గ్రూప్-2 అభ్యర్థులకు చిక్కులు! | The group of candidates to -2 implications! | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 అభ్యర్థులకు చిక్కులు!

Published Sat, Nov 12 2016 4:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

గ్రూప్-2 అభ్యర్థులకు చిక్కులు! - Sakshi

గ్రూప్-2 అభ్యర్థులకు చిక్కులు!

- పలు కేంద్రాల్లో స్వల్ప గందరగోళం
- 7.89 లక్షల మందికిగాను 5.17 లక్షల మంది హాజరు
 
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి శుక్రవారం నిర్వహించిన గ్రూపు-2 పేపరు-1, పేపరు-2 రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పలు పరీక్ష కేంద్రాల్లో స్వల్ప గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. హాల్‌టికెట్లలో తప్పుడు చిరునామాల వల్ల పదుల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా వంద మందికిపైగా పరీక్షలు రాయలేకపోయారు. మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రం బుక్‌లెట్, జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్ల బార్‌కోడ్ లు సరిపోలకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. పలు కేంద్రాల్లో బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించడంతో హాల్‌టికెట్లు, అటెస్ట్‌డ్ కాపీలను సరిపోల్చుకొని అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్షలకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకోగా శుక్రవారం 5,17,891 మంది (65.60 శాతం) పరీక్షలు రాసినట్లు తెలిపింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ పరీక్షల్లో సకినాలు అంటే ఏమిటి వంటి ప్రశ్నలను ఇచ్చారు.
 
 
హాల్‌టికెట్లలో తప్పుడు చిరునామా...
గ్రూప్ 2 పరీక్షల హాల్‌టికెట్ల జారీలో అధికారుల తప్పిదం 40 మంది అభ్యర్థులకు శాపంగా పరిణమించింది. పరీక్షా కేంద్రాల చిరునామాలో దొర్లిన తప్పులు వారిని పరీక్షకు దూరం చేశాయి. హాల్‌టికెట్లలో జయశంకర్ జిల్లాకు బదులు వరంగల్ జిల్లా అని పేర్కొనడంతో నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక వారు పరీక్ష రాయలేకపోయారు. జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగులలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 2,388 మంది అభ్యర్థులకు ములుగులో ఆరు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. అయితే వాటిని మెయిన్ రోడ్డు ములుగు, వరంగల్ జిల్లాగా చిరునామాలో తప్పుగా పేర్కొన్నారు. ఇది తెలియని కుమ్రం భీం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమకు వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు దగ్గర ఉన్న కాలేజీల్లో పరీక్షా కేంద్రం కేటాయిుంచినట్లుగా భావించి ఉదయం 8 గంటలలోపే అక్కడకు చేరుకున్నారు. కానీ పరీక్షా కేంద్రం కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో చివరకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని ములుగు పట్టణానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సమయం 9 గంటలు దాటడం వల్ల ఆలస్యమైందనే కారణంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు. హాల్ టికెట్లపై తప్పుడు చిరునామా వల్లే సరైన కేంద్రాలకు చేరుకోవడంలో జాప్యమైందని...అందువల్ల తమను పరీక్షకు అనుమతించాలని అభ్యర్థులు ఎంత బతిమాలినా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా 40మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవ కాశం కోల్పోయారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వెచ్చించిన శ్రమ, సమయం వృథా అయ్యాయని కన్నీటి పర్యంతమవగా... చేయని తప్పులకు తమను బాధ్యుల్ని చేయడమేంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ అధికారులు తమకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ తీరుకు నిరసనగా వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన మెట్టుపల్లి ప్రశాంత్ అనే అభ్యర్థి పరీక్ష కేంద్రం దగ్గరే తన హాల్‌టికెట్‌ను చింపేశాడు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తున్న దాసరి అజయ్ ఒక్కసారిగా ఫిట్స్‌తో పడిపోయాడు.  వెంటనే  ఆస్పత్రికి తరలించారు.
 
పరీక్ష కోసం వస్తూ రోడ్డు ప్రమాదం
కరీంనగర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు అయిున బబిత, స్వప్న తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని వాగేశ్వరీ కళాశాలలో గ్రూప్2 పరీక్ష నిమిత్తం స్కూటీపై బయల్దేరగా స్థానిక సుభాష్‌నగర్ స్టేజీ వద్ద మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే స్వప్న స్పృహ కోల్పోయింది. స్థానికులు 108కు సమాచారమివ్వగా సకాలంలో స్పందించలేదు. ఎల్‌ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి తన వాహనంలో కొంతదూరం తీసుకెళ్లగా.. అక్కడినుంచి అంబులెన్స్‌లో కరీంనగర్‌లో ఆస్పత్రికి తరలించారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉంది.
 
రాజధానిలో పరీక్షకు 40 మందికిపైగా దూరం
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 263 పరీక్షా కేంద్రాల్లో 1,15,488 మంది అభ్యర్ధులకు గాను ఉదయం 77,647 మంది, మధ్యాహ్నం 74,047 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.  ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు. పలు కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన 40 మందికిపైగా అభ్యర్థులను పోలీసులు వెనక్కి పంపించి వేశారు.
 
అన్యాయం జరగనివ్వం
కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాల బుక్‌లెట్ నెంబర్లతో సంబంధం లేకుండా ఓఎంఆర్ జవాబు పత్రాలను పంపిణీ చేశారు. దీంతో బుక్‌లెట్ నంబర్లు, ఓఎంఆర్ జవాబు పత్రాల్లోని బార్ కోడ్ నంబర్లు మిస్ మ్యాచ్ అయ్యారుు. కానీ దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందొద్దు. కమిషన్ అంతర్గత భద్రత కోసమే వాటిని ముద్రిస్తాం. జవాబు పత్రం మూల్యాకనంలో ఈ నెంబర్లు కలవాలన్నది తప్పనిసరి కాదు.. ఈ అంశాన్ని పరిశీలించి, అభ్యర్థులకు అన్యాయం జరక్కుండా చూసేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అలాగే నెట్‌వర్క్ ఫెరుుల్యూర్ కారణంగా అభ్యర్థులు అందరి బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తి కాలేదు. పూర్తికాని వారి బయోమెట్రిక్ వివరాలను ఈనెల 13న జరిగే పేపర్-3, పేపర్-4 పరీక్షల సందర్భంగా ఆఫ్‌లైన్‌లో తీసుకుంటాం.
- పార్వతి సుబ్రమణ్యన్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి
 
రెండేళ్ల శ్రమ వృధా
రెండేళ్లుగా గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నా. హాల్‌టికెట్‌లో మెయిున్ రోడ్డు, ములుగు, వరంగల్ జిల్లా అని ఉండటంతో ప్రణాళిక ప్రకారం ఉదయం అక్కడి చేరుకున్నాను. తీరా చూస్తే అక్కడ అలాంటి సెంటర్లు లేవని తెలిసింది. తిరిగి ములుగుకు చేరుకునే సరికి సమయం అయిపోయిందని అధికారులు లోనికి అనుమతించలేదు. ప్రభుత్వ తప్పిదానికి రెండేళ్ల  కష్టమంతా వృథా అయ్యింది.
- మారేపల్లి ప్రతిభ ( ధర్మారం, కరీంనగర్ )
 
అడ్రస్ పూర్తిగా ఎలా తెలుస్తుంది
నేను కుమ్రం భీం జిల్లా రెబ్బెన మండలం నుంచి వచ్చాను. ఉదయం 8 గంటలకే ములుగు రోడ్డుకు చేరుకున్నా పరీక్షా కేంద్రం అక్కడ లేదని, జయశంకర్ జిల్లా ములుగులో ఉందన్నారు. వేరే జిల్లాకు చెందిన నా లాంటి వారికి ములుగు, ములుగు రోడ్డుల మధ్య తేడా ఎలా తెలుస్తుంది.
 -గుగులోతు అనసూయ (కుమ్రం భీం జిల్లా)
 
అడిగితే బెదిరించారు
నా బుక్‌లెట్ నం.1655602. ఓఎంఆర్‌షీట్ బార్‌కోడ్ నెం. 1655601గా వచ్చింది. ఇదేమని ఇన్విజిలేటర్‌ను అడిగితే పరవాలేదన్నారు. పరిశీలకుడు దృష్టికి తీసుకెళ్తే బార్‌కోడ్ మారిన అభ్యర్థిని డిబార్ చేస్తామని చెప్పారు. నా ప్రశ్నపత్రం చెల్లుతుందో లేదోనని ఆందోళనగా ఉంది.
 -రాములు, మద్దూర్, మహబూబ్‌నగర్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement