదు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్ ఈసారి ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆసిఫాబాద్ సర్పంచ్, కోవ లక్ష్మి చెల్లెలు మర్సోకోల సరస్వతి కూడా టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు రమేష్‌రాథోడ్ ప్రకటించడం గమనార్హం. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంపై ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కన్నేయడంతో బాపూరావు పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. మంచిర్యాల జిల్లాలో రసవత్తరం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను బలం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి జి.వినోద్‌కుమార్ నుంచి సీటు గండం పొంచి ఉంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి గులాబీ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోదరులు ఈసారి తమ పూర్వ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తే ఓదెలుకు ఇబ్బందికరమే. అయితే వివేక్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అడపాదడపా కనిపిస్తున్నా... వినోద్‌కుమార్ మాత్రం చెన్నూరుకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో తనకు ఢోకా ఉండదనే ధీమాతో ఓదెలు ఉన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్థానంలో సీటు కోసం సొంత పార్టీలో చాలా మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు ఇటీవలి కాలంలో శుభాకాంక్షలు, అభినందనల ఫ్లెక్సీలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ఎంపీపీ మొదలుకొని మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ పర్యటన సందర్భంగా వేదిక పైనుంచి ఎమ్మెల్యే కోరికల పేరుతో మంచిర్యాలకు వరాలు ప్రకటించడం దివాకర్‌రావు వర్గానికి బలాన్ని పెంచింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి మళ్లీ టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఆయన గత నెల 24నే పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగినా, సీఎం సమక్షంలో కూడా టీఆర్ఎస్లో చేరకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఊపిరి పీల్చుకుంటోంది. -
అధికార పార్టీలో రాజ్యసభ హడావుడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో రాజ్యసభ అంతర్మథనం మొదలయింది. అర్థిక బలం, పార్టీలో పరపతి ఉన్న నేతలకే పదవులు అంటూ ముఖ్యుల నుంచి సంకేతాలు రావటంతో సీనియర్ నేతలు గళం విప్పేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి జిల్లా నేతల్లో ఒకరిని వరించే అవకాశం ఉండటంతో ఆర్థిక పరపతితో పాటు సామాజికవర్గాల వారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి జిల్లాలో పార్టీ నేతలు బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి మిగిలిన సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలతో పాటు ఆశావాహుల్లోని లోటుపాట్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చిన్నస్థాయి నామినేట్ పదవులు కూడా భర్తీ చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న క్యాడర్‌పై రాజ్యసభ కొత్త చిచ్చుపెట్టినట్లయింది. పోటీ తీవ్రం అధికార పార్టీలో రాజ్యసభ సీటు కోసం పోటీ తీవ్రమైంది. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ఆర్థిక పరపతిలేని నేతలు అనేక మంది ఉన్నారు. కనీసం వారి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకపోవటం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కావలి టీడీపీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు పేరు బీసీ కోటాలో తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా, వివాదరహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఆర్థికంగానూ స్థితిమంతుడు కావటంతో ఖర్చుకు వెనుకాడని పరిస్థితి. ఈ క్రమంలో అతని పేరు పరిగణనలో ఉంది. నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజికవర్గ కోటాలో సూళ్లూరుపేట పార్టీ ఇన్చార్జి పరసా రత్నం కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీద సోదరులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్‌ను కూడా కలిసినట్లు సమాచారం. గతంలో టీటీడీ చైర్మన్ పదవి రేసులో బీద మస్తాన్‌రావు ఉన్నారు. బీద సోదరులపై వ్యతిరేకత ఇదిలా ఉండగా పార్టీలో బీద సోదరులపై వ్యతిరేకత ఉంది. జిల్లాలో బీసీ కోటాలో పార్టీ పదవులన్నీ వారికేనా అనే అసంతృప్తి స్వరం కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపాటి పదవి నుంచి రాజ్యసభ వరకు అన్నింటికీ వారే ప్రయత్నాలు చేసుకుంటే మిగిలిన బీసీ నేతల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బీద మస్తాన్‌రావు గత ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలై అక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు. దీంతోపాటు రాజధాని నిర్మాణకమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు శాసనమండలి సభ్యునిగానూ కొనసాగుతున్నారు. అలాగే పైడేరు ఎస్కేప్ చానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ–2 చైర్మన్‌గా బీద గిరిధర్ వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బీద మస్తాన్‌రావు బావ దేవరాల సుబ్రహ్మణ్యం కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. బీదా మస్తాన్‌రావు సోదరి మస్తానమ్మ నగరంలో కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఐదు పదవులు, అది కూడా పార్టీలో బీసీ కోటాలోని పదవులు కావటంతో పార్టీలోని సీనియర్ బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్‌రావు పేరు తెరపైకి రావటం చర్చనీయాంశంగా మారింది. -
త్రిపుర ప్రజల్ని బానిసలు చేశారు
సోనామురా/కైలాషహర్: త్రిపురలో అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాలను బానిస బతుకులు చేసిందని, ఆ పార్టీని గద్దె దించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాణిక్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన మోదీ..బీజేపీ అధికారంలోకి వస్తే త్రిపురలో ‘హీరా’(హెచ్–హైవేలు, ఐ–ఇంటర్నెట్, ఆర్–రోడ్లు, ఏ–ఎయిర్వేస్) అభివృద్ధి చెందుతుందని అన్నారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా పాలిస్తున్న కమ్యూనిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రేషన్ కార్డు లాంటి చిన్నాచితకా అవసరాలకూ ఆ పార్టీ తలుపులు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ నుంచి అనుమతి రానిదే ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రతి దానికీ ప్రజలు తమపైనే ఆధారపడేలా చేసారని, బానిసత్వానికి ఇది కొత్త రూపమని అభివర్ణించారు. లెఫ్ట్ పాలనలో త్రిపురలో అభివృద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదని ఆరోపించారు. తామొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలుచేస్తామన్నారు. -
‘పంచాయతీ’ ప్రతిష్టాత్మకం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేలా పకడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు సంకటంగా మారనున్నాయి. 2013లో జరిగిన ఎన్నికలు అప్పటి అ«ధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా జరిగాయనే చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో పోటీపడి నువ్వానేనా అన్నట్లు పోరాడింది. చివరకు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా తెలంగాణ ఆవశ్యకతను చాటిచెప్పింది. గత పంచాయతీ ఎన్నికలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చి పెట్టాయి. జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. పేరుకు పార్టీ రహితమే అయినా గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల నాయకులే బరిలో దిగారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించారు. వచ్చే నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజాప్రతినిధులు పనితీరుకు గ్రేడింగ్‌గా పేర్కొనడం అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 2013లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పోటాపోటీ.. 2014 నుంచి తారుమారైన ఫలితాల సంఖ్య.. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ స్వల్ప మెజారిటీ సాధించింది. అయితే.. తదనంతర పరిణామాలు ఫలితాల సంఖ్యను తారుమారు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టడంతో అప్పటివరకు వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులు అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం అమాంతం పెరిగింది. పూర్వ కరీంనగర్ జిల్లాల్లో 1,207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 379 గ్రామాల్లో టీఆర్ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే.. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచెన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచులు ప్లేట్ ఫిరాయించారు. మూడింట రెండు వంతుల గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈ«శ్వర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో నేతల్లో, ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా పెరిగింది. అయితే.. గత ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ విశ్లేషణ జరిపి ప్రస్తుతం తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందించి పంచాయతీకి కదులుతున్నట్లు తెలుస్తోంది. ‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే.. ఎమ్మెల్యేలకు సంకటంగా ‘పంచాయతీ’.. శాసనసభ ఎన్నికలకు ముందు వస్తున్న పం చాయతీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఒక్క జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నా రు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడిం గ్ విధానాన్ని అమలు చేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్‌లు ఇస్తోంది. దీని ఆధారంగానే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం సైతం ఉండడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్, బలం నిరూపించుకునేందుకు బరిగీసినట్లు కనిపిస్తోంది. మెజారిటీ సర్పంచులను గెలిపిం చుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని పార్టీ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చి నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోం ది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనో హర్రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తు న్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఉన్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్ సీరియస్‌గా ఆదేశించడం.. ఆ ఎన్నికలు, ఖర్చు సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది. -
చిత్తూరులో ఆధికార పార్టీ నేతల ఆగడాలు
-
అధికార మెహర్బానీ
అధికార పార్టీ నేతల మెహర్బానీ చివరి ఆయకట్టు రైతులకు శాపంగా మారనుం. గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే కనిగిరి రిజర్వాయర్ నుంచి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నవంబరు రెండో తేదీ నుంచి విడుదల చేయాల్సిన నీటిని జిల్లా మంత్రి ఆదేశాలతో ముందుగా విడుదల చేయడంపై చివరి ఆయకట్టు రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో 4.98 లక్షల ఎకరాలను సాగునీరందించేలా శనివారం నెల్లూరు గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. నవంబరు రెండో తేదీన అధికారికంగా సోమశిల నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని తీర్మానం చేశారు. అయితే కనిగిరి రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఆదివారం ముందస్తుగానే నీటిని విడుదల చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైడేర్ ఎస్కేప్ చానల్‌కు 300 క్యూసెక్కులు, ఈస్ట్రన్ చానల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేశారు. వాస్తవానికి ఐఏబీలో జరిగిన తీర్మానం కాపీ ప్రభుత్వానికి అంది అక్కడి నుంచి నీటి విడుదలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాలి. అయితే మంత్రి మాటలతో ఇరిగేషన్ అధికారులు మాత్రం నీటిని ముందుగా విడుదల చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆందోళనలో చివరి ఆయకట్టు రైతులు కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల తెలుసుకున్న చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాదీ చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరందుతుందని సంబరపడ్డారు. అయితే ముందస్తుగా నీటి విడుదల చేయడంతో తమ పొలాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు మెహర్బానీ కోసం చివరి ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు. చివరి ఆయకట్టుకు నీరందాలి ఐఏబీ తీర్మానం జరగడమే ఆలస్యమైంది. చివరి ఆయకట్టు వరకు నీరందాలి. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదు. అయితే నారుమళ్లు వేసుకున్న రైతులకు మంచిదే. చివరి ఆయకట్టుకు నీరందేలా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై తగిన జాగ్రత్తలు పాటించి, రైతులకు నీరందేలా చూడాలి. –జొన్నలగడ్డ వెంకమరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మిగిలిన కాలువలకు ఎందుకు వదల్లేదు డెల్టా ప్రాంతంలో అన్ని కాలు వలకు సాగునీరందాలి. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి కొన్ని కాలువలకు నీరు వదలడం సరికాదు. ఐఏబీ సమావేశంలో తీర్మానాలను గౌరవించాలి. రైతులందరినీ సమాన దృష్టితో చూడాలి. –నెల్లూరు నిరంజన్‌రెడ్డి, కోశాధికారి, జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య కమిటీ చైర్మన్ల కోరిక మేరకు నీటి విడుదల ఈస్ట్రన్ చానల్, పైడేరు కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల కోరిక మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేశాం. రైతులు ముందుగానే నారుమడులు పోసుకుంటారన్న చైర్మన్ల వాదతో నీటిన విడుదల చేశాం. –షేక్ అహ్మద్‌బాషా, ఇరిగేషన్ ఏఈ, కొడవలూరు -
స్వపక్షంలో విపక్షం
రాయగడ(ఒడిశా): జిల్లాలో ప్రతి అభివృద్ధి పనిలో అధికారపార్టీ నాయకుల జోక్యంతో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి ఒక్క సంఘటనలో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకుని శాంతిభద్రతలకు సంపూర్ణంగా విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కలుగచేసుకోవాలని రాయగడ జిల్లా పరిషత్ సభ్యుడు అధికార పార్టీకి చెందిన పట్నాన గౌరీశంకర్ నిలదీశారు. జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా లాల్‌బిహారీ హిమరికను నియమించిన తరువాత రాయగడ డీఆర్డీఏ కాన్ఫరెన్స్ సమావేశ భవనంలో ఆయన అధ్యక్షతన తొలి సమావేశాన్ని(16వ జిల్లా ప్రణాళిక కమిటీ) శనివారం నిర్వహించారు. గోపబంధు గ్రామీణ యోజన 2017–18 యాక్షన్ ప్లాన్ ఆమోదానికి సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ప్రజాప్రతినిధుల చర్చలు, సమస్యలు, వివరించే సమయంలో బీజేడీకి చెందిన జెడ్పీ సభ్యుడు మాట్లాడుతూ భారీపరిశ్రమల్లో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకోవడం వల్ల జిల్లాలో వేదాంత అల్యుమిన, ఇంఫా, పరి శ్ర మ, జేకే పరిశ్రమ, ఉత్కళ అల్యుమిన పరిశ్రమల్లో జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగావకాశం లభించడం లేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించగా ఈ జిల్లాలో యువత నిరుద్యోగులుగా మారి స మాజంలో సంఘవిద్రోహలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు అధికారులు లొంగొద్దు జిల్లాలో దాదాగిరి, గుండాయిజం, దౌర్జన్యాలు, పెరిగిపోయాయి. జిల్లా అధికారులు అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకూడదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులు విధులను నిర్వహిస్తూ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నేరుగా అధికారపార్టీ నాయకులను ఉద్దేశించి ఆవేదన వెలిబుచ్చారు. సబ్సిడీలు అందుకుని మూసివేత చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు ఇస్తుండగా ఏ ఒక్క చిన్న తరహా పరిశ్రమలో కూడా స్థానిక విద్యార్థులకు ఉద్యోగావకాశం కల్పించలేదని సబ్సిడీ అందిన పిదప పరిశ్రమలను మూసివేస్తున్నారని గౌరీశంకర్ ఆరోపించారు. కంపెనీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని కూలీలు, కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేపట్టే అభివృద్ధి పథకాలు తక్కువ రోజుల్లో కూలిపోతున్నాయని జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా పనిచేయాలని అభ్యర్థించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న అధికారపార్టీ రాజకీయ నాయకుల ముఖాలు కళావిహీనంగా మారాయి. -
‘చర’ చిక్కాడు
♦ పోలీసులకు లొంగిపోయిన బెట్టింగ్ సూత్రధారి ♦ నెలన్నరపాటు సింగపూర్‌లో మకాం ♦ అధికార పార్టీ అండతో తప్పించుకునేందుకు విఫలయత్నం ♦ ఇంకా అజ్ఞాతంలోనే శరత్చంద్ర కుమారుడు సుభాష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ దువ్వూరి శరత్చంద్ర అలియాస్ చరను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే విదేశాలకు పరారైన చర, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బాలకృష్ణనాయుడు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న చర కుమారుడు సుభాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు కూడా దొరికితే బెట్టింగ్ కేసు దాదాపు ముగింపు దశకు వస్తుంది. సీఎం పేషీ స్థాయిలో పైరవీలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై దృష్టిపెట్టి కీలక వ్యక్తులతోపాటు పంటర్లనూ కలుగుల్లోంచి బయటకు లాగారు. మొక్కుబడి అరెస్ట్‌లకు పరిమితం కాకుండా మూలాలను గుర్తించి 300 మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన బుకీలుగా ఉన్న 40 మందికిపైగా నిందితులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ మాజీ కౌన్సిలర్, జిల్లా మంత్రికి సన్నిహితుడు అయిన దువ్వూరు శరత్చంద్ర పలాయన మంత్రం జపిం చాడు. అధికార పార్టీ నేత కావడం, మంత్రి అండదండలు ఉండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేశం విడిచి పారి పోయాడు. తన కుమారుడు సుభాష్‌తో కలిసి సింగపూర్‌లో చక్కర్లు కొట్టాడు. అతడి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో సోమవారం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తండ్రీ కొడుకులే కీలకం జిల్లాలో బెట్టింగ్ రాకెట్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించడానికి చర, అతని కుమారుడు సుభాష్ సాగించిన వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ చివరి వారంలో నగరానికి చెందిన దారం మల్లికార్జునరావు తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లికార్జునరావు, అతని భార్య మాధురి, కుమారుడు ప్రణవ్ జూలై 1న రామేశ్వరంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లికార్జునరావు టీడీపీ నేత దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్ వద్ద పలు మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కట్టాడు. ఆస్తిపాస్తులన్నీ ధారబోసినా ఇంకా లక్షలాది రూపాయలు బకాయి పడ్డాడు. దీంతో శరత్చంద్ర, అతని కుమారుడు కలిసి మల్లికార్జునరావును మానసికంగా వేధించడంతోపాటు అతడి ఇంటికెళ్లి బకాయిల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే అతని కుటుంబమంతా అసువులు తీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బెట్టింగ్ మూలాల్లోకి వెళ్లారు. వందల మందిని అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేత శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్, బాలకృష్ణనాయుడు జూలై రెండో వారం నుంచి పరారీలో ఉన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతల ద్వారా వివిధ రూపాల్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ చివరకు లొంగిపోక తప్పలేదు. హైకోర్టులో బెయిల్ పిటీషన్! నెల్లూరు (క్రైమ్): బెట్టింగ్ కేసులో రిమాండ్ అనుభవిస్తున్న కీలక సూత్రధారి దేవళ్ల కృష్ణసింగ్, మరికొందరు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా కోర్టులో పలు దఫాలుగా బెయిల్ పిటీషన్ వేయగా.. కోర్టు నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీటిని మంగళవారం విచారించే అవకాశం ఉందని సమాచారం. -
ప్రతిపక్షంపై ఆగని అధికార పార్టీ దౌర్జన్యం
-
అజ్ఞాతంలో కీలక బు‘కీ’లు..!
♦ బుకీలకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు ♦ బాధితుల ఫిర్యాదుతో గతంలో ఐదుగురి అరెస్ట్ ♦ మరో బుకీని బుధవారం అరెస్ట్ చూపిన వైనం ♦ అరెస్టయినవారిలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ♦ ఎస్పీలు దృష్టి సారించడంతో నెలరోజులుగా అజ్ఞాతంలోనే బుకీలు సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. బెట్టింగ్‌లలో సొమ్ము పోగొట్టుకుని అప్పుల పాలై తెనాలికి చెందిన కుటుంబం మొత్తం మాచర్లకు వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్వం కోల్పోయి తల్లిదండ్రులకు ముఖం చూపలేక ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా క్రికెట్ బు‘కీ’లను మాత్రం పట్టలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా ఉన్న సమయంలో మాత్రం బెట్టింగ్‌లు కాసే వారిని అదుపులోకి తీసుకుని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా డొంకను కదల్చలేకపోతున్నారు. కుటుంబాలను బలి తీసుకుంటున్న క్రికెట్ మహమ్మారికి సీరియస్‌గా వ్యవహరించాల్సిన పాలకులే కీలక బుకీలకు అండగా నిలుస్తూ పోలీసులు వారి జోలికి రాకుండా రక్షిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా పనిచేసిన పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కీలక బుకీలను అదుపులోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించిన క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేశారంటే జిల్లాలో బుకీలకు ప్రభుత్వ పెద్దల నుంచి ఏ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్‌లపై సీరియస్‌గా దృష్టి సారించిన సమయంలో అధికార పార్టీ నేతల అండతో అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవడం, వారితో పోలీసు అధికారులకు చెప్పించుకుని యథావిధిగా బెట్టింగ్‌లకు పాల్పడడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి... జిల్లాలో గత నెలలో క్రికెట్ బెట్టింగ్‌లలో తీవ్రంగా నష్టపోయి బుకీల దౌర్జన్యానికి పొలాలు, స్థలాలు కోల్పోయిన అనేక మంది బాధితులు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కీలక బుకీ బాలాజీతో పాటు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక బుకీలు అధికార పార్టీకి చెందిన రాజధాని ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులు, అనుచరులు కావడంతో వారిపై సరైన చర్యలు లేకుండా వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసులో మరో బుకీ గంజికుంట సాంబశివరావును బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు క్రికెట్ బుకీలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులపైనే ఒత్తిళ్లు... గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు క్రికెట్ బుకీలపై దృష్టి సారించారనే విషయం తెలుసుకున్న అనేక మంది కీలక బుకీలు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కీలక బుకీలుగా ఉన్న ఐదుగురు అధికార పార్టీ నేతల స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలకు భారీ మొత్తంలో ఆఫర్లు ఎర వేసి పోలీసులు తమ జోలికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరంతా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేత తనయ, తనయుడు, రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓ మంత్రి వద్దకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారులు తమను అదుపులోకి తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, బెట్టింగ్‌లు నిర్వహించే వారంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తుండటంతో పోలీసులు సైతం వీరికి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు..?
♦ కార్పొరేటర్ల పయనం వెనుక రాజకీయం ♦ అంతా అధికార పార్టీకి చెందినవారే ♦ ఓ కీలక నేత వైఖరి నచ్చకేనని ప్రచారం ♦ ఏలూరు నగరంలో జోరుగా చర్చలు ఏలూరు (సెంట్రల్): నగరపాలక సంస్థ కార్పొరేటర్ల ఢిల్లీ ప్రయాణం చర్చనీయాంశమైంది. వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడం, నగరంలోని ఓ కీలక నేత పనితీరుపై అసంతృప్తి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ నేతను తొలగించే ప్రయత్నమే ఈ ప్రయాణమని ప్రచారం జరుగుతోంది. నగరంలో మొత్తం 44 మంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 25 మంది ఈనెల 2న ఢిల్లీ వెళ్లారు. వీరు తిరిగి ఈనెల 8న రానున్నట్లు సమాచారం. ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. కీలక పదవిలో ఉన్న నేతను తొలగించే ప్రయత్నంలో భాగమే ఢిల్లీకి ప్రయాణమని అధికార పార్టీ నాయకుల్లో చర్చ నడుస్తోంది. ఓ నేత తీరుపై అసంతృప్తి నగరపాలక సంస్థ కీలక పదవిలో ఉన్న ఓ నేత తీరుపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నేత వ్యతిరేక వర్గం ఢిల్లీకెళ్లింది. వచ్చిన తరువాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. సదరు నేత స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోరనేది కార్పొరేటర్లు, నాయకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఓ సీనియర్ నాయకుడైన కార్పొరేటర్‌ను మందలించి, పార్టీకి ఎంతగానో సహకరించే వ్యక్తిపై ఇటువంటి వైఖరిని మానుకోవాలని సూచించినట్లు సమాచారం. అభివృద్ధి పనుల్లో వివక్ష నిత్యం ఎమ్మెల్యే, మేయర్ వెనుక పదుల సంఖ్యలో తిరిగే కార్పొరేటర్లు ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికే పరిమితమయ్యారు. ఇందుకు తమ డివిజన్లలో పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల పలు డివిజన్లలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నగరానికి ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. ఈ డివిజన్లకు అనుకొని ఉన్న డివిజన్లలో పనులు అంతంతమాత్రంగానే ఉండడంపై ప్రజలు కార్పొరేటర్లను ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్లోని సమస్యలను పాలకులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయా కార్పొరేటర్లు తీవ్ర అసంత్తృప్తితో ఉన్నట్లుగా తెలిసింది. -
నయీం కేసును నీరుగార్చిన సర్కార్
నేరెళ్ల ఘటనపై స్పందించని ప్రభుత్వం: చెరుకు పెద్దపల్లిరూరల్: అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతల తో సంబంధాలుండటం వల్లే సీఎం కేసీఆర్ నయీం కేసు ను నీరుగార్చారని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత లభ్యమైన డైరీలో లభించిన ఆధారాలు, ఆయన స్థావరాల్లో లభ్యమైన సొమ్ము ను ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఇసుక మాఫియాకు సర్కార్ అండగా ఉంటోదనే సంకేతాలను ఇస్తోందని ఆరోపించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుండా సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం టీఆర్ఎస్ సర్కార్కే చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులు రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావిస్తున్నారన్నారు. హోంమంత్రి నాయిని ప్రారం భోత్సవ కార్యక్రమాలకు తప్ప దేనికి పనికిరాడన్నారు. -
‘దందా’ పోలీసు!
♦ పోలీసుస్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు ♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు ♦ ఆరోపణలొస్తున్నా బదిలీ లేకుండా తిష్ఠ ♦ స్టేషన్ల సుందరీకరణ ముసుగులో నొక్కుళ్లు ♦ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసుల్లో ఆవేదన ♦ కొత్త బాస్ త్రివిక్రమ వర్మ ఓ లుక్ వేయాల్సిందే! సీఎం త్రివిక్రమవర్మ... జిల్లా పోలీసు బాస్‌గా బ్రహ్మారెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరించి బుధవారానికి నెల పూర్తవుతోంది! తొలి రోజు నుంచే ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి! వాటిలో మిగతావాటి మాటెలా ఉన్నా సొంత శాఖనే ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది! అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇటీవలే వీఆర్‌కు పంపించిన ఆయన తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు! కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు పోలీసులపై కొరడా ఝుళిపించారు! వారే గాకుండా కొంతమంది స్టేషన్ అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసులే లోలోన ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు! అలాంటివారిని కొత్త బాస్ ఎలా దారిలో పెడతారో వేచి చూడాల్సిందే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా పోలీసు శాఖను సంస్కరించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్ని పోలీసుస్టేషన్లు ప్రైవేట్ సెటిల్మెంట్లకు వేదికగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులెవ్వరైనా స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు ఇస్తే చాలు... ఇరు పార్టీల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. కేసులు నీరుగార్చేస్తున్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతూ అడుగులకు మడుగులొత్తుతారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కూడా వారికి అండగా నిలబడుతున్నారు! ఎస్పీ బంగళా, జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ ముసుగులో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూలు చేసి దిగమింగిన పోలీసు అధికారులపై సైతం ఈగ కూడా వాలకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొంతమందికి నేరగాళ్లతో తెరవెనుక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. లీలల్లో మచ్చుకు కొన్ని.... జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇటీవలి వరకూ పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కుల నుంచి ఓ అధికారి బాగానే వసూలు చేశారట! తన జేసీబీని వమరవల్లికి చెందిన ఓ జేసీబీ యాజమానికి అప్పగించి అద్దె రూపేణా బాగానే ఆర్జించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసొచ్చింది. అలాగే మరో సర్కిల్ స్థాయి అధికారిది ముడుపుల వసూళ్లలో అందెవేసిన చేయి. ఇరు పార్టీల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా దీర్ఘకాలం నగరంలో తిష్ట వేయడం ఆయనకే చెల్లింది. అంతకాలం ఉన్నా పరిష్కారమైన, దర్యాప్తు పూర్తయిన కేసు ఒక్కటీ లేదంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం జిల్లా పోలీస్ కార్యాలయంలోనే ఇద్దరు గుమస్తాలు రూ.70 లక్షల వరకు స్వాహా చేసిన కేసు ఈయన హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల రిమ్స్‌లో సుమారు రూ.3 లక్షల విలువైన ఎండోస్కోపీలో ఒక ముఖ్య పరికరం మాయమైన కేసునూ నీరుగార్చేయడం ఆయనకే చెల్లింది. నగరంలోని ఓ హోటల్లో విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుమారుడి హత్యలో కూడా నిందితుల నుంచి భారీగా నొక్కేశాడనే విమర్శలూ ఆయనపై వచ్చాయి. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో పనిచేసిన ఓ ఎస్సైపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ ఐపీఎస్ అధికారితో విచారణకు డీఐజీ కార్యాలయం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచే గాకుండా పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి. ∙ రాజాం సర్కిల్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టినా, కేసు ఉపసంహరించుకోవాలనుకున్నా ఓ సర్కిల్ స్థాయికి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా కొంతమంది కానిస్టేబుళ్లు సాయంత్రం సమయాల్లో పట్టణానికి సమీపంలో వాహనాలను తనిఖీ సాకుతో ఆపి వసూళ్లకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో దాబాల వద్దకు చేరి నిర్వాహకుల నుంచి వసూళ్లు జరపడం షరా మామూలుగా మారింది. రూరల్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి కూడా మామూళ్లకు మారుపేరుగా మారారు. రోడ్డు ప్రమాదం జరిగితే చాలు ఇటు నిందితులు, అటు బాధితుల నుంచి ఎంతోకొంత నొక్కేయడంలో ఆయన సిద్ధహస్తుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ∙టెక్కలి సర్కిల్ స్టేషన్లో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఆయనకు అధికార పార్టీలో ఓ ముఖ్య నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వైన్స్, మైన్స్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు భారీగానే దండేస్తున్నా ఆయనను దండించేవారే కరువయ్యారనేది బాధితుల ఆవేదన. కాశీబుగ్గ డివిజనల్ సర్కిల్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు ఒక్కటై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూమి కబ్జాలు, స్థల వివాదాలు, అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణా... ఇలా ఏదైనా సరే సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిపప్పు రైలులో రవాణా చేయాలన్నా, పశువులను అక్రమంగా లారీలోకి ఎక్కించాలన్నా, గుట్కా గుట్టుగా సరిహద్దు దాటిపోవాలన్నా అక్రమార్కులు వారిని కలిస్తే సరిపోతుందట! కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు కార్పొరేట్ హంగుల పేరుతో ఓ అధికారి అన్ని రకాల వ్యాపారుల నుంచే గాకుండా చివరకు రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగానే వసూలు చేశారంట! వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్ పూర్తిగా అధికార పార్టీ కార్యాలయంగా మారిపోయందనే విమర్శలు మార్మోగుతున్నాయి. ఇక్కడి అధికారి ఒకరు ఏకంగా ఇసుక, మద్యం, గనుల వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల నుంచి, వారు ఫిర్యాదు ప్రకారం నిందితుల నుంచి ఇరువైపులా కేసు తీవ్రతను బట్టి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొనేందుకు ఏసీబీ ఇటీవల వలవేసినా చివరి నిమిషంలో తప్పించుకున్నారని తెలిసింది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో పాతపట్నం, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లలో కొంతమంది పోలీసులను మించినవారు లేరనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి, ఎర్ర చందనం అక్రమంగా సరిహద్దు దాటిపోతున్నా వీరిపై ఈగ కూడా వాలకపోవడానికి కారణం కూడా అదేనన్న ఆరోపణలు ఉన్నాయి. -
పంచేశారు
► రూ.14.67 కోట్ల నీరు– చెట్టు నిధులు బూడిదలో పోసినట్లే ► నేతల పందేరానికే రూ.10 లక్షల లోపునకు కుదించారు ► నాయకులకు లబ్ధే తప్ప ప్రయోజనం శూన్యం ► పునర్నిర్మించాల్సిన చోట మరమ్మతులతో సరి ► ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే పోలంరెడ్డి తొలి విడతలో కోవూరు నియోజకవర్గానికి రూ.14.67 కోట్లు కేటాయించారు. ఈ పనులను రూ.10 లక్షలకు మించితే టెండరు పిలవాల్సి వస్తుందని దానికి మించకుండా ఆ లోపు నిధులతోనే పనులు చేపట్టేలా 187 పనులుగా ముక్కలు చేశారు. నీటి సంఘాల అధ్యక్షులకు లబ్ధి చేకూరేలా ముక్కలు చేసిన పనులను అధికార పార్టీ నాయకులకు అప్పగించేశారు. పునర్నిర్మించాల్సిన వంతెనలకు సైతం పైపై పూతలు పూసి సరిపుచ్చేస్తున్నారు. కొడవలూరు(కోవూరు): కోవూరు నియోజకవర్గంలో తూర్పు, దక్షిణ, జాఫర్ సాహెబ్ కాలువలు ప్రధాన పంట కాలువలుగా ఉన్నాయి. తూర్పు, దక్షిణ కాలువలు కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లోని ఆయకట్టుకు, జాఫర్ సాహెబ్ కాలువ ఇందుకూరుపేట మండలంలోని ఆయకట్టుకు సాగు నీరందిస్తాయి. వీటికింద లక్ష ఎకరాలకుపైఆ ఆయకట్టు ఉంది. ఈ కాలువలు, వాటి బ్రాంచి కాలువలపై 307 చిన్న, పెద్ద కల్వర్టులు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిలో సింహభాగం కల్వర్టులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల్సి ఉంది. పీఆర్లో రూ.5 లక్షలు దాటితే టెండరు పిలవాల్సి ఉండగా, ఇరిగేషన్లో రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే అవకాశం ఉంది. దీనిని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ నేతలకు వరంగా మార్చారు. కల్వర్టు నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని, రూ.10 లక్షలలోపు నిధులతో కల్వర్టులకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల షట్టర్ల పునర్నిర్మాణం, దెబ్బతిన్న కాలువలకు రివిట్మెంట్లు అవసరమైనా రూ.10 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలవాల్సి వస్తుందని, వాటిని పక్కన పెట్టారు. తొలి విడతలో మంజూరైన నీరు–చెట్టు నిధుల 14.67 కోట్లను నీటి సంఘాల అధ్యక్షులకు 187 పనుల కింద విభజించి కట్టబెట్టేశారు. తమ్ముళ్లకు లబ్ధి్ద చేకూర్చేందుకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు కనువిప్పు కలిగేనా? కల్వర్టులకు మరమ్మతుల వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదని ఇంజినీరింగ్ అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే ఒత్తిడితో విభజించి అంచనాలు వేసేశారు. పనుల నాణ్యత విషయంలోనూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అధికార ఒత్తిడిలకు తలొగ్గి అవకతవకలకు పాల్పడిన హౌసింగ్ ఏఈలు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులకు కనువిప్పు కలుగలేదు. ఈ పనులకు 187 శిలాఫలకాలు వేయాల్సి వస్తుందని, నాలుగైదు పనులకు కలిపి ఒకటి వంతున వేశారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం ఈ ఏడాది మే 12న నీటి సంఘాల అధ్యక్షులతో ఎమ్మెల్యే పోలంరెడ్డి సమావేశమై పనుల్లో అవకతవకలకు పాల్పడకుండా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే ఇలా పైపై ప్రకటనలు చేస్తూ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పనులను ముక్కలు చేసి తమ్ముళ్లకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
అరాచకం
►వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసు జులుం ►దేవరపల్లి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ►శనివారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని గృహ నిర్బంధం ►ఆదివారం ఉదయం ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అరెస్ట్ ►జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్ఆర్సీపీనేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు ►పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం ►అధికారపార్టీ నియంతలా వ్యవహరిస్తోందంటూ నేతల ధ్వజం ఒంగోలు: జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. విపక్ష నేతలు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉండేందుకు ఎమర్జె్జన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారు. మాట వినకుంటే అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తామంటూ బెదిరింçపులకు పాల్పడుతున్నారు. ఆదివారం పర్చూరు మండలంలోని దేవరపల్లి దళితుల భూ వివాదాన్ని పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ గ్రామాన్ని సందర్శించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అధికారపార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలపై పోలీసులను ప్రయోగింపచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టులు చేయించి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా కీలకమైన నేతలను గృహ నిర్బంధంలో ఉండేలా చూశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఒంగోలు ఒన్‌టౌన్ సీఐ రామారావు బాలినేనికి చెప్పారు. ఆదివారం సాయంత్రం వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. బాలినేని గృహ నిర్బంధం వార్త క్షణాల్లో జిల్లావ్యాప్తంగా వ్యాపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ సీనియర్ నేత పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, రేణు నాగరాజు తదితర నేతలు వెంటనే బాలినేని ఇంటికి చేరుకున్నారు. సింగరాజు వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డిలను సైతం అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువురు నేతలు బాలినేనితో కలిసి ఆయన స్వగృహంలోనే ఉండటంతో వారిని కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఆదివారం ఉదయానికే బాలినేని నిర్బంధంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వ్యాపించడంతో మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి, దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నాయకులు చుండూరి రవిబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, బడుగు కోటేశ్వరరావు, గంగాడ సుజాత, బడుగు ఇందిర, పోకల అనురాధ, చిన్నపరెడ్డి అశోక్‌రెడ్డి, సూరే మణికంఠారెడ్డి, యశ్వంత్‌వర్మ, కాకుమాను సునీల్రాజు, యనమల నాగరాజు, డీఎస్ క్రాంతికుమార్ తదితరులతోపాటు వందలాదిమంది నేతలు, కార్యకర్తలు బాలినేని గృహానికి చేరుకున్నారు. అధికారపార్టీ నియంతృత్వ పోకడలతోపాటు పోలీసుల చర్యలను ఈ సందర్భంగా ఖండించారు. ఆదివారం ఉదయానికి దేవరపల్లిని సందర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరువ నాగార్జున బయలుదేరగా ఆయనను మార్గమధ్యలోనే పర్చూరు మండలంలోని బోడవాడ గ్రామం వద్ద సీఐ శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని యద్దనపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. నాగార్జునతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు డొక్కుమల్ల రవి, డేవిడ్, సుబ్బయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ను శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రంవరకు ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలోనే ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి భరత్‌ను పోలీసులు దేవరపల్లిలో అదుపులోకి తీసుకొని ఇంకొల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరితోపాటు పర్చూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కృష్ణమోహన్, మాజీ ఎంపీపీ యద్దనపూడి హరిప్రసాద్, మార్టూరు మండల కన్వీనర్ కాలేషావలి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ముకుందరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాస్, అనీల్, మస్తాన్‌వలి, సురేష్, సులేమా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్చూరు మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు తదితరులను అరెస్టు చేసేందుకు శనివారం అర్ధరాత్రి పోలీసులు వారి ఇళ్లవద్దకు చేరుకున్నారు. అయితే కొల్లా బాలినేనితో కలిసి దేవరపల్లి వెళ్లేందుకు ఒంగోలుకు చేరుకొని ఆయనతోపాటు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. అలాగే చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ యడం బాలాజీ, పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జ్ వరికూటి అమృతపాణిలను అదుపులోకి తీసుకుని వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. -
వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. 17మంది రేషన్ డీలర్లపై కక్షసాధింపునకు పాల్పడ్డారు. వీరి రేషన్ షాపులపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి బయో మెట్రిక్ మిషన్లను తీసుకెళ్లారు. డీలర్లపై ఫిర్యాదులొచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తుండడంతో వీరిపై అధికారులు దాడులు చేశారు. కాగా, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా వదలడంలేదు. స్థానిక 18వ వార్డు కౌన్సిలర్ సుబారాయుడు ఇంటిపై గత రాత్రి వందల సంఖ్యలో పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న రూ.5.5 లక్షలను తీసుకెళ్లారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపినా పట్టించుకోకుండా తీసుకెళ్లారని కౌన్సిలర్ వాపోయారు. నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ ఈ విధమైన దారుణాలకు ఒడిగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
అధికారం ఆడిందే ఆట
♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట ♦ రాజధానిలో యథేచ్ఛగా నిర్వహణ ♦ అనధికార క్లబ్బుల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్న వైనం ♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని స్థానిక పోలీసులు సాక్షి, గుంటూరు: జిల్లాలో పేకాట క్లబ్బులకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతివ్వకపోవడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల బంధువులు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అనధికారికంగా పేకాట స్థావరాల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్నారు. ప్రతి రోజూ బంకిణీల పేరుతో వేలాది రూపాయలను పేకాట రాయుళ్ల నుంచి వసూలు చేస్తున్నారు. ‘పోలీసులతో ముందే మాట్లాడుకున్నాం.. వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెపుతూనే ఉన్నాం.. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా నిర్భయంగా ఇక్కడకు వచ్చి పేకాట ఆడుకోవచ్చు’ అంటూ ఓపెన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో జూదగాళ్లు ‘డబ్బు పోయినా పర్వాలేదు, పోలీసుల బెడద లేకుండా ఉంటే చాలం’టూ ఆ స్థావరాలకు వెళ్లి హాయిగా ఆడేసుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి, నూతక్కి, యర్రబాలెం, పేరేచర్ల, రూరల్ జిల్లా పరిధిలోని నాదెండ్ల, యడ్లపాడు, నర్సరావుపేట, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రాజధానిలో ప్రాంతంలో.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంతోపాటు ఆ మండలంలోని నూతక్కి, యర్రబాలెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. మంగళగిరి మండలం రామచంద్రాపురం, తాడేపల్లి మండలాల్లో కేంద్రాలు నడుస్తున్న విషయం గతంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ గ్రామాల్లో తాత్కాలికంగా పేకాట నిలిచిపోయింది. మిగతా ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జోరుగా సాగుతోంది. ఇళ్లను క్లబ్బులుగా మార్చుకుని.. నరసరావుపేట రూరల్ మండలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో గతంలో ముఖ్యనేత తనయుని అనుయాయులు పేకాట కేంద్రాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో దానిపై గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 15 మందిని అరెస్టు్ట చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, రూ. 7.95 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, మండల సరిహద్దుల వద్ద రోజుకో స్థావరం మారుస్తూ పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో కొన్ని నెలల క్రితం క్లబ్బు మూతపడటంతో ఇళ్లలోనే పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో తమకు అనువుగా ఉన్న ఇళ్లలో పేకాట నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మండలంలోని ఓ రైస్ మిల్లో, యడ్లపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలే పేకాట కేంద్రాల్ని నడుపుతుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లడం లేదు. కొందరు పోలీస్ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ శిబిరాల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట నిర్వాహకులు నిత్యం పోలీస్స్టేషన్లలోనేæ కూర్చుని పంచాయితీలు సైతం చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు, చిరు ఉద్యోగులు పేకాటలో లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరిపి పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అంతా మాయ!
♦ రిజర్వ్ ఫారెస్ట్‌ను అన్ రిజర్వ్డ్గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు ♦ దేవరకొండ దోపిడీకి సర్కారు అండ ♦ జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేసిన పెద్దలు ♦ క్వారీ తవ్వకాలకు అనుకూలంగా మారిపోయిన మ్యాపులు ♦ అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ♦ ఈ నెల 22న న్యాయ స్థానానికి నివేదిక అందజేయనున్న అధికారులు తిమ్మిని బమ్మిని చేసి... బమ్మిని తిమ్మిని చేసే కుతంత్రాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. సర్కారు ఆస్తుల్ని దర్జాగా అప్పగించేసేందుకు పెద్ద స్థాయిలో పైరవీలు నడుస్తున్నాయి. గిరిజనుల మనోభావాలను పట్టించుకోకుండా... వారి ఆందోళనలు లెక్క చేయకుండా... తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకునేందుకు ఆ కొండలపై వాలిన డేగలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎక్కడ కొల్లగొట్టేందుకు అవకాశం ఉంటుందో అక్కడ దోపిడీ చేసేయడానికి పక్కా వ్యూహాలు తయారైపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడానేతల కనుసన్నల్లో అధికారుల నివేదికలు సిద్ధమైపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో బడేదేవరకొండ గ్రానైట్ నిక్షేపాలను దోచుకునేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు తారాస్థాయికి చేరాయి. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రే అందుకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్వే రికార్డులు మార్చిన దగ్గర నుంచి తాజాగా తప్పుడు మ్యాపులు తయారీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి అనుచర గణం చేస్తున్న తెర వెనుక కుట్రలు విస్తుగొలుపుతున్నాయి. మరో భారీ కుంభకోణానికి తెరదీస్తున్నాయి. పార్వతీపురం మండలంలో కోరి సర్వే నెం.1లో అత్యంత విలువైన కాశ్మీరీ గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకోవడానికి టీడీపీ ప్రభుత్వం తమిళనాడుకు చెందిన ఫళనివేల్ అనే బడా వ్యాపార వేత్తకు అనుమతులిచ్చింది. 41.25 ఎకరాల్లో గనులు తవ్వుకోవచ్చని చెప్పడంతో ఆయన రోడ్లు కూడా వేసుకున్నాడు. అయితే అతనికి అనుమతిచ్చిన చోట కాకుండా మరోచోట తవ్వుకునేందుకు అక్కడ భారీ అక్రమాలకు తెరదీశారు. సీఎం పేషీలోని కొందరు పెద్దల ద్వారా అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, జిల్లా మంత్రి అండదండలతో పథకం ప్రకారం జరిగిన ఈఅక్రమాల్లో రూ.కోట్లు చేతులుమారుతున్నాయి. అసలేం జరుగుతోందంటే... అటవీ భూములను గుర్తించడానికి ఉన్న ప్రధాన మార్గం జియో కో ఆర్డినేట్స్. వాటి ఆధారంగానే ఏ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉంది. ఏ ప్రాంతం అన్ రిజర్వ్‌లో ఉందనే విషయాలను తెలుసుకుంటుంటారు. ఫళనివేల్ ఇక్కడే తన బుద్ధి కుశలతను ఉపయోగించారు. తమకు అనుమతి ఉన్న కోరి ప్రాంతంలో కాకుండా ములగ ప్రాంతంలోని సర్వే నెం.1లో జియో కో ఆర్డినేట్స్‌ను సృష్టించారు. నిజానికి ఈ భూముల్లో దేవరకొండ ఊటనీటితో అక్కడి గిరిజనులు 10వేల ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. 1993లో అటవీ భూములను డిజిటలైజ్ చేశారు. దాని ప్రకారం 2005లో ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అని తేల్చారు. అదే విషయాన్ని తాజాగా ఢిల్లీలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్‌కు అటవీ శాఖ లేయర్స్‌ను తయారు చేస్తుంది. వాటి ప్రకారం చూసినా ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌గానే ఉంది. సర్వే పేరుతో సరికొత్త ఎత్తుగడ గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హైలెవెల్ కమిటీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైంది. గతనెలలో చీఫ్ కమిషనర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆ కమిటీలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్(ఇన్చార్జ్) శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ విజయమోహన్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.సారంగి జిల్లాకు వచ్చి అధ్యయనం చేశారు. ఆ సమయంలో తెర వెనుక జరిగిన అంశాలను రహస్యంగా ఉంచి కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రజలకు చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ రోజు అటవీ శాఖ నుంచి వారికి అనేక ఆధారాలు లభించాయి. ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పడానికి ఉన్న అన్ని డాక్యుమెంట్లను ఆ శాఖ అధికారులు చూపించారు. ప్లాన్ బెడిసికొడుతుందని భావించిన ప్రభుత్వం, మంత్రి, ఫళనివేల్తో కుమ్మక్కైన ఓ అధికారి కొత్త మెలిక పెట్టారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు విడివిడిగా సర్వే చేయించుకోవడం కాదు రెండూ కలిసి సర్వే చేయాలని చెప్పి కమిటీని తప్పుదోవ పట్టించి పంపించేశారు. దీని వెనుక అసలు కారణం తాజాగా తయారు చేస్తున్న మ్యాపుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేయాలనుకోవడమేనని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే పాత మ్యాపులో జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేశారు. దానిపై అప్పటి అధికారులు కనీసం చూసుకోకుండా సంతకాలు చేసేశారు. ఇప్పుడు అంతకు మించి పక్కా మ్యాపులు తయారు చేయడానికి మొదటి పాయింట్ నుంచి చేయాల్పిన సర్వేను కేవలం మైనింగ్ ప్రాంతంలో మాత్రమే చేస్తూ మమ అనిపిస్తున్నారు. -
గుండెచెరువు
►వరిని మింగేస్తున్న ఆక్వా ►పడిపోతున్న వరి సాగు విస్తీర్ణం ►అంతా చెరువుల మయం ►ఆక్వాకు అధికారపార్టీ వత్తాసు ►నిబంధనలకు తూట్లు ►అధికారుల చర్యలకు ప్రజాప్రతినిధుల మోకాలడ్డు ►ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ►రైతు సంఘాల ఆందోళన జిల్లాకు గుండెలాంటి గోదావరి డెల్టా.. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేరొందింది. ప్రస్తుతం దైన్యాగారంగా మారింది. నానాటికీ వరి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు చెరువులు తవ్వేస్తున్నారు. వారికి అధికారపార్టీ నేతలు వత్తా సు పలుకుతున్నారు. ఏలూరు (మెట్రో) : ‘అనుమతులు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి. అక్రమంగా అనుమతులు ఇస్తే మత్స్యశాఖ అధికారులపై చర్యలు తప్పవు. ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడను’ ఇదీ గత వారం కలెక్టరేట్లో నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పలికిన మాటలు.. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అండ అడ్డదిడ్డంగా ఆక్వా చెరువుల తవ్వకానికి అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. నిబంధనలు పాటించని అక్రమార్కులపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంటే వారు అడ్డుతగులుతున్నారు. అధికారులపై దూషణల పర్వానికీ పూనుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే.. అనుమతులు ఇవ్వకుంటే అంతు చూస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. ఫలితంగా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. ఉండి, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవిగో.. ఉదాహరణలు.. ఉండి నియోజవకర్గం ఆకివీడు మండలంలో ఇటీవల మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, అధికారులతో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. చేపల చెరువుల అనుమతులు ఎందుకు రద్దుచేశారంటూ అధికారులను మందలించారు. కార్యకర్తల ముందే నిలబెట్టి దూషణలకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ నేత నిడమర్రు మండలంలో చెరువుల అనుమతులపై మండల స్థాయి అధికారులపై విరుచుకుపడ్డారు. భీమవరానికి మంచినీటిని సరఫరా చేసే వేండ్ర మార్గంలో తాగునీటి చెరువు సమీపంలో చేపల చెరువులు తవ్వుతున్నారని నిలిపేందుకు యత్నించిన అధికారులకు అక్కడి ప్రజాప్రతినిధి నుంచి చివాట్లు ఎదురయ్యాయి.దీంతో అధికారులు నలిగిపోతున్నారు. చెరువులకు అనుమతులు ఇవ్వకుంటే.. ప్రజాప్రతినిధులు, ఇస్తే కలెక్టర్ తమపై విరుచుకుపడుతుండడంతో ఏమి చేయాలో పాలుపోక తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయాలని మదన పడుతున్నారు. నాయకులే చెరువుల దళారులు చేపల చెరువులకు మండల స్థాయి నుంచి, జిల్లాస్థాయి వరకూ అనుమతులు తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలే దళారులుగా మారారు. వీరు గతంలో ఎకరా చెరువు అనుమతికి రూ.25వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిప్పించేందుకు తమ కమీషన్‌ను తగ్గించుకున్నారు. ప్రస్తుతం రూ.15వేలకు అన్నిరకాల అనుమతులూ తీసుకొస్తామని రైతుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలకు పాతర.. మాగాణి భూములను చేపలు, రొయ్యలు చెరువులుగా మార్చాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే. అయితే అక్రమార్కులు, దళారులు వీటిని పట్టించుకోవడం లేదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుని చెరువులు తవ్వేస్తున్నారు. కొందరు అనుమతులు లేకుండానే అనధికార సాగుచేపట్టేస్తున్నారు. నిబంధనలు ఇవి.. వరి, ఇతర పంటలకు పనికిరాని భూములను మాత్రమే చేపల చెరువులుగా మార్చాలి.తమ భూములకు సాగునీటి వసతి లేదని, పంటలకు పనికి రావని ధ్రువీకరించే ఆధారం చూపించాలి.పంట, కాలువలు, డ్రెయిన్లకు దగ్గరలో చెరువులు తవ్వకూడదు. ఉప్పునీటి రొయ్యల సాగుకు అనుమతి లేదు. నిర్దేశించిన ఆరు రకాల చేపలను మాత్రమే పెంచాలి.అయితే ఈ నిబంధనలేమీ అక్రమార్కులకు పట్టడం లేదు. అక్రమ చెరువులపై ఫిర్యాదుల వెల్లువ ఇదిలా ఉంటే జిల్లాలో అక్రమంగా తవ్విన చెరువులపై కలెక్టరేట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతివారం మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు సుమారు 20 నుంచి 50 ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కలెక్టర్ అక్రమంగా తవ్విన చెరువులపై దృష్టిపెట్టారు. మండల స్థాయి అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల వల్ల చెరువుల తవ్వకాల నియంత్రణ అధికారులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మరింతగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవాలి! ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వరి మాయమవుతుందని, ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మత్స్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు వరి ప్రాధాన్యం, ఆక్వా చెరువుల వల్ల కలిగే అనర్థాలపై సదస్సులు నిర్వహించారు. ఇప్పటికైనా నష్టనివారణ చర్యలు చేపట్టాలని, అప్పుడే వరిసాగు వర్థిల్లుతుందని రైతు సంఘాలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
మా రూటే సెపరేటు!
∙ అధికారులు, అధికార పార్టీ నేతల కుమ్మక్కు ∙ పునరావాస నిధులను బొక్కేస్తున్న వైనం ∙ టెండర్లలో అక్రమాలు.. ∙ కాంట్రాక్టర్లను బెదిరింపులు.. బలవంతంగా లేఖలు ∙ ప్రజాధనానికి భారీగా గండి ∙ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు పేరుకు మాత్రం ఈ–టెండర్లు..కానీ జిల్లాలో వాటి రూటే సెపరేటు. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బెదిరించి అబౌ రేట్లకు పనులను దక్కించుకోవడం మామూలైపోయింది. కాంట్రాక్టర్లతో ఈ పనులు మాకొద్దంటూ బలవంతంగా లెటర్లు రాయించడం ఆ తర్వాత అదే పనులను తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించి 12 నుంచి 15 శాతం కమీషన్లు పుచ్చుకుంటున్నారు. ఇందుకు జిల్లా స్థాయి అధికారులే సహకారం అందిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారు 12 శాతానికి తగ్గకుండా కమీషన్లు పుచ్చుకుంటున్నారు. మొత్తంగా అధికార పార్టీ శాసనసభ్యులు, అధికారులు కలిపి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని బొక్కుతున్నారు. జిల్లా భారీ నీటిపారుదల శాఖ (ప్రాజెక్టుల విభాగం)లో జరుగుతున్న టెండర్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. తాజాగా వెలిగొండ పునరావాస పనుల టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పోటీ టెండర్లలో పాల్గొనకుండా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ జిల్లా పాలనాధికారి తనకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒంగోలు :వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తోకపల్లె గ్రామ పునరావాస పనులకు సంబంధించి ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సంబంధిత గ్రామంలో డ్రైయిన్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.2 కోట్ల పనులకు 14 మంది కాంట్రాక్టర్లు పోటీ పడి ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశారు. వీరిలో ఇద్దరిని అధికారులు డిస్క్వాలిఫై చేశారు. ఇందులో యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ 20.06 లెస్‌కు టెండర్ వేశారు. పని తనకే కావాలంటూ యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇరిగేషన్ (ప్రాజెక్టులు) ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి తలొగ్గిన ఎస్ఈ రూ.2 కోట్ల పనిని ఆయనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రెండు నెలల పాటు టెండర్ ఖరారు చేయలేదు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు తెరవలేదంటూ ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. అనుకోకుండా ఒక్కసారిగా ఆన్లైన్లో టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది. ప్రైజ్ బిడ్ ఓపెన్ కావాల్సి ఉంది. అప్పటికే ఎవరూ ఎక్కువ లెస్ వేశారన్న విషయంపై స్పష్టత వచ్చింది. 20.06 ఎక్కువ లెస్‌కు వేసినందున పని తనకే వచ్చిందని కాంట్రాక్టర్ ఎస్ఈని కలిసి చెప్పాడు. పని అగ్రిమెంట్ చేయాలంటూ ఎస్ఈని కోరారు. అసలు తాము టెండర్లే ఓపెన్ చేయలేదని అవి ఎలా ఓపెన్ అయ్యాయో... తెలియదంటూ ఎస్ఈ అడ్డం తిరిగారు. ఇదే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఇరిగేషన్ ఎస్ఈ కాంట్రాక్టర్లతో బలవంతంగా పని తమకు వద్దంటూ లెటర్ రాయించుకున్నారు. కొద్దిరోజులు ఆగి ఆ తర్వాత మరోమారు టెండర్లు ఓపెన్ చేసినట్లు ఎస్ఈ ప్రకటించారు. ఈ లోపు 12 మంది కాంట్రాక్టర్లను డిస్ క్వాలిఫై చేశారు. కేవలం ఎస్టిమెట్ రేట్లకు టెండర్ వేసిన ఒక కాంట్రాక్టర్‌తో పాటు 4.4 అబౌ వేసిన మరో కాంట్రాక్టర్‌ను మాత్రమే క్వాలిఫై చేశారు. అబౌ రేటుకు టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు పనిని ఓకే చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఈ వ్యవహారం మొత్తం నడిచింది. తొలుత టెండర్ ప్రకారం 20.06 లెస్‌లో పని ఖరారై ఉంటే.. ప్రభుత్వానికి 42 లక్షల నిధులు ఆదా అయ్యేవి. అలా కాకుండా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కలిసి మొత్తం నిధులను బొక్కేందుకు ప్రణాళిక రచించారు. పని దక్కించుకున్న ప్రజాప్రతినిధి 15 శాతం కమీషన్ పుచ్చుకున్నట్లు సమాచారం. ఇక అధికారులకు సైతం 12 శాతం వరకు కమీషన్‌ను ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై చర్యలేవీ.. పునరావాస పనుల్లో అక్రమాలకు ఈ టెండర్ల వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు ఇటీవల టెండర్లు పిలిచిన వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరగడమే కాకుండా పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారింది. పర్సంటేజీలు పుచ్చుకొని అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సదరు పనుల్లో వాస్తవాలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లకు బెదిరింపులు జిల్లాలో అభివృద్ధి పనులకు పోటీ టెండర్లు వేసే కాంట్రాక్టర్లకు బెదిరింపులు తప్పడం లేదు. తాము చెప్పినట్లు వినకపోతే భవిష్యత్తులో పనులు రావని, ఒక వేళ వచ్చిన చేయలేరంటూ అధికారులు నిస్సిగ్గుగా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పోటీ టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల ద్వారా బలవంతంగా లెటర్లు రాయించడం గమనార్హం. తోకపల్లె పునరావాస పనికి టెండర్లు దాఖలైన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్లతో బలవంతంగా లెటర్లు రాయించారు. ‘టెండర్ ఖరారు కావడం రెండు నెలలు ఆలస్యమైనందున గతంలో వేసిన రేట్లకు తాము పనులు చేయలేమని, నష్టపోతామని కాబట్టి టెండర్ క్యాన్సిల్ చేయాలంటూ అధికారులకు కాంట్రాక్టర్లకు లెటర్ రాసుకున్నట్లుగా’ బలవంతంగా లెటర్లు రాయించారు. అధికారులు పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు సాక్షితో వాపోయారు. కాదూ... కూడదంటే కాంట్రాక్టర్లపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తోకపల్లె రూ.2 కోట్ల పనికి 20.06 శాతం లెస్ వేసిన కాంట్రాక్టర్‌పై ఇరిగేషన్ ఎస్ఈ కక్ష కట్టినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్ అద్దంకి ఏరియాలో 1.13 కోట్ల పనితో పాటు మరో 67 లక్షల పనులకు టెండర్లు దాఖలు చేయగా ఎస్ఈ అతనిని డిస్క్వాలిఫై చేయడం ఇందుకు ఉదాహరణ. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆడమన్నట్లు జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘అధికార పార్టీ తొత్తులైన అధికారులు’
పీలేరు: పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు బరితెగింపుతో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై ప్రత్యేక మక్కువ ఉన్న అధికారులు నేరుగా ఆ పార్టీలో చేరితే తమకు అభ్యంతరం లేదని కొంతమంది అధికారుల తీరు దుర్మార్గమని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా పలువురు అధికారులు తమ తీరు మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నెలవారీ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రత్యేకాధికారి అధ్యక్షతన ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో ఈ కార్యక్రమం జరిగింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకుండానే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వచ్చేసరికి స్టేజిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండడాన్ని చూసి ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక టీడీపీ సమావేశమా అని అధికారులను ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని టీడీపీ నేతలను స్టేజిపైకి ఆహ్వానించి అసలైన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఎమ్మెల్యే రావటం గమనించిన అధికారులు స్టేజిపైకి రావాలిన మైక్‌లో పిలిచారు. దీనికి స్పందించిన రామచంద్రారెడ్డి కనీసం ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేనపుడు తాను పైకి రానని జనంలోనే కూర్చుంటానంటూ పక్కన ఉన్న కూర్చీలో పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కలిసి కూర్చున్నారు. ఎమ్మెల్యేను విస్మరించి టీడీపీ కార్యక్రమం తరహాలో కొనసాగించారు. ఇంతలో లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసే సమయంలో ఎమ్మెల్యే పేరు ప్రస్తావించగా ప్రొటోకాల్ పాటించని అధికారుల వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇంతలో టీడీపీ నేతలు కేరింతలు, బిగ్గరగా కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు అధికారులను నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఎందుకు ఆహ్వానించలేదని, వారు వస్తే ఎక్కడ కూర్చోవాలో చూపాలంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ నేతల కేకలకు నిరసనగా ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయం ప్రవేశ గేటు వద్ద నేలపై గంటకుపైగా బైఠాయించారు. ఎమ్మెల్యే ధర్నాకు కూర్చున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం టీడీపీ నేతల సూచనల మేరకు కార్యక్రమాన్ని ముగించారు. పీలేరు అర్బన్, రూరల్ సీఐలు డీ. నాగరాజు, మహేశ్వర్, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఇతర పోలీస్ అధికారులు ధర్నా వద్దకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతం నియోజక వర్గ ప్రత్యేకాధికారి గోపీచంద్, పీలేరు ఎంపీడీవో, తహశీల్దార్ ఏ. వసుంధర, మునిప్రకాశంలు సుదీర్గంగా ఎమ్మెల్యేతో చర్చించి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అనేక సార్లు ఇలానే చెప్పా, కనీస మర్యాద కూడా పాటించకుండా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులు, అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ధర్నా విరమించారు. -
అడ్డొస్తే అంతమే..!
►ఏలూరులో హత్యారాజకీయాలు ►ప్రత్యర్థులను హతమార్చడానికి సుపారీలు ►రెచ్చిపోతున్న రౌడీషీటర్లు విష సంస్కృతికి శ్రీకారం ►అధికారపార్టీ అండదండల వల్లే.. కొత్త ఎస్పీకి సవాలే..! పైరుపచ్చని పశ్చిమ సీమ.. ప్రశాంతతకు ఆలవాలం.. సమైక్య జీవనం.. సమతకు, మమతకు తార్కాణం.. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారింది. విద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. హత్యారాజకీయాలు పేట్రేగిపోతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరు పరిసరాల్లో విష సంస్కృతి పురుడుపోసుకుంటోంది. దీనికి అధికారపార్టీ కూడా వత్తాసు పలుకుతోంది. హత్యాకాండలకు అండదండలందిస్తోంది. ఈ ప్రమాదకర పోకడ సర్వత్రా ఆందోళన రేపుతోంది. ఏలూరు : అడ్డొస్తే అంతమొందించేయ్.. ఇదీ జిల్లా కేంద్రం ఏలూరు, పరిసరాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. గతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఎవరైనా తమ కార్యకలాపాలకు అడ్డొస్తున్నారని భావిస్తే.. వారిని బెదిరించడం, మహా అయితే దాడి చేయడం వరకూ ఉండేది. అయితే రెండేళ్లలో ఏలూరులో శాంతిభద్రతలు క్షీణించాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను మట్టుబెట్టడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంతమొందించేందుకు కుట్ర పన్నే దుస్థితి నెలకొంది. ఇది ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. ఏడాదిన్నర క్రితం న్యాయవాది రాయల్ హత్య కేసుతో మొదలైన హత్యా రాజకీయాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పోలీసులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. దీనికి ఈ ఉదాహరణలే నిదర్శనం.. ఇసుక దందాకు అడ్డమని..! తాజాగా దెందులూరు మండలానికి చెందిన అ«ధికార పక్ష నేత ఒకరు.. తన అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాడనే కారణంతో ఒక వ్యక్తిని అంతమొందించడానికి కిరాయి రౌడీలతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతుండటంతో ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు మోతుకూరి శోభన్‌బాబు తనకు అన్ని విషయాల్లో అడ్డు వస్తున్న ఫొటోగ్రాఫర్ కొత్తపల్లి రమేష్‌ను చంపడం కోసం ఏలూరుకు చెందిన రౌడీషీటర్ బ్రహ్మానందంతో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుని రూ. 25 వేలు అడ్వాన్సు ఇచ్చారు. అయితే బ్రహ్మానందం ఈ విషయాన్ని రమేష్‌కు చెప్పడంతో రమేష్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. సరిహద్దు తగాదాల నేపథ్యంలో.. సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఈ నెల 10న చొదిమెళ్ల గ్రామానికి చెందిన బండి రాంబాబు, బాబూరావును అదే గ్రామానికి చెందిన వారు ఏలూరు పాతబస్టాండ్ ప్రాంతంలో కత్తులతో దాడి చేసి చంపబోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో అతను మళ్లీ బెదిరిస్తున్నాడని గ్రామస్తులంతా టూటౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించాల్సి వచ్చింది. ఆధిపత్యపోరుతో హత్య ఇటీవల గుడివాకలంక మాజీ సర్పంచ్ భద్రగిరి స్వామిని ఏలూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అగంతకులు కత్తులతో నరికి చంపారు. ఈ హత్య అధిపత్య పోరుతోనే జరిగింది. ఏకంగా ఎమ్మెల్యే హత్యకే కుట్ర! దెందులూరు శాసనసభ్యునితోపాటు మరో ఇద్దరిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఘటన ఈ నెలలోనే వెలుగు చూసింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. అప్పలనాయుడు భార్య ఏలూరు ఎంపీపీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడంతో ఆమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. అయితే పదవీకాలాన్ని ఇంకో ఏడాది పెంచాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. దీనికి చింతమనేని నిరాకరించారు. దీంతో రెడ్డి అనురాధ తన పదవికి రాజీనామా చేశారు. మోరు హైమావతి ఎంపీపీ పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పదవి దక్కలేదని, పైపెచ్చు తమను ఆర్థికంగా చింతమనేని ఇబ్బంది పెడుతున్నారని అక్కసు పెంచుకున్న రెడ్డి అప్పలనాయుడు ఎలాగైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విషయాన్ని పసిగట్టిన పోలీసులు చింతమనేని ప్రభాకర్‌కు 3 ప్లస్ 3 సెక్యూరిటీని కల్పించారు. దిలా ఉంటే అధికార పార్టీలోని భీమవరపు సురేష్, కొల్లి శంకరరెడ్డి వర్గాలు ఒకరినొకరు చంపుకునేందుకు రెక్కీలు కూడా జరుపుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొల్లి శంకరరెడ్డి చింతమనేని హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరపు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే హత్యలవైపు మొగ్గుచూపుతున్న ఈ విష సంస్కృతికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవిప్రకాష్ ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే! -
‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!
- ‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు – మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం – దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు – మార్గదర్శకాలు రాకనే పైరవీలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి 6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్చార్జ్ మంత్రికే అధికారాలు! రైతురథం పథకం కింద ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు. ఇవీ నిబంధనలు –రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి. – అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు. – దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్ ఉంటే అనర్హుడు. – ఆధార్, పాస్‌బుక్‌లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. – దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. – వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్చార్జ్ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జ్ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది. -
భూరాబందులు
తిరుపతి/మదనపల్లె: మదనపల్లెలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పెచ్చుమీరిపోయాయి. కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లెలోని మాజీ సైనికుల స్థలాన్ని ఆక్రమించిన అధికార పార్టీ నేతలు తమ ఆక్రమణల పరంపరను కొనసాగిస్తూ పట్టణంలో మిగిలిన ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎవ రి పరిధిలో వారు తమదైన శైలిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన కోట్ల విలువ చేసే స్థలంపై వీరి కన్ను పడింది. టెండరు ద్వారా ఆర్టీసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకు న్న వ్యాపారి నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను శనివారం రాత్రి అడ్డుకుని దౌర్జన్యానికి పాల్ప డ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మదనపల్లె ఆర్టీసీ డిపో పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 294/1, 294ఏ, 294బీలలో 1,535 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఆర్టీసీ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన స్థలాన్ని అధికారులు తమ పరిధిలోనే ఉంచుకున్నారు. ఆదాయ వనరులు పెంచుకునే క్రమంలో ఈ స్థలాన్ని లీజుకివ్వాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ఈ స్థలా న్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కనే ఉన్న ఓ చోటా టీడీపీ నేత కన్నేశాడు. తనకున్న అధికార బలంతో ఇప్పటికే పలుమార్లు కోర్టుకెళ్లి ఆర్టీసీ టెండర్లను అడ్డుకునేందుకు స్టేలు తెచ్చారు. దీంతో మూడేళ్లుగా ఆర్టీసీ టెండర్ల ద్వారా గదుల నిర్మాణం చేపట్ట లేక లక్షలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే రెండు నెలల కిందట హైకోర్టు ఆర్టీసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమల్లో పెట్టేందుకు మదనపల్లె డిపో అధికారులు సదరు స్థలాన్ని లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌లో ఈ స్థలాన్ని వెంకటేశ్ అనే వ్యాపారి లీజుకు పొందాడు. నెలకు రూ.42 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రయివేటు హోటల్ యజమాని దీన్ని అడ్డుకుని ఆ స్థలా న్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. శని వారం రాత్రి నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. పట్టణ టీడీపీలో క్రియాశీలకంగా ఉండే సదరు యు వ నాయకుడు పార్టీ అండ చూసుకుని ఆక్రమణలకు సిద్ధపడినట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలు బేఖాతరు ఆ స్థలం ఆర్టీసీదనీ ఎవరూ జోక్యం చేసుకోవద్దని డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి చెప్పినా వినని టీడీపీ నేత తనదైన దందాను ప్రదర్శించారు. స్థలం జోలి కొస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా నిర్మాణానికి సిద్ధం చేసిన ఇటుకలు ఇతరత్రా సామాగ్రిని ట్రాక్టర్లలో బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై గొడవకు దిగి దుర్భాషలాడారు. ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన దాడులకు, స్థల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి తెలిపారు. ఆ స్థలం మాది ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మదనపల్లెలోని ఖాళీ స్థలం ఆర్టీసీదనీ, ఎవరో ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుని ఆక్రమించేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అధికార పార్టీ
♦ గుర్రప్పడియలో గెలుపే లక్ష్యం ♦ పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యం ♦ సర్పంచ్ అభ్యర్థితో పాటు ఓటర్లను భయపెడుతున్న వైనం ♦ సోదాల పేరుతో ఇళ్లపై దాడులు ♦ గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకే ♦ అధికార పార్టీ అడ్డదారులు ♦ సజావుగా ఎన్నికకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా? సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి మండలం గుర్రప్పడియ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ నానా రకాల అడ్డదారులు తొక్కుతోంది. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి దత్తత గ్రామం కావడంతో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అరాచకానికి తెర తీసింది. పోలీసులను అడ్డుపెట్టి పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులతో పాటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు కూడా అనుమతించటం లేదు. పైగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. సోదాల పేరుతో దౌర్జన్యానికి దిగి అరాచకం సృష్టిస్తున్నారు. గుర్రప్పడియ గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన బీసీ మహిâ¶ళ బాపట్ల కొండమ్మ 11 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. తరువాత ఆమె మృతి చెందారు. ఉపసర్పంచ్ ఇన్చార్జి సర్పంచ్‌గా ఇప్పటి వరకు కొనసాగారు. అయితే గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు గురువారం సర్పంచ్ ఎన్నికకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. కాగా టీడీపీ మద్దతుదారుగా బీసీ వర్గానికి చెందిన మాదాల శాయమ్మ, వైఎస్సార్సీపీ మద్దతుదారుగా అదే వర్గానికి చెందిన బాపట్ల లక్ష్మమ్మ పోటీలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయంపై ధీమాతో ఉండగా ఎన్నికలు ఎలాగైనా నెగ్గేందుకు అధికార పార్టీ సామదానభేదదండోపాయలు ప్రయోగిస్తోంది. గుర్రప్పడియ కొండపి ఎమ్మెల్యే స్వామి దత్తత గ్రామం కావడంతో ఎమ్మెల్యే ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమకు ఓట్లేయకపోతే పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. పక్కా గృహాలు రాకుండా చేస్తామని, ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామంటూ మరింతగా బెదిరింపులకు గురి చేశారు. ఇక పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రచారం చేసుకోకుండా అడ్డుకున్నారు. నలుగురు కనిపిస్తే చాలు పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు. అసలు ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధిస్తున్నారు. పోలింగ్‌ను ఏకపక్షంగా నిర్వహించుకోవడంతో పాటు అవసరమనుకుంటే తమ అభ్యర్థిని దౌర్జన్యకరంగానైనా గెలిచినట్లు డిక్లేర్ చేసేందుకు కూడా అధికార పార్టీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గురువారం జరిగే పోలింగ్, కౌంటింగ్‌లను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థితో పాటు ఓటర్లకు రక్షణ కల్పించాలని పంచాయతీకి చెందిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ఓటర్లు కోరుతున్నారు. గురువారం జరిగే పోలింగ్‌లో అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ! -
రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే
-
రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే
♦ ఎస్సై, రైటర్ని నిర్బంధించి టీడీపీ ఎమ్మెల్యే దుర్భాషలు ♦ ‘మావాళ్లపై కేసులు పెడతారా’ అంటూ చిందులు ♦ తన కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి తిట్లు.. ♦ సమాధానం చెప్పి కదలాలంటూ నిర్బంధం ♦ వేల్పూరులో తీవ్ర ఉద్రిక్తత.. ♦ భారీగా మోహరించిన పోలీసులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏఎస్సైని కాలితో తన్నిన విషయం మర్చిపోకముందే.. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా ఒక ఎస్సైని, రైటర్‌ను తన కార్యాలయానికి పిలిపించి నిర్భంధించారు. పార్టీ కార్యాలయంలో కటిక నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ‘నా మాట వినకుండా మా పార్టీ వారిపై కేసులు పెడతావా. నాకు సమాధానం చెప్పే వరకూ నిన్ను ఇక్కడి నుంచి వదిలేది లేదు’ అంటూ భీష్మించారు. పార్టీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు తిట్టినట్టు సమాచారం. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అధికారపార్టీవారిపై కేసు పెట్టవద్దంటూ ఒత్తిడి తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య చర్చి విషయంలో కొంతకాలంలో వివాదం నెలకొంది. సమాధుల్ని అలికే రోజున స్మశానంలోనే ఇరువర్గాలు గొడవ పడ్డాయి. తర్వాత ఎవరింటికి వారు వచ్చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్సార్ సీపీ వర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడి చేశారు. ఒకరికి తల పగిలింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరువర్గాలకు చెందిన చెరో ఆరుగురిపై సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్థారణ కావడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మీకు ఎంత దమ్ముందిరా.. అంటూ దుర్భాషలు ఈ నెల 15న తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని, వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. గురువారం నాడు వైఎస్సార్ సీపీకి చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. ఇంకా ఇద్దరు దొరకాల్సి ఉంది. అయితే తన మాట వినకుండా తమ వారిపై కేసులు పెట్టడమే కాకుండా వారిని అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగ్రహించారు. ఇరగవరం ఎస్సై, రైటర్‌ను వేల్పూరులోని తన కార్యాలయానికి రమ్మని తణుకు సీఐ ఆదేశించారు. సీఐ వేరేచోట ఉండటంతో రాలేకపోయారు. ఎస్సై శ్రీనివాస్, రైటర్ ప్రదీప్‌కుమార్ సాయంత్రం 6 గంటల సమయంలో వేల్పూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ గదిలోకి రమ్మన్న ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా.. మీకు ఎంత దమ్ముందిరా’ అంటూ బూతులు తిట్టారు. వారిని కార్యాలయంలో నేలపై నేలపై కూర్చోబెట్టి తాను కూడా వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారాన్ని ఫొటోలు తీసిన పోలీసుల నుంచి సెల్ఫోన్లు లాక్కుని ఆ ఫోటోలను డిలిట్ చేయించారు. ఎస్సైని నిర్బంధించిన విషయం ఎస్పీకి తెలియడంతో ఆయన స్వయంగా ఎమ్మెల్యేకి ఫోన్‌చేసి నిర్బంధించడం సరికాదని చెప్పడంతో వారిని వదిలిపెట్టినట్టు సమాచారం. అప్పటికే అక్కడికి చేరుకున్న రేలంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు ఎస్ఐని, రైటర్‌ను బయటకు వెళ్లనివ్వకుండా మరోమారు అడ్డగించారు. దీంతో పోలీసులు భారీగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మోహరించారు. కొవ్వూరు డీఎస్పీ మురళీకృష్ణ, తణుకు సీఐ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. తఢమ వారికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడానికి మాత్రమే పిలిచానని, తాను ఎవరిని నిర్బంధించలేదని ఎమ్మెల్యే మీడియాకి తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుడి దాడి
– ఫిర్యాదు చేసిన బాధితుడు, పట్టించుకోని పోలీసులు – నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే మణిగాంధీ కర్నూలు సీక్యాంప్: వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులకు అడ్డుకట్ట పడడంలేదు. బుధవారం గీతాముఖర్జీనగర్లో నివాసముంటున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాకలి నరేష్(28)ను అదే కాలనీకి చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ప్రధాన అనుచరుడు అధికార పార్టీ నాయకుడు ఇ.సురేంద్ర గౌడ్ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చాకలి నరేష్ స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అధికార పార్టీ ఇచ్చిన తప్పుడు వాగ్ధానాల గురించి స్థానికులకు వివరించేవాడు. దీన్ని మనసులో పెట్టుకుని సురేంద్ర గౌడ్ దాడి చేశాడని నరేష్ బంధువులు వాపోయారు. ప్రమాద స్థలంలో స్పృహ తప్పి పడిపోయిన చాకలి నరేష్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిపించారు. అతని తలకి, చేతికి దెబ్బతగలి 12కుట్లు పడ్డాయి. క్షతగాత్రుడి తల్లిదండ్రులు భార్య నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన సురేంద్రగౌడ్ మణిగాంధీ అనుచరుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఐపై గల్లా అనుచరుల దాడి
►నలుగురు యువకుల బరితెగింపు ►రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ ►ఇన్స్పెక్టర్ తీరుపై రగిలిపోతున్న పోలీసులు తిరుచానూరు: తిరుచానూరు ఎస్ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్ఐ స్టేషన్‌కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?
జరిమానాతో లారీలను వదిలిపెట్టిన విజిలెన్స్ అధికారులు ప్యాపిలి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అక్రమార్జనకు తెరతీశారు. అయితే అధికారులు తరచూ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా చివరకు అధికారపార్టీ నేతలదే పైచేయి అవుతోంది. మండల కేంద్రం ప్యాపిలి వద్ద ఇటీవల విజిలెన్స్ అధికారులు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని చివరకు జరిమానాతో వాటిని వదిలేయడం చర్చనీయాంశమైంది. కర్నూలు వైపు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా గ్రానైట్ ఖనిజాన్ని తరలిస్తున్న ఏపీ 02ఎక్స్ 6277, ఏపీ 02 టీఏ 6255 నంబర్లు గల లారీలను ఈ నెల 14న కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్యాపిలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలను ప్యాపిలి పోలీస్‌స్టేషన్ అప్పగించిన అధికారులపై తాడిపత్రికి చెందిన అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం ప్యాపిలికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న లారీలపై ఫెనాల్టీ వేసి వదిలేశారు. అయితే ఈ లారీలు ఎవరి పేరుతో ఉన్నాయన్న విషయం, ఫెనాల్టి ఎంత వేశారన్న వివరాలు తెలియరాలేదు. -
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
-
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
► నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతల ఇల్లు కూల్చివేత ►ఎర్రచందనం స్మగ్లర్ మహేష్‌నాయుడు తదితరులపై కేసు నమోదు ►సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సుండుపల్లి: సుండుపల్లిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మహేష్ నాయుడు, శివారెడ్డిలు సోమవారం అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఇంటికి సమీపంలో వేరెవరూ ఇల్లు నిర్మించుకోకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. సొంత భూమిలో వైఎస్సార్సీపీ నాయకులు ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో మనుషులు, మారణాయుధాలతో వచ్చి జేసీబీతో ఇంటిని కూల్చి వేసి భయోత్పాతం సృష్టించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ, మండల వైఎస్సార్సీపీ నాయకుడు 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న వారి పూర్వీకుల స్థిరాస్తిలో ఇల్లు కట్టుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు. ఎంపీపీ అజంతమ్మ మాట్లాడుతూ తాము బెంగళూరులో ఉంటున్నామని, తమ సొంత భూమిలో ఇంటి నిర్మాణం జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారన్నారు. తాము ప్రతి దాడికి దిగితే పరిస్థితి ఏమవుతుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మండల మేజిస్ట్రేట్ రావాలి. పోలీసులు రావాలి కానీ ఇలా టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు వచ్చి అతని ఇంటికి వెళ్లేందుకు దారి లేదంటూ తమ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయడం ఏమిటన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీ నాయకులు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి సుండుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి సీఐ నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిరాజుదీ్దన్, సర్పంచ్ బ్రహ్మానందం, ఎంపీటీసీ బాబు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, రంగారెడ్డి, రాజారెడ్డి, బెల్లం సంజీవరెడ్డి, గౌరవసలహాదారుడు కృష్ణంరాజు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ చిన్నప్ప, మండల కోఆప్షన్ మెంబర్ పండూస్, బీసీ నాయకులు సూరి ఆచారి, జిల్లా ఎస్టీ నాయకుడు చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రికార్డులెక్కడ?
⇒ముదపాక భూముల్లో మరో కోణం ⇒రెవెన్యూ అధికారుల పనేనని అనుమానం ⇒మలుపులు తిరుగుతున్న కుంభకోణం ⇒భూములను పరిశీలించిన కలెక్టర్, జేసీ విశాఖపట్నం/పెందుర్తి : పెను సంచలనం రేపిన పెందుర్తి మండలం ముదపాక భూముల వ్యవహారంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. దళితులకు చెందిన వందల ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేయడానికి కొంతమంది అధికార పార్టీ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, సాక్షిలో పలు కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చ జరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో వెంకటేశ్వరరావు, వుడా అధికారులు ముదపాక వెళ్లి వివాదాస్పద అసైన్డ్ భూములను సందర్శించారు. రెవెన్యూ, వుడా అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. అధికారిక రికార్డులెక్కడ ఈ అసైన్డ్ భూములకు చెందిన అధికారిక రికార్డులు లేవని సాక్షాత్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. దీంతో వందల కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి వేసిన స్కెచ్‌లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిం చారన్న ఆరోపణలు ఆది నుంచీ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన కొంతమంది పెద్దలు ఎకరం రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ భూములను విక్రయించకపోతే ప్రభుత్వమే స్వాధీనం చేసేసుకుంటుందని, అప్పుడు ఈ సొమ్ము కూడా దక్కకుండా పోతుందని భయపెట్టారు. బెదిరించి అక్రమంగా కొందరు భూముల్లోంచి రోడ్డు కూడా వేసేశారు. అది నిజమేనేమోనని నమ్మిన రైతులు తమ భూములు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలా 236 మంది రైతుల నుంచి 280 ఎకరాల భూమిని కొనుగోలుకు ‘పెద్దలు’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున అడ్వాన్సుగా చెల్లించి వారి నుంచి ముందస్తుగా తెల్లకాగితాలు, ప్రాంసరీనోట్లపై సంతకాలు చేయించుకున్నారు. వుడా ఎంట్రీతో ఉలిక్కపడ్డ రైతులు చివరకు తమ నుంచి కొనుగోలు చేస్తున్న భూములను వుడా భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) కు ఎకరం కోటి రూపాయలకు ఇస్తున్నారన్న సంగతి తెలుసుకుని సదరు రైతులు షాక్ తిన్నారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, రైతులు ఏకమై పత్రికలు, బీజేపీ శాసనసభా పక్షనేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజును ఆశ్రయించారు. దీనిపై సాక్షిలో ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీ ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ బాగోతంలో అధికార పార్టీ పెద్దలు, రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జేసీ, ఆర్డీవో, తహసీల్దార్లను వెంటబెట్టుకుని ముదపాక భూములను పరిశీలించారు. అనంతరం ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన అధికారిక రికార్డులు లేవని, ఎంజా య్మెంట్ సర్వేకు ఆదేశించామని కుండబద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డులు మాయం వెనక రెవెన్యూ అధికారులున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బజారున పడిన పచ్చపార్టీ పరువు!
రాజంపేట : రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఇటీవల పోలీసు, రెవెన్యూశాఖ పరంగా అధికారపార్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా లేకుంటే అవినీతి..అమ్ముడుపోయారనే లాంటి అపవాదును అంటగడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధశాఖలకు చెందిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ బహిరంగగానే ఆరోపణలు గుప్పించడంపై అధికారపార్టీ వర్గాల్లో కలకలంరేపుతోంది. అధికారపార్టీలో కొనసాగుతున్నవారే అధికారుల పనితీరుపై పచ్చనేతలు ధ్వజమెత్తుతుంటే అది నేరుగా చంద్రబాబు సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉందనే భావనతో కొందరు పార్టీనేతలు ఆవేదన చెందుతున్నారు. మా విధులు మమ్మల్ని చేయనివ్వండి. లేదంటే పనిచేయలేం..బదిలీ చేసేయ్యండి బాబు అంటూ పలువురు అధికారులు అధికార పార్టీ నేతల తీరుతో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పోలీసువైఖరిపై మహిళనేత కస్సుబుస్సు.. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో రెండురోజు క్రింద జరిగిన ఓ ఘర్షణ కేసుకు సంబంధించి పోలీసులు హత్యయత్నం కేసును నమోదు చేశారు. ఈవిషయంలో అధికారపార్టీ చెందిన జిల్లా మహిళనాయకురాలు రంగప్రవేశం చేశారు.. ఈ కేసు పెట్టడం అన్యాయమంటూ, తమ వర్గానికి చెందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ ఏకంగా ఉన్నతస్థాయి అధికారి నుంచి కింద వరకు ఉన్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహారించారని, అమ్ముడుపోయారని మీడియా ఎదుట ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలు పై పోలీసులు అంసతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మహిళనేత రాత్రి వరకు పోలీసుస్టేషన్లోనే భీష్మించుకొని ఉండటం అధికారపార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నాయకురాలు అనుసరిస్తున్న తీరు బెదిరింపు«ధోరణిలా ఉందనే భావనకు పోలీసులు వచ్చేసినట్లు తెలిసింది. ప్రభుత్వనేతలే మాపై నిందలేస్తుంటే ఏలా? ప్రభుత్వం ఆదేశాలు, నిబంధనల మేరకు పనిచేస్తుంటే ..అధికారపార్టీకి చెందిన నేతలే అనవసరమైన నిందలేస్తుంటే ఏలా అనే భావన అధికారుల్లో నెలకొనింది. ప్రధానంగా పోలీసు, రెవిన్యూశాఖలకు అధికారపార్టీకి చెందిన నేతల నుంచి వత్తిడి రోజురోజుకు అధికంకావడం రాజంపేట డివిజన్లో అధికమవుతోంది. అనుకూలం..ప్రతికూలం అంశాలను పరిగణనలోకి తీసుకొని తమ పట్ల అధికారపార్టీ నేతలు ఇష్టానుసారగంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రభుత్వం నడిచే బాటలో ఏ విధంగా నడుచుకోగలమని అధికారవర్గాలు వాపోతున్నారు. విడమంటే పాముకు కోపం, కరచమంటే కప్పకు కోపం అన్నట్లు చందనా రాజంపేట పోలీసు, రెవిన్యూ అధికారుల తలలుపట్టుకుంటున్నారు. కొందరైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి బదిలీకోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. -
అధికార పార్టీ బ్యాలెట్ గేమ్
-
ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు
► టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాలు ► 6 నెలల కాలంలో భారీగా పడిపోయిన ఎమ్మెల్యేల పనితీరు ► ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని సూచించిన అధినేత ► జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకోనున్నట్లు వెల్లడి సాక్షి, మహబూబ్‌నగర్ : ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన సర్వే ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చింది. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేశారు. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు పుట్టించాయి. 6నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేల పనితీరు భారీగా పడిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. ఎమ్మెల్యేల పనితీరును కాస్త మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన మార్కులతో సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం 6నెలల కాలంలోనే దాదాపు 20శాతం పైగా పడిపోయారని వివరించారు. అయితే ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటే సునాయాసంగా గెలుపొందవచ్చని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119స్థానాలకుగానూ దాదాపు 106 వరకు గెలుపొందుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందుతామని స్పష్టం చేశారు. ఎన్నికల వేడి రగిల్చిన సర్వే.. రానున్న రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సన్నద్ధమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14నియోజకవర్గాలకుగాను 7 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందగా.. 5 కాంగ్రెస్, 2టీడీపీ గెలుపొందాయి. రాష్ట్ర స్థాయిలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బలం 9కి చేరింది. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను చూసుకుంటున్నారు. నెల రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే నిర్వహించగా... తాజాగా సీఎం కేసీఆర్ సర్వేలను బయటపెట్టడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్‌క్లాస్ మార్కులే రాలే... ఉమ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలో కేవలం ముగ్గురు మాత్ర మే ఫస్ట్ క్లాస్ మార్కులు సాధిం చినట్లు సీఎం సర్వే ద్వారా వెలుగుచూసింది. వీరిలో టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మాత్ర మే 67.40శాతం సాధించారు. మిగతా ఇద్దరు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ 71.10శాతం, గద్వాల ఎమ్మెల్యే 65శాతం లభించింది. 6నెలల్లో నే ఎమ్మెల్యేల పనితీరు బాగా పడిపోయింది. సరాసరిగా ప్రతీఒక్క ఎమ్మెల్యే 20శాతం మేర పడిపోయారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డా.సి.లక్ష్మారెడ్డి 6నెలల క్రితం 73.20శాతంలో ఉంటే జనవరిలో నిర్వహించిన సర్వేలో 51.40 శాతానికి పడిపోయారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 6నెలల క్రితం 62.50శాతం ఉండగా... తాజా సర్వేలో 55.20కు తగ్గింది. కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 6నెలల క్రితం 56.80శాతం ప్రజల మద్దతు లభించగా... ప్రస్తుతం 49.80శాతం ఉన్నట్లు వెల్లడైంది. సుతిమెత్తగా హెచ్చరింపు... జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పనితీ రు ఆధారంగా.. సర్వేల ఆధారంగానే పార్టీ తరఫున టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సంకేతాలు జారీ చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉ న్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో సర్వే ద్వారా తెలియజేశారు. ఇక నుంచి జనం మధ్యలో తిరుగుతూ.. వారి సమస్యలను పరిష్కరించాలని సుతిమెత్తగా హెచ్చరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఈటల టాప్
► మంత్రి కేటీఆర్‌కు తొలి, రెండో సర్వేకు10.20 శాతం తేడా ► ముగ్గురు ఎమ్మెల్యేలకు అత్తెసరు మార్కులు ► పలువురు ఎమ్మెల్యేలకు ఏటా తగ్గిన గ్రాఫ్ ► జగిత్యాలలో పుంజుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ► ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సర్వే విడుదల ► ప్రజల మనోభావాలను కళ్లకు కట్టిన సీఎం కేసీఆర్ ► జనంతో మమేకం కావాలని ఉద్బోధ ► ఏటా పెరుగుతూ వచ్చిన రాజేందర్ పనితీరు ► ఉమ్మడి జిల్లాలో 89.90 శాతం జనం మెచ్చిన నేత సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల పనితీరును గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కళ్లకు కట్టారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు, రెండు విడతలు నిర్వహించిన సర్వే ఫలితా లను వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సర్వే నివేదికల ఆధారంగా సమీక్ష జరిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల జాతకాన్ని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ప్రజాక్షేత్రంలో ఉండే వారికి ప్రజల వేసిన మార్కులను వివరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటల రాజేందర్‌కు ఫస్ట్ ర్యాంకు.. తొలి సర్వే, రెండో సర్వేకు భారీ తేడా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. ఏటా ఆయన ప్రజలకు చేరువవుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా.. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మధ్య ఆ పార్టీ మొదట సర్వే జరిపించింది. తొలి సర్వేలో మంచి మార్కులు సాధించిన వారు కూడా రెండో సర్వేలో దారుణంగా వెనుకబడడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ తొలి సర్వేలో 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 నుంచి 60.40 శాతంగా మారింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే జిల్లా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు మార్కులు తగ్గాయి. అదే వరుసలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం తేడాతో ఉండగా, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 88.10 శాతం నుంచి 56 శాతానికి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ 67.60 నుంచి 53.90కి, చొప్పదండి ఎమ్మెల్యే 79.40 నుంచి 62.50, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 75.50 నుంచి 54.20కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి తొలి, రెండో సర్వేకు గ్రేడ్ పెరిగింది. తొలి సర్వేలో 50.90 శాతం ఉండగా.. రెండో సర్వే నాటికి 68.90 శాతానికి పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మారాలి... ప్రజలతో మమేకం కావాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో నిలవడంతోపాటు చిరస్థాయి పేరు ప్రఖ్యాతలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించిన సీఎం 60 శాతానికి పైగా ప్రజల మద్దతు పొందిన ఎమ్మెల్యేలను అభినందించారు. మిగతా వారు కూడా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్నారు. ప్రజల మద్దతే పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించినట్లు తెలిసింది. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు -
ఇదీ.. మీ పనితీరు
ఎమ్మెల్యేల పని విధానంపై సర్వేల నివేదిక ∙స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ మీరు మారాలని శాసనసభ్యులకు క్లాస్ లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశం బహిరంగ సభలు నిర్వహించాలని సూచన సర్వేలో ఎర్రబెల్లి ఫస్ట్, వినయ్‌భాస్కర్ సెకండ్ ఆఖరులో ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్ వరంగల్ : అధికార పార్టీలో సర్వే అలజడి నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వే వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, టీఆర్ఎస్పై ప్రజల స్పందన వంటి అంశాలతో ఈ సర్వే చేయించారు. రెండు దశల్లో చేసిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పాత జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశయమ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను వారికి స్వయంగా అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఉన్నా... స్థానికంగా ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లోపాలను వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్పై, ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాగా ప్రతికూలత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, స్వయంగా తానే ఈ సభలకు హాజరవుతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
అధికార పార్టీకి మహిళలపై గౌరవం లేదు
ఒంగోలు అర్బన్: అధికార పార్టీ నేతలకు మహిళలపై గౌరవం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటలపోటీలు, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. గతంలో కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దారుపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేయిచేసుకోవడం, ఇటీవల మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకి హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రవర్తించిన తీరుతో పాటు రాష్ట్రంలో మహిళలపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ మహిళా దినోత్సవం నుంచి అయినా అధికార పార్టీ నేతల్లో మహిళల పట్ల మార్పు రావాలన్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అని చెప్పి మోసం చేశారన్నారు. మహిళా విభాగం జిల్లా అ«ధికార ప్రతినిధి బడుగు ఇందిర మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కనీస భద్రత కల్పించాలన్నారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా మహిళలకు సముచిత స్థానం ఇచ్చి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను కల్పించి అమలు చేయాలని కోరారు. సమావేశంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కావూరి సుశీల, అనంతలక్ష్మీ తదితరులు ఉన్నారు. -
కార్యకర్తలను వదిలే వరకు కదిలేది లేదు
– టీడీపీ వర్గీయుల మధ్య ఫ్లెక్సీల గొడవ – అనుమానంతో అమాయకులపై గల్లా అనుచరుల దాడి – ఫిర్యాదు చేసిన బాధితులను అరెస్టుచేసిన పోలీసులు – ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన చెవిరెడ్డి – పెద్దసంఖ్యలో తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు – దళితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరా ? : నారాయణ స్వామి ‘‘నన్ను నమ్మిన వాళ్లు అన్యాయంగా జైల్లో ఉంటే.. నాకు పండుగ లేదు.. అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అమాయకులు బలైతుంటే ఊరుకునేది లేదు. తప్పు చేసినవారితో పాటు దాన్ని సమర్థించిన వారు కూడా భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విచారించకుండానే అమాయక దళితులను అరెస్టు చేయడం పోలీసులకు తగదు’’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీపంలోని పుదిపట్లలో గురువారం టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడ్డాయి. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి వస్తున్న మణి అనే దళితుడిపై అనుమానంతో పుదిపట్ల సమీపంలో మాజీ మంత్రి గల్లా అనుచరులు దాడికి తెగబడ్డారు. బాధితులు గల్లా అనుచరులపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు శుక్రవారం ఉదయం మణిని, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. బాధితులకు అండగా చెవిరెడ్డి సింగపూర్, చెన్నై నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారులు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారు. అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో ఓ దళితుడిని అన్యాయంగా స్టేషన్లో ఉంచారని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఉదయం ముత్యాలరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాధితులను వదలాలని కోరారు. వారిని వదిలే వరకు ఎన్ని గంటలయినా.. రోజులయినా సరే ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు అరాచకాలకు పాల్పడితే బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులపై నారాయణస్వామి ఫైర్ గురువారం అర్ధరాత్రి దళితులు ఫిర్యాదుచేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి మండిపడ్డారు. కేసు నమోదు చేయకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మునీశ్వర్ రెడ్డి, మునస్వామి యాదవ్, వెంకటరమణ, బడి వెంకటేష్ యాదవ్, చంద్రమౌళి రెడ్డి, దళిత సంఘ నాయకులు ప్రదీప్, నారాయణ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి కేసు నమోదు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామి స్టేషన్ వద్దే బైఠాయించడంతో బాధితుడు మణి బంధువు సిద్దముని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నిందితులు బడి సుధా యాదవ్, రవీంద్ర, వెంకటముని, గుండ్లూరు శివ, ఈశ్వరయ్యపై కేసు నమోదు చేశారు. -
రచ్చ రచ్చ.. రసాభాస
ఎండాడలో గంట ముందే ముగిసిన జన్మభూమి సమస్యలు చెబుదామని వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తల దాడి రుషికొండలో తమ్ముళ్ల బాహాబాహీ అధికార పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు జన్మభూమి సాక్షిగా బహిర్గతమయ్యాయి. అధికారుల ఎదుటే బాహాబాహీకి దిగడం, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడంతో బిత్తరపోయారు ప్రజలు. టీడీపీ మహిళా నాయకురాలిపై అదే పార్టీకి చెందిన నాయకుడు అసభ్యంగా ప్రవర్తించడం.. ఆమె భర్త తిరగబడడం.. ఇలా ఒకటేమిటి.. అడ్డూ అదుపూ లేని టీడీపీ నాయకుల ఆగడాలకు వేదికైంది ఆరో వార్డు పరిధి రుషికొండలోని జన్మభూమి సభ. ఇక అదే వార్డులోని ఎండాడ సభ ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఇక్కడ విశేషమేమంటే సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపైనే దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలకడం శోచనీయం. ప్రజలపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవకు దిగి అక్కడి సభనూ రచ్చరచ్చ చేశారు. మొత్తానికి ఎందుకు నిర్వహించారో తెలియకుండానే ముగించేశారు అధికారులు. – సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) జీవీఎంసీ ఆరోవార్డు పరిధిలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా ముగిశాయి. ఎండాడలో గంటన్నర ఆలస్యంగా మొదలైన సభను గంట ముందుగానే ముగించేశారు. మధురవాడ జోనల్ కమిషనర్ పి.ఎం. సత్యవేణి ఫిర్యాదులిచ్చిన స్థానికులతో అతిగా వ్యహరించడంతో స్థానికులు వారిపై తిరగబడ్డారు. అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకుండా రచ్చరచ్చ చేశారు. నిర్మాణం పూర్తయినా ప్రారంభించని ఎన్టీఆర్ సుజలం వాటర్ ప్లాంట్ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు లొడగల రామ్మోహన్, లొడగల అప్పారావు, ఉప్పులూరి గోపి, నల్ల రవి, సుంకర హరిబాబు, చిర్రా రామ్మోహన్ సభలో జోనల్ కమిషనర్ సత్యవేణిని ప్రశ్నించారు. దీంతో జెడ్సీ వ్యంగ్యంగా మాట్లాడటంతో లొడగల అప్పారావు, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజీవ్‌నగర్ రోడ్డు దుస్థితి, సాగర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోగుల పరిస్థితి, రోడ్లు, అంతర్గత డ్రైనేజీల దుస్థితిపై అధికారులను నిలదీశారు. దీంతో శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన వెంకటరమణ అనే చోటా కార్యకర్త, వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి దాడికి ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య పది నిమిషాలు తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు భరించలేక జన్మభూమి ప్రత్యేక అధికారి మోహన్‌రావు గంటన్నర ముందుగానే వేదిక దిగిపోయారు. అనంతరం ఒకరు తర్వాత ఒకరుగా వివిధ శాఖల అధికారులంతా వెళ్లిపోవడంతో వేదిక ఖాళీ అయిపోయింది. ఉదయం 10.30కు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 12 గంటలకే ముగిసిపోయింది. దీంతో సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులు బిత్తరపోయి, సభ నిర్వహణను విమర్శిస్తూ వెళ్లిపోయారు. -
అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి
చండూరు : గట్టుప్పల మండలం రద్దుపై అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని రైతుసేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గట్టుప్పలలో జరిగిన ఒక్క రోజు దీక్షకు ఆయన ఆదివారం సంఘీభావం తెల్పిన అనంతరం మాట్లాడారు. చండూరుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న గట్టుప్పల గ్రామానికి మండలానికి కావల్సిన అర్హత ఉందన్నారు. ఆ ఇద్దరి గలాటలో మండలాన్ని కోల్పోయామని ఆరోపించారు. వారు గ్రామస్తులకు తమ సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందన్నారు. తప్పించుకొని ఎన్నాళ్లు తిరుగుతారని, ఎన్నికల ముందైన తమ దగ్గరకు వస్తారని, ఆ సమయంలో తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. గట్టుప్పల మండలం కోసం చేస్తున్న దీక్షలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. మండలం ఏర్పాటయ్యే వరకు నిరసనలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, క్రిష్ణయ్య, రాపోలు సత్తయ్య, పోరెడ్డి ముత్తారెడ్డి, లడే సత్తయ్య, గుండుకాడి జంగయ్య, కుమ్మరి సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగొని మల్లేశం తదితరులు ఉన్నారు. ఆందోళనలు ఆగవు : ఇడెం కైలాసం చండూరు : గట్టుప్పలను మండలంగా ప్రకటించే వరకు ఆందోళనలు ఆగవని మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం అన్నారు. 82వ రోజు మండల సాధన కమిటీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. 82 రోజులుగా దీక్షలు చేపడుతున్న అధికార పార్టీ నేతలు స్పందించక పోవడం బాధకరమన్నారు. అసెంబ్లీలో మండలం పై ఎమ్మెల్యే చర్చించపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్ని నెలలైన, సంవత్సరాలైన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రాపోలు సత్తయ్య, లడే సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగోని మల్లేశం తదితరులు ఉన్నారు. -
అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
9 నెలలైనా బిల్లులు ఇవ్వరా? అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే బిల్లులు ఇస్తారా? దివంగత సీఎం జయలలితకు నివాళి మునిపల్లి : మండలంలోని ఆయా శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే తమిళనాడు దివంగత సీఎం జయలలితకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అని ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖమ్మంపల్లి మల్లేశంగౌడ్, మక్తక్యాసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార పాటిల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంగద్‌పై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు పోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయమంటే 9 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఎమ్మెల్మే ఫోన్ చేయగానే ఓ ప్రజాప్రతినిధికి మొత్తం బిల్లులు ఇచ్చారని, మిగతా ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వొద్దని ఎవ్వరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వాటర్ ట్యాంకర్ యజమానులకు ప్రజాప్రతినిధులు బయట అప్పులు తెచ్చి ఇచ్చారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ఎన్నింటికి అనుమతి ఉంది..? ఎన్నింటికి అనుమతి లేదనే వివరాలను పూర్తి స్థారుులో ఇవ్వాలని జూలేలో కోరితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఇన్చార్జి ఎంఈఓ దశరథ్ను ఎంపీపీ మల్లేశంగౌడ్, మక్తక్యసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార్ పాటిల్ నిలదీశారు. పాఠశాలలకు సక్రమంగా ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేకుండా పోరుుందని, ఏది చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటిపన్నును ముక్కుపిండి వసూలు చేసే పంచాయతీ కార్యదర్శులు మేళసంగంలో శివారులో పత్తి కంపెనీ నిర్మాణం కోసం పన్ను (ట్యాక్స్) కడతానని అనుమతి తీసుకున్నారని, పన్ను కట్టకుండా పనులు నిర్వహించి ఏకంగా పత్తి కొనుగోలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఇన్చార్జి ఈఓపీఆర్డీ నాగలక్ష్మిని నిలదీశారు. ‘మాకు సంబంధం లేదు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కే తెలుసు’ అని ఆమె దాటవేశారు. శ్రీనివాస్ వివరణ ఇస్తూ పన్ను కట్టాలని డిమాండ్ నోటీసు ఇచ్చామన్నారు. రూ.1,502 పన్ను కట్టినట్లు రశీదు ఇచ్చారని సభదృష్టికి తెచ్చారు. ఇంటి యజమానుల నుంచి వేలలో పన్ను వసూలు చేస్తున్న అధికారులు పత్తి కంపెనీ నుంచి ఇంత తక్కువ పన్ను ఏ లెక్కన తీసుకుంటున్నారని పంచాయతీ కార్యర్శి శ్రీనివాస్‌ను నిలదీశారు. 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గల గుట్టలను ఎల్అండ్టీ సంస్థ జేసీబీలతో తవ్వి అక్రమంగా మొరం తరలిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని తహసీల్దార్ పద్మావతిపై మండిపడ్డారు. కంకోల్, పెద్దగోపులారం, బుదేరా శివారులోని గుట్టల నుంచి అక్రమంగా మొరం తవ్వి తీసుకెళ్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎల్అండ్టీ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తహసీల్దార్ పద్మావతి సభదృష్టికి తెచ్చారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమీక్ష సమావేశంలో పాల్గొని రిజిష్టర్‌లో సంతకాలు చేయాలని సీడీపీఓ రేణుక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అసద్‌పటేల్, ఎంపీటీసీ సభ్యలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అవినీతి సొమ్ము మార్చేదెలా?
అధికార పార్టీ నేతల్లో గుబులు విశాఖపట్నం: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కోట్లు కూడబెట్టిన అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు కంటిపై కునుకు కరువైంది. ఇసుక నుంచి రేషన్‌షాపు డీలర్‌షిప్‌ల వరకు, సీసీ రోడ్ల నుంచి ఇళ్ల క్రమబద్ధీకరణ వరకు ప్రతి పనిలో కిక్‌బ్యాగ్‌లు, పర్సంటేజ్‌లు తీసుకుంటూ సంపాదించిన సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు హవాలా మార్గంలో మార్చుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్‌లో చక్రం తిప్పే ఓ ప్రజాప్రతినిధితో పాటు పోర్టు వ్యాపారాల లావాదేవీల్లో కింగ్‌మేకర్‌గా ఉన్న మరో ప్రజాప్రతినిధి ఈ తరహాలో బ్లాక్‌ను వైట్ చేసుకుంటున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నారుు. గ్రామీణ జిల్లా పరిధిలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు హవాలా బ్రోకర్ల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో ఇలా వందల కోట్ల బ్లాక్‌మనీ వైట్‌గా మారినట్టు తెలిసింది. తొలుత ఎక్స్చేంజ్కు 20 శాతం కమిషన్ తీసుకున్న ఈ బ్రోకర్లు ప్రస్తుతం 30 నుంచి 35 శాతం వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. పన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు.. చోటామోటా నాయకులు తమకు పరిచయం ఉన్న బ్యాంకు మేనేజర్ల ద్వారా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మార్చిన సొమ్ము పన్నుల పరిధిలోకి రాకుండా ఉండేందుకు వివిధరూపాల్లో బ్యాంకులో జమైనట్టుగా చూపించి సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు ఏడాది వరకు ఎలాంటి వడ్డీ లేకుండా వ్యాపారస్తులకు అప్పులిస్తున్నారు. తొలి రెండురోజులు జన్‌ధన్ ఖాతాల్లో జమ చేరుుంచినా ఆ డిపాజిట్లపై ఇన్‌కంటాక్స్ నిఘా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉండడంతో ఏదో విధంగా వైట్ చేసుకోవాలన్న తపనతో పరుగులు పెడుతున్నారు. -
ఏ క్షణమైనా మెరుపుదాడి!
- ఏజెన్సీలో ఉండొద్దు.. మైదాన ప్రాంతాలకు వచ్చేయండి - అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు పోలీసుల హెచ్చరిక విశాఖపట్నం: భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఏజెన్సీ సహా పరిసర మండలాల్లోని టీడీపీ నేతలు కంటిమీద కనుకు లేకుండా ఉన్నారు. కీలక నేతలు సహా ఒకేసారి 30 మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపుదాడి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ప్రజాప్రతినిధులు మైదానప్రాంతాలకు వెళ్లాలని కేంద్ర ఇంటిలిజెన్స శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలొచ్చారుు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు కొంత కాలంపాటు స్వగ్రామాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీలో పర్యటించాల్సి వచ్చినప్పటికీ జిల్లా పోలీస్ శాఖతోపాటు స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. మీ ఆనుపానులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం సాధ్యమయ్యే పనికాదని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీంతో ఏ క్షణాన్న ఏ రూపంలో మావోలు విరుచుకుపడతారోననే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. మావోల నుంచి ముప్పు ఉన్న జిల్లామంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితోపాటు ఏజెన్సీకి చెందిన పలువురు టీడీపీ నేతలకు భద్రత పెంచారు. ఇటీవలే టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకు భద్రత పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందనే ఆందోళనతో మంత్రి అయ్యన్నపాత్రుడితో సహా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు పలువురు పూర్తిగా విశాఖకే పరిమితయ్యారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడైతే ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఒక దశలో మీడియాకు విడుదల చేయడం కూడా ఆపేశారు. ఇటీవలే మళ్లీ టూర్ షెడ్యూల్ ఇస్తున్నప్పటికీ పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో టూర్ షెడ్యూల్ విషయంలో పోలీసుల అనుమతితోనే విడుదల చేసే పరిస్థితి నెలకొంది. పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో ఈయనొక్కరే కాదు.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది. -
అధికార పార్టీ అండతో గ్యాంబ్లింగ్ క్లబ్స్
-
అధికార‘పంచాయితీ’
–టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న జిల్లా కీలక ఉన్నతాధికారి –పార్టీ పంచాయతీలకు వేదికైన కార్యాలయం –అసమ్మతి నేతలకు బుజ్జగింపూ అక్కడే –సర్వత్రా విమర్శల పాలవుతున్న తీరు ప్రజా సేవ చేయాల్సిన ఉన్నతాధికారి అధికారపార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. రాజకీయపరంగా పాలకపక్షానికి తమ వంతు సాయమందిస్తున్నారు. ఆఖరుకు పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికార టీడీపీ చేతుల్లో పావులుగా మారిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ప్రమాణం చేసి వచ్చి అధికారపక్ష సేవలో తరించడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, చిత్తూరు: రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ..ప్రజల మన్ననలు పొందాల్సిన అధికారులు అధికారంలో ఉండేపార్టీలకు కొమ్ము కాస్తున్నారు. తుదకు అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తినా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులు చక్కబెడుతున్నారు. అధికార పెద్దలకు నివేదికలు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుజ్జగింపుల పర్వం కేవలం మండలస్థాయిలో అనుకుంటే పొరబడినట్లే. జిల్లా పాలనలో కీలక భూమిక వహించే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వాన జరగడం విశేషం. ఇవికో మచ్చుకు కొన్ని – కుప్పం పంచాయితీలో ఇటీవల టీడీపీలో కొందరు వార్డు సభ్యులు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. వీరిని బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను జిల్లా కీలక ఉన్నతాధికారి భుజాన వేసుకున్నారు. ఈ పంచాయతీని సమర్ధంగా నిర్వహించి వారిలో అసమ్మతిని చల్లార్చారు. పంచాయతీ అభివృద్ధి నామమాత్రంగా ఉందంటూ గోడు చెప్పుకొందామని కార్యాలయానికి వచ్చిన వార్డు సభ్యులకు సదరు అధికారి క్లాసు పీకారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చొద్దంటూ సలహా ఇచ్చారు. – జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ,అటవీ శాఖ మంత్రి బోజ్జల, హౌసింగ్ చైర్మన్ వర్ల రామయ్యలు ఏకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను నేరుగా జిల్లా కీలక ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకొచ్చారు. మంతనాలు జరిపారు. టీడీపీ నాయకులకు అధికారులు అనుగుణంగా నడచుకోవాలని హుకుం జారీ చేశారు. ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరగాలని అనధికార ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగం ఆ పాలనాధికారి సమక్షంలోనే జరగడం గమనార్హం. – మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి బొజ్జల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ తదితరులు రాజకీయ సమావేశం సదరు కీలక ఉన్నత అధికారి చాంబరులోనే నిర్వహించారు. ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన సమావేశం అనుకుంటే పొరపాటు. నీరు–చెట్టు, ఇతర నామినేషన్ పనులను టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని అ ఉన్నతాధికారికి చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం చాలా వరకు పనులు అధికార పార్టీ కార్యకర్తలకే పనులు కేటాయిస్తున్నారు. – కొన్ని రోజుల క్రితం చిత్తూరు మేయర్ కుర్చీపై టీడీపీ నాయకులతో అర్ధరాత్రివరకు సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఉన్న రెండు వర్గాలను పిలిపించుకొని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. కుమ్ములాడుకుంటుంటే పార్టీ పరువు పోతుందని సదరు ఉన్నతాధికారి స్వయంగా వ్యాఖ్యానించారని సమాచారం. -
‘ప్లాన్’ మారింది!
– అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ పనులు – మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధం – అధికారపార్టీ అనుయాయుడికి లబ్ధి – ఓ వాణిజ్య భవనం జోలికి వెళ్లని కర్నూలు కార్పొరేషన్ అధికారులు మాస్టర్‌ప్లాన్.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. కానీ.. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు మాస్టర్‌ప్లాన్ పనులు అడ్డగోలుగా చేపట్టారు. అలైన్‌మెంట్‌ను అడ్డదిడ్డంగా మార్పులు చేశారు. ఓ రహదారిలో రెండు చోట్ల వాణిజ్య భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుని స్వామిభక్తిని ప్రదర్శించారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే..‘షార్ట్ టర్మ్’ పనులు శరవేగంగా చేయాల్సి ఉన్నందున అంతవరకే చేశామని సమాధానమిస్తున్నారు. సాక్షి, కర్నూలు కార్పొరేషన్లో ఆరేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నగరంలో అప్పటి కమిషనర్ మూర్తి కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. ఆ తర్వాత ఎలాంటి పనులు జరగలేదనే చెప్పాలి. ఇక నిధుల లేమి కారణంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలో అభివద్ధి కుంటుపడింది. కృష్ణా పుష్కరాల పుణ్యమా అని నగరానికి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో నగరంలో రహదారుల విస్తరణ పనులతోపాటు.. సుందరీకరణ తదితర అభివద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు శరవేగంగా చేపట్టారు. పనులు ఇలా.. కర్నూలు నగర జనాభా ఏటేటా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టు రహదారుల విస్తరణ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిధులతో విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి బిర్లాగేటు వరకు.. ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్దు వరకు.. మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుంకేసుల రహదారి వరకు.. సి–క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. మార్పులు ఇలా.. ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు 100 నుంచి 60 అడుగుల వరకు రహదారిని విస్తరించాలని నగర పాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పనులు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా జలమండలి.. కేవీఆర్ కళాశాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకుని రహదారిని విస్తరిస్తున్నారు. అదేవిధంగా మరోవైపున రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న భవనాలు, ఓ వాణిజ్య సముదాయం.. ట్రాన్స్‌కో భవనం.. జలవనరుల అధికారి నివాసం, అదనపు ఎస్పీ నివాసం వరకు రహదారిని విస్తరిస్తున్నట్లు మార్కింగ్ చేశారు. అయితే ఇక్కడే అధికారులు తెలివితేటలు ప్రదర్శించారు. జలమండలి ఎదురుగా ఉన్న రహదారిని 100 నుంచి 90 అడుగులకు.. అదేవిధంగా రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిని 60 అడుగుల నుంచి 45 అడుగులకు కుదించి అధికారపార్టీ నేతల అనుయాయులకు అనుకూలంగా అలైన్మెంట్లో మార్పులు చేశారు. గతంలో వేసిన మార్కింగ్ భిన్నంగా విస్తరణ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ అధికారుల దష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులకు సంబంధించిన భవనాలు ఉన్నాయి.. కాబట్టి ప్రస్తుతం వాటి జోలికెళ్లలేదని అడిషనల్ సిటీప్లానర్ శాస్త్రి తెలిపారు. -
పోలీసుల స్వామిభక్తి...
ఎన్సీపీ దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కొనసాగుతున్న వేధింపులు కార్యాలయాన్ని ధ్వంసం చేసి, నాయకులపై దాడి చేసిన నిందితులను గుర్తించని వైనం నరసరావుపేటటౌన్: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసు అధికారులు నడుస్తూ స్వామి భక్తిని చాటుకొంటున్నారు. నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) కార్యాలయం ధ్వంసం అనంతరం జరిగిన పరిణామాల్లో కేవలం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. మరికొందరిని విచారణపేరుతో వేధిస్తున్నారు. దీంతో పాటు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్రపన్నుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటలో ఇటీవల ఎన్ సీవీ కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్‌రావును తీవ్రంగా గాయపరచిన నిందితులను ఇప్పటివరకు గుర్తించని పోలీసులు, బాధితులైన ఎన్సీవీ యాజమాన్యంపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసులో అరెస్టయి సబ్జైల్లో ఉన్న ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాం కోటేశ్వరరావులకు బెయిల్ రాకుండా ఉండేందుకు దేశం నాయకుల వత్తిడితో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో ఫిర్యాదుదారుడైన షేక్ జానిమౌలాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినా ఇంకా వైద్యశాలలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు సమర్పించడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. జాని మౌలాలి విషయంపై వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.మోహన్ శేషుప్రసాద్‌ను వివరణ కోరగా మూడురోజుల క్రితం వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళినట్టు ధ్రువీకరించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వేళ బెయిల్‌పై విడుదలైతే మరోకేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ కేసులో అత్యుత్సాహం .. కౌన్సిలర్ శీలు బాబురావు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమానితుల పేరుతో శనివారం రాత్రి జొన్నలగడ్డ, పమిడిపాడు, సాతులూరు గ్రామాలకుచెందిన సుమారు పదిమందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారిని కలుసుకొనేందుకు బంధువులు, గ్రామస్తులు స్టేషన్‌కు వెళ్ళగా వారిపట్ల దురుసుగా వ్యవహరించినట్లు బంధువులు చేప్పారు. స్టేషన్లో ఉన్న వారిపై విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అధికార పార్టీలో అంతర్మథనం
► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం ► ఆందోళనలో పాత నేతలు ► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..? ► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం ► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు ► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్‌రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్‌లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే. జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం. -
తమ్ముళ్లకు ‘ప్రత్యేక’ పందేరం
♦ రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం ♦ పాత మున్సిపాలిటీలో ప్రతిపాదించకపోవడంపై ఓ నేత అభ్యంతరం పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. అధికారులను ఏమార్చి.. నిబంధనల రూటుమార్చి దోచుకోండంటూ ‘ప్రత్యేక’నిధులను కేటాయిస్తోంది. ఇంకేముంది అధికారం అండతో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ‘మీకింత మాకింత’ అంటూ అందినకాడికి దోచుకుతింటున్నారు. కడప కార్పొరేషన్ : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై పనులు తీసుకొని పంచుకుతినేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెలితే.. నగరపాలక సంస్థ అధికారులు 20 డివిజన్లలో 48 పనులకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నిధులను కేటాయిస్తుంది. కానీ గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనికి కొత్త భాష్యం నేర్పారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేతలకు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి, అధికార పార్టీ నేతలకు పందేరం నిర్వహించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత తెలుగు దేశం ప్రభుత్వంలో కూడా అదే అనవాయితీ కొనసాగుతోంది. ఎస్డీఎఫ్ నిధులను స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడికి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా ఆ నిధులను విని యోగించుకునేందుకు తహతహలాడుతున్నారు. ప్రతిపాదనలు మళ్లీ తయారుచేయండి... పాత మున్సిపాలిటీలో ఒక్క పనిని కూడా ప్రతిపాదించకపోవడంపై ఇటీవల పార్టీ మారిన నగరపాలక సంస్థలోని కీలక నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా మళ్లీ ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిసింది. అలాగే అధికారులు ఒకరికి కేటాయించిన పనులను పైరవీలతో మరొకరు ఎగరేసుకు పోతుండటంపై ఒకరదిద్దరు తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ పనులను ఏ శాఖ ద్వారా చేయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నగరపాలక సంస్థ ద్వారానే చేయిస్తే మాత్రం మిగతావారు కూడా అదే విధానంలో పనులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో నగరపాలక అధికారులు ఇరుకున పడుతున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ నిధులతో జల్సా.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక ం నిధులను దారి మళ్లించి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరిట పట్టణాల్లో ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరికి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలూ చెలరేగుతున్నాయి. నిధుల పంపకం ఇలా... 44వ డివిజన్లోని సత్తార్ కాలనీలో డోర్ నంబర్ 46/87 నుంచి 106-1వరకూ సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణానికి రూ.10లక్షలు ప్రతిపాదించారు. ఈ పనిని ఆ డివిజన్ కార్పొరేటర్ భర్తకు కేటాయించినట్లు సమాచారం. అలాగే 45వ డివిజన్ బాలాజీనగర్ ఎస్సీకాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.4.97లక్షలు అంచనాలు రూపొందించి ఆ డివిజన్ కార్పొరేటర్ తనయునికి అప్పగించినట్లు తెలుస్తోంది. 37వ డివిజన్లో రూ.4.95లక్షలతో సిమెంటు రోడ్డు, రూ.4.90లక్షలతో సీసీడ్రైన్ నిర్మాణానికి అంచనాలు తయారుచేసి స్థానిక టీడీపీ కార్పొరేటర్‌కు అప్పగించినట్లు తెలిసింది. 41వ డివిజన్లో సీసీరోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను స్థానిక టీడీపీ నాయకుడికి అప్పగించారు. ఎస్డీఎఫ్ పనుల అంచనా విలువలన్నీ ఖచ్చితంగా రూ.5లక్షలుగానీ, లేకపోతే రూ.4.95లక్షలు, రూ.4.90లక్షలు ఇలా నాలుగైదు వేల తేడాతో అంచనాలు రూపొందించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌కు విన్నవించి.. అంచనాలు రూపొందించి.. ఈ మేరకు నగరంలో ఫలానా చోట సమస్యలున్నాయని కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చారు. పనుల వారీగా వాటికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ కమిషనర్‌ను ఆదేశించారు. ఏ ప్రభుత్వ నిధులనైనా టెండర్ విధానంలో ఖర్చుచేస్తే సంబంధిత శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. పనుల నాణ్యత కూడా బాగుంటుంది. అలా కాకుండా ఈ నిధులను నామినేషన్‌పై అప్పగించడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లే. ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చే చేయడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇదేం విభజన!
♦ కొత్త జిల్లాలపై టీఆర్ఎస్లో భిన్నస్వరాలు ♦ ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టించుకోకపోవడంపై కినుక ♦ విడిపోయిన హైదరాబాద్‌లో మళ్లీ చేర్చడమేమిటని రుసరుస ♦ ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏకపక్షంగా జిల్లాను విడగొడుతూ అధికారులు ప్రతిపాదించడం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడడంలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోకి తూర్పు ప్రాంతాలను చేర్చడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అధికారపార్టీలో అసంతృప్తిని రాజేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆపార్టీ నేతల అసంతృప్తికి కారణమైంది. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావు ముందు కుండబద్దలు కొట్టారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై ఎలాంటి భేదాభిప్రాయం లేకున్నా.. మిగతా నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలుపుతూ ముసాయిదా రూపొందించడాన్ని తప్పుబడుతు న్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంపై.. నేడో, రేపో విలేకర్ల సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో చూడకుండా.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లా ఏర్పడిందని, మరోసారి తమను హైదరాబాద్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకర్ల సమావేశంలో తేల్చిచెప్పే అవకాశముంది. -
నమ్మించి...వంచించి..!
► మాచర్ల మునిసిపాలిటీలో టీడీపీ కొత్త డ్రామా .. ► పదవి నుంచి దిగిపోవాలని చైర్‌పర్సన్‌పై ఒత్తిడి ► ససేమిరా అంటున్న చైర్పర్సన్ వర్గీయులు ► గ్రూపులుగా విడిపోయిన అధికార కౌన్సిలర్లు ► మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి ► వైస్ చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మ ఏరుదాటాక తెప్ప తగలేయడం అధికార పార్టీకి అలవాటే అంటున్నారు. నమ్మించి వంచించడంలోనూ అంతేనంటున్నారు. ఓట్ల కోసం దేనికైనా ఒడిగడతారని, అవసరమైతే మాటలు చెప్పి మభ్యపెడతారంటున్నారు. ఈ కోవలోనే మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతూ, అధికారపార్టీ అంటేనే అసహ్యించుకునే రీతిలో చైర్పర్సన్ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు వర్గాలను వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా ఏరిపారేయడం అధికార పార్టీ నేతలకు అలవాటు. జిల్లాలోని మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ వ్యవహారంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మున్సిపాల్టీలో ఎక్కువ ఓటర్లు ఉన్న ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చైర్పర్సన్ పదవిని ఎరచూపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భారీగా ఖర్చు పెట్టించారు. తీరా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ అసలు రూపం చూపించారు. చైర్‌పర్సన్‌కు ఏ పనిలోనూ సహకరించకుండా అడుగడుగునా అవస్థలకు గురిజేశారు. ఒప్పందంలో భాగమంటూ ఇప్పుడు పదవి నుంచి దిగిపోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయినట్లు డ్రామాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి.... టీడీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గోపవరపు శ్రీదేవిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ సామాజిక వర్గ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్లో ఆమోదించాల్సి వచ్చినప్పుడల్లా గైర్హాజరవుతూ కోరం లేకుండా చేస్తూ అడుగడుగునా అడ్డుపడ్డారు. అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో దూషణలకు దిగడమే కాకుండా చైర్పర్సన్, ఆమె భర్తపై భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. సుమారు ఆరు కోట్ల నిధులు ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు చేసే అవకాశం లేకుండా చేశారు. పలు సార్లు కౌన్సిల్ సమావేశాల సాక్షిగా చైర్పర్సన్, ఆమెకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను అవమానించారు. పదవి నుంచి దిగేందుకు ససేమీరా అంటున్న చైర్పర్సన్ వర్గం... ఒప్పందం ప్రకారం జూలై 2వ తేదీన నూతన చైర్‌పర్సన్‌గా ప్రస్తుత వైస్ చైర్మన్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. తమకాలంలో ఒక్క పనికి కూడా సహకరించనందుకు తాము పదవి నుంచి దిగే సమస్యే లేదని చైర్పర్సన్ వర్గం భీష్మించి కూర్చుంది. వైస్ చైర్మన్ నెల్లూరు మంగమ్మను చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, మంత్రి సైతం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవసరమైతే చైర్‌పర్సన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. పదవి కోసం డ్రామా.... ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించిన తీరుపై చైర్పర్సన్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఖండించని నియోజకవర్గ ఇన్చార్జితోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వారి సామాజిక వర్గం నేతను చైర్మన్‌గా కూర్చొబెట్టేందుకు రాజకీయ డ్రామాకు తెరలేపారు. గ్రూపులుగా విడిపోయినట్లు నటిస్తూ చైర్పర్సన్ సామాజిక వర్గానికి దూరం కాకుండా వ్యవహారం నడుపుతున్నారు. చైర్పర్సన్ ఇబ్బందులకు గురిచేసినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారంటూ ఆర్యవైశ్య నాయకులు జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
ఆయనొద్దు.. ఈయనొద్దు!
► బదిలీలపై టీడీపీ నేతల పోస్టుమార్టం ► ఒత్తిళ్లతో జిల్లా అధికారుల బేజారు ► కొత్త స్థానాల్లో చేరని పలువురు ఉద్యోగులు ► యథాస్థానాల కోసం నేతల పట్టు ► మరోసారి బదిలీలు తప్పవనే చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మరోసారి బదిలీలు చేపట్టాల్సి రానుందా? బదిలీలు చేయాల్సిందేనంటూ అధికార పార్టీ నేతల నుంచి మళ్లీ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయా? ఈ నేపథ్యంలోనే బదిలీ అయిన పలువురు ఉద్యోగులు ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టలేదా? అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మరోసారి బదిలీల ఫైళ్లను దులపనున్నారా? అనే వరుస ప్రశ్నలకు నిజమేననే సమాధానం వస్తోంది. ఒకవైపు రెవెన్యూలో కీలక సంస్కరణలు అమలవుతున్న సందర్భంలో పలువురు తహశీల్దార్లు విధుల్లో చేరేందుకు విముఖత చూపుతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా అధికార పార్టీలోని నేతల నుంచే వద్దని ఒకరు.. చేయాల్సిందేనని మరొకరు ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి బదిలీలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. చేరమంటే చేరం.. ► జిల్లాలో మొత్తం 16 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. అయితే, ఇందులో పలువురు ఇంకా బదిలీ జరిగిన ప్రాంతంలో బాధ్యతలు తీసుకోలేదు. ప్రధానంగా ఆళ్లగడ్డ తహసీల్దార్‌ను రుద్రవరానికి బదిలీ చేశారు. అయితే, ఈయన ఇప్పటివరకు విధుల్లో చేరలేదు. అహోబిలం ఆలయం విషయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిప్యత పోరులో భాగంగా బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలో మరో అధికార పార్టీ నేత బదిలీ చేసిన చోట బాధ్యతలు తీసుకోవద్దని, మళ్లీ ఇక్కడికే పోస్టింగ్ ఇప్పిస్తానని చెబుతున్నట్టు సమాచారం. ► కల్లూరు తహసీల్దారును బీ-సెక్షన్ సూపరిండెంటుగా బదిలీ చేశారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. ఏదో ఒక మండలానికి తహసీల్దారుగా వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు కొద్ది మంది అధికార పార్టీ నేతలు పైరవీ చేస్తున్నారని తెలిసింది. ► సి.బెళగల్ తహశీల్దారును బనగానపల్లెకు మార్చారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. కోడుమూరు నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం పార్టీ మారిన నేత ఈ బదిలీ వెనుక ఉన్నారని సమాచారం. దీంతో మరో అధికార పార్టీ నేత ఈయనను ఇక్కడే ఉంచేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ఈ విధంగా పలువురు తహసీల్దార్లు బదిలీ జరిగిన చోటకు వెళ్లకుండా నచ్చిన చోటనే ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అవకాశం లేకున్నా... ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏ ఒక్క తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొద్ది మందిని బదిలీ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల్లోనే ఎక్కడికక్కడ మరో వర్గం బదిలీ జరగకుండా ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎవరి మాట వినాలనే విషయంలో జిల్లా ఉన్నతాధికారులకూ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కొంత మంది వివిధ ఆరోపణలతో పోస్టింగులు కూడా దక్కించుకోలేదు. వీరు కూడా ఇప్పుడు పోస్టింగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద మరోసారి జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెరలేవనుందన్నమాట. -
ఉత్తమ అవార్డు ఖరీదు రూ.20 వేలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా తయారైంది అధికార పార్టీలోని కొంద రు నాయకుల పరిస్థితి. పైరవీకారులంతా ప్ర జాప్రతినిధుల వద్దకు వెళుతుంటే తమ పరిస్థితి ఏమిటని భావించారో లేక కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డారో కానీ పార్టీ మైనారిటీ నేత ఒకరు ఏకంగా ఉత్తమ అవార్డులు ఇప్పిస్తామం టూ డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా పది మంది దగ్గర డబ్బులు చేసిన సదరు నేత అందులో ఇద్దరికి అవార్డులు కూడా ఇప్పించగలిగారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కి చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ చెవినపడటంతో వారు సదరు నేతపై మండిపడ్డారట. దీంతో చేసిదేమీ లేక తీసుకున్న డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు ఇచ్చేశాడని సమాచారం. పది మందికి హామీ... రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ప్రభుత్వం ఉత్తమ అవార్డులతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈనెల 2న రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా అవార్డులు అందించిన సంగతి విదితమే. ఈ అవార్డు కింద సన్మానపత్రంతోపాటు రూ.50 వేల చెక్కు కూడా ఇస్తుండటం తో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అవార్డుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఫలానా కేటగిరిలో ఫలానా వారికే అవార్డు ఇవ్వాలంటూ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. తెల్లవారితే అవార్డుల ప్రదానోత్సం ఉంటుంద ని తెలిసినప్పటికీ అర్ధరాత్రి వరకు అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటించలేకపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ జిల్లా విభాగానికి చెందిన నాయకుడొకరు అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పలువురిని కలిసి ‘మీకు అవార్డు ఇప్పిస్తాను. అవార్డు కింద మీకు రూ.50 వేలు వస్తాయి. అందులో నాకు రూ.20 వేలు ఇవ్వండి’ అని ప్రతిపాదించారు. కొందరు సదరు నేత ప్రతి పాదనను తిరస్కరించగా... ఓ పది మంది మాత్రం డబ్బులిచ్చేందుకు సిద్ధపడి కొంత అడ్వాన్సు కూడా ఇచ్చేశారు. అయితే అందులో ఇద్దరికి మాత్రమే అవార్డులొచ్చాయి. నిజానికి ఆ ఇద్దరు ఏ రంగంలోనూ పెద్దగా సేవలందిం చిన వాళ్లు కాదు. అయినప్పటికీ వాళ్ల పేర్లు అవార్డు గ్రహీతల జాబితాలో ఉండటం... మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంతో అధికార పార్టీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. మూడో వ్యక్తితో ముప్పు.. సొంత పార్టీ నేతలు ఒకవైపు ఆరా తీస్తున్న సమయంలోనే కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డ సదరు మైనారిటీ నేత ఉత్తమ అవార్డు పొందిన వ్యక్తి వద్దకు వెళ్లారు. నిజానికి సదరు వ్యక్తికి మంచి పేరుంది. ఏ రాజకీయ నాయకుడితో నూ పెద్దగా సంబంధాల్లేవు. సేవాభావాలున్న మనిషి. దీంతో ఎలాంటి పైరవీ లేకుండానే అతని పేరును ఉత్తమ అవార్డు గ్రహీతల జాబి తాలో చేర్చారు. అయితే సదరు నేత ఆయనను కూడా వదల్లేదు ‘మీకు అవార్డు మీకు ఇవ్వాలని మంత్రికి, అధికారులకు చెప్పింది నేనే. నావల్లే నీకు అవార్డు వచ్చింది. మరి నాకేం లేదా?’ అని అడిగారు. దీంతో నోరెళ్లబెట్టిన సదరు అవార్డు గ్రహీత నిజమే కాబోలు అనుకుంటూ రూ.15 వేలు ఇచ్చాడని తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈనోటా చేరి పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో వారు సదరు నాయకుడిపై మండిపడ్డట్లు సమాచారం. దీంతో భయపడిన సదరు నేత కిక్కురమనకుండా రూ.15వేలు తి రిగి ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు మా త్రం అవార్డులు వచ్చిన సంతోషంలో ఉన్నారు. -
పోరంబోకు ప్రణాళిక
► రూ.5 కోట్ల శ్మశాన స్థలం కబ్జాకు యత్నం ► పాత్రధారులు అధికార పార్టీనేతలు ► సూత్రధారులు రెవెన్యూ అధికారులు ► హైకోర్టు స్టే ఉన్నా బేఖాతరు కాసుల వేటలో కొందరు అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై శ్మశాన పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. హైకోర్టులో స్టే ఉన్నా వెనుకాడటం లేదు. ఈ తంతు వెనుక లక్షలాది రూపాయల మతలబు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని స్థలాలకు ఐదారేళ్ల నుంచి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా విలువ లేని ఇళ్ల స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటుతున్నాయి. సందర్భాన్ని సొమ్ము చేసుకున్న కొంతమంది నాయకులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన స్థలాలను అమ్మేసుకున్నారు. పట్టణంలోని సర్వే నంబరు 1167, 1179, 1180లోని 11.34 ఎకరాల ప్రభుత్వ శ్మశాన పోరంబోకు భూమిపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల కన్ను పడింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రూ.5 కోట్లుపైగా విలువచేసే ఈ భూమికి టెండరు పెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఓ అధికారి సహకారంతో ఈ భూమిని చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. రికార్డులు తారుమారు సర్వే నంబరు 1167లో 4.86 ఎకరాలు, సర్వే నంబరు 1179లో 4.89, సర్వే నంబరు 1180లో 1.59 ఎకరాలను వందేళ్ల నుంచి శ్మశాన స్థలంగా వాడుతున్నారు. 1954 ఆర్ఎస్సార్లోనూ ఈ భూమి శ్మశాన పోరంబోకుగా నమోదైవుంది. 2016 మార్చి వరకు కూడా అడంగల్‌లో శ్మశాన పోరంబోకుగానే నమోదై ఉంది. కానీ 2016 జూన్‌లో ఈ శ్మశాన పోరంబోకు కాస్త రికార్డుల్లో పోరంబోకుగా మార్చేశారు. శ్మశాన స్థలాలను కాపాడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేయడంతో ఆ స్థలాన్ని పోరంబోకుగా మార్చేశారు. కొన్నేళ్ల నుంచి వివాదం విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు 20 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూనే ఉన్నారు. గతంలో ఈ భూమికి పెద్దగా విలువ లేకపోవడంతో నేతల కన్ను పడలేదు. కానీ ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో దీన్ని ఎలాగైనా కాజేయాలని అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాదాల జానకిరాం ఉదయగిరి ఎమ్మెల్యేగా రాష్ట్ర భూగర్భ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని కాజేసేందుకు కొంతమంది ప్రయత్నించగా స్థానికులు ప్రతిఘటించారు. దీంతో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను, స్థానికులను ఒకచోటకు చేర్చి రెవెన్యూ రికార్డులు పరిశీలించి శ్మశాన స్థలంగా ఉండటంతో అందులో ఎవరికీ ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఆ సమస్య అంతటితో సద్దుమణిగింది. టీడీపీ అధికారంలోకొచ్చిన వెంటనే తహసీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు సహకారంతో పట్టణానికి చెందిన కొంతమంది అధికారపార్టీ నేతలు దీన్ని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నేతలు ఆ శ్మశాన స్థలం పక్కనే ఉన్న సెటిల్మెంట్లో ఇళ్లస్థలాల లే అవుట్లు వేసి దాని పక్కనే ఉన్న శ్మశాన స్థలంలో 70 సెంట్లు ఆక్రమించి అందులోనూ ప్లాట్లు వేసి విక్రయించారు. ఇందులో సుమారుగా రూ.30 లక్షలకు పైగా ప్రభుత్వ భూమిని అమ్మున్నారనే విమర్శలున్నాయి. ఇంతటితో ఆగక పక్కనే ఉన్న మిగతా మొత్తం స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. అంతే కాకుండా ఈ స్థలాన్ని ఇళ్ల ప్లాట్లుగా మార్చేందుకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని రెవెన్యూ అధికారులు పంచాయతీకి ఏ-1 నోటీసు పంపించారు. దీంతో పరిస్థితి మరింత రచ్చకెక్కడంతో పంచాయతీ పాలకవర్గం ఇది శ్మశాన స్థలమైనందున ఇళ్ల పాట్లుగా మార్చేందుకు తీర్మానం ఇవ్వలేమని పంపించారు. కొంతమంది స్థానికులు ఈ విషయమై 2016 జనవరిలో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఆగని ప్రయత్నాలు ఇంత రచ్చకెక్కినా గుట్టుచప్పుడు కాకుండా ఈ శ్మశాన భూమికి సంబంధించి 300కుపైగా ఇళ్ల ప్లాట్లుగా విభజించి లేఅవుట్లు తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాత తేదీలతో ఈ పట్టాలను అధికార పార్టీ నేతల చేతుల్లో పెట్టేందుకు రెవెన్యూ కార్యాలయంలో పత్రాలు సిద్ధమైనట్లు తెలిసింది. నెలలోపు ఈ పట్టాలన్నీ అధికార పార్టీ నేతలకు అందించేందుకు రంగం సిద్ధమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వెంకటరామారావు దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి శ్మశాన స్థలాన్ని కాపాడాలని ఉదయగిరి పట్టణవాసులు కోరుతున్నారు. ఇళ్ల స్థలాలు ఎవరికీ ఇవ్వడం లేదు పై సర్వే నంబర్లకు సంబంధించిన భూమి హైకోర్టులో స్టేలో ఉంది. ఆ స్థలంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు. గతంలో ఈ స్థలం ప్రభుత్వ అనాదీనంగా ఉంది. అడంగల్‌లో శ్మశానంగా ఎలా మారిందో నాకు తెలియదు. ఈ స్థలానికి సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం లేదు. - కుర్రా వెంకటేశ్వర్లు, తహసీల్దారు