exam center
-
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
గుంటూరు: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.ముఖ్యమైన సూచనలు..‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు. -
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్‌జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్‌ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్కడక్కడా అప శ్రుతులతో ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా 2,26,744 మంది (84.12%) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా 1,89,963 మంది (91.11%) హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1139 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీసం హాల్ టిక్కెట్లు సైతం పరిశీలించకుండా లోనికి అనుమతి ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మాల్ ప్రాక్టీస్, పరీక్ష బుక్లెట్ మారడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఇన్విజిలేటర్‌పై కేసు పేపర్–1 పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్న తన సమీప బంధువుకు జవాబులు అందజేశాడు. విషయం తెలిసిన పోలీసులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిని, అందుకు సహకరించిన ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శిని అధికారులు సస్పెండ్ చేశారు. మూడు గంటల ముందే ప్రశ్నపత్రాల సరఫరా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సభను దృష్టిలో ఉంచుకుని గంట ముందుగా రావాల్సిన టెట్ ప్రశ్నపత్రాలను అధికారులు మూడు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేర్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని భావించిన అధికారులు ప్రశ్నపత్రాలను ముందే తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు సరఫరా చేసిన బుక్‌లెట్‌కు బదులు మరో బుక్లెట్ ప్రశ్నపత్రాలు ఇవ్వాలని హైదరాబాద్ నుంచి సమాచారం రావడంతో గందరగోళం ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రశ్నపత్రం మార్చేందుకు కస్టోడియన్ మళ్లీ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరడం ఆలస్యమైంది. మరోవైపు సిరిసిల్లలో మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష నిర్వహణలో అధికారుల అలసత్వంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్–2కు బుక్లెట్–2 ఇస్తే.. సిరిసిల్లలో మాత్రం బుక్లెట్–1 ఇచ్చారు. అభ్యర్థులు పలువురు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రాశారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు గంట ఆలస్యంగా బుక్లెట్–2 అందజేశారు. అయితే పత్తిపాక వీధిలోని సిద్దార్థ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వైట్నర్తో దిద్దించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇలావుండగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల చిరునామాలు సరిగా లేకపోవడంతో సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయారు. -
వాష్ రూంకు వెళ్లొస్తానని... పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోయిన అభ్యర్థి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పరీక్షా కేంద్రం నుంచి నిర్ణీత సమయం కంటే ముందే పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం పరీక్ష జరిగింది. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అసర్ హాజరయ్యాడు. బయో సబ్జెక్ట్‌కు విరామం ఇచ్చిన సమయంలో సాయంత్రం 4:15 నిమిషాలకు అసర్ టాయిలెట్ కోసం అనుమతి తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను పారిపోయినట్లు గుర్తించిన చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. -
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే ► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. ►మధ్యాహ్నం పేపర్-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. ► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది. చదవండి: లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో? ►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. ► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది. -
తప్పుగా నింపాడని ఓఎంఆర్ షీట్ మింగేశాడు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థి ఓఎంఆర్ షీట్లో తప్పులు నింపాడని ఏకంగా ఆ షీట్నే నమిలి మింగేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలం బోర్గాం(పి) పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓ పరీక్షాకేంద్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పరీక్షకు నిర్మల్ జిల్లాకు చెందిన సహకార శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్న అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి హాజరయ్యాడు. పరీక్షరాసే క్రమంలో అతడు ఓఎంఆర్ షీట్‌ను తప్పుగా నింపడంతో దానిని చింపి మింగేశాడు. తన బెంచీలో గైర్హాజరైన అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను తీసుకుని అందులో సమాధానాలు బబ్లింగ్‌చేశాడు. కొంతసేపటికి ఇన్విజిలేటర్ పరీక్షకు హాజరుకాని ఏడుగురు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కలెక్ట్ చేస్తుండగా...ఒకటి తక్కువ వస్తోంది. దీంతో అబ్దుల్ ముఖీద్ పక్కన ఉండాల్సిన ఓఎంఆర్ షీట్ గురించి ఆరా తీశారు. అయితే తనకేం తెలియదని ముందు బుకాయించగా..సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనలో ఇతగాడి వ్యవహారం అంతా రికార్డు కావడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా..ఆర్డీవో వచ్చి పరిశీలించారు. అనంతరం నాల్గవ టౌన్లో అబ్దుల్పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. -
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభంకానున్న 10, 12 తరగతుల మొదటి టర్మ్ బోర్డు పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకొనేందుకు సీబీఎస్ఈ అనుమతించింది. అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా విద్యార్థి వేరే నగరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ నగరంలో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సీబీఎస్ఈ బుధవారం ప్రకటన జారీ చేసింది. కొందరు విద్యార్థులు వారు అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా ఇప్పటికీ ఇతర నగరాల్లో నివసిస్తున్నారని సీబీఎస్ఈ దృష్టికి వచ్చిందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చడానికి విద్యార్థుల సంబంధిత పాఠశాలలకు ఒక అభ్యర్థన చేసేందుకు నిర్ధిష్ట సమయాన్ని ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విద్యార్థులు, ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అంగీకరిస్తుందని భరద్వాజ్ తెలిపారు. కాగా 10వ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబర్ 30 నుంచి, 12 తరగతి పరీక్షలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైన విషయం తెలిసిందే. (ఈ కోర్సులు చదవితే జాబ్ ఆఫర్లు అపారం!) -
JEE Mains: ముగిసిన ఫస్ట్ షిఫ్ట్.. 3 గంటలకు రెండో షిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది. ఈ క్రమంలో మొదటి షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు ప్రత్యేక గైడ్‌లైన్స్‌తో పాటు డ్రెస్‌కోడ్ పాటించాల్సిందిగా ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ఈ పరీక్షకు నిబంధనలన్నీ తప్పక ఫాలో కావాలి. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 660 నుంచి 828కు పెంచింది ఎన్టీఏ. అలాగే గతంలో 232 నగరాల్లో జరిగే ఈ పరీక్షలు ఈసారి 334 సిటీస్‌లో జరగనున్నాయి. అలాగే ఎన్టీఏ.. ప్రత్యేక మార్గదర్శకాలు, నిబంధనలు విధించింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు పరీక్షకు వచ్చే అభ్యర్థులంతా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఇక పరీక్ష కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కాంటాక్ట్‌లెస్‌గా ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలి. పరీక్ష కేంద్రంలో సీటింగ్ కూడాభౌతిక దూరం నిబంధన ప్రకారమే ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు హ్యాండ్ శానిటైజర్ అందిస్తారు. ఒక షిఫ్ట్‌లో వాడిన కంప్యూటర్లను ఆ రోజు మరో షిఫ్ట్‌కు వినియోగించరు. అలాగే కేంద్రాల వద్ద అభ్యర్థులు గుమికూడకుండా రిపోర్టింగ్ కోసం స్లాట్లను కేటాయించారు. దాన్ని బట్టి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు వెళ్లాలి -
రాత.. దాత
రోజులో కొన్ని గంటల సమయం మనది కాదనుకుంటే.. చూపులేని వారికి వెలుగు దారి చూపొచ్చు. మరచిపోయిన పరీక్ష హాలుని మరోసారి గుర్తు తెచ్చుకుంటూనే మరొకరికి ‘చే’యూత అందించిన గొప్ప జ్ఞాపకాన్ని మిగుల్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గం అంధ విద్యార్థులకు పరీక్షల్లో రాత సాయం. సాక్షి, సిటీబ్యూరో:అటు ఎండలతో పాటు ఇటు పరీక్షల వేడి కూడా నగరంలో రాజుకుంటోంది. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా, పదో తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల రికార్డింగ్స్ దగ్గర్నుంచి పరీక్షలు రాసే విషయం వరకూ ‘చే’యూత ఇచ్చేవారి కోసం అంధ విద్యార్థులు అన్వేషిస్తున్నారు. కొండంత చీకటిని పారదోలడంలో తమకు గోరంత సాయంగా, స్కైబ్స్గా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. తిప్పలు వర్ణణాతీతం.. అంధ విద్యార్థుల సమస్యలు చెబితే అర్థమయ్యేవి కావు. ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి తిప్పలు వర్ణనాతీతం. అన్ని కష్టాలున్నా చదువుకోవాలనే వారి తపన చూస్తే ఎటువంటి వారికైనా మనసు కరగకమానదు. ఆర్థికంగా కాకపోయినా, అవసరమైన వారికి ఏదో ఒక రూపంలోసేవ చేద్దాం అనుకున్నవారికి స్క్రైబ్స్ఓ మంచి అవకాశం. నగరంలోని బేగంపేట, దిల్సుఖ్నగర్, దారుషిఫా, మలక్‌పేట.. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్, హోంలలో అంధ విద్యార్థులు స్క్రైబ్స్ కోసం నిరీక్షిస్తున్నారు. సహాయకుల కొరత.. రెమ్యూనరేషన్ నామమాత్రంగా ఉండటం, చెల్లించే పద్ధతిలో లోపాల కారణంగా స్క్రైబ్స్‌గా వచ్చేందుకు ఎక్కువ మంది సముఖత చూపడం లేదు. మరోవైపు కొందరు కేవలం డబ్బుల గురించి మాత్రమే స్క్రైబ్‌గా చేసే వ్యక్తికి ఉన్న విషయ పరిజ్ఞానం, విద్యార్హతల సమాచారం గురించి తెలియక తాము చెప్పిన ఆన్సర్లు సరిగా రాయగలరో లేదోనని అంధ విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. ‘నాకు స్క్రైబ్‌గా స్కూల్ అటెండర్‌ను నియమించారు. అతడికి స్పెల్లింగ్‌లు కూడా సరిగా రాక బాధలు పడ్డా’నని ఓ విద్యార్థ వాపోయాడు. ‘గ్రూప్–2 పరీక్ష రాస్తున్నప్పుడు సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. దాంతో ఆ పరీక్షల్లో 450 మార్కులకు బదులు కేవలం 223 మాత్రమే వచ్చాయి’ అని మరో అంధ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సహాయకులకు ప్రభుత్వం రెమ్యునరేషన్ ఇస్తుందనే విషయం చాలా మంది అంధ విద్యార్థులకు తెలియకపోవడంతో అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛందంగా రావా(యా)లి.. సమస్యలున్నా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో చదివే వారికి ప్రభుత్వ పరంగా కొంత అండ ఉంటే ఆర్ఫాన్ హోమ్స్ వగైరాల్లో ఆశ్రయం పొందుతూ చదువుకునే అంధ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీరి పరీక్షలకు సంబంధించి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి, అర్హత కలిగిన స్క్రైబ్స్ కొరతను తీర్చడానికి, స్వచ్ఛంద సేవకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి స్క్రైబ్స్‌గా పనిచేయడానికి వచ్చేవారిని ప్రోత్సహించాలని, వారి పేర్లను నమోదు చేసుకుని అవసరానికి అనుగుణంగా వారిని ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ‘స్వచ్ఛంద సేవకుల్ని స్క్రైబ్స్‌గా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాష్ట్రస్థాయిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి సేవాగుణమున్న గృహిణులు, ఐటీ ఉద్యోగులకు తర్ఫీదు ఇవ్వాలి’ అని ఆసరా ఎన్జీఓ అధ్యక్షుడు ఆర్.జగదీష్‌బాబు అభిప్రాయపడ్డారు. స్క్రైబ్స్‌గా సేవలందించాలంటే.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఐడీ ప్రూఫ్, పదవ తరగతి మెమో ఉండి తెలుగు బాగా చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రశ్నలు స్క్రైబ్స్ చదివి చెబితే సమాధానాలు విద్యార్థులు చెబుతారు. అందుకని ఒకటికి రెండుసార్లు ప్రశ్న చదివి వినిపించాలి. మిగతా వారితో పోలిస్తే అంధ విద్యార్థులకు పరీక్ష పూర్తి చేసేందుకు అరగంట సమయం అదనంగా ఇస్తారు. కేవలం ఒక పరీక్ష మాత్రమే రాస్తానన్నా, అన్ని పరీక్షలూ రాస్తామన్నా అవకాశం ఇస్తారు. ఏదేమైనా.. స్వచ్ఛందంగా సేవ అందించడం కాదు.. ఖచ్చితంగా పరీక్ష సమయానికి వెళ్లగలగడం అంటేనే చెప్పాలి. లేకపోతే అనవసరంగా ఓ విద్యార్థి జీవితానికే పరీక్షగా మిగులుతారు. రాసాయం చేశా.. ఓ ఎన్జీఓ వాళ్లు స్క్రైబ్స్ కావాలంటే వెళ్లి కలిశాను. అలా ఆర్బీఐ పరీక్షకు అటెండ్ అయిన ఓ అంధుడి కోసం స్క్రైబ్‌గా స్వచ్ఛందంగా రాశాను. ఆ తర్వాత ఎస్బీఐ క్లర్క్ కోసం రాశా. మరో 2 సార్లు రాశాను. పరీక్ష రాయడం కోసం ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే అనుకుని రాశాను. ఇప్పటికీ ఏ మాత్రం అవకాశం ఉన్నా స్క్రైబ్‌గా సర్వీస్ అందిస్తా.– నరేష్, చార్టెర్డ్ అకౌంటెంట్ ఐదేళ్లుగా.. మా స్నేహితులతో పాటు నేను కూడా ఐదేళ్లుగా స్వచ్ఛందంగా స్క్రైబ్ సేవలందిస్తున్నా. అంధులకు మన వంతుగా దారి చూపడంలో గొప్ప ఆత్మసంతృప్తి లభిస్తుంది. – భారతి -
పోలీసమ్మా... మనసు చల్లనమ్మా..
సాక్షి, కడప: ఈ చిత్రం చూస్తే పోలీసమ్మా.. మనసు చల్ల నమ్మా అనక తప్పదు. గ్రామ సచివాలయ పరీక్షలకు పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో చిన్న పిల్లల తల్లులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప ఆర్ట్స్ కళాశాలలో తల్లి పరీక్ష రాయడానికి వెళ్లగా బయట అమ్మమ్మ లాలిస్తున్నా చిన్నారి ఏడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసమ్మ ఆ బిడ్డను తీసుకుని బాటిల్‌తో పాలు పట్టి లాలించింది. -
సీసీ కెమెరాల అపహరణ
సాక్షి, వీరఘట్టం: ఇప్పటికే అత్యంత సమస్యాత్మక పరీక్షా కేంద్రంగా గుర్తింపు పొందిన వీరఘట్టం పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు.శనివారం ఈ విషయాన్ని గుర్తించిన ఇక్కడ పరీక్షల చీఫ్ అధికారి బి.సొంబర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ పి.ఇందిరామణి, ఏఎస్ఐ రమణబాబులు వచ్చి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి శుక్రవారం జరిగిన సోషల్ పేపర్–1కు సీసీ కెమెరాలు ఉన్నాయని, శనివారం ఉదయం పరీక్ష గదులు తెలిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నాలుగు గదుల్లో సీసీ కెమెరాలు కనబడలేదని వాటిని అమర్చిన వైర్లు కట్ చేసి ఉన్నాయని చీఫ్ అధికారి బి.సొంబర తెలిపారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో వీరఘట్టం బాలురు, బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షాలు కేంద్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు బాలికోన్నత పాఠశాల పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు దొంగిలించడంపై జిల్లా విద్యాశాఖ మండిపడుతోంది. ఇక నుంచి ఇక్కడ పరీక్షలను పకడబ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో భవిష్యత్‌లో ఈ కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేయవచ్చునని అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రుల ఆందోళన వీరఘట్టం పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ఆకతాయి కుర్రాళ్లే ఎక్కువ మంది పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నారని, వారిలో ఎవరో చేసిన పనేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. -
వైరల్ ఫోటో : ‘అమ్మ పరీక్షకెళ్లిందిగా నే ఆడించనా’
సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌లనగానే దురుసుగా మాట్లాడుతూ.. జనాలను హడలేత్తిస్తుంటారనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంది. కానీ వారు అందరిలాంటి వారేనని, విధి నిర్వహణలో భాగంగా అలా ప్రవర్తిస్తుంటారనే విషయం మర్చిపోతుంటాము. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిన్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే పరీక్ష హాల్లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో ఎగ్జామ్ రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చింది. పరీక్ష ప్రారంభం కావడంతో సదరు మహిళ తన చిన్నారిని వెంట వచ్చిన మనిషి దగ్గర వదిలి లోపలికి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాప గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపడం లేదు. ఈ క్రమంలో పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ ఉర్ రెహ్మన్ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని సముదాయించడానికి ప్రయత్నించాడు. తాను పోలీస్ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు అసలైన ఉదాహరణగా నిలిచారు. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్ ఫోటోను రమా రాజేశ్వరి అనే ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో షేర్ చేశారు. దాంతో పాటు #HumanFaceOfCops అనే హాష్ ట్యాగ్‌ను జత చేశారు. Head Constable Officer Mujeeb-ur-Rehman (of Moosapet PS) who was on duty for conducting SCTPC exam in Boys Junior College, Mahbubnagar trying to console a crying baby, whose mother was writing exam inside the hall. #HumanFaceOfCops#Empathy pic.twitter.com/QudRZbAADu — Rema Rajeshwari IPS (@rama_rajeswari) September 30, 2018 ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల అభినందనలు అందుకుంటుంది. ముజీబ్ కూకట్పల్లి మూసాపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్... సూపర్ బాస్
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అంటే ప్రజలకు ఒకరకమైన భయం. వారితో ఎందుకులే అని ఆమడ దూరంలో వెళ్లిపోతారు. ఎందుకంటే పురాతన కాలం నుంచి వారిపై ప్రజలకు ఉన్న చెడు అభిప్రాయం. కానీ వీటన్నింటికి భిన్నంగా హైదరాబాద్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సమయానుకూలంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన తలదాల్చుకుంటున్న వారికి సహాయం అందిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే తాటతీసే పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లోను విరివిగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ట్రాఫిక్ పోలీసులు 8మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను తమ వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు పారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ మారేడ్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అర్ధాంతరంగా ఆగిపోయింది. పరీక్షకు సమయం మించి పోతుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పరిస్థితిని గమనించి వారిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు. అంతేకాదు ప్రతిరోజు నగరంలోని ట్రాఫిక్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్డేట్ చేస్తారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలంటూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష జరగనుండగా.. మార్చి 2నుంచి సెకండియర్ విద్యార్థులకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 123 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం చిరునామా సులువుగా తెలుసుకునేందుకు వీలుగా అధికారులు ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ మొబైల్ యాప్‌ని రూపొందించారు. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే పరీక్ష కేంద్రానికి దారులను చూపిస్తుంది. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నిఘానేత్రం నడుమ.. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ముందే తెరుస్తారు. ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్, నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వీటికితోడు హైపర్ కమిటీ, కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) కూడా పరీక్షల నిర్వహణ తీరును నిత్యం పర్యవేక్షిస్తాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స పెట్టె, ఒక ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ముందే వెళ్తే మంచింది.. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాళ్లలోకి విద్యార్థులను అనుమతిస్తారు. తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను తీసుకెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ లోనికి అనుమతించరు. పరీక్ష సమయాన్ని మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పరీక్షకు ఒకరోజు ముందుగానే వెళ్లి కేంద్రాలను చూసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యానాయక్ సూచించారు. ముందుగా చూసుకోవడం వల్ల కేంద్ర చిరునామా, రవాణా సౌకర్యాలు, చేరుకోవడానికి పట్టే సమయం తదితర అంశాలపై అవగాహన వస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళనకు గురికావొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రశాంతంగా ఆలోచిస్తూ పరీక్షలు రాయాలని చెప్పారు. తొలుత సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ఎదుర్కోవాలన్నారు. ఆహారం విషయంలో జాగ్రత్త ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నీరసం రాకుండా పరీక్షకు వెళ్లేముందు అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. పళ్లరసం ఉంటే మేలు. సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డైటీషియన్లు సూచిస్తున్నారు -
ఇదిగో ఇంటర్సెంటర్
నేరేడ్మెట్: ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్ బోర్డు రూపొందించిన ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమ పరీక్ష కేంద్రానికి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్ లోకేటర్గా పిలుస్తున్న ఈ యాప్ (tsbie exam center locator 2018) ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్‌లో విద్యార్థి తన హాల్ టికెట్ నంబర్‌ను ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే వెంటనే పరీక్ష కేంద్రం ఫోటో, పూర్తి వివరాలు వస్తాయి. కింది భాగంలో డైరెక్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పరీక్ష కేంద్రానికి రూట్ మ్యాప్ కన్పిస్తుంది. ఎన్ని కి.మీ.దూరంలో సెంటర్ ఉంది..ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు తదితర సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులకు వీలు కలుగుతుంది. -
పరీక్షలకు దూరం..!
బేల(ఆదిలాబాద్) : దూరభారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షగా మారింది. ఫలితంగా ఉన్నత విద్యను అర్ధంతరంగా ముగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మారుమూల సరిహద్దు మండలం బేల. ఉన్నత విద్య కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని బేలకు వచ్చి ఇక్కడి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక ప్రముఖుల చొరవతో 2014–15లో మండల కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. గతంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారు, రెగ్యులర్ విద్యార్థులు ఇక్కడే ప్రవేశాలు పొందుతున్నారు. ఇంగ్లిషు మీడియం అయినప్పటికీ సమీపంలో ఉండడంతో మరాఠీ, గిరిజన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. 220 మంది డిగ్రీ విద్య అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా.. ఇబ్బందులను అధిగమించి వస్తున్నారు. పరీక్షల కోసం జిల్లా ఆదిలాబాద్‌లోని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ప్రభుత్వం సెమిస్టర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఒక విద్యా సంవత్సరంలో కచ్చితంగా రెండు పరీక్షలు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజు పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి రావడానికి ఎంతో సమయం పడుతోంది. గ్రామాల నుంచి విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాలేక చదువును అర్ధంతరంగా మానేస్తున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారి సంఖ్య 120 ఉండగా.. 2016–17లో 100కు తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో 58 పడిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంఖ్య సైతం 100కు తగ్గింది. నిర్మల్ జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలకు అనుమతి.. మారుమూల మండల కేంద్రాల్లో ప్రైవేటు డిగ్రీ కళశాలలు ఉన్న చోట కాకతీయ యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలకు స్థానికంగా అనుమతి ఇస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్మల్ జిల్లాలోని కల్లూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళశాలకు సమీప ప్రభుత్వ జెడ్పీఎస్‌ఎస్‌లో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. లక్ష్మణచాందలోని కళశాలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళశాలలో పరీక్ష కేంద్రం అనుమతి లభించింది. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి యూనివర్సిటీ అధికారులు బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, పోషకులు కోరుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయిన. మాది కూలీ కుటుంబం. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఉన్నదని, ఇష్టపడి చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి ఇక్కడి రావాలంటే ఎటువంటి వాహనాలు ఉండవు. చదువుకోవాలని ఆసక్తితో రెండు కిలోమీటర్లు కాలినడకన వస్తున్నాను. ఆదిలాబాద్‌కు వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయినా. ఇప్పుడు నా చదువు అర్ధంతరమేనో.– కైరి అశ్విని, బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరం, మోహబత్పూర్ నాన్నతో కలిసి పరీక్షలకు.. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి ప్రతి రోజు నాన్నతో కలిసి వెళ్లాను. నా స్నేహితులు వారి కుటుంబ సభ్యుల తోడు లేకపోవడంతో ఈ పరీక్షలు రాయడానికి రాలేదు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– మరప అశ్విని, బీకాం మొదటి సంవత్సరం, బెల్లూరిగూడ పరీక్ష కేంద్రం కోసం ప్రయత్నిస్తున్నాం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కళశాలకు సమీపంలో మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. భాష, రవాణా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం సెమిస్టర్ విధానంతో రెండు సార్లు పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లలేక విద్యార్థులు చదువు అర్ధంతరంగా మానేయడం బాధగా ఉంది. స్థానికంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– వరప్రసాద్‌రావు, కీర్తన డిగ్రీ కళశాల బేల -
ఏపీపీఎస్సీ సెంటర్లో స్వల్ప మార్పు
కర్నూలు(అగ్రికల్చర్): ఎపీపీఎస్సీ గ్రూపు–3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి 23న జరిగే ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఒక సెంటర్‌ను మార్పు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. బి.క్యాంపు మాధవీనగర్‌లోని సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్ సెంటరుకు కేటాయించబడిన అభ్యర్థులు సమీపంలోనే ఉన్న నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బిషప్ చర్చి ఎదురుగా ఉన్న సాయి సుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. స్కూల్ ఒక్కటేనని.. కేవలం అడ్రస్ మారిందని తెలిపారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని సూచించారు. -
‘బురఖా’ను అనుమతించాలి
సాక్షి, ముంబై: ఈ విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి పరీక్షలు రాసే ముస్లిం విద్యార్థినిలను బురఖాతో పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు స్పష్టం చేసింది. అందుకు అవసరమైన సర్క్యూలర్ అన్ని పాఠశాలలకు పంపించింది. దీంతో బురఖాతో పరీక్ష కేంద్రాలకు వచ్చే ముస్లిం బాలికలకు ఊరట లభించిం ది. ఈ నెల మూడో వారం నుంచి 12వ తరగతి పరీక్షలు, మార్చి ఆఖరు వారం నుంచి 10వ తరగతి పరీక్షలు జరనున్నాయి. గతంతో 10, 12 తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన ముస్లిం విదార్థినిలను కొన్ని కేంద్రాలలో ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకునే వారు. బురఖా తీసి, తనిఖీ చేసిన తరువాత మాత్రమే వారిని లోపలికి అనుమతించే వారు. దీంతో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా బోర్డు ఓ సర్క్యులర్ జారీ చేసింది. బురఖా తీయమని చెప్పడం, తనఖీ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మతాన్ని అవమానించినట్లవుతుందని బోర్డు అభిప్రాయపడింది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనే ప్రమాదముందని, దాన్ని నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. -
గ్రూప్-2 అభ్యర్థులకు చిక్కులు!
- పలు కేంద్రాల్లో స్వల్ప గందరగోళం - 7.89 లక్షల మందికిగాను 5.17 లక్షల మంది హాజరు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి శుక్రవారం నిర్వహించిన గ్రూపు-2 పేపరు-1, పేపరు-2 రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పలు పరీక్ష కేంద్రాల్లో స్వల్ప గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. హాల్టికెట్లలో తప్పుడు చిరునామాల వల్ల పదుల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా వంద మందికిపైగా పరీక్షలు రాయలేకపోయారు. మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రం బుక్లెట్, జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్ల బార్కోడ్ లు సరిపోలకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. పలు కేంద్రాల్లో బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించడంతో హాల్‌టికెట్లు, అటెస్ట్డ్ కాపీలను సరిపోల్చుకొని అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్షలకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకోగా శుక్రవారం 5,17,891 మంది (65.60 శాతం) పరీక్షలు రాసినట్లు తెలిపింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ పరీక్షల్లో సకినాలు అంటే ఏమిటి వంటి ప్రశ్నలను ఇచ్చారు. హాల్టికెట్లలో తప్పుడు చిరునామా... గ్రూప్ 2 పరీక్షల హాల్‌టికెట్ల జారీలో అధికారుల తప్పిదం 40 మంది అభ్యర్థులకు శాపంగా పరిణమించింది. పరీక్షా కేంద్రాల చిరునామాలో దొర్లిన తప్పులు వారిని పరీక్షకు దూరం చేశాయి. హాల్టికెట్లలో జయశంకర్ జిల్లాకు బదులు వరంగల్ జిల్లా అని పేర్కొనడంతో నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక వారు పరీక్ష రాయలేకపోయారు. జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగులలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 2,388 మంది అభ్యర్థులకు ములుగులో ఆరు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. అయితే వాటిని మెయిన్ రోడ్డు ములుగు, వరంగల్ జిల్లాగా చిరునామాలో తప్పుగా పేర్కొన్నారు. ఇది తెలియని కుమ్రం భీం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమకు వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు దగ్గర ఉన్న కాలేజీల్లో పరీక్షా కేంద్రం కేటాయిుంచినట్లుగా భావించి ఉదయం 8 గంటలలోపే అక్కడకు చేరుకున్నారు. కానీ పరీక్షా కేంద్రం కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో చివరకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని ములుగు పట్టణానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సమయం 9 గంటలు దాటడం వల్ల ఆలస్యమైందనే కారణంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు. హాల్ టికెట్లపై తప్పుడు చిరునామా వల్లే సరైన కేంద్రాలకు చేరుకోవడంలో జాప్యమైందని...అందువల్ల తమను పరీక్షకు అనుమతించాలని అభ్యర్థులు ఎంత బతిమాలినా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా 40మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవ కాశం కోల్పోయారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వెచ్చించిన శ్రమ, సమయం వృథా అయ్యాయని కన్నీటి పర్యంతమవగా... చేయని తప్పులకు తమను బాధ్యుల్ని చేయడమేంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ అధికారులు తమకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ తీరుకు నిరసనగా వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన మెట్టుపల్లి ప్రశాంత్ అనే అభ్యర్థి పరీక్ష కేంద్రం దగ్గరే తన హాల్‌టికెట్‌ను చింపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తున్న దాసరి అజయ్ ఒక్కసారిగా ఫిట్స్‌తో పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్ష కోసం వస్తూ రోడ్డు ప్రమాదం కరీంనగర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు అయిున బబిత, స్వప్న తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని వాగేశ్వరీ కళాశాలలో గ్రూప్2 పరీక్ష నిమిత్తం స్కూటీపై బయల్దేరగా స్థానిక సుభాష్‌నగర్ స్టేజీ వద్ద మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే స్వప్న స్పృహ కోల్పోయింది. స్థానికులు 108కు సమాచారమివ్వగా సకాలంలో స్పందించలేదు. ఎల్ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి తన వాహనంలో కొంతదూరం తీసుకెళ్లగా.. అక్కడినుంచి అంబులెన్స్‌లో కరీంనగర్లో ఆస్పత్రికి తరలించారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉంది. రాజధానిలో పరీక్షకు 40 మందికిపైగా దూరం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 263 పరీక్షా కేంద్రాల్లో 1,15,488 మంది అభ్యర్ధులకు గాను ఉదయం 77,647 మంది, మధ్యాహ్నం 74,047 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు. పలు కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన 40 మందికిపైగా అభ్యర్థులను పోలీసులు వెనక్కి పంపించి వేశారు. అన్యాయం జరగనివ్వం కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాల బుక్లెట్ నెంబర్లతో సంబంధం లేకుండా ఓఎంఆర్ జవాబు పత్రాలను పంపిణీ చేశారు. దీంతో బుక్లెట్ నంబర్లు, ఓఎంఆర్ జవాబు పత్రాల్లోని బార్ కోడ్ నంబర్లు మిస్ మ్యాచ్ అయ్యారుు. కానీ దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందొద్దు. కమిషన్ అంతర్గత భద్రత కోసమే వాటిని ముద్రిస్తాం. జవాబు పత్రం మూల్యాకనంలో ఈ నెంబర్లు కలవాలన్నది తప్పనిసరి కాదు.. ఈ అంశాన్ని పరిశీలించి, అభ్యర్థులకు అన్యాయం జరక్కుండా చూసేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అలాగే నెట్వర్క్ ఫెరుుల్యూర్ కారణంగా అభ్యర్థులు అందరి బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తి కాలేదు. పూర్తికాని వారి బయోమెట్రిక్ వివరాలను ఈనెల 13న జరిగే పేపర్-3, పేపర్-4 పరీక్షల సందర్భంగా ఆఫ్‌లైన్‌లో తీసుకుంటాం. - పార్వతి సుబ్రమణ్యన్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి రెండేళ్ల శ్రమ వృధా రెండేళ్లుగా గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నా. హాల్‌టికెట్‌లో మెయిున్ రోడ్డు, ములుగు, వరంగల్ జిల్లా అని ఉండటంతో ప్రణాళిక ప్రకారం ఉదయం అక్కడి చేరుకున్నాను. తీరా చూస్తే అక్కడ అలాంటి సెంటర్లు లేవని తెలిసింది. తిరిగి ములుగుకు చేరుకునే సరికి సమయం అయిపోయిందని అధికారులు లోనికి అనుమతించలేదు. ప్రభుత్వ తప్పిదానికి రెండేళ్ల కష్టమంతా వృథా అయ్యింది. - మారేపల్లి ప్రతిభ ( ధర్మారం, కరీంనగర్ ) అడ్రస్ పూర్తిగా ఎలా తెలుస్తుంది నేను కుమ్రం భీం జిల్లా రెబ్బెన మండలం నుంచి వచ్చాను. ఉదయం 8 గంటలకే ములుగు రోడ్డుకు చేరుకున్నా పరీక్షా కేంద్రం అక్కడ లేదని, జయశంకర్ జిల్లా ములుగులో ఉందన్నారు. వేరే జిల్లాకు చెందిన నా లాంటి వారికి ములుగు, ములుగు రోడ్డుల మధ్య తేడా ఎలా తెలుస్తుంది. -గుగులోతు అనసూయ (కుమ్రం భీం జిల్లా) అడిగితే బెదిరించారు నా బుక్లెట్ నం.1655602. ఓఎంఆర్షీట్ బార్కోడ్ నెం. 1655601గా వచ్చింది. ఇదేమని ఇన్విజిలేటర్‌ను అడిగితే పరవాలేదన్నారు. పరిశీలకుడు దృష్టికి తీసుకెళ్తే బార్కోడ్ మారిన అభ్యర్థిని డిబార్ చేస్తామని చెప్పారు. నా ప్రశ్నపత్రం చెల్లుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. -రాములు, మద్దూర్, మహబూబ్‌నగర్ జిల్లా -
జనార్దనరావు ఇప్పుడు ఒంటరి
సంతకవిటి: కొండంత బాధను దిగమింగు తూ టెన్తు పరీక్ష రాస్తున్నాడో విద్యార్థి. తల్లి అనారోగ్యం దిగులు వెంటాడుతున్నా ధైర్యంగా పరీక్ష కేంద్రం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇంతలో తల్లి మరణించింది. విషయం తెలియని విద్యార్థి యధాతథంగా శనివారం పరీక్ష రాశాడు. వివరాలివి. మండలంలో తమరాం గ్రామానికి చెందిన నడగాన జనార్దనరావు హొంజరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ విద్యార్థి తండ్రి రమణ ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. తల్లి వెంకటమ్మ రోజు వారీ కూలీ పనులు చేస్తూ జనార్దనరావును చదివిస్తోంది. నాలుగురోజులు క్రితం ఈమె అనారోగ్యం పాలైంది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పక్షవాతం వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనార్దనరావు మందరాడ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్నాడు. తల్లికి ఏమి జరుగుతుందో అనే ఆందోళన చెందుతూ మరో వైపు ఉత్తీర్ణుడు కావాలనే గట్టి సంకల్పంతో రోజూ పరీక్షకు హాజరవుతున్నాడు. శనివారం ఉదయం విశాఖపట్నంలో ఆస్పత్రిలో తన తల్లి గురించి ఆరోగ్య సమాచారం తెలుసుకుని పరీక్షకు హాజరయ్యాడు. పది గంటలు సమయంలో ఇతడి తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరీక్ష ముగిసేవరకూ బంధువులు వెల్లడించలేదు. పరీక్ష ముగిసి హాలు నుంచి బయటకు రాగానే జనార్దనరావుకు విషయాన్ని తెలిపారు. దీంతో విద్యార్థి విషాదంలో మునిగిపోయాడు. సాయంత్రం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కూలిపనులు చేసుకుంటూ తల్లి తెచ్చే చిరు సంపాదనతోనే చదువు సాగించిన జనార్దనరావు ఇప్పుడు దిక్కులేనివాడయ్యాడు. -
రేపు ‘సాక్షి స్పెల్‌బీ’ రెండో రౌండ్
ఏలూరు సిటీ : సాక్షి, ఇండియా స్పెల్‌బీ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ స్పెల్లింగ్‌పై నిర్వహిస్తున్న స్పెల్‌బీ రెండో దశ పరీక్ష ఆదివారం జరుగనుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేలా సాక్షి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక స్థాయి పరీక్షలకు 27 పాఠశాలల నుంచి 1,203 మంది హాజరయ్యారు. వీరిలో రెండో దశ పరీక్షకు 272 మంది ఎంపికయ్యారు. రెండో రౌండ్ పరీక్షలు నాలుగు కేటగిరీల్లో నిర్వహిస్తారు. ఉదయం 10.15 గంటల నుంచి ప్రారంభమయ్యే స్పెల్‌బీ పరీక్షలు సాయంత్రం 4.15 వరకు కొనసాగుతాయి. షెడ్యూల్ ఇలా.. సాక్షి ఇండియా స్పెల్‌బీ-14 రెండో దశ పోటీలు కేటగిరి-1 విద్యార్థులకు ఉ.10.15 గంటలకు, కేటగిరి-2 విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటలకు, కేటగిరి-3 విద్యార్థులకు మ.2.15 గంటలకు, కేటగిరి-4 విద్యార్థులకు సాయంత్రం 4.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం : ఏలూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు అదేరోజు ఉదయం పరీక్షా కేంద్రానికి చేరుకుని ‘సాక్షి’ టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమంలో వ్యాఖ్యత చెప్పిన ఆంగ్ల పదాలను విని పరీక్ష రాయాలి. స్పెల్‌బీ మాస్టర్ విక్రమ్ 30 పదాలను ఉచ్చరిస్తారు. ఒక్కోపదాన్ని మూడుసార్లు పలుకుతారు. వీటిని విని స్పెల్లింగ్ రాయాలి. పరీక్షా సమయం 30 నిముషాలు. నిబంధనలు: విద్యార్థులు వారి పాఠశాల యూని ఫాంలో పరీక్షకు హాజరుకావాలి. పెన్ లేదా పెన్సిల్, ప్యాడ్, పరీక్షలో పాల్గొనేందుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. అల్పాహారం, భోజనం, మంచినీరు విద్యార్థులే ఏర్పాటు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి లేదు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏలూరు : సర్ సీఆర్ రెడ్డి స్కూల్, భాష్యం స్కూల్, కేకేఆర్ గౌతమ్ స్కూల్, సిద్దార్థ విద్యాలయం. భీమవరం : సెయింట్ మేరీస్ స్కూల్, వెస్ట్ బెర్రీ స్కూల్. తణుకు : విరంచి విద్యానితన్, రూట్స్, భాష్యం స్కూల్, ఎయిమ్ యూపీ ఇంగ్లిష్ మీడియం స్కూల్. పాలకొల్లు : భారతీయ విధ్యాభవన్స్, ఆదిత్య స్కూల్ నరసాపురం : జే.సికిలి స్కూల్, భాష్యం లిటిల్ చాంప్స్, ఆదిత్య స్కూల్. కొవ్వూరు : ఏఎస్ఆర్ అండ్ వీఎన్డీఏవీ సూల్, భాష్యం స్కూల్. తాడేపల్లిగూడెం : కింబర్లీ స్కూల్, శ్రీ రమణ మహర్షి స్కూల్ జంగారెడ్డిగూడెం : ప్రతిభ స్కూల్. ధర్మాజీగూడెం : శ్రీ విద్య స్కూల్. దొండపూడి : సెయింట్ మేరీస్ స్కూల్. గణపవరం : సాధన స్కూల్, విద్యాజ్యోతి స్కూల్. పెనుగొండ : ఇన్పాంట్ జీసస్ స్కూల్. పొలమూరు : జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సెల్ప్బీ పరీక్షలకు హాజరుకానున్నారు. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
అనంతగిరి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ధన్నారం సమీపంలోని అన్వర్‌ఉలూమ్ కళాశాల సెంటర్లలో గురువారం ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త, ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శివప్రకాశ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడికల్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5-30 గంటల దాకా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో కలిపి ఇంజినీరింగ్‌కు 1,012 మంది, మెడిసిన్‌కు 694మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు రెం డు సెంటర్లలోనూ ఉన్నాయన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భం గా ఎంసెట్ రాసే విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులను వాడాలి హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి ఫొటో అతికించి అటెస్టెడ్ చేసిన అప్లికేషన్ ఫారం తప్పనిసరి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అటెస్టెడ్ చేసిన కుల ధ్రువీకరణపత్రం తీసుకురావాలి పరీక్ష హాల్ల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్లలోని నిబంధనలను చదివి విద్యార్థులు విధిగా పాటించాలి.