బడాబాబు భూదాహం.. బడుగులపై దాష్టీకం | Forcing it to take over the market place | Sakshi
Sakshi News home page

బడాబాబు భూదాహం.. బడుగులపై దాష్టీకం

Published Sun, Apr 24 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

బడాబాబు భూదాహం..  బడుగులపై దాష్టీకం

బడాబాబు భూదాహం.. బడుగులపై దాష్టీకం

మార్కెట్ స్థలం స్వాధీనానికి బలప్రయోగం  
రూ.15 కోట్ల ఆ స్థలంపై  ప్రజాప్రతినిధి కన్ను
అడ్డుకున్నవారి ఈడ్చివేత.. లాఠీల ప్రయోగం
ముగ్గురి ఆత్మహత్యాయత్నం.. అయినా కరుణించని అధికారులు
రోడ్డున పడ్డ 400 మంది రైతులు, చిరువ్యాపారులు
విశాఖ నగరంలో ప్రభుత్వ దౌర్జన్యకాండ
బలవంతంగా ఖాళీ చేయించిన వైనం
400మంది రైతుల జీవనోపాధికి విఘాతం
 

 
ముందస్తు నోటీసులు లేవు.. సూచనప్రాయ సమాచారమూ లేదు..శనివారం ఉదయం..వ్యాపారాలు జరుగుతున్న వేళ..ఉరుము లేని పిడుగులా ఒక్కసారిగా పోలీసు బలగాలు.. వారి వెంట జీవీఎంసీ అధికారులుఅక్కడ వాలారు..వచ్చీ రావడంతోనే బడుగులపైదాష్టీకానికి దిగారు..షాపులు ఖాళీ చేయమనిహుకుం జారీ చేశారు..షాపుల్లో ఉన్న కూరగాయలను రోడ్డుపైకి విసిరేశారు.. అడ్డుకున్న వారిని ఈడ్చిపారేశారు.. లాఠీలు ప్రయోగించారు..ముగ్గురు ఆత్మహత్యాయత్నానికిపాల్పడినా ఏమాత్రం వెనుకంజ వేయలేదు..వారిని కూడా ఎత్తుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు.. అరెస్టు చేసి.. స్టేషన్లకు తరలించారు..ఆనక.. పొక్లెయిన్లతో షాపులను పడగొట్టారు.. మార్కెట్‌ను నేలమట్టం చేశారు. బడుగు రైతులు.. చిరువ్యాపారుల జీవ న చిత్రాన్ని ఛిద్రం చేశారు.. ఎందుకింత దాష్టీకం?.. ఎవరి కోసం ఈ దౌర్జన్యకాండ??..అని ప్రశ్నిస్తే.. దీని వెనుక పెద్దల భూదాహం కనిపిస్తుంది.. రూ.15 కోట్ల మార్కెట్‌స్థలంకాజేయాలన్న కుట్ర కనిపిస్తుంది.. అదేలాగో మీరే చదవండి..
 

 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని 29వ వార్డు పరిధి కొబ్బరితోట ప్రాంతంలోని రామకృష్ణా జంక్షన్‌లో దాదాపు అర ఎకరా విస్తీర్ణంలో ఎన్నో ఏళ్లుగా కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది కూరగాయల రైతులు, చిరు వ్యాపారులకు ఈ మార్కెట్టే జీవనాధారం. కానీ శనివారం హఠాత్తుగా జీవీఎంసీ, పోలీసులు  ఆ మార్కెట్ స్థలంపై పడ్డారు. రైతులు, చిరువ్యాపారులను ఇష్టం వచ్చినట్లు ఈడ్చివేశారు. ముగ్గురు ఆత్మహత్యకు యత్నించినా పట్టించుకోకపోగా బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దుకాణాలను నేలమట్టంచేశారు. శనివారం సాయంత్రానికి మార్కెట్‌ను చదును చేసేశారు.

తెరముందు జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఈ దమనకాండకు పాల్పడినా.. తెరవెనుక టీడీపీ పెద్దల కబ్జాకాండ వ్యూహం ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్వయంగా ఈ క్రైం కథ నడిపించారు. జీవీఎంసీ కార్యాలయంలో కూర్చొని మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయించాల్సిందేనని కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి పెంచారు. బడుగులపై ఉక్కుపాదం మోపి పని జరిపించుకున్నారు.


 ప్రజాప్రతినిధికి కట్టబెట్టే కుట్ర
కొబ్బరితోట ప్రాంతంలోని రామకృష్ణా జంక్షన్‌లో సర్వే నంబర్ 129తో ఉన్న దాదాపు అర ఎకరా స్థలాన్ని జీవీఎంసీ కొన్నేళ్ల క్రితమే కూరగాయల రైతులకు కేటాయించింది. జీవీఎంసీ అక్కడ రోడ్లు, మౌలిక సౌకర్యాలు కూడా కల్పించింది. కానీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ పెద్దల కన్ను ఆ స్థలంపై పడింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాని విలువ దాదాపు రూ.15 కోట్లు. ప్రధానంగా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆ స్థలాన్ని తమపరం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. కానీ రైతులు, చిరువ్యాపారులు తమకు జీవనోపాధి కల్పిస్తున్న ఆ స్థలాన్ని వదులుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్టపడరని ఆయనకు తెలుసు. దాంతో కోర్టు తీర్పులు ఉటంకిస్తూ


ఖాళీ చేయించాలనుకున్నారు. అది కూడా సాధ్యపడదని తెలుసుకున్నారు. ఇక దండోపాయంతోనే రైతులను ఖాళీ చేయించడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు జీవీఎంసీ అధికారులు, పోలీసుల సహకారం తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా శనివారం హఠాత్తుగా జీవీఎంసీ, పోలీసు అధికారులను వెంటబెట్టుకు వచ్చి షాపులపై పడ్డారు.  రైతులు, చిరువ్యాపారులను విచక్షణారహితంగా ఈడ్చివేసి.. లాఠీలు ప్రయోగించి మరీ మార్కెట్‌స్థలాన్ని ఖాళీ చేయించారు.
 
ఎమ్మెల్యే వాసుపల్లి హల్‌చల్
మార్కెట్ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం. ప్రజాప్రతినిధిగా బాధితుల పక్షాన నిలవాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రైతులు, చిరువ్యాపారుల ఆందోళనతో మార్కెట్‌లో ఓ వైపు పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా ఎమ్మెల్యే వాసుపల్లి  జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించాలని స్పష్టంగా చెప్పారు. లేకపోతే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారని కూడా సందేహం వ్యక్తం చేశారు.  అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దగ్గరుండి మరీ ఒత్తిడి తెచ్చారు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించారు.

దాదాపు 400 మంది రైతులు, చిరువ్యాపారులకు జీవనోపాధి కల్పించిన మార్కెట్‌ను నేలమట్టం చేయించారు.  ఖాళీ చేయించడం అయిపోయింది.. ఆ స్థలాన్ని కొల్లగొట్టడమే మిగిలింది.. అధికార పార్టీ పెద్దలు తలచుకుంటే బడుగుల బతుకులు ఏపాటి చెప్పండి... ప్రభుత్వ పెద్దల భూదాహానికి ప్రభుత్వ భూములు కరగాల్సిందే మరి!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement