అనారోగ్యంతో తల్లి చనిపోయిందనే బాధలో డిప్రెషన్‌లోకి..
దహన సంస్కారాలకు డబ్బుల్లేక, ఏం చేయాలో పాలుపోక దీనస్థితిలో..
బౌద్ధనగర్: బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు... అప్పటి నుంచి తల్లి వారికి అన్ని విధాలా అండగా ఉంటూ ఆదరించింది. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి (45) కన్నుమూయడంతో ఇద్దరు కూతుళ్లు తామూ చనిపోవాలని భావించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకుని తొమ్మిది రోజులపాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు.
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, వారాసీగూడ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగం చేసే రాజు, లలిత దంపతులు. వీరికి రవళిక (25), అశ్విత (22) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రాజు 2020 లోనే భార్య, పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండు నెలలుగా లలిత ఇద్దరు కూతుళ్లతో కలిసి బౌద్ధనగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని 4వ ఫ్లోర్‌లో ఉంటోంది. రవళిక ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా.. అశి్వత ఈవెంట్స్ నిర్వాహకుల వద్ద చేస్తోంది.
కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లలిత ఈ నెల 23న ఇంట్లోనే కన్నుమూసింది. తల్లి కన్నుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏంచేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మళ్లీ ధైర్యం రాక, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోయారు. శుక్రవారానికి కొద్దిగా తేరుకున్న వాళ్లు తల్లి చనిపోయిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు వారి బంధువుల గురించి ఆరాతీసి వారికి సమాచారం అందించారు. చనిపోయి 9 రోజులు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొంది. విషయం తెలిసి ఈ భవనంలో ఉండే వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల నివసించే వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment