
భర్త మరణంతో విరక్తి చెంది అకృత్యం
బెంగళూరులో విషాద ఘటన
బనశంకరి: భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ జీవితంపై విరక్తి చెంది తీవ్ర నిర్ణయం తీసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కుమారున్ని హత్యచేసిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. మనసులను కలిచివేసే ఈ ఘోర దుర్ఘటన బెంగళూరులో యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యలహంక ఆర్‌ఎంజెడ్ అపార్టుమెంట్‌లో పులివర్తి శ్రీధర్ (47), రమ్యా (40), వారి కుమార్తె (20), కుమారుడు భార్గవ్ (13) నివాసం ఉంటున్నారు.
వీరి స్వస్థలం తిరుపతి ప్రాంతమని తెలిసింది. శ్రీధర్ ఐటీ ఇంజినీరుగా పనిచేసేవారు. మూడు నెలల క్రితం పులివర్తి శ్రీధర్ క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి రమ్యా భర్తను తలచుకుంటూ మనో వ్యాకులతకు గురైంది. ఇటీవల నగరంలోనే పీజీ హాస్టల్లో ఉన్న కుమార్తెతో రమ్యా ఫోన్‌లో మాట్లాడి బాధపడింది. ఈ నేపథ్యంలో రమ్యా పోలీసులకు, డాక్టరు, కుమార్తెకు లేఖ రాసి, అపార్టుమెంటులో కుమారుడు భార్గవ్‌ను ఉరివేసి హత్యచేసిన తరువాత రమ్యా కూడా ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని మృతదేహాలకు శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment