సంతకవిటి: కొండంత బాధను దిగమింగు తూ టెన్తు పరీక్ష రాస్తున్నాడో విద్యార్థి. తల్లి అనారోగ్యం దిగులు వెంటాడుతున్నా ధైర్యంగా పరీక్ష కేంద్రం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇంతలో తల్లి మరణించింది. విషయం తెలియని విద్యార్థి యధాతథంగా శనివారం పరీక్ష రాశాడు. వివరాలివి. మండలంలో తమరాం గ్రామానికి చెందిన నడగాన జనార్దనరావు హొంజరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ విద్యార్థి తండ్రి రమణ ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు.
తల్లి వెంకటమ్మ రోజు వారీ కూలీ పనులు చేస్తూ జనార్దనరావును చదివిస్తోంది. నాలుగురోజులు క్రితం ఈమె అనారోగ్యం పాలైంది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పక్షవాతం వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనార్దనరావు మందరాడ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్నాడు. తల్లికి ఏమి జరుగుతుందో అనే ఆందోళన చెందుతూ మరో వైపు ఉత్తీర్ణుడు కావాలనే గట్టి సంకల్పంతో రోజూ పరీక్షకు హాజరవుతున్నాడు.
శనివారం ఉదయం విశాఖపట్నంలో ఆస్పత్రిలో తన తల్లి గురించి ఆరోగ్య సమాచారం తెలుసుకుని పరీక్షకు హాజరయ్యాడు. పది గంటలు సమయంలో ఇతడి తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరీక్ష ముగిసేవరకూ బంధువులు వెల్లడించలేదు. పరీక్ష ముగిసి హాలు నుంచి బయటకు రాగానే జనార్దనరావుకు విషయాన్ని తెలిపారు. దీంతో విద్యార్థి విషాదంలో మునిగిపోయాడు. సాయంత్రం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కూలిపనులు చేసుకుంటూ తల్లి తెచ్చే చిరు సంపాదనతోనే చదువు సాగించిన జనార్దనరావు ఇప్పుడు దిక్కులేనివాడయ్యాడు.
జనార్దనరావు ఇప్పుడు ఒంటరి
Published Sun, Apr 3 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement