
మరో కుటుంబం ఆత్మహత్య
బెట్టింగ్‌లో అప్పుల పాలై విషాదం
మైసూరు: రాచనగరిలో అప్పుల బాధతో ఓ వ్యాపారవేత్త భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. నగరవాసులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే అదే మాదిరి మరో సామూహిక ఆత్మహత్యల ఘటన సంభవించింది. జెస్సీ ఆంటోని, అతని సోదరుడు జోబి ఆంటోని, అతని భార్య స్వాతి బలవన్మరణానికి పాల్పడినవారు. మృతులు నగరంలోని విద్యానగర, యరగనహళ్లి నివాసులుగా గుర్తించారు. వీరి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది.
వివరాలు.. జోబి ఆంటోని, జెస్సీ ఆంటోనీలు కవల సోదరులు. తాలూకాలోని రమ్మనహళ్లిలో జెస్సీ ఆంటోని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు అతను ఒక వీడియో చేశాడు. అందులో జోబి ఆంటోని, అతని భార్య స్వాతి అలియాస్ శర్మిల, తన సోదరి మేరీ షెర్లిన్ ద్వారా ఊరు నిండా అప్పులు చేశారు, అప్పులవారి బాధ భరించలేకున్నాం, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. షెర్లిన్‌కి భర్త లేడని, ఆమెను మోసం చేశారని, ఆమెని, ఆమె బిడ్డను చంపాలని ప్రయత్నించారని తెలిపాడు. దీనంతటికీ జోబి ఆంటోని, అతని భార్య స్వాతి కారణమని, వారిని శిక్షించాలని వీడియోలో అభ్యర్థించాడు. ఆ వీడియోను తన సోదరికి పంపి ఉరి బిగించుకున్నాడు.
భయపడి.. జోబి జంట..
మేరీ షెర్లిన్ మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్‌లో జోబి, స్వాతిలపై ఫిర్యాదు చేయగా ఆత్మహత్యకు ప్రేరేపించారనే సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ పరిణామాలతో భయపడిన జోబి, స్వాతి విజయనగర క్రీడా మైదానంలోని నీటి ట్యాంకు నిచ్చెనకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జోబి ఆంటోని తన సోదరి పేరిట బెట్టింగ్ కోసం సుమారు రూ.80 లక్షల మేర అప్పులు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో ఘర్షణలు చెలరేగాయని తెలుస్తోంది. వరుస ఆత్మహత్యల పరంపర మైసూరులో కలకలం సృష్టిస్తోంది.