mother died
-
9 రోజులు తల్లి మృతదేహంతోనే ఇద్దరు కూతుళ్లు
బౌద్ధనగర్: బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు... అప్పటి నుంచి తల్లి వారికి అన్ని విధాలా అండగా ఉంటూ ఆదరించింది. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి (45) కన్నుమూయడంతో ఇద్దరు కూతుళ్లు తామూ చనిపోవాలని భావించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకుని తొమ్మిది రోజులపాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు.సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, వారాసీగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగం చేసే రాజు, లలిత దంపతులు. వీరికి రవళిక (25), అశ్విత (22) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రాజు 2020 లోనే భార్య, పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండు నెలలుగా లలిత ఇద్దరు కూతుళ్లతో కలిసి బౌద్ధనగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని 4వ ఫ్లోర్లో ఉంటోంది. రవళిక ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా.. అశి్వత ఈవెంట్స్ నిర్వాహకుల వద్ద చేస్తోంది.కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లలిత ఈ నెల 23న ఇంట్లోనే కన్నుమూసింది. తల్లి కన్నుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏంచేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మళ్లీ ధైర్యం రాక, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోయారు. శుక్రవారానికి కొద్దిగా తేరుకున్న వాళ్లు తల్లి చనిపోయిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు వారి బంధువుల గురించి ఆరాతీసి వారికి సమాచారం అందించారు. చనిపోయి 9 రోజులు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొంది. విషయం తెలిసి ఈ భవనంలో ఉండే వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల నివసించే వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పిల్లలను తోసి కాలువలోకి దూకిన తల్లి
పటమట(విజయవాడతూర్పు): ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి నెట్టి, తానూ దూకి ఆత్మహత్యకు యత్నంచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతదేహం లభించగా.. తల్లి, మరో కుమార్తె ఆచూకీ లభించలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్క్రూబ్రిడ్జి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దీనికి కారణమని తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు శారద కాలనీకి చెందిన తిరుపతిరావు రోజువారీ పనులకు వెళ్తుంటాడు. అతనికి సుధారాణి(25)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి జాస్వీ (16 నెలలు), బ్లెస్సీ(4 నెలలు) సంతానం.శనివారం గుంటూరులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని కళానగర్‌లో నివసించే తిరుపతిరావు బావ కోటేశ్వరరావు ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఫోను వచి్చందని తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి స్క్రూబ్రిడ్జికి చేరుకుని ఇద్దరు పిల్లలను బందరు కాలువలో పడేసి ఆమె కూడా దూకింది.స్థానికులు దీనిని గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా బ్లెస్సీ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న పటమట సీఐ పవన్‌కిషోర్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జాస్వీ, సుధారాణిల ఆచూకీ లభించలేదు. పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దయనీయ స్థితిలో ముగ్గురు అమ్మాయిల కథ
అమ్మ దూరమైంది.. నాన్న జైలు పాలయ్యాడు.. అలాన లేదు.. పాలనలేదు.. ఆకలికి అన్నం లేదు.. పస్తులు ఉంటున్నారు.. కాలే కడుపుతో తల్లడిల్లుతున్నారు.. ఆకలి తీర్చుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. నాన్న చేసిన తప్పుకు పిల్లలేందుకు శిక్ష అనుభవిస్తున్నారు.. అకలితో అలమటిస్తున్నా ముగ్గురు పిల్లలపై స్పెషల్ రిపోర్టు.. సాక్షి, ఆదిలాబాద్: కన్నకూతుళ్లను అమ్మిన కేసులో ఆదిలాబాద్ జిల్లా బంగారి గూడలో నివసించే గంగాధర్ అరెస్టై జైలుపాలయ్యారు.. గంగాధర్, ఆయన భార్య రాధ బంగారి గూడలో కూలీ పనులు చేసుకోని జీవనం సాగించేవారు. వీరికి ఆడపిల్లలు ఉన్నారు. మగబాబు కావాలని భావించారు. ఈ క్రమంలో గతేడాది రాధ మరోసారి గర్భం దాల్చింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది. అయితే అప్పటికే గంగాధర్ ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఇద్దరు కవలలు జన్మించడంతో అయిదుగురి పిల్లల పెంపకం భారమైంది. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక భార్య చనిపోయిన తర్వాత ఎనిమిది నెలల క్రితం ఇద్దరు ఆడ పిల్లలను అమ్మేశాడు తండ్రి గంగాధర్. కర్ణాటకకు చెందివారికి మూడు లక్షలకు కూతుర్లను అప్పగించాడు. అయితే అమ్మకం దందా బయట పడటంతో పోలీసులు గంగాధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గంగాధర్ జైలు పాలుకావడంతో ముగ్గురు అడ పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు. ఇంటి వద్ద అమ్మ లేదు. నాన్న లేడు. తల్లిని కోల్పోయిన పిల్లలను గంగాధర్ ఇన్ని రోజులు కూలీ పనులు చేసి పోషించేవాడు. కానీ ఇప్పుడు అతడు కూడా జైలుగోడల మధ్య మగ్గుతున్నాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కనీసం తినడానికి తిండలేక. ఇబ్బందులు పడుతున్నారు. ఆకలికి అన్నం దొరక్క పస్తులు ఉంటున్నారు. కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ఆకలికి తీర్చుకోవడానికి వాళ్ల తాతతో కలిసి బిక్షాటన చేస్తున్నారు. బిక్షాటనలో అన్నం దొరికితే తింటున్నారు. లేదంటే పస్తులు ఉంటున్నారని పిల్లల తాత అవేదన వ్యక్తం చేశారు. పిల్లలను, తమను చూసే వాళ్లు ఎవరు లేరని వాపోయారు. కనీసం పిల్లల ఆకలిని తీర్చడానికి దాతలు, ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
పరీక్ష బాగా రాశాననే ఆనందం అవిరైంది.. తల్లి లేదని తెలిసి ఖిన్నుడయ్యాడు.
ఖమ్మం: ఖమ్మంలో ఉంటూ కండక్టర్‌గా పనిచేసే ఎక్కిరాల దేవమణిని ఆమె భర్త రాంబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి రోకలిబండతో మోది చంపేశాడు. ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వీరి కుమారుడు ప్రణవ్‌తేజ్‌కు ఇది తెలిస్తే టెన్త్ తొలిరోజు పరీక్షకు హాజరు కాలేడని భావించిన బంధువులు.. విషయం చెప్పలేదు. పరీక్ష పూర్తయ్యాక నేరుగా మార్చురీ వద్దకు తీసుకెళ్లి తల్లి మృతదేహాన్ని చూపించడంతో ఒక్కసారిగా ఖిన్నుడయ్యాడు. అంతకు కొద్దిక్షణాల ముందే పరీక్ష బాగా రాశానని తనకెదురైన తన తల్లి స్నేహితురాలికి నవ్వుతూ ప్రణవ్ బదులివ్వడాన్ని చూసి బంధువులు కంటతడి పెట్టారు. -
NRI News: తల్లిని చిదిమేసిన విమానం.. కూతురి పరిస్థితి విషమం
న్యూజెర్సీ: న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఆమె కూతురు, పైలట్ గాయాలతో బయటపడినప్పటికీ.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోమా గుప్తా(63), ఆమె తనయ రీవా గుప్తా(33)లు ఆదివారం ఓ తేలికపాటి ప్రదర్శన విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో కాక్‌పిట్ నుంచి పొగ రావడంతో పైలెట్ దానిని లాంగ్ ఐల్యాండ్ వద్ద క్రాష్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానంలో మంటలు చెలరేగి రోమా అక్కడిక్కడే మృతి చెందగా.. కాలిన గాయాలతో రీవా, పైలెట్(23)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు ఫార్మింగ్డేల్ రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ముగ్గురితో టేకాఫ్ అయ్యింది. ప్రమాదానికి గురైన ఫోర్ సీటర్ విమానం టూరిస్ట్ ఫ్లైట్ అని, కేవలం ప్రదర్శన(డెమో) కోసమే ఉంచారని అధికారులు చెబుతున్నారు . అయితే న్యూజెర్సీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు ఆ తేలికపాటి విమానాన్ని కొనుగోలు చేసినట్లు విమాన కంపెనీ తరపు న్యాయప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు ఒకవైపు ఎన్టీఎస్బీ(National Transportation Safety Board), మరోవైపు ఎఫ్ఏఏ(Federal Aviation Administration) దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటికే మూడుసార్లు ప్రమాద స్థలానికి వెళ్లి.. శకలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే.. గుప్తా కుటుంబం కోసం GoFundMe ద్వారా ఇప్పటికే 60వేలకు పైగా డాలర్లను సేకరించారు. -
నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆమె శనివారం(జూలై 23న) బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేశారు. చదవండి: నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్ సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట -
యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం
‘దియా’ ఫేం, కన్నడ యంగ్ హీరో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో పృథ్వీ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆమె మృతిపట్ల కన్నడ టీవీ, సినీ నటీనటులు సంతాపం తెలుపుతు పృథ్వీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చదవండి: పూరీ దంపతుల విడాకులపై అంబర్ పేట్ శంకరన్న క్లారిటీ! కాగా పృథ్వీ పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందాడు. 2008 ‘రాథా కల్యాణ’ సీరియల్‌తో నటుడిగా పరిచమైన పృథ్వీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో అయ్యాడు. 2014లో వచ్చిన ‘బరికే’ అనే తుళు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ 2020లో వచ్చిన ‘దియా’ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా తెలుగులోనూ ‘దియా’ పేరుతో రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా పృధ్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! -
అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..
సాక్షి, సిరిసిల్ల: అనారోగ్యం ఆ కుటుంబాన్ని వెంటాడింది.. విధి వెక్కిరించడంతో తల్లీకుమారుడు రెండు నెల వ్యవధిలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన అల్లే పద్మ–బాలయ్య దంపతుల మూడో కూతురు ప్రీతికి 13 నెలల కిందట ముంబాయికి చెందిన అవినాష్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు బాబు జన్మించగా అవిష్ అని పేరు పెట్టారు. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారి రెండు నెలల క్రితం చనిపోయా డు. అప్పటినుంచి తీవ్ర ఆవేదనకు గురవుతున్న ప్రీతి అనారోగ్యం పాలైంది. ముంబాయిలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కూతురు, మనవడి మృతితో వృద్ధులైన ప్రీతి తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని -
తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు
తిరుపతి(చిత్తూరు): తల్లి మరణించిందన్న సంగతి తెలియని కుమారుడు 4 రోజుల పాటు ఆమె మృతదేహం పక్కనే నిద్రించాడు. తల్లి నిద్రపోతోందని భావించి.. రోజూ స్కూల్‌కు కూడా వెళ్లొచ్చేవాడు. ఇంట్లో మిగిలి ఉన్న ఆహారాన్ని, చిరు తిండ్లను భుజిస్తూ గడిపేశాడు. చివరకు మృతదేహం నుంచి దుర్వా సన రావడంతో మేనమామకు ఫోన్ చేసి ‘అమ్మ నిద్రపోతోంది. ఇల్లంతా వాసన వస్తోంది. ఆపరేషన్ చేయిద్దాం రండి’ అని చెప్పడంతో బిత్తరపోయిన ఆయన హుటాహుటిన వెళ్లగా.. అసలు విషయం వెలుగు చూసింది. తిరుపతి విద్యానగర్ కాలనీలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజ్యలక్ష్మి (41) ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయి మానసిక ఎదుగుదల లేని కుమారుడు శ్యామ్‌కిశోర్ (10)తో వేరుగా ఉంటోంది. ఈ నెల 8న రాజ్యలక్ష్మికి వాంతులయ్యాయి. దీంతో తీవ్రంగా నీరసపడిన ఆమె నేలపై పడుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు శ్యామ్‌కిశోర్ గమనించినా.. తల్లి నిద్ర పోతోందనుకున్నాడు. లేపితే కోప్పడుతుందేమోననుకుని అలాగే ఉండిపోయాడు. రోజూ రాత్రివేళ తల్లి మృతదేహం పక్కనే పడుకునేవాడు. 4 రోజులు తర్వాత శవం నుంచి దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం రాత్రి మేనమామ దుర్గాప్రసాద్‌కు ఫోన్‌చేశాడు. అమ్మ 3 రోజులుగా నిద్రపోతోందని, ఇల్లంతా వాసన వస్తోందని, అందువల్ల అమ్మకు ఆపరేషన్ చేయిద్దాం రండి అన్నాడు. మేనమామ దుర్గాప్రసాద్ వెంటనే ఘటనా స్థలికి వెళ్లి చూశాడు. నేలపై కుళ్లిన చెల్లెలి మృతదేహాన్ని చూసి విలపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మానసిక ఎదుగుదల లేని కారణంగానే శ్యామ్‌కిషోర్ ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు. -
కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి
సాక్షి, కామారెడ్డి: కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హరిజనవాడ కాలనీకి చెంది బుంది గంగయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి భార్య గంగవ్వ (42) కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తరుణ్ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గంగవ్వ మానసికంగా కుంగిపోతోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసుదన్‌గౌడ్ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. -
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద.. తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా అందం, అభినయంతో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన జయప్రద ‘భూమికోసం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిశారు. తన సినీ కెరీర్లో జయప్రద మొత్తం(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి) 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. -
తల్లిని కాపాడేందుకు చెరువులో ఐదేళ్ల చిన్నారి సాహసం
పలమనేరు: బట్టలు ఉతుకుతూ కాలుజారి చెరువులో పడి తల్లి మునకలేసింది. తల్లిని చూసి కాపాడేందుకు ధైర్యం చేసి చెరువులోకి దిగిన చిన్నారి తానూ మునిగిపోతూ కేకలేసింది. ఇది విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు. తల్లి మాత్రం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. శుక్రవారం ఈ సంఘటన మండలంలో పకీరుపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలప్ప కుమార్తె సుజాత (40) తన తండ్రి వద్దే ఉంటోంది. ఆమె తన కుమార్తె లక్ష్మి (5)తో కలసి గ్రామ సమీపంలోని కూర్మాయిచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగా కాలుజారి చెరువులో పడి మునిగిపోయింది. ఇది చూసి లక్ష్మి గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాకపోయేసరికి తల్లిని కాపాడేందుకు తానే చెరువులోకి దిగడంతో బాలిక సైతం మునిగింది. ఆ బాలిక కేకలు విన్న సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని కాపాడారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోసం గాలించినా ఫలితం లభించలేదు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గంటపాటు గాలించి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో విషాదం
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి) : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తల్లి, స్వర్గీయ జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి (91) శనివారం ఉదయం కన్నుమూశారు. విశ్వేశ్వర్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళవారం. మాధవరెడ్డి దంపతులకు కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాతృమూర్తి మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించి సంతాపం తెలిపారు. సినీ హీరో చిరంజీవి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. కొండా నివాసానికి చేరుకుని జయలతాదేవి పార్థీవదేహానికి నివాళర్పించారు. రేపు(సోమవారం) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
అమ్మను చంపేశారు.. అందుకే చనిపోతున్నా...
రాజేంద్రనగర్/పహాడీషరీఫ్: ‘అమ్మ చావుకు ఆస్పత్రి వైద్యులే కారణం, వారి నిర్లక్ష్యం కారణంగానే అమ్మ చనిపోయింది’అని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ తల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వైద్య ఖర్చులకోసం శ్రీహరి తన స్నేహితుల వద్ద రూ.10 లక్షలు అప్పు చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించాడని, మరో రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పడంతో అటు తల్లిని కోల్పోయి.. ఇటు మిగిలిన బిల్లు ఎలా కట్టాలో తెలియక శ్రీహరి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. డిగ్రీ చదువుతున్న శ్రీహరి (25) తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య, తల్లి రుక్మిణి (60)తో కలసి రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ కాలనీలో నివసిస్తున్నాడు. వారం కిందట తల్లి రుక్మిణికి కరోనా సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. కాగా, అంతకు కొద్ది సేపటి ముందు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పిన శ్రీహరి.. తన స్నేహితుడు సాయిని ఆస్పత్రి వద్ద ఉంచి వెళ్లాడు. అదే సమయంలో రుక్మిణి మరణవార్తను ఆస్పత్రి సిబ్బంది సాయికి చెప్పడంతో ఆ విషయాన్ని ఫోన్ చేసి శ్రీహరికి చెప్పాడు. అప్పటినుంచి శ్రీహరి ఆచూకీ లభ్యంకాలేదు. అయితే తన తల్లిని ఆస్పత్రి డాక్టర్లే చంపారని, వారి నిర్లక్ష్యమే తల్లిని బలితీసుకుందని ఆరోపిస్తూ అతను సెల్ఫీ వీడియో రికార్డు చేసి స్నేహితులకు పోస్ట్ చేశాడు. దీంతో వారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో వెతికినా శ్రీహరి జాడ లభించలేదు. చివరకు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో శనివారం మధ్యాహ్నం శ్రీహరి మృతదేహం లభించింది. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు భార్య, ఇటు కుమారుడు.. గంటల వ్యవధిలో భార్య, కుమారుడు మృతిచెందడంతో రామచంద్రయ్య కుప్పకూలాడు. కుమారుడు శ్రీహరి ఏమైపోయాడో తెలియని పరిస్థితుల్లో శనివారం మధ్యాహ్నం భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కుమారుడు కూడా మృతిచెందాడన్న వార్త విని రామచంద్రయ్య తట్టుకోలేకపోయాడు. బంధువులు అతడికి సపర్యలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని అప్పగించడంతో రాత్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తు లక్ష్మి (88) మంగళవారం సాయంత్రం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మే 18న తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. శంకర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లి ముత్తు లక్ష్మి అని పలు ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పేవారు. తన చిన్న వయసులో ఎన్నో కష్టాలుపడి పెంచి తనను ఈ స్థాయి తీసుకొచ్చారంటూ ఆయన తరచూ తల్లిని గుర్తు చేసుకునేవారు. కాగా ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ నటీనటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది. ఈ తరుణంలో తాజాగా శంకర్ తల్లి మృతి వార్త మరింత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే పనిలో పడ్డారు. Director #Shankar's mother S Muthulakshmi age 88 passed away today pic.twitter.com/8lTNJfSLIk — Priya - PRO (@PRO_Priya) May 18, 2021 -
కరోనాతో వేద కృష్ణమూర్తి తల్లి మృతి
సాక్షి, బెంగళూరు: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబ్డా దేవి శనివారం తుదిశ్వాస విడిచారు. వేద సోదరి కూడా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ‘అమ్మ మరణంతో మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఇప్పుడు మా సోదరి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’ అని వేద వ్యాఖ్యానించింది. 28 ఏళ్ల వేద భారత మహిళల జట్టు తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది. -
దయనీయం: తల్లి మృతి, టెంట్ కిందే వారం రోజులుగా..
సాక్షి, కోరుట్ల: ఎంత మంది వెన్నంటి ఉన్నా.. అమ్మకు సాటి రారు. అమ్మలేని లోటు తీర్చలేనిది. పదేళ్లు దాటని నలుగురు ఆడపిల్లలు అమ్మను కోల్పోతే ఆ పరిస్థితి మరింత దయనీయం. నాన్న ఉన్నా..అమ్మ లేని లోటు పూడ్చలేని దుస్థితి. అద్దె ఇంట్లో కర్మలు చేయడానికి ఒప్పుకోని పరిస్థితిలో విధి లేక నాన్న, నలుగురు చిన్నారులు మండు టెండలో టెంట్ నీడలో వారం రోజులుగా కాలం గడుపుతున్నారు. అమ్మ కోసం ఏడుస్తూ విలవిల్లాడుతున్న నలుగురు ఆడపిల్లలకు సర్దిచెప్పలేక ఆ తండ్రి పడుతున్న వేదన పలువురిని కలిచివేస్తోంది. పేద కుటుంబం.. కోరుట్ల పట్టణంలోని పటేల్‌రోడ్డుకు చెందిన గొల్లపల్లి గంగారాం(48)–మమత(45) దంపతులు రజక వృత్తి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వైష్ణవి(10), అనిత(7), అమూల్య(5), దుర్గ(3) సంతానం. నలుగురు ఆడపిల్లలతో మమత కులవృత్తి చేస్తూ, గంగారాం ఓషాపులో ఇస్త్రీ పనికి వెళుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వైష్ణవి,అనితలు 5, 3వ తరగతులు చదువుతుండగా మిగతా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మార్చి 1వ తేదీన మమత తీవ్ర అనారోగ్యం పాలు కాగా..ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ తరువాత మార్చి 7వ తేదీన మమత మృతిచెందింది. దీంతో పదేళ్లలోపు నలుగురు ఆడపిల్లలు అమ్మ లేక విలవిల్లాడుతూ, నాన్న ఓదార్పుతో సేదదీరడం లేదు. టెంట్ నీడలో.. మమత మృతిచెందడంతో అంత్యక్రియల అనంతరం కార్యక్రమాల నిర్వహణకు ఇంటిని అద్దెకు ఇచ్చిన వారు ఒప్పుకోకపోవడంతో గంగారాం తన పిల్లలతోపాటు దగ్గరలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో స్థానికులు ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో టెంట్ వేసుకుని ఉంటున్నారు. వారం రోజులుగా అదేటెంట్‌లో ఎండకు, చలికి ఇబ్బందులు పడుతూ నలుగురు పిల్లలతో కాలం వెల్లదీస్తున్నాడు. పనికోసం గంగారాం బయటకు వెళ్లాల్సి రావడంతో నలుగురు చిన్నారులను పట్టించుకునే వారు కరువయ్యారు. చిన్నారులు అమ్మ ఏదని అడిగితే..ఏమి చెప్పలేక కలత చెందుతున్నాడు. ప్రభుత్వపరంగా ఆడపిల్లలను ఆదుకోవాలని దాతలు తమకు వీలైనంత సాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. -
కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం
సాక్షి, న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారవాహికలో సీతగా నటించిన నటీ దీపికా చిఖాలియా కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శనివారం ఆమె తల్లి మృతి చెందారు. దీపకా తన తల్లి మరణించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన తల్లిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం. ఆ దుఖం నుంచి బయటకు రావటం అంత సులభం కాదు. అమ్మా మీ అత్మకు శాంతి కలగాలి’ అని కామెంట్ చేశారు. సోషల్ మీడియోలో చాలా యాక్టివ్‌గా ఉండే దీపికా చిఖాలియా.. కొన్ని నెలల క్రింతం తన తల్లిదండ్రులతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘అమ్మా, నాన్న, నేను.. మా కుటుంబానికి సంబంధించిన ఫొటో ఆల్బమ్‌లో నేను ఎంతో ఇష్టంగా పంచుకోవాలనుకునే ఫొటో ఇది. మా అమ్మకి చీరలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఆమె తరచు చీరలు ధరించడానికే ఆసక్తి చూపేవారు. అదే విధంగా ఆమె వివిధ రకాల ఫర్స్‌లను కూడా ఇష్టపడేవారు. అందుకే నేను చాలా ఇష్టంగా పలు రకాల పర్స్‌లను సేకరించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫొటో నా సోదరి పుట్టక ముందు బరోడా(వడోదరా)లో దిగినది’ అని కాప్షన్ జత చేశారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యాన్ని దృశ్యంగా మలచిన ‘రామాయణ్’ ధారవాహిక ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram Mum 🙏 RIP A post shared by Dipika (@dipikachikhliatopiwala) on Sep 11, 2020 at 9:14pm PDT -
యూపీలో హృదయ విదారకర ఘటన
-
యూపీలో హృదయ విదారకర ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను తన కుమారుడు హార్డోయి జిల్లాలోని సవాయిజౌర్ కమ్మూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆస్పత్రి వెలుపల తన తల్లిని రక్షించాలని ఏడుస్తూ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రి వెలుపల నేల మీద స్పృహ లేకుండా ఉన్న ఆ మహిళను కాపాడాలంటూ ఆమె కుమారుడు ఎంత వేడుకున్నా ఎవరు పట్టించుకోలేదు. కదలలేని పరిస్థితిలో ఉన్న తన తల్లిపై ఆస్పత్రి వైద్యులు స్పందించకపోవటంతో అతను ఏడుస్తూ ఆస్పత్రి అద్దాలు పగలగొట్టిమరీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లే ప్రయాత్నం చేశాడు. అయినా ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ.. ఆ మహిళను ఆస్పత్రి ప్రధాన ద్వారం గుండా తీసుకురాలేదని తెలిపారు. అందువల్లనే ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదని, సాయం చేయలేకపోయారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన గేటు గుండా కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ మహిళను అంబులెన్స్‌లో జిల్లా అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
మద్యం మత్తు.. తల్లిని తుపాకీతో కాల్చి
న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ యువకుడు తల్లిని హతమార్చిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో సూరజ్ అనే 26 ఏళ్ల యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తూ తన తల్లితో(60) కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి తప్పతాగి ఇంటికి చేరుకున్న యువకుడు ఓ విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగాడు. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ.. తల్లిపై చేయి చేసుకున్నాడు. అనంతరం తాగిన మత్తులో తల్లిని పిస్తోల్‌తో నిర్ధాక్షిణ్యంగా కాల్చాడు. మహిళకు ఎడమ కంటికి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (మామ ఉద్యోగం కోసం బావమరిదిపై..) చదవండి: ఢిల్లీలో భూప్రకంపనలు -
మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
సాక్షి, వనపర్తి : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు వనపర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. కాగా, తారకమ్మ అంత్యక్రియలు నేడు సాయంత్రం స్వగ్రామంలో జరగనున్నట్టుగా సమాచారం. -
తల్లి అంత్యక్రియలకు కూతుళ్ల భిక్షాటన
సాక్షి, జగిత్యాల : తల్లి అంత్యక్రియలకు డబ్బు లేక కూతుళ్లు భిక్షాటన చేసిన దైన్య ఘటన శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కొడుకు సైతం భిక్షాటన చేయగా... స్పందించిన ముస్లిం నాయకులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కూతుళ్లు కన్నతల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయారు. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన మస్తాన్ తన భార్య ముంతాజ్, చిన్నాన్న పెద్ద మస్తాన్, ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాలకు నెల రోజుల క్రితం వచ్చారు. ఇక్కడే భిక్షాటన చేస్తూ జిల్లాకేంద్రంలోని టౌన్హాల్లో సేద తీరుతున్నారు. ఓ వైపు అర్ధాకలి, మరోవైపు అనారోగ్యంతో మస్తాన్ భార్య ముంతాజ్ శనివారం ప్రాణాలు విడిచింది. భార్య మృతితో మస్తాన్ నిశ్చేష్టుడయ్యాడు. మస్తాన్ కూతుళ్లు ముంతాజ్(10), మున్నీ(7) తాతతో కలిసి తల్లి అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కోసం భిక్షాటనకు వెళ్లారు. మస్తాన్ చిన్నకొడుకు అబ్దుల్లాతో కలిసి భార్య శవం వద్ద ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న మెకానిక్‌లు స్పందించి అంత్యక్రియల కోసం తలాకొంత డబ్బు జమచేశారు. భిక్షాటనకు వెళ్లిన వారు సాయంత్రమైనా తల్లి శవం వద్దకు చేరుకోలేదు. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. చీకటి పడుతుండటంతో కూతుళ్లు రాకుండానే ముంతాజ్ శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భిక్షాటనకు వెళ్లిన కూతుళ్లు తల్లి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. రాత్రయినా పిల్లలు తండ్రి వద్దకు చేరుకోలేదు. -
కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి మృతి
-
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం
సాక్షి,నెల్లూరు : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ(89) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం 7 గంటలకు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం లండన్‌లో వున్నారు. రేపు ఉదయం నెల్లూరులో అంత్యక్రియలు జరుగనున్నాయి. -
చేతబడి నెపంతో తల్లిని చంపిన తనయుడు..!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): నవమోసాలు మోసి కని పెంచిన తల్లిని తనయుడే హతమార్చిన సంఘటన బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన జంగపెల్లి చంద్రవ్వ(60) అనే మహిళను ఆమె కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్ ఆదివారం రాత్రి గొంతు నులిమి చంపిన ఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డితో పాటు గ్రామస్తుల కథనం ప్రకారం.. జంగపెల్లి చంద్రవ్వ–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వీరికి గతంలోనే వివాహాలు జరిగాయి. కుమారుడు శ్రీనివాస్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి నాలుగు నెలల క్రితం వచ్చాడు. ఇంట్లో ఉంటే ఆరోగ్యం బాగుండడం లేదని గంగాధరలో భార్య కుమారుడితో కలిసి కాపురం పెట్టాడు. తన తల్లి చంద్రవ్వ మంత్రాలు చేయడంతోనే తన ఆరోగ్యం బాగుండడం లేదని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో విరుగుడు పూజలు సైతం చేయించాడు. ఆదివారం విలాసాగర్‌లోని తమ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తండ్రి నర్సయ్య తన కూతురు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రాత్రి నిదురిస్తున్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బల్ల పై నుంచి కింద పడి మృతి చెందిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబసభ్యులు అనుమానంతో నిలదీయడంతో చివరకు తానే ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో తన భార్య చంద్రవ్వను కుమారుడు శ్రీనివాస్ గొంతునులిమి హత్య చేశాడని నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ డీ.రఘుచందర్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నాడు. నిందితుడి అరెస్ట్ విలాసాగర్ గ్రామంలో మంత్రాల నెపంతో తల్లి జంగపెల్లి చంద్రవ్వను గొంతు నులిమి చంపిన కేసులో కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు వేములవాడరూరల్ సీఐ రఘుచందర్ తెలిపారు. మంత్రాలు చేస్తుందనే దురాలోచనతో తల్లిని శ్రీనివాస్ టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళికి మాతృవియోగం
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ (78) గుండెపోటుతో మరణించారు. సూర్యాపేటలోని వారి నివాసంలో మంగళవారం మధ్యా హ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం కాగా సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వర్ధెల్లి బుచ్చిరాములు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు మురళితో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటర్ మురళి సూర్యాపేటకు చేరుకుని మాతృమూర్తి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ మరణంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సీపీఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు బుధ వారం సూర్యాపేటలో జరుగుతాయని తెలిపారు. -
విధి విలాసం
కృష్ణాజిల్లా , యడ్లపాడు: జాతీయ రహదారిని దాటుతున్న బాలింతను ఆటో ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామంలోని శాంతి నగర్‌కు చెందిన సుజాత(34) తన కుమార్తె మూడు నెలల పల్లవికి టీకాలు వేయించేందుకు ఆస్పత్రికి బయలుదేరింది. తోడుగా ఆడపడుచు మేరీని తీసుకెళ్లింది. కాలనీ నుంచి విష్ణుస్పన్పైప్ కంపెనీ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారి వద్దకు రాగానే పాపను మేరీకి ఇచ్చింది. మేరీ రోడ్డు దాటి అవతలకు వెళ్లింది. సుజాత కూడా రోడ్డు దాటుతుండగా చిలకలూరిపేట వైపు నుంచే వచ్చే టాటా మేజిక్ ఆటో ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ఆటోలో ఓ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలకు హాజరవుతున్నట్లు తెలిసింది. నాదెండ్ల ఎస్ఐ ఎస్ రామాంజనేయులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి ప్రేమకు దూరమైన బిడ్డలు ప్రకాశం జిల్లా వలపర్ల గ్రామానికి చెందిన సుజాత మూడు నెలల వయసులోనే తల్లిదండ్రులు గుంటి చంద్రమౌళి, రామకోటేశ్వరమ్మ చనిపోయారు. దీంతో మేనమామ కాలేషావలి బాలికను చేరదీశాడు. 14 ఏళ్ల కిందట నాదెండ్ల మండలంలోని గణపవరంకు చెందిన సుబ్రమణ్యంకు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి అరుణ్ యశ్వంత్, పల్లవి(3 నెలలు) బిడ్డలు పుట్టారు. పాప పుట్టినప్పటి నుంచి సుజాత పనులకు వెళ్లకుండా తన అమ్మే పుట్టిందనుకుని అల్లారుముద్దుగా చూసుకుంటుంది. పాపకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయించేందుకు శుక్రవారం ఆసుపత్రికి బయలుదేరి మృత్యువాత పడింది. మూడేళ్ల వయసులో సుజాత తల్లిని కోల్పోగా.. ఇప్పుడు తన బిడ్డ మూడు నెలల వయసులో అమ్మ ప్రేమకు దూరమైంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి గుండె కన్నీటితో చెమ్మ గిల్లింది. -
ఆశీర్వదించకుండానే వెళ్లిపోయావా అమ్మా..
యలమంచిలి రూరల్: ముద్దుల కొడుకు పుట్టిన రోజు.. వరాల బాబు తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన రోజు.. తలంటాలి, కొత్త దుస్తులు తొడగాలి, మిఠాయి తినిపించాలి.. అందుకే ఆ తల్లి వేడి నీళ్లు సిద్ధం చేస్తోంది.. బకెట్ నీటిలో హీటర్ పెట్టి నీళ్లు వేడి చేస్తోంది. అంతలోనే ఆ ప్రయత్నంలోనే విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పిల్లల్ని అనాథలను చేసి కన్నుమూసింది. వేడుక వేళ ఆ ఇంటిలో తాండవించిన విషాదం చూపరులను సైతం కన్నీళ్లు పెట్టించింది. ఈ దుర్ఘటన పెద్దపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. శానాపతి ధనలక్ష్మి (26) తన కుమారుడు వినయ్ పుట్టినరోజు కావడంతో బాలుడికి స్నానం చేయించేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీటిని మరిగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ధనలక్ష్మిని కాపాడే ప్రయత్నంలో ఆమె భర్త ప్రసాద్‌కు కూడా స్వల్పగాయాలయ్యాయి. ప్రసాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యలమంచిలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు. పాప స్థానిక ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతుండగా.. కుమారుడు వినయ్ అంగన్వాడీ పాఠశాలలో చేర్పించారు. హేమాంబిక గుడిలో అభిషేకం చేయించాలని, అంగన్వాడీ పాఠశాలలో చాక్లెట్లు పంచాలని అన్నీ సిద్ధం చేసి అంతలోనే కన్నుమూసిందని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. -
కొడుకును కాపాడి కన్నుమూసిన తల్లి
మెదక్ రూరల్: కరెంట్ షాక్‌కు గురైన కొడుకును రక్షించబోయి ఓ తల్లి మృతి చెందింది. ఈ ఘటన మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ తండాలో గురువారం జరిగింది. బుధవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా తండాకు చెందిన శేఖర్, బూలీ దంపతుల గుడిసెకు విద్యుత్ షాక్ వచ్చింది. దీంతో వారి కొడుకు శేఖర్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కొడుకును గుడిసె నుంచి బయటకు విసిరేసిన తల్లి.. షాక్‌తో అక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బూలీని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. శేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
అమ్మ ఎళ్లిపోయింది..
రాయపర్తి(వర్ధన్నపేట) : ఆ మాతృమూర్తి మరణం గుండెలను పిండేసింది. ఎనిమిది మంది సంతానానికి అన్నీ తానై చూసుకుంది. కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోసిన ఆ తల్లి కన్నుమూయడంతో కన్నబిడ్డల రోదనలు మిన్నుముట్టాయి. రాయపర్తి ఎస్సీకాలనీకి ఐత సాయిలు, చంద్రమ్మ దంపతులకు కుమారుడు అంజి, కుమార్తె రేణుక సంతానం. చంద్రమ్మ చనిపోవడంతో సాయిలు నాగమ్మ(55)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మొత్తం ఎనిమిది మంది సంతానం. మేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సాయిలు పెద్ద భార్య కుమారుడు, కుమార్తె వివాహం చేయడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ముగ్గురు కుమారులు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్లో రాజేశ్వరి డిగ్రీ పూర్తి చేసింది. చంద్రకళ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం సాయిలు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ భారమంతా నాగమ్మపై పడింది. పిల్లలకు అన్నీ తానై చూసుకుంటోంది. కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు అబ్బాస్ వివాహం చేద్దామని సంబంధం చూసేందుకు వెళ్తుండగా బుధవారం సాయంత్రం నాగమ్మ అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. వర్ధన్నపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. -
‘తల్లి’డిల్లిన హృదయంతో..
పిఠాపురం : ప్రతిరోజూ ఎదురొచ్చి సాగనంపే తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి శోకాన్ని మిగిల్చగా.. కనీసం తల్లి ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక గుండెల నిండా బరువును నింపుకొని పదో పరీక్షకు హాజరైంది ఆ విద్యార్థిని. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం శివారు ముమ్మిడివారిపోడుకు చెందిన బత్తినీడి అప్పారావు భవానీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అనంతలక్ష్మి ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మూలపేట హైస్కూల్లో రాస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కుమార్తెను తయారు చేసి ఎదురు వచ్చి పరీక్షకు పంపించేది తల్లి భవానీ. అయితే శనివారం భవానీ తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుదామని లేచిన కుమార్తె అనంతలక్ష్మి తల్లిని లేపింది. ఆమె ఎంతకు లేవకపోవడంతో విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు వచ్చి చూడగా ఆమె మృతి చెంది ఉండడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో పరీక్షకు సమయం దగ్గర పడడంతో తల్లి ఆఖరి చూపును కూడా వదులుకుని అనంతలక్ష్మి పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. ఇక్కడ పరీక్ష కేంద్రంలో కుమార్తె పరీక్ష రాస్తుంటే అదే సమయంలో అక్కడ మరుభూమిలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం స్థానికులను కలచివేసింది. అయితే ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళ్లే సరికి తల్లి అంత్యక్రియలు పూర్తి కావడంతో తల్లి కోసం గుండెలవిసేలా రోదించిన ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. -
తల్లి మరణించినా లక్ష్యం విడవకుండా..!
బల్లికురవ: తల్లి చినపోయినా ఆ బాధను మనసుసులోనే దిగమింగుకుని, మనోధైర్యంతో బల్లికురవ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షలకు హాజరవుతోంది. మండలంలోని చిన అంబడిపూడి గ్రామానికి చెందిన కోవూరి వెంకటశేషయ్య, కుమార్తె సరళను 18 సంవత్సరాల క్రితం మార్టూరు మండలం, చిమ్మరిబండకు చెందిన పల్లపు వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఆరు సవత్సరాల క్రితం సరళ అనారోగ్యం బారిన పడటంతో, నీవు నాకు అక్కర్లేదని, వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురిచేయడంతో సరళ పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. కుమార్తె ప్రియాంక స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సరళ అనారోగ్యంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్న ఈ నెల 12న మరణించింది. ప్రియాంక తల్లి అంత్యక్రియలకు హాజరై తిరగి పాఠశాలకు వచ్చి, తాత, వెంకటశేషయ్య, విద్యాలయం ప్రత్యేకాధికారి సరళ కుమారి ఇచ్చిన ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తోంది. తన తల్లి చనిపోయింది. తండ్రి వెంకటేశ్వర్లు పట్టించుకోవడం లేదు. దాతలు సహకారం అందిస్తే తాను, తన సోదరుడు అనిల్ ఉన్నత చదువులు చదువుకోగలమని విద్యార్థిని చెప్పింది. -
వక్రీకరించిన విధి
చిత్రంలో కాలిన గాయాలతో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రేమ్‌కుమార్. వయస్సు 14 నెలలు. నెల రోజులుగా వచ్చీ రాని మాటలతో అమ్మా.. అని పిలుస్తున్నా ఆ తల్లి కనిపించడం లేదు. నాన్నా.. అని అరుస్తున్నా ఆ తండ్రి హత్తుకోవడం లేదు. అమ్మకు ఏమైందో తెలీక, నాన్న ఎందుకు రావడం లేదో అర్థం కాక ఈ బుజ్జాయి ఏడుస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 12న విశాఖలో జరిగిన గ్యాస్ ప్రమాదంలో ఈ చిన్నారి తల్లిదండ్రులు గాయపడ్డారు. తల్లి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయారు. తండ్రి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ విషాదంతో మందస మండలం పితాతొళి గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. శ్రీకాకుళం, మందస: ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతానికి వెళ్లిన కుటుంబంపై విధి పగబట్టింది. అందమైన కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తల్లి మరణించింది. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తల్లిదండ్రుల గుండెలపై ఆడుకోవాల్సిన చిన్నారి.. ఏం జరిగిందో తెలియక.. అమాయకంగా అమ్మా.. నాన్నా.. అని పిలుస్తున్న దృశ్యం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఊహించని ప్రమాదంతో.. మందస మండలంలోని పితాతొళి గ్రామానికి చెందిన బాడ గిరిబాబు(30) స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో పదేళ్లుగా తిరుగుతున్నారు. మూడేళ్ల క్రితం విశాఖపట్నం వచ్చి.. దువ్వాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు. కూర్మన్నపాలెంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 12న రాత్రి 11.30 సమయంలో గ్యాస్ వాసన రావడంతో మేల్కొన్న గిరిబాబు లైట్ వేశాడు. ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ప్రమాద తీవ్రత గుర్తించిన గిరిబాబు.. ఉయ్యాలలో నిద్రిస్తున్న 14 నెలల కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గిరిబాబు 60 శాతం, భార్య పద్మ(23).. 75 శాతం కాలిపోయారు. చుట్టుపక్కలవారు మంటలను అదుపు చేశారు. కుటుంబసభ్యుల్లో ఆందోళన గిరిబాబు, పద్మ, ప్రేమ్‌కుమార్‌ను విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు. పద్మ మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయింది. ఆమె ఇటీవలే కేజీహెచ్‌లో మరణించినట్టు పితాతొళిలోని బంధువులకు సమాచారం అందిచారు. గిరిబాబు కూడా మృత్యువుతో పోరాడుతుండటంతో తల్లిదండ్రులు కూరాకులు, సరోజనమ్మతో పాటు అన్నయ్య శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోడలిని కోల్పోయిన దుఃఖంలో ఉండగా.. కొడుకు మృత్యువుతో పోరాడుతుండటం వారిని మరింత కుంగదీస్తోంది. ముక్కు, నోరు, బుగ్గలపై కాలిన గాయాలతో ప్రేమ్మార్ దీనంగా చూస్తున్న చూపులు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన వారిపై పగ పట్టినట్టు జరిగిన ఈ సంఘటన స్థానికుల హృదయాలను ద్రవింపజేస్తోంది. -
నాగావళిలో తల్లి మృతి, కుమారుడు గల్లంతు
విజయనగరం: స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు కుటుంబ సభ్యుల్లో తల్లి మృతిచెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఒరిస్సా రాయగడ మజ్జిగౌరీ అలయం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన శాంతి అనే మహిళ తన కుమార్తె ఇందు, కుమారుడు అఖిల్‌తో కలిసి స్నానం చేసేందుకు నాగావళి నదికి వెళ్లింది. నీట మునిగి శాంతి మృతిచెందగా అఖిల్ గల్లంతయ్యాడు. ఇందు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అఖిల్ కోసం గాలింపు చేపట్టారు. -
కన్నా.. నేనూ నీ వెంటే
సాక్షి, అన్నానగర్ : చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు ప్రమాదంలో మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తమిళనాడులోని వేడచందూర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలో ఉన్న సత్తీరపట్టికి చెందిన కాత్తవరాయన్ (55), ఈశ్వరి (51) దంపతులు. వీరికి మకుఠీశ్వరన్ (24) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను వేడచందూర్ సమీపం రాగమ్‌పట్టిలో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. రోజూలాగే, గురువారం ఉదయం స్నేహితులు మలైస్వామి (35), మణి (25)తో కలసి ఫ్యాక్టరీకి బయల్దేరాడు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైకును దిండుక్కల్–వేడచందూర్ రోడ్డులో కాక్కాతోట విభాగ సమీపంలో కరూర్ నుంచి దిండుక్కల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మకుఠీశ్వరన్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన మలైస్వామి, మణిని దిండుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మకుఠీశ్వరన్ మృతి చెందాడన్న సమాచారాన్ని ఇంట్లో ఉన్న అతని తల్లి ఈశ్వరికి తెలియజేశారు. వెంటనే ఆమె కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ప్రాంతం శోకంలో మునిగిపోయింది. -
నర్సు ఆపరేషన్.. గర్భిణి మృతి!
శ్రీకాకుళం: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ గర్భిణి మృతిచెందింది. ఈ ఘటన శ్రీకాకుళం రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురాగా.. డాక్టర్‌కు బదులుగా నర్సు ఆపరేషన్ చేసింది. దీంతో ఈ ఆపరేషన్ వల్ల తల్లి మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మాత్రం క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కుమార్తెలను పుట్టింట దింపి వస్తూ..
అమలాపురం రూరల్ : దీపావళి పండుగకు పిల్లలను తన పుట్టినింట దించి ఆటోలో తిరిగివస్తున్న ఓ తల్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అమలాపురం మండలం ఎ.వేమవరానికి చెందిన రాకుర్తి గంగాభవాని (34) ఈ ప్రమాదంలో మృతి చెందింది. అమలాపురం– చల్లిపల్లి రోడ్డులోని కామనగరువు దుర్గమ్మ గుడి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గంగా భవాని మృతి చెందగా ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి పండుగ కావడంతో గంగాభవాని తన ఇద్దరు కూతుళ్లను చల్లపల్లిలోని తన పుట్టినింట దింపి, ఆటోలో తిరిగి ఎ.వేమవరం వస్తోంది. ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది. ఆటోలో ఉన్న భవానితోపాటు తాళ్లరేవు శివారు అడవి పొలానికి చెందిన బోడా ప్రసాద్, కొమరిగిరిపట్నానికి చెందిన తిరుమల బంగారం, కోడూరి కుమారి, గోపవరానికి చెందిన కుంచే కుమారి గాయపడ్డారు. క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. భార్య భవాని చనిపోవటంతో ఆమె భర్త సుబ్రహ్మణ్యం కన్నీరుÐ మున్నీరుగా విలపిస్తున్నారు. తమ తల్లి మరణంతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అమలాపురం తాలూకా ఎస్సై గజేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు పెళ్లి చూసి కన్నుమూసిన తల్లి
ఖిలావరంగల్ : ఒకవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం.. తరుముకొస్తున్న మృత్యువు.. మరోవైపు తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడాలన్న తపన..ఆమెను కొద్ది క్షణాలను జీవంగా ఉంచింది. మనసారా తనయుడిని ఆశీర్వదించిన మరుక్షణంలోనే ఆ మాతృమూర్తి అనంతలోకాలకు పయనమైం ది. పలువురి హృదయాలను కలిచివేసిన ఈ ఘటన 20 డివిజన్ లక్ష్మీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన మంగళగిరి ఆరువయ్య, సక్కుబాయి(50)దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం సక్కుబాయి క్యాన్సర్ బారిన పడింది. సర్కారు దవాఖానలో వైద్యపరీక్షలు చేయించుకోగా ఏడాదికన్నా ఎక్కవకాలం బతకలేదని వైద్యులు తేల్చి చెప్పారు. తనకున్న ఏకైక కుమారుడు రాజేష్ వివాహం చూసి తనువు చాలించాలని తరచూ స్థానికులకు చెప్పుకుని వాపోయేది. దీంతో స్థానిక పెద్దలు ముందుకు వచ్చి పేదింటి యువతి సమతను రాజేష్‌కు ఇచ్చి గురువారం ఉదయం ఉర్సుగుట్టపై వివాహం చేశారు. అయితే నవదంపతులు ఇంటికి చేరుకుని తల్లి సక్కుబాయి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కొద్ది సేపట్లోనే ఆ మాతృమూర్తి కన్నుమూసింది. దహన సంస్కారాలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో హన్మకొండకు చెందిన వ్యాపారి పోరండ్ల కుమారస్వామి, టీఆర్ఎస్ నేత బోరిగం నర్సింగం, వంటల మల్లమ్మ, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కూనూరు శేఖర్‌గౌడ్ ముందుకు వచ్చారు. రూ.9వేలు ఆర్థిక సాయం అందజేసి అంత్యక్రియలు జరిపించారు. -
తల్లికోసం తల్లడిల్లి..
తల్లి మృతి.. అనాథలైన పిల్లలు ఇంద్రవెల్లి : మండలంలోని వడగామ్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన మెస్రం అనుసూయబాయి(35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారు జమున మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. లింగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం మారుతికి వడగామ్ గ్రామానికి చెందిన అనుసూయబాయితో వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం. లక్ష్మీ(12), గణేష్(8), రామ్‌చరణ్ (1) ఉన్నారు. మారుతి గత సంవత్సరం వేరే మహిళతో మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మారుతి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అనుసూయ ఆరోగ్యం బాగలేకపోయిన కులీ పనులు చేసి ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి అనుసూయబాయి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త లేక, వైద్యం చేయించడానికి ఇంట్లో ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోజు రోజుకూ పరిస్థితి విషమించి అనసూయబాయి శనివారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. లింగపూర్ గ్రామంలో విషాధచాయలు అములుకున్నాయి. -
దూరమైన మాతృత్వం
పాలిస్తూ మృత్యు ఒడికి చేరిన తల్లి గుక్కపట్టి ఏడుస్తోన్న పసికందు తొగుట: నిండు బాలింత.. నెలలు నిండని పసికందు.. విధి వక్రీకరించింది. వీరి బంధాన్ని వేరు చేసింది. తల్లి పాలే ఆ పసికందుకు దూరమయ్యాయి. పుట్టిన బిడ్డకు పాలిస్తూ ఆ తల్లి మృత్యు ఒడిలోకి ఒరిగిపోయింది. పాలను తాగుతున్న లోకం తెలియని ఆ పసికందుకు ఇక అమ్మలేదన్న విషయం తెలియదు. ఆ పసికందును చూసిన కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదించారు. పలువురిని కంట తడి పెట్టించిన ఈ విషాదకర సంఘటన తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తుక్కాపూర్ గ్రామ శివారులోని తుర్రకాశవాడకు చెందిన షేక్ సమీనా (20) మూడు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తల్లిగారింటి వద్దే ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి పనులు పూర్తి చేసుకుని తన మూడు నెలల కూతురుకు పాలిస్తూ పడుకుంది. ఈ క్రమంలో ఆమె అలాగే మృత్యు ఒడిలోకి చేరింది. సాయంత్రం పసిపాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుండడంతో పక్కింటివారు వచ్చి చూశారు. వారు సమీనాను నిద్రలేపే ప్రయత్నం చేయగా, ఆమె నిద్రలేవ లేదు. దీంతో సమీపంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన డాక్టర్ సమీనాఅప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. అక్కడ ఉన్న పసికందును చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
అశ్వారావుపేట ఎమ్మెల్యేకు మాతృవియోగం
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(84) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పి.నరసాపురం మండలంలోని ఆమె స్వగ్రామం మర్రిగూడెంలో మృతి చెందారు. విషయం తెల్సిన తాటి వెంకటేశ్వర్లు మర్రిగూడెం బయలు దేరారు. ఎమ్మెల్యేకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
రైల్లోంచి పడిన తల్లీకొడుకులు
♦ తల్లి మృతి, క్షేమంగా బయటపడిన కుమారుడు.. ♦ మృతురాలు యాచకరాలిగా గుర్తింపు తాండూరు రూరల్ : కదులుతున్న రైల్లోంచి ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు కిందపడ్డారు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన రుక్మాపూర్ - ధారూర్ రైల్వే స్టేషన్ మధ్యలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం మేరకు.. రైల్లో భిక్షాటన చేసే ఓ మహిళ (27), తన ఏడాదిన్న వయస్సున్న కుమారుడితో కలిసి ప్రతి రోజూ తాండూరు - హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లలో భిక్షాటన చేసేది. మంగళవారం కూడా ఆమె ఓ రైలు ఎక్కింది. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు రుక్మాపూర్ - ధారూర్ మధ్య కేఎం నంబ ర్ 84 వద్ద ప్రమాదవశాత్తు రైల్లోం చి తల్లి, కొడుకులు కిందపడ్డారు. తల్లి అక్కడిక్కడే మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. విషయం తె లుసుకున్న రైల్వే పోలీసులు తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాం డూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడిని శిశుగృహానికి తరలించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు. మృతిచెందిన యాచకురాలు చందానగర్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
మిరాకిల్... వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘటన
వాషింగ్టన్: అమెరికా వైద్యులు అద్భుతం చేశారు. వైద్యశాస్త్రంలో ఎప్పుడు జరగని ఓ ఘటనకు సాక్షులుగా మిస్సోరి వైద్యులు నిలిచారు. చిన్నారి గర్భంలో ఉండగానే ప్రమాదవశాత్తూ తల్లి చనిపోయినా డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులోని పసిపాపను సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ కుటుంబసభ్యులకు ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఓ వైపు చిన్నారి కన్నతల్లి చనిపోయిందని వారు దుఖంలో ఉండగా.. మరోవైపు తల్లి ఎలాగు చనిపోయిందని వైద్యులు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఓ పసిపాపను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి వైద్యులు నిజంగానే సరికొత్త చరిత్ర సృష్టించారు. మాట్ రైడర్, సారా ఇల్లర్ దంపతులు. ఆగ్నేయ ముస్సోరి సమీపంలో వీరు నివాసం ఉండేవారు. అయితే గర్భంతో ఉన్న సారాను భర్త మాట్ రైడర్ హాస్పిటల్స్ కు తీసుకువస్తున్నాడు. మార్గం మధ్యలోనే ఓ ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మాట్ కు స్వల్పగాయాలు కాగా, ఇల్లర్ మాత్రం తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి డాక్టర్లను రప్పించారు. అంబులెన్స్ లో వీరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, కొన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరనుండగా ఇల్లర్ మృతిచెందింది. హాస్పిటల్ కు వెళ్లగానే కొన్ని నిమిషాల్లోనే డాక్టర్లు ఆపరేషన్ చేసి చనిపోయిన ఇల్లర్ నుంచి పాప మాడిసన్ ను బయటకుతీశారని ఆమె సోదరి కసాండ్రా ఇల్లర్ చెప్పింది. తల్లి చనిపోవడంతో చిన్నారికి ఆక్సిజన్ అందదని భావించిన వైద్యులు మొదట మాడిసన్ ను వెంటిలేటర్ లో ఉంచారు. నాలుగు రోజుల తరువాత కన్ను తెరిచిన చిన్నారి వెంటనే నర్స్ వేలిని పట్టుకుందని సోదరి మృతిచెందిన బాధలోనూ తన సంతోషాన్ని పంచుకుంది. మాట్ ఎముకలు కొన్ని విరిగాయని, సెయింట్ లూయిస్ ఆప్పత్రితో చికిత్స పొందుతున్నాడని చెప్పింది. ఏది ఏమైతేనేం ఇప్పుడు ఆ పాపకు అమ్మ లేదన్నది వాస్తవమని చనిపోయిన ఇల్లర్ కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. -
కుమార్తెను రమ్మని చెప్పి వస్తుండగా...
తల్లి మృతి... కొత్తూరు : వేసవి సెలవులతో పాటు గ్రామంలో బంధువుల వివాహానికి పాఠశాలలో చదువుతున్న కుమార్తెను ఇంటికి పిలిచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వివాహిత దుర్మరణం పాలైంది. భర్త మిన్నారావు, బంధువులు, పోలీసులు చెప్పిన వివరాలు...భామిని మండలం అత్తికొత్తూరుకు చెందిన తందాడ రమణమ్మ(35) పాతపట్నంలో చదువుతున్న తన కుమార్తె లావణ్యను ఇంటికి తీసుకువచ్చేందుకు అక్కడి వసతిగృహానికి శుక్రవారం వెళ్లింది. అక్కడి అధికారులు శనివారం పంపిస్తామని చెప్పడంతో రమణమ్మ తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యలో రమణమ్మ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా ఇంటికి వస్తానని చెప్పడంతో ఆ యువకులు ఆమెను కూడా బైక్‌పై ఎక్కించారు. బైక్‌పై వస్తుండగా బంకి గ్రామ సమీపంలో బైక్ పైనుంచి రమణమ్మ జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారిణి సునీత తెలిపారు. రమణమ్మకు భర్త మిన్నారావు, కుమార్తె లావణ్య, కుమారుడు సోమేశ్వరరావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుట హెచ్‌సీ సింహాచలం తెలిపారు. -
జనార్దనరావు ఇప్పుడు ఒంటరి
సంతకవిటి: కొండంత బాధను దిగమింగు తూ టెన్తు పరీక్ష రాస్తున్నాడో విద్యార్థి. తల్లి అనారోగ్యం దిగులు వెంటాడుతున్నా ధైర్యంగా పరీక్ష కేంద్రం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇంతలో తల్లి మరణించింది. విషయం తెలియని విద్యార్థి యధాతథంగా శనివారం పరీక్ష రాశాడు. వివరాలివి. మండలంలో తమరాం గ్రామానికి చెందిన నడగాన జనార్దనరావు హొంజరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ విద్యార్థి తండ్రి రమణ ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. తల్లి వెంకటమ్మ రోజు వారీ కూలీ పనులు చేస్తూ జనార్దనరావును చదివిస్తోంది. నాలుగురోజులు క్రితం ఈమె అనారోగ్యం పాలైంది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పక్షవాతం వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనార్దనరావు మందరాడ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్నాడు. తల్లికి ఏమి జరుగుతుందో అనే ఆందోళన చెందుతూ మరో వైపు ఉత్తీర్ణుడు కావాలనే గట్టి సంకల్పంతో రోజూ పరీక్షకు హాజరవుతున్నాడు. శనివారం ఉదయం విశాఖపట్నంలో ఆస్పత్రిలో తన తల్లి గురించి ఆరోగ్య సమాచారం తెలుసుకుని పరీక్షకు హాజరయ్యాడు. పది గంటలు సమయంలో ఇతడి తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరీక్ష ముగిసేవరకూ బంధువులు వెల్లడించలేదు. పరీక్ష ముగిసి హాలు నుంచి బయటకు రాగానే జనార్దనరావుకు విషయాన్ని తెలిపారు. దీంతో విద్యార్థి విషాదంలో మునిగిపోయాడు. సాయంత్రం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కూలిపనులు చేసుకుంటూ తల్లి తెచ్చే చిరు సంపాదనతోనే చదువు సాగించిన జనార్దనరావు ఇప్పుడు దిక్కులేనివాడయ్యాడు. -
ఆత్మాహత్యాయత్నం: తల్లి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా కనేకల్లులోని రామ్‌నగర్ కాలనీ చెరువులో ఓ మహిళ తన కుమారుడితో కలసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి... తల్లీకుమారుడిని చెరువు నుంచి బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో తల్లి ఫక్రుమా (38) అప్పటికే మృతి చెందింది. తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే అతడ్ని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఫక్రుమా మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీమంత్రికి మాతృవియోగం
పెద్దముడియం(వైఎస్సార్ జిల్లా): పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మాతృమూర్తి వెంకట లక్ష్మమ్మ(75) గురువారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈమెకు నలుగురు కుమారులు ఉండగా పెద్దకుమారుడు గోపాల్‌రెడ్డి, నాలుగో కుమారుడు ప్రతాప్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. రెండో కుమారుడు శిల్పామోహన్‌రెడ్డి, మూడో కుమారుడు శిల్పా చక్రపాణిరెడ్డి (ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు) రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. కుమారులు ఊరు వదిలి వెళ్లినప్పటికి వెంకటలక్షుమ్మ, ఆమె భర్త చెన్నారెడ్డిలు స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌కు తీసుకె ళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఆమె అంత్యక్రియలు కొండసుంకేసులలో జరుగనున్నాయి. -
కొడుకు మరణం తట్టుకోలేని ఓ తల్లి..
తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా): కొడుకు మరణించాడన్న నిజాన్ని తట్టుకోలేని ఓ తల్లి వెంటనే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి పరిధిలోని నర్సింగాపూర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అల్లెపు లింగయ్య, మల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో కొమురయ్య(50) శనివారం పనికి వెళ్లి వచ్చాడు. నీళ్లివ్వాలని అడిగి.. వెంటనే నోటిలో నుంచి నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే.. తల్లి మల్లవ్వ కొడుకు మీద పడి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. ఆటోలో కొమురయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దుద్దెనపల్లి వద్ద 108లోకి ఎక్కించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లి మల్లవ్వ సైతం మృతి చెందడం గమనార్హం. -
బైకును ఢీకొన్న లారీ తల్లి మృతి, తనయుడికి తీవ్ర గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ గంగురాజుపురం ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా తనయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గంగురాజుపురంలో నివాసముంటున్న సుబ్బరత్న అక్కడి ఓ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. బుధవారం ఆమెను మిల్లు వద్ద వదిలిపెట్టేందుకు ఆమె కుమారుడు వెంకటేష్ బైకులో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వీరికి పరిచయమున్న అమిరుద్దీన్ అనే వ్యక్తి కనిపించాడు. దీంతో రోడ్డు పక్క బైకును నిలిపి అతనితో మాట్లాడుతుండగా వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరత్న అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అమిరుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సుబ్బరత్న భర్త చిన్నయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదిగా తయారైంది. ప్రమాదానికి కారణమైన లారీని మంగంపేట వద్ద స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి మృతి... పరీక్షకు హాజరైన విద్యార్థి
గుంటూరు: అనారోగ్యంతో అకాల మరణం పాలైన కన్నతల్లి మృతదేహం ఓ వైపు ... ఆమె కలలుకన్న బంగారు భవితకు పునాదులు వేసుకునే పరీక్ష మరో వైపు ... ఇలాంటి సంక్షిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న పసి మనస్సు పరీక్ష రాయడానికి సిద్ధమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన సుమంత్‌రాజ్ తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. గత అర్థరాత్రి కన్నతల్లి మరణించింది. అయినా పుట్టెడు దుఃఖంలో సుమంత్‌రాజ్ మంగళవారం ఉదయం పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. -
కన్నబిడ్డ కళ్లముందే...
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్ - మహిళ దుర్మరణం, పరారైన డ్రైవర్ రెయ్యిపాడు (వజ్రపుకొత్తూరు): కన్న కొడుకు కళ్లెదుటే ఘోరం జరిగిపోయింది. తల్లిని బైకుపై ఎక్కించుకుని బంధువుల ఇంటికి వెళ్తుండగా ట్రాక్టరు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడంతో ఆ కొడుకు హతాశుడయ్యాడు. తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వజ్రపుకొత్తూరు మండలం లో చోటుచేసుకుంది. మండలంలోని రెయ్యిపాడు వద్ద మంగళవారం ట్రాక్టరు ఢీకొని హుకుంపేటకు చెందిన కొమర చంద్రావతి(49) అక్కడికక్కడే మృతి చెందారు. హుకుంపేట నుంచి భావనపాడు వెళ్లేందుకు కుమారుడు కొమర శంకరరావుతో కలిసి హీరో హోండా ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమర చంద్రావతి తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు స్వగ్రామం హుకుంపేట నుంచి కుమారునితోకలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలో రెయ్యిపాడు వద్దకు వచ్చేసరికి మురిపింటివానిపేటకు చెందిన ఎల్. చిరంజీవికి చెందిన ట్రాక్టర్ వీరిని ఢీకొంది. ద్విచక్రవాహనం ముళ్లకంచెపై పడిపోగా, బైక్ వెనుక కూర్చున్న చంద్రావతి కింద పడడంతో ట్రాక్టర్ ఆమె తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జయింది. వాహనాన్ని నడుపుతున్న మృతురాలి కుమారుడు శంకరరావుకు స్వల్పగాయాలైయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌కు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేవని, రిజిస్ట్రేషన్ నంబరు కూడా లేదని పోలీసులు చెప్పారు. శంకరరావు ఫిర్యాదు మేరకు జ్రపుకొత్తూరు పోలీసులు శవ పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఒకే కాన్పులో ముగ్గురు జననం
తల్లి మృతి.. పిల్లలు క్షేమం ఇటిక్యాల: ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ఆలనాపాలనా చూడకుండానే మృత్యుఒడిలోకి జారుకుంది. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మందా మహేశ్వరి గత నెల 29వ తేదీన కాన్పు కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. 30న ఆపరేషన్ ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారులు ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, రక్తహీనతతో బాధపడుతున్న మహేశ్వరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలు మహేశ్వరి మొదటికాన్పులో ఒక బిడ్డకు, రెండో కాన్పులో కవలలకు, మూడోకాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి తనువు చాలించింది. -
తల్లీబిడ్డను విడదీసిన అతివేగం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : అతివేగం తల్లీబిడ్డను విడదీసింది. నెల రోజుల పసికందుకు మాతృప్రేమను దూరం చేసింది. జైనూర్ మండలం తిమ్కపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పది మంది గాయపడ్డారు. జైనూర్ ఎస్సై కృష్ణమూర్తి కథనం ప్రకారం.. సిర్పూర్(యు) మండలం మామిడిపల్లి గోండుగూడకు చెందిన కుర్సెంగ వినయ్‌కుమార్, ఆత్రం శారదాబాయి, కుర్సెంగ కమలాబాయి, ఆత్రం లక్ష్మీబాయి, ఆత్రం పరమేశ్వర్, ఆత్రం దత్త, అడ యమునాబాయి, ఆత్రం భీంబాయి, చిన్నారులు ఆత్రం లాల్‌ప్రసాద్, భీంబాయి, అరుంధతిలు ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి టాటాఏస్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి పది గంటల సమయంలో జైనూర్ మండలం తిమ్కపల్లి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆత్రం భీంబాయి(30) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అందులో ప్రయాణిస్తున్న మరో పది మందికి గాయాలు కావడంతో ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భీంబాయి మృతితో ఆమె కుమారుడు(నెల రోజులు) తల్లి ప్రేమకు దూరమయ్యాడు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు దురె కేశవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. డ్రైవర్ తాగి ఉండడాన్ని గమనించి వేగంగా వెళ్లవద్దంటూ వారించినా వినలేదని, అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు ఆరోపించారు.