mother son
-
కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య
బనశంకరి: భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ జీవితంపై విరక్తి చెంది తీవ్ర నిర్ణయం తీసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కుమారున్ని హత్యచేసిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. మనసులను కలిచివేసే ఈ ఘోర దుర్ఘటన బెంగళూరులో యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యలహంక ఆర్ఎంజెడ్ అపార్టుమెంట్లో పులివర్తి శ్రీధర్ (47), రమ్యా (40), వారి కుమార్తె (20), కుమారుడు భార్గవ్ (13) నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం తిరుపతి ప్రాంతమని తెలిసింది. శ్రీధర్ ఐటీ ఇంజినీరుగా పనిచేసేవారు. మూడు నెలల క్రితం పులివర్తి శ్రీధర్ క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి రమ్యా భర్తను తలచుకుంటూ మనో వ్యాకులతకు గురైంది. ఇటీవల నగరంలోనే పీజీ హాస్టల్లో ఉన్న కుమార్తెతో రమ్యా ఫోన్లో మాట్లాడి బాధపడింది. ఈ నేపథ్యంలో రమ్యా పోలీసులకు, డాక్టరు, కుమార్తెకు లేఖ రాసి, అపార్టుమెంటులో కుమారుడు భార్గవ్‌ను ఉరివేసి హత్యచేసిన తరువాత రమ్యా కూడా ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని మృతదేహాలకు శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
పశువుల కొట్టానికి మంటలు..గోవును కాపాడబోయి తల్లీ కుమారుడు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మహారాజా గంజ్ జిల్లా భుసి అమ్వా గ్రామంలో విషాద ఘటన జరిగింది. పశువుల కొట్టాటనికి మంటలు అంటుకోగా.. అందులో ఉన్న ఆవును కాపాడేందుకు వెళ్లి తల్లి, కుమారుడు సజీవ దహనమయ్యారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులను కౌసల్య దేవి(56), రామ్ ఆశీష్(35)గా గుర్తించారు. దోమల బెడదను నివారించేందుకు చెత్తకు నిప్పు అంటించి పొగబెట్టింది కౌసల్య. అయితే గాలికి ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న పశువుల కొట్టానికి అంటుకున్నాయి. అందులో ఉన్న ఆవును కాపాడేందుకు కౌసల్య లోపలికి వెళ్లింది. పొరపాటున అందులోని స్తంభం తగిలి ఆమె కిందపడిపోయింది. దీంతో తల్లిని కాపాడేందుకు రామ్ కూడా లోపలికి వెళ్లాడు. అయితే ఒక్కసారిగా పైకప్పు కూలి వీరిపై పడింది. అప్పటికే మంటలు భారీగా చెలరేగడంతో ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో గోవుకు తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ప్రభుత్వం నుంచి అసవరమైన సహాయ సహకారాలు ఉంటాయని అధికారులు కౌసల్య కుటుంబానికి హామీ ఇచ్చారు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
మనసున్న మారాజు మా జగనన్న
సాక్షి, కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాయకరావుపేటలో పర్యటించిన సందర్భంలో ఓ తల్లి కష్టం చూసి చలించిపోయిన విషయం తెలిసే ఉంటుంది. వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డకు సాయం అందించాలని ఓ తల్లి ఆయన్ని దీనంగా వేడుకుంది. దీంతో చలించిపోయిన సీఎం జగన్.. తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అలాగే పింఛను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అక్కడిక్కడే ఆదేశించారు. అయితే.. జగనన్న ఇచ్చిన సాయం మాటగానే మిగిలిపోలేదు. ఆయన సూచనల మేరకు అంతేత్వరగతిన అధికారులు స్పందించారు. రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. తనూజ, చిన్నారి ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు రావాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణితో ఆ తల్లీకొడుకుల రాకకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్లోని తన ఛాంబరుకు పిలిపించుకుని రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం ఆ తల్లికి అందించారు. అలాగే చిన్నారి ధర్మతేజకు వచ్చే నెల నుండి పింఛను మంజూరు చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. చిన్నారికి పూర్తిస్థాయి వైకల్యం ఉండడంతో.. రూ. 35 వేల రూపాయల విలువైన వీల్ చైర్ అందించారు. అసలేం జరిగిందంటే.. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజకు వైకల్యంతో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు. పూర్తిగా బిడ్డ ఆలనాపాలనా చూస్కోవాల్సి రావడంతో.. తనూజ కూలీ పనులకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందిపడింది. అధికారులకు అర్జీ పెట్టుకుంది. ఈలోపు తన నిస్సహాయ స్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు చిన్నారితో సహా ఎదురుచూసింది. గురువారం పాయకరావు పేటలో సీఎం జగన్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసి.. ఆ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకుని.. జనం మద్యలో నిలుచుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచే తనూజను చూశారు. కాన్వాయ్‌ను ఆపించి.. ఆమెను దగ్గరకు పిలిచి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పిలిచి సహాయం అందించి, తన కష్టాలను తొలగించిన జగనన్న మంచి మనసుకు.. ఆ తల్లి పదే పదే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతోంది. ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్ సత్వర సాయం -
కొత్త కోణం: అమ్మాయిల కోసమే భూదేవి హత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సరూర్‌నగర్ తల్లి, దత్తపుత్రులు హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. దత్తత తీసుకుని పెంచిన తల్లి భూదేవిని.. సాయి తేజ చంపడానికి స్నేహితుడు శివ పురిగొల్పడమే కారణమని తేలింది. మానసిక స్థితి సరిగాలేని సాయిని.. పెంపుడు తల్లి హత్యకు పురిగొల్పింది శివ అనే విషయం తాజాగా వెలుగు చూసింది. అమ్మాయిల కోసమే భూదేవిని శివ హతమార్చినట్లు వెల్లడైంది. అమ్మాయిలకు ఖర్చు పెట్టడానికే భూదేవి హత్యకు సాయిని పురిగొల్పిన శివ.. ఆపై నగదు, నగల దోపిడీకి పాల్పడ్డాడు. ఆపై హత్య విషయం ఎక్కడ బయటపడుతోందనని చివరకు స్నేహితుడైన సాయిని కూడా చంపేశాడు శివ. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. ఇక ఈ హత్యలకు డ్రైవర్ నరసింహ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూదేవిని నలుగురు నిందితులు కలిసి చంపినట్లు ధృవీకరించారు పోలీసులు. అయితే సాయి తేజని చంపింది శివ కుమార్ ఒక్కడే వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై.. -
ఆర్భాటపు పెళ్లికి ఒప్పుకోలేదని..
కర్నూలు (టౌన్): ఉన్నత చదువు చదివాడు.. లాయర్ వద్ద గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నాడు.. సమాజంలో మంచిని పెంపొందించాల్సిన ఆ యువకుడు విక్షణ కోల్పోయాడు. పెళ్లి ఆర్భాటంగా చేసేందుకు ఒప్పుకోలేదని తల్లిని రోకలిబండతో బాది హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని తారకరామ నగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భర్త లేకపోయినా లక్ష్మీదేవి (45) తన ఇద్దరు కుమారులను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడు రామగిరేంద్ర ఎంఏ వరకు చదివి ఇటీవల లాయర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదోని మండలం ఇలిగేరి గ్రామానికి చెందిన యువతితో ఈ యువకుడికి పెళ్లి చేయాలని బంధువులు నిశ్చయించారు. బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలని తల్లి లక్ష్మీదేవితో గురువారం ఇంట్లో కుమారుడు గొడవ పడ్డాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని తల్లి మందలించడంతో రామగిరేంద్ర క్షణికావేశానికి గురై పక్కనే ఉన్న రోకలి బండతో తలపై మోదాడు. దీంతో అమె అక్కడి కక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి మరిది శేషగిరి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, హత్య కేసు నమోదు చేశారు. కాగా..గురువారం సాయంత్రం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. -
షాకింగ్ వీడియో: ఈ తల్లీకొడుకులు చెప్పింది వింటే చిర్రెత్తుకు రావడం ఖాయం
బిడ్డ ఎలాంటోడైనా, ఎంతటోడైనా ఆ తల్లికి పసివాడే. అలాంటిది పసివాడినే ఆ తల్లి అలా చేసేసరికి.. చూసేవాళ్లకి చిర్రెత్తుకొచ్చింది. చీర, బెడ్షీట్లకు కొడుకును వేలాడదీసి పైకి లాగిన ఆ తల్లిని చూసి.. ‘ఇదేం తల్లీ? అనుకునేవాళ్లంతా’.. అందుకు కారణం తెలిసేసరికి తిట్టిన తిట్టు తిట్టడమే కనిపిస్తోంది సోషల్ మీడియా అంతా.. ఫరిదాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనగా ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది. పోయినవారం సెక్టార్ 82లోని ఓ సొసైటీలో ఇది జరిగింది. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోవడం, ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో.. వేరేవాళ్ల సాయం కోరకుండా ఇదిగో ఈ తల్లి ఇలా కొడుకును కిందకు వేలాడదీసి పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అదీ తొమ్మిదవ ఫ్లోర్ నుంచి.. ఆ సమయంలో దూరంగా ఎదురుగా ఎక్కడో ఉన్న అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా వైరల్ అయ్యింది ఆ వీడియో. ఏ మాత్రం జంకు లేకుండా ఆ పిలగాడు పైకి వెళ్తుండగా.. ఆ తల్లి నిమ్మలంగా పైకి లాగుతూ కనిపించింది. ఆ పక్కనే మరికొందరు ఉన్నారు. గ్రిల్ మీద కాళ్లు పెట్టే క్రమంలో పట్టుతప్పి ఉంటే గనుక ఆ బిడ్డ సంగతి ఏంటని తిట్టి పోస్తున్నారు. Daily News Haryana సౌజన్యంతో వీడియో ఇక వైరల్ అయిన వీడియోపై ఆ తల్లీకొడుకులు సైతం స్పందించారు. అయితే వాళ్ల మాటలు గనుక వింటే.. అప్పటిదాకా పిల్లోడి మీద జాలి చూపించిన వాళ్లకు మరింత కోపం రావడం ఖాయం. పడితే ఏమవుతుంది? ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు పోవాల్సిందేగా అని ఆ బుడ్డోడు చెప్తుంటే.. వీడియో తీస్తున్నారని తెలియదని, ఈ ఘటనకు తనను క్షమించాలని ఆ తల్లి అంటోంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి సైతం వెళ్లింది. మరి వాళ్లు ఏం చేస్తారో చూడాలి మరి. -
Kilimanjaro: తల్లి.. తనయుడు.. కిలిమంజారో
కొడుక్కు14 ఏళ్లు. తల్లికి 35 లోపే. ‘కిలిమంజారో అధిరోహిద్దామా అమ్మా’ అని కొడుకు అంటే ‘అలాగే నాన్నా’ అని తల్లి సమాధానం ఇచ్చింది. అలా ఏ కొడుకూ తల్లీ కలిసి కిలిమంజారోకు హలో చెప్పింది లేదు. దుబాయ్‌లో స్థిరపడ్డ శోభ తన కొడుకుతో కలిసి సాధించిన రికార్డు అది. పిల్లలను మార్కెట్‌కు పంపడానికి భయపడే ఈ రోజుల్లో కొత్త ప్రపంచాలకు చూపు తెరిచే సాహసాలు చేయడం స్త్రీలు సాధ్యం చేస్తున్నారు. సాధారణంగా తల్లీకుమారులు కలిసి సాయంత్రం కూరగాయలు కొనడానికి వెళుతుంటారు. ఐస్‌క్రీమ్ తినడానికి. లేదంటే ఒక లాంగ్ డ్రైవ్. పిక్నిక్. కాని దుబాయ్‌లో స్థిరపడ్డ్డ బెంగాలి కుటుంబం శోభ మహలొనోబిస్, ఆమె కొడుకు శాశ్వత్ మహలొనోబిస్ మాత్రం అలా ఏదైనా కొండెక్కి దిగుదామా అనుకుంటారు. శోభ భర్త శుభోజిత్ ఇందుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తుంటాడు. విదేశాలలో ఉన్న భారతీయులు సాధించే విజయాలు కొన్ని ఇక్కడ ప్రచారం పొందడం లేదు. కాని జూలై రెండో వారంలో ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతాలలో ఒకటైన కిలిమంజారోను అధిరోహించిన తొలి తల్లీకొడుకుల జంటగా శోభ, శాశ్వత్ రికార్డు స్థాపించారు. బహుశా కిలిమంజారోను అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా కూడా శాశ్వత్ రికార్డు నమోదు చేసి ఉండవచ్చు. శోభ, కుమారుడు శాశ్వత్‌తో శోభ భళాభళిమంజారో అఫ్రికాఖండంలో అతి ఎత్తయిన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారో టాంజానియాలో ఉంది. సముద్రమట్టం నుంచి దీని ఎత్తు 19,341 అడుగులు. ఏదైనా పర్వతాల వరుసలో కాకుండా ఏకైక పర్వతంగా (సింగిల్ ఫ్రీ స్టాండింగ్) నిలవడం దీని విశిష్టత. ఇది అగ్నిపర్వతం. అంతేనా? మైనస్ 7 నుంచి 16 డిగ్రీల వరకూ ఉండే తీవ్రమైన శీతల ఉష్ణోగత, మంచుపొరలు, కఠినమైన శిలలు, ప్రచండ గాలులు... దీనిని అధిరోహించడం పెద్ద సవాలు. ఈ సవాలును స్వీకరించడంలోనే పర్వతారోహకులకు కిక్ ఉంటుంది. ప్రాణాలకు తెగించైనా సరే అనే తెగింపు ఉంటుంది. అలాంటి తెగింపును చూపారు శోభ, శాశ్వత్. కొడుకు కోసం దుబాయ్‌లోని జెమ్స్ మోడ్రన్ అకాడెమీలో చదువుకుంటున్న 14 ఏళ్ల శాశ్వత్ చదువులో చాలా బ్రిలియంట్. ఇప్పటికే అతడు ‘పైథాన్’ లాంగ్వేజ్‌లో స్పెషలిస్ట్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో 14 సర్టిఫికెట్లు పొందాడు. కోవిడ్ కాలంలో ఊరికే ఉండక చాలామందికి పైథాన్ నేర్పించాడు. గిటార్ కూడా వాయిస్తాడతడు. అంతే కాదు బయట తిరగడం కూడా అతడి హాబీ. ‘మావాడు ఇంట్లో ఉండడు. ఎక్కడికైనా తిరగాలంటాడు. వాడి ట్రెక్కింగ్‌లో భాగంగా నేను కూడా వెళ్లేదాన్ని. నేను వాడితో పాటు కొండలెక్కుతుంటే మా అమ్మ కూడా భలే ఎక్కుతోంది అన్నట్టుగా గర్వంగా చూసేవాడు. వాడు నా నుంచి ఇన్‌స్పయిర్ అవుతున్నాడని అనిపించింది. వాడు కిలిమంజారో ఎక్కుదామని అన్నప్పుడు వాడికి తోడుగా నేను కూడా ఉండాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది శోభ. కఠోర శిక్షణ తీసుకుని కాని ఇది చిన్నా చితక వ్యవహారం కాదని వాళ్లిద్దరికీ తెలుసు. అందుకే కఠోర శిక్షణ మొదలెట్టారు. ముందుగా దుబాయ్ చుట్టుపక్కల ఉండే కొండలను ట్రయినర్స్ సహాయంతో ఎక్కడం నేర్చుకున్నారు. భుజాలకు పది పది కేజీలు ఉన్న బ్యాగ్‌లు కట్టుకుని, వాటిలో పర్వతారోహణ సామాగ్రిని మోస్తూ సాధన చేశారు. ‘వారంలో నాలుగురోజులు మేము కొండలెక్కడం దిగడం సాధన చేశాం. ఇవి కాకుండా ఇద్దరం కలిసి రోజూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్లం. శాశ్వత్ అది చాలదన్నట్టు ట్రెడ్మిల్ మీద తిరిగి నడిచేవాడు’ అంది శోభ. ‘కిలిమంజారో ఎక్కడానికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వం మాకు వచ్చింది అనుకున్నాకే మేము అధిరోహణకు బయలుదేరాం’ అని శాశ్వత్ అన్నాడు. ఆరు రోజులలో టాంజానియాలో కిలిమంజారో నుంచి జూలై 4న ఈ తల్లీకొడుకుల ఆరోహణ మొదలైంది. ‘మొదటి రోజు మేము 10 గంటల పాటు అధిరోహించాము. కాని నా పని అయిపోయిందని అనిపించింది. ఇక చాలు వెనక్కు వెళ్లిపోదాం అనుకున్నాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకువెళ్లింది. జూలై 9న మేము శిఖరాన్ని అధిరోహించాము. మధ్యలో అమ్మ డీలా పడితే నేను ధైర్యం చెప్పాను. మేము ఇద్దరం ఒకరికి ఒకరం విశ్వాసం కల్పించుకుంటూ ముందుకు సాగాం. శిఖరం ఎక్కే రోజున ఏకధాటిగా 14 గంటలు ఎక్కుతూనే ఉన్నాం. అంత శ్రమ పడి పైకి ఎక్కిన తర్వాత అక్కడ కనిపించే ప్రకృతి దృశ్యం వర్ణనాతీతం అనిపించింది. అది ఒక అద్భుతం’ అని శాశ్వత్ అన్నాడు. ఈ విజయం తర్వాత ఈ తల్లీకుమారులు ఎవరెస్ట్ మీద తమ గురి నిలిపారు. ‘మేము ముందే అనుకున్నాం... ఈ అధిరోహణ విజయవంతమైతే ఎవరెస్ట్‌ను తాకాలని. బహుశా వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో మేము ఆ పని చేస్తాం’ అని శోభ అంది. సాహసాలు, ప్రకృతి దర్శనం మానవ ప్రవృత్తిని ఉన్నతీకరిస్తుంది. ఆ మేరకు చిన్న వయసులోనే తల్లిని తోడు చేసుకుని అంత పెద్ద పర్వతం అధిరోహించిన శాశ్వత్ మున్ముందు ఎన్నోసార్లు ఘనవిజయాలతో మనల్ని తప్పక కలుస్తాడు. -
Mitra Satheesh: పద నాన్నా... దేశం చూద్దాం
ఇలా బహుశా ఏ తల్లీ చేయలేదేమో. కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ తన పదేళ్ల కొడుకు నారాయణ్‌ను తీసుకుని సొంత కారులో సొంత డ్రైవింగ్‌లో దేశం చూడటానికి బయలుదేరింది. ‘ఒరు దేశీ డ్రైవ్’ అని దానికి పేరు పెట్టిందికాని దూరం మాత్రం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఆ తల్లీ ఆ కొడుకు మార్చిలో బయలుదేరి మే 6 వరకూ సాహసోపేత దారుల్లో తిరిగి మళ్లీ కొచ్చి చేరుకున్నారు. ‘దేశం అంతా ఊళ్లల్లో ఉంది. ఆ ఊళ్లను చూశాం మేము’ అంటున్న మిత్రా ఈ కరోనా తగ్గగానే దేశాన్ని చుట్టేయమని చెబుతోంది. తోడుగా ఉన్నది ఒక మారుతి ఎస్–క్రాస్ మోడల్ కారు. 11 ఏళ్ల కొడుకు. దాదాపు 10 ఏళ్ల నుంచి కారు నడుపుతున్న ధైర్యం. అంతే. కొచ్చి (కేరళ)కు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ మార్చి 17, 2021న దేశం చూడ్డానికి బయలుదేరింది. ‘నా కొడుక్కి నా దేశం చూపించాలి. ప్రజలు ఎలా జీవిస్తారో వాడికి తెలియాలి. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించవచ్చని తెలియచేయాలి. పిల్లలు పుట్టాక ఇల్లు కదలలేరు అనే దానికి విరుగుడుగా పిల్లలనే తోడు తీసుకొని తిరగొచ్చు అని స్త్రీలకు చెప్పగలగాలి. అంతే కాదు... నేనొక ప్రయాణ ప్రేమికురాలిని. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. గ్రామీణ భారతంలోనే అంతా సౌందర్యం ఉంది అని చెప్పడానికి కూడా నేను ప్రయాణించాలి అని అనుకున్నాను’ అని ఈ సాహసోపేతమైన ప్రయాణం వెనుక తన లక్ష్యాలను వివరించింది మిత్రా సతీష్. 100 రోజులు 20 వేల కిలోమీటర్లు ‘ముందుగా నా భర్తకు కృతజ్ఞతలు. ఆయన మా అబ్బాయితో కలిసి ఈ యాత్ర చేయడానికి ప్రోత్సహించారు. మా అమ్మకు కూడా’ అంటుంది మిత్రా. మార్చి 17న బయలుదేరి 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని మిత్రా ప్లాన్. అందుకు తగ్గట్టు తన యాత్రకు ‘ఒరు దేశీ డ్రైవ్’ అని పేరు పెట్టుకుంది. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సరర్‌గా నిలిచింది. ఇక ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫాలోయెర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఆమె యాత్ర మొదలెట్టింది. ‘2019లో ఒంటరిగా భూటాన్ వెళ్లాను కారులో. అప్పుడు కాని అర్థం కాలేదు నాకు యాత్ర చేయడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు దారిలో తెలుసుకోవడం. కస్టమ్స్ కాస్ట్యూమ్స్ రెండు తెలియాలి జనానివి. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ ఒంటరిగా కారులో తిరిగాను. ఇప్పుడు నా కొడుక్కు దేశం చూపించాలనిపించింది. బయలుదేరాను’ అంది మిత్రా. అయితే ఆమె బయలుదేరిన సమయానికి కరోనా ఉధృతంగా లేదు. ఆమె యాత్ర సగంలో ఉండగా కేసులు, లాక్డౌన్లు మొదలయ్యాయి. అదీగాక డ్యూటీకి హాజరుకమ్మని ఆమెకు పిలుపు వచ్చింది. అయినప్పటికీ 51 రోజుల్లో దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగి ఆమె విజయవంతంగా స్వస్థలానికి చేరుకుంది. ఆత్రేయపురం పూతరేకులు కేరళ నుంచి బయలుదేరిన మిత్ర తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం, వరంగల్ జిల్లా చేర్యాల వంటి ఊళ్ల గుండా తన ప్రయాణం సాగించింది. ‘ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురం పూతరేకులు అద్భుతం. అలాగే చేర్యాల హస్తకళలు కూడా’ అని ఆమె చెప్పింది. తల్లీ కొడుకులు ప్రతిరోజూ ఉదయం 5 గంలకు ప్రయాణం మొదలెట్టి సాయంత్రానికి నిర్దేశిత ఊరికి చేరుకునేవారు. ‘మేము గ్రామాల్లో ఎవరినో ఒకరిని అడిగి వారి ఇళ్లల్లో ఉండేవాళ్లం. గ్రామీణులు ఎంతో అదరంగా మమ్మల్ని చూసేవారు’ అని ఆమె అంది. ఆదివాసీలతో ఈ ప్రయాణంలో తన కుమారుడికి ఆదివాసీ ల జీవనం చూపడం గురించి మిత్ర ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోరాపుట్ (ఒడిసా) బోండా ఆదివాసీలతో, కంగ్రపోడ్ (దక్షిణ ఒడిసా) లో గదబలతో, జగదల్పూర్ (చత్తీస్‌ఘర్)లో ధృవ తెగతో, అంజర్ (మధ్యప్రదేశ్)లో మడియా గిరిజనులతో మేము గడపడం వారి గూడేల్లో ఉండి వారు పెట్టింది తినడం మర్చిపోలేము’ అని మిత్ర అంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్త్రీలు ఎంతో ఆదరంతో పలకరించి ఎక్కడకు వెళ్లినా గౌరవ వస్త్రంతో స్వాగతం పలకడాన్ని ఆమె కృతజ్ఞతతో చెబుతుంది. ప్రమాదకరం ‘మేము వైష్ణోదేవి ఆలయం చూడాలనుకున్నాం. కాని దారి మూసేశారు. దాంతో హెలికాప్టర్లో వెళ్లాం. నాకు మా అబ్బాయికి కూడా హెలికాప్టర్ ఎక్కడం అదే ప్రథమం. అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ట్రిప్ కేన్సిల్ అయ్యింది. దాంతో 14 కిలోమీటర్లు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సగం దూరం గుర్రాల మీద వచ్చాం. ఆ సమయంలో మాత్రం చాలా భయం వేసింది’ అని మిత్ర అంది. ఈ మొత్తం ప్రయాణంలో కొడుకు ముందు నుంచి ఎదురు చూసింది జమ్ము, కశ్మీర్‌లను చూడటం గురించే. ‘వాడు మొదటిసారి మంచుమైదానాలను చూసి వెర్రెత్తి పోయాడు’ అని ఆమె పెద్దగా నవ్వింది. మామూలుగా మన దేశం పూర్తిగా చూడటానికి ఒక జన్మ చాలదని అంటారు. అన్ని విశేషాలు, జీవనాలు ఉంటాయి. మనలో చాలామందికి కార్లుంటాయి. కాస్త తిరగగలిగే వీలు కూడా ఉంటుంది. కాని ‘ఆరంభించరు అతి బీరువులు, బద్దకస్తులు’ అన్నట్టు భయం కొద్దీ, బద్ధకం కొద్దీ ఎక్కడికీ కదలం. ‘తెలిసిన ఊళ్లో ఉన్నవాడు ఏమీ తెలియనట్టే ఉండిపోతాడు. తిరిగినవాడు లోకం తెలిసి బాగుపడతాడు’ అని పెద్దలు అన్నారు. మనం, మన తర్వాతి తరం లోకాన్ని చూడకపోతే ఎలా? ముఖ్యంగా స్త్రీలు ఇంత అందమైన దేశాన్ని తిరిగి చూస్తే ఇల్లు విజ్ఞానవంతం అవదూ? పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పొచ్చు. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ కరోనా గిరోనా అంతా పోతుందని ఆశిద్దాం. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే. ఏమంటారు? – సాక్షి ఫ్యామిలీ -
పసిబిడ్డ పునర్జన్మ కోసం..
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి సుదూరాల తీరం దాటి నగరానికి తీసుకొచ్చింది.ఎంతో వ్యయప్రయాసలకోర్చి యోజనాల దూరం దాటి ఇక్కడకు తెచ్చిన కన్నపేగు బంధం నగర వైద్యుల్లో తమ సంకల్ప బలాన్ని రెట్టింపు చేసింది. 20 గంటలపాటు డాక్టర్లు శ్రమించి చికిత్స చేసి ఆ పసిబిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. అతిక్లిష్టమైన చికిత్సను చేసి శిశువుకు ప్రాణం పోసి అంతర్జాతీయంగా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది కిమ్స్ వైద్య బృందం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆయాసం..గుక్కపట్టి ఒక్కటే ఏడుపు జింబాబ్వేకు చెందిన నోరా సిటుంబెకో 11 నెలల క్రితం ఓ మగ శిశువుకు జన్మనించింది. పుట్టిన తర్వాత శిశువు సరిగా పాలు తాగకపోవడంతో పాటు ఆయాసం, గుక్కపట్టి ఏడవటం వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లి నోరా సిటుంబెకో చికిత్స కోసం స్థానికంగా ఉన్న పలువురు వైద్యులను ఆశ్రయించింది. పరీక్షించిన వైద్యులు శిశువు క్లిష్టమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జింబాబ్వేలో నిపుణులు లేకపోవడంతో వారు హైదరాబాద్‌లోని కిమ్స్‌కి సిఫార్సు చేశారు. దీంతో తల్లి నోరా తన బిడ్డతో గత నెలలో నగరం చేరుకుంది. యూనిఫోకలైజేషన్ పద్ధతిలో చికిత్స ఆస్పత్రికి చెందిన చిన్నపిల్లల గుండె చికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్ అనిల్‌కుమార్ శిశువును పరీక్షించారు. 2డిఎకో, ఈసీజీ, ఆ్రల్టాసౌండ్ సహా పలు వైద్య పరీక్షలు చేశారు. గుండె కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళం లేకపోవడంతో పాటు ఎడమ ఊపిరితిత్తులకు రావాల్సిన రక్తనాళాల శాఖలు కూడా చిన్నగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తులకు మాప్కాస్ అనే నాళా ల నుంచి రక్తం సరఫరా అవుతుండటమే శిశువు హృద్రోగ సమస్యకు కారణంగా గుర్తించారు. వైద్య పరిభాషలో ‘పల్మనరీ ఆట్రిíÙయా’గా పిలుస్తారు. రక్త ప్రసరణను సాధారణ స్థితికి తెచి్చ, శిశువు ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్లిష్టమైన యూనిఫోకలైజేషన్ అనే ప్రక్రియను వైద్యులు ఎంచుకున్నారు. గుండె వెనుక నుంచి వచ్చే అయోటా నుంచి మాప్కాస్‌లను తప్పించి, గుండె నుంచి నేరుగా ఊపిరితిత్తులకు ప్రత్యామ్నాయంగా రక్తనాళాలు ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు. చికిత్సకు 20 గంట ల సమయం పట్టినట్లు అనిల్ తెలిపారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తన కొడుకుని బతికించిన వైద్యులకు రుణపడి ఉంటానని తల్లి నోరా తెలిపారు. -
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లి కోడుకు మృతి
-
అత్తమ్మ
ప్రమీల ఇంటికొచ్చింది ఆమె తల్లి పార్వతమ్మ. తల్లిని చూసి ఎంతో సంబరపడింది ప్రమీల.తల్లికి ఇష్టమైనవి వండి పెడుతూ, తను కొనుక్కున్న నగలు, చీరలను చూపెడుతూ, ఊళ్ళో ఉన్న తన అత్తగారు, ఆడబిడ్డలని ఆడిపోసుకోవడంతోనే నాలుగు రోజులు గడిచిపోయాయి.అలా అని కూతురు చెప్పిందానికల్లా తల ఊపేసి భుజంతట్టే రకం కాదు పార్వతమ్మ.తన కూతురైనా సరే అకారణంగా ఇతరులను ద్వేషించడం ఆమెకు నచ్చేది కాదు.‘‘అలా తిట్టొద్దు తల్లీ’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసినా వినేది కాదు ప్రమీల.పైగా...‘‘అమ్మా, వాళ్ల గురించి నీకు తెలియదు’’ అని దబాయించేది.కూతురి మొండి వైఖరి తెలిసిన పార్వతమ్మ దీనికి బుద్ధెప్పుడు వస్తుందో అని అనుకునేది. ప్రమీల భర్త ప్రసాదరావు చాలా మంచివాడు. భార్య తన తల్లికి, చెల్లెళ్ళకు మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళు రావటం ఆమెకు ఇష్టం లేకపోయినా, వాళ్ళు వచ్చినప్పుడు ఆమె పెద్దగా నోరు పారేసుకున్నా సహించి ఊరుకొనేవాడు తప్పితే తిరిగి ఆమెను ఏమనేవాడు కాదు.భార్య నోటికి జడిసి సంపాదించే యంత్రంలా మారి ఆమెను సుఖపెడుతున్నాడే గానీ ఊళ్ళో ఒంటరిగా ఉన్న తన తల్లిని తన దగ్గరికి తెచ్చిపెట్టుకోవటానికి ఏ మాత్రం సాహసించలేదు. ఎప్పుడైనా తల్లి కొడుకు ఇంటికి నాల్గురోజులుండి పోదామని వస్తే రెండో రోజే వెళ్ళిపోయేదావిడ ప్రమీల ఈసడింపు మాటలను భరించలేక.అందుకని ఊళ్ళోనే ఉంటూ అప్పుడప్పుడు కొడుకునే వచ్చి చూసిపోమనేది. ఇంటి చుట్టు పక్కల దగ్గర బంధువులుండటం వలన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనసులోనే బాధ పడేవాడు ప్రసాదరావు.పొద్దున పదిగంటలకు ఆఫీసుకెళ్ళబోతున్న అల్లుడితో...‘‘అల్లుడు గారు, నేనొచ్చి అప్పుడే వారం రోజులైంది. ఈ రోజు సాయంత్రం అమ్మాయి బసెక్కిస్తుంది నన్ను’’ అని చెప్పింది పార్వతమ్మ. ‘‘ఇంకో నాల్రోజులుండి వెళ్ళొచ్చుగా అత్తయగారూ...’’ అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా. అతనికి పెద్దలంటే గౌరవం. తన తల్లిని భార్య నిర్లక్ష్యం చేసినా తను మాత్రం ఆమె తల్లిని గౌరవిస్తూ ఏలోటూ రానీయకుండా చూసేవాడు. తన తల్లి వస్తే ప్రమీల చాలా సంతోషంగా ఉంటుంది..మరి తనతల్లి వస్తే ఎందుకు మొహం చిట్లించుకుంటుందో అని అతని బాధ.‘‘లేదయ్యా...ప్రమీల నాన్నగారు రమ్మనమని ఫోన్ చేశారు...అందుకే ..’’ అన్నది పార్వతమ్మ.‘‘సరే మీ ఇష్టం.. జాగ్రత్తండీ’’ అని ఆఫీసుకెళ్ళి పోయాడు ప్రసాదరావు.పన్నెండున్నరకి చెమటలు కక్కుతూ ఆదరాబాదరాగా ఇంటికొచ్చిన ప్రసాదరావుని చూసి ఆశ్చర్యపోయారు తల్లీ కూతుళ్ళిద్దరూ. కాసిని మంచినీళ్ళు తాగి ‘‘నేను అర్జెంటుగా ఊరెళుతున్నాను. అమ్మకి సుస్తీగా ఉంది. రెండు రోజుల్లో వస్తాను. నే వచ్చేవరకు మీరు ప్రమీలకి తోడుగా ఉండండి’’ అని చెప్పి మరోమాట లేకుండా వెళ్ళిపోయాడు.రెండు రోజుల తరువాత నీరసంగా ఉన్న తల్లిని నడిపించుకుంటూ తీసుకొస్తున్న భర్తని చూడగానే మొహం మాడ్చుకుంది ప్రమీల. కనీసం పలకరించలేదు. ఆమెను చూడగానే గబగబా ఎదురెళ్ళి ‘‘ఆరోగ్యం ఎలా ఉంది?’’ అని అడిగి తాను చెయ్యి పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది పార్వతమ్మ.వేడి వేడి కాఫీ కలిపి అల్లుడికిచ్చి ఆమె చేత మెల్లగా తాగించింది. కొంచెం స్థిమిత పడ్డాక ఏమైందని అల్లుడిని అడిగింది.‘‘అమ్మకు గత కొంత కాలంగా గుండెల్లో నొప్పి వస్తోంది. మొన్న ఊళ్ళో హాస్పిటల్లో చూపెడితేసిటీకి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని చెప్పారు. బంధువులు నాకు ఫోను చేసి చెబితే అమ్మను తీసుకొచ్చాను..’’ చెప్పాడు ప్రసాదరావు.విసుక్కుంటూనే అందరికి వంట చేయడం మొదలుపెట్టింది ప్రమీల. ఆమర్నాడు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించాడు ప్రసాదరావు. ‘‘వీలైనంత తొందర్లో బైపాస్ సర్జెరీ చేస్తే మంచిది’’ అని డాక్టర్ చెప్పాడు. ‘‘ఎన్ని రోజుల్లో చేయించాలి?’’ అడిగాడు ప్రసాదరావు.‘‘నాలుగైదు రోజుల్లో చేయిస్తే మంచిది. కొన్ని మెడిసిన్స్ ఇస్తాం...ఏం ఫరవాలేదు ఈ లోపల మీరు డబ్బు రెడీ చేసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్.ఇంటికొచ్చిన ప్రసాదరావు తనకు కావలసిన డబ్బు డ్రా చేసుకొచ్చాడు.‘‘నేను ఆఫీసుకు సెలవు పెట్టాను. రేపో, ఎల్లుండో అమ్మకు ఆపరేషన్ జరగొచ్చు’’ అని భార్యకు అత్తగారికి చెప్పాడు.తలనొప్పిగా ఉండటంతో ప్రమీలని కాస్త కాఫీ చేసిమ్మన్నాడు..కళ్ళు మూసుకోని సోఫాలో కూర్చున్నాడు.ఇంతలో కెవ్వున కేక వినబడింది. అటు వంటింట్లోంచి ప్రమీల, ఇటు ప్రసాదరావు గాబరాగా పరుగెత్తుకెళ్ళారు.మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన పార్వతమ్మ బట్టలు తీసుకుని వస్తూ పై మెట్టు నుండీ జారి దొర్లుకుంటూ కింద పడి ఉంది. తలకు దెబ్బతగిలిందేమో విపరీతమైన రక్తస్రావం. నుదుటి మీదకి కారుతోంది. తల్లిని అలాంటి స్థితిలో చూసిన ప్రమీల భోరున ఏడ్చేస్తోంది. ప్రసాదరావు ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని హాల్లోకి తెచ్చి అంబులెన్స్‌కు ఫోన్ చేసి కారిన రక్తాన్ని తుడిచి తలకు కట్టుకట్టాడు. పార్వతమ్మ అపస్మారక స్థితిలోనే ఉంది. అంబులెన్స్ రాగానే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.డాక్టర్లు ఆమెను చూసి వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు. కాసేపటికి డాక్టర్ వచ్చి–‘‘తలకు బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాటయ్యింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఛాన్సెస్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అని చెప్పాడు. ప్రమీల బావురుమంది. అన్నయకు ఫోను చేయమంది. ప్రసాదరావు ఏ మాత్రం ఆలోచించకుండా ‘‘ఓకే డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి. ఎంత డబ్బైనా పరవాలేదు..’’ అన్నాడు.ప్రసాదరావు డబ్బులు కట్టడంతో వెంటనే ఆపరేషన్ చేసి ‘‘నో ప్రాబ్లమ్. షి విల్ బి ఆల్ రైట్’’ అని చెప్పాడు డాక్టర్.తల్లికి గండం తప్పినందుకు సంతోషించిన ప్రమీలకి జ్ఞానోదయమైంది. తన తల్లి ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే మానవత్వంతో డబ్బులన్నీ ఖర్చుచేసి ఆమె ప్రాణం నిలవాలని తపించాడు తన భర్త. తన తల్లికి ఆపరేషన్ కోసం పెట్టుకున్న డబ్బుని ఏ మాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా తన తల్లి ఆపరేషన్ కి ఇచ్చేశాడు.‘ ‘నా భర్త దేవుడు. నేను మాత్రం అతని తల్లిని ఈసడించుకుంచు, ఆడిపోసుకుంటూ ఎంతో బాధ పెట్టాను. నా ప్రవర్తనతో ఆయన మనసెంత క్షోభించిందో’’ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ప్రమీల.కన్నీళ్ళతో తన పాదాలను పట్టుకుని క్షమించమని అడుగుతున్న ప్రమీలని రెండుచేతులతో లేవనెత్తి కళ్ళు తుడిచాడు ప్రసాదరావు. అత్తగారి ఆపరేషన్‌కై తన నగలమ్మి డబ్బు తెమ్మన్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. తన తల్లితో పాటు అత్తగారిని కూడా కంటి రెప్పలా చూసుకుంటూ సేవలు చేసింది ప్రమీల. ‘‘మీ మనసు నొప్పించినందుకు క్షమించండి’’ అని అత్తగారి దగ్గర భోరుమని విలపించింది. ఇక అత్తగారు ఉళ్ళో ఉండవలసిన అవసరం లేదని తమ దగ్గరే ఉండమని వేడుకుంది. అత్తను కూడా అమ్మలా ప్రేమగా చూసుకుంటున్న ప్రమీలను చూసి మనసారా ఆనందించాడు ప్రసాదరావు. -
స్కూల్ బెల్ట్‌తో మిస్టరీ వీడింది
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ బెల్ట్ సాయంతో తల్లికొడుకుల హత్య కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తన గురించి చిన్న ఆనవాలు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడిని.. అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ మాల్దాకు చెందిన బబ్లూ కుమార్ మోందాల్(29) ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సావిత్రి ఘోష్ అనే వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారిని మాత్రం తానే ఆమె భర్తనని బబ్లూ నమ్మించసాగాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం బబ్లూకు యాక్సిడెంట్ అయి కాలికి గాయమైంది. అయితే అప్పటి నుంచి సావిత్రి తనను నిర్లక్ష్యం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. గత నెల 25న ఆమెకు మద్యం తాగించి గొంతుకోసి చంపాడు. ఆపై 8 ఏళ్ల ఆమె కొడుకును కూడా అదే రీతిలో చంపి పరారయ్యాడు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బబ్లూకు సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు మిస్టరీ ఛాలెంజింగ్‌గా మారింది. బెల్ట్ ఆధారంగా... సావిత్రి భర్తగా చెప్పుకున్న బబ్లూపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. కానీ, అతనికి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. చివరకు అతని పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా ఎవరికి తెలీకపోవటంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఇంతలో బాలుడి స్కూల్బెల్ట్ పై స్కూల్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వివరాల్లో పిల్లాడి దరఖాస్తు ఫామ్‌లో ఉన్న ఫోటో(తండ్రి స్థానంలో బబ్లూ ఫోటో ఉంది) ఆధారంగా ఆచూకీ కోసం యత్నించారు. చివరకు అతను మాల్దాకు చెందిన వ్యక్తి అన్న సమాచారం దొరకటంతో సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ‘నిందితుడు కనీసం ఫోన్ కూడా వినియోగించేవాడు కాదు. దారినపోయే వారి ఫోన్ అడిగి తన బంధువులకు కాల్స్ చేసేవాడు. దీంతో అసలు అతను ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కోవటం కష్టతరంగా మారింది. అయితే ఆ బంధువుల సాయంతోనే చివరకు అతన్ని పట్టుకున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం జార్ఖండ్‌లోని షహిబ్‌గంజ్ ప్రాంతంలో చివరకు బబ్లూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వరకట్నం కేసులో తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అదనపు కట్నం తేవాలని వేధిం పులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిన తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు బుధవారం ఉద యం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా ఒదికాడు గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కుప్పుస్వామి(30). ఇతను రేల్వే పనులు నిర్వహించే కాంట్రాక్టర్ వద్ద తాత్కాలిక ఉద్యోగిగా పనులుచేస్తున్నాడు. ఇతను రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించి తిరువ ళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చిన్నకనంబేడు గ్రామానికి చెందిన రైతు రామలింగం కుమార్తె కోటీశ్వరిని అక్టోబర్ 2008లో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో రామలింగం కట్నంగా రూ.5 లక్షల నగదు, 40 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వివాహం జరిగిన కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మరికొంత నగదును కట్నంగా ఇప్పించాలని కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మ తరచూ కోటేశ్వరిని వేధించేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కట్నం తేవడానికి నిరాకరించిన కోటీశ్వరీ 2009లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పెనాలూరు పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి కావడంతో తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మురుగన్ బుధవారం ఉదయం తీర్పును వెలువరించారు. కోటీశ్వరీని కట్నం కోసం తరచూ వేధించిన భర్త కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మకు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆయన ఆదేశించారు. వారిని పుళల్ జైలుకు తరలించారు.