
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం.
వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..
Comments
Please login to add a commentAdd a comment